హీరోయిన్ ముస్కాన్ సేథీ ఇంటర్వ్యూ
`పైసా వసుల్` చిత్రంతో హీరోయిన్గా పరిచయమై మొదటిసినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది ముస్కాన్ సేథి. ప్రస్తుతం అనురాగ్, ముస్కాన్ సేథీ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రాధాకృష్ణ’. ప్రముఖ దర్శకుడు `ఢమరుకం`ఫేమ్ శ్రీనివాసరెడ్డి స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ చిత్రంలో నందమూరి లక్ష్మీ పార్వతి ఒక కీలకపాత్రలో నటించారు. టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిహరిణి ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై పుప్పాల సాగరిక కృష్ణకుమార్ నిర్మించారు.
ఈ సినిమా ఫిబ్రవరి 5న గ్రాండ్ రిలీజ్ అవుతున్న సందర్భంగా హీరోయిన్ ముస్కాన్ సేథీ ఇంటర్వ్యూ విశేషాలు.
– శ్రీనివాస్ రెడ్డిగారిని రాధాకృష్ణ సినిమా కోసం కలిసినప్పుడు ఆయన నా పాత్ర గురించి వివరించారు. చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. సాంప్రదాయకమైన తెలుగు అమ్మాయి పాత్ర. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా. ఇందులో అందమైన ప్రేమకథ కూడా మిళితమై ఉంటుంది. అలాగే మంచి సామాజిక సందేశం కూడా ఉంటుంది. సినిమాలో నాయనమ్మ కలను నేరవేర్చడానికి `రాధ` అనే అమ్మాయి ఏం చేసిందనేదే సినిమా. అంతరించిపోతున్న నిర్మల్ బొమ్మల ఆర్ట్‌ను ఎలా అభివృద్ధి చేసింది. గ్రామ ప్రజలకు ఎలా సాయం చేసిందనేదే ప్రధానమైన కథ. సినిమా అంతటినీ నా భుజాలపై క్యారీ చేసే పాత్ర నాది. ఇలాంటి పాత్రను చేయడం చాలా కష్టం. ఇలాంటి పాత్ర దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది నా డ్రీమ్ రోల్
– సినిమాలో నా పాత్ర గ్రాఫ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. పాటల్లో డాన్సులు చేస్తూ సంతోషంగా ఉండే గర్ల్ నెక్ట్స్ పాత్ర కాదు. సినిమాను క్యారీ చేసే ఓ బలమైన పాత్ర. చాలా బలమైన డైలాగ్స్ ఉన్నాయి. మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయి. శ్రీనివాస్ రెడ్డిగారు చిన్న ఎమోషన్ విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదు. కొన్ని సన్నివేశాల కోసం ముప్పై, ముప్పై ఐదు టేకులు కూడా తీసుకున్న సందర్భాలున్నాయి. పెద్ద డైలాగ్స్ చెప్పడమే కాదు, ఆ డైలాగ్స్‌కు తగ్గ ఎమోషన్స్‌ను చూపించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది.
– విలేజ్ అమ్మాయి పాత్రలో నటించడం కష్టమనే చెప్పాలి. కథానుగుణంగా నేను నిర్మల్‌లోని ఓ గెస్ట్ హౌస్‌లో 45 రోజుల పాటు ఉండి షూటింగ్లో పాల్గొన్నాను. సిటీకి అలవాటుపడ్డవాళ్లకు అలా ఉండటం అంత సులభమైన విషయం కాదు. డేడికేషన్‌తో ఎంటైర్ టీమ్ వర్క్ చేయడం వల్లనే అనుకున్న సమయంలో సినిమాను పూర్తి చేయగలిగాను.
– అనురాగ్ చాలా మంచి నటుడు. తనతో కలిసి పనిచేయడం హ్యాపీ. ఈ సినిమా తనకు మంచిపేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.
– నిర్మల్‌లో ఉన్న సమయంలో అక్కడ బొమ్మలు ఎలా చేస్తారో తెలుసుకున్నాను. కొన్ని బొమ్మలను తయారు చేశాను కూడా. మట్టి, కొయ్యతో చేసే నిర్మల్ బొమ్మల్లో ఎలాంటి రసాయనాలు ఉపయోగించరు. అందుకని వాటివల్ల వాతావరణం కూడా కలుషితం కాదు. ఆ బొమ్మలను తయారు చేసే వారిని ప్రత్యేకంగా కలిసి వాటిని ఎలా తయారు చేస్తారనే విషయాన్ని గమనించి తయారు చేయడం నేర్చుకున్నాను.
– ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.శ్రీలేఖగారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ప్రతి పాట నాకు చాలా బాగా నచ్చింది. నేపథ్య సంగీతం కూడా చక్కగా కుదిరింది.
– నిర్మాత సాగరిక కృష్ణకుమార్ గారు చాలా ప్యాషన్‌తో రాధాకృష్ణ సినిమాను తెరకెక్కించారు. నిర్మల్.. వారి స్వగ్రామం. ఓ రకంగా చెప్పాలంటే ఇది వారి కథే అనుకోవచ్చు. కుటుంబంలా మా యూనిట్‌తో కలిసి పోయి, మేకింగ్ పరంగా మంచి సహకారాన్ని అందించారు. హరిణి ఆరాధ్య క్రియేషన్స్‌లో నటించడం చాలా హ్యాపీగా ఉంది.
– లక్ష్మీపార్వతిగారికి అన్ని విషయాలపై మంచి అవగాహన ఉంది. షూటింగ్ సమయంలో ఏ మాత్రం ఖాళీ దొరికినా ఆమెతో కూర్చుని మాట్లాడేదాన్ని. ఆమె నాకు చాలా విషయాలను వివరించారు. ఆమెకు సాహిత్యంపై మంచి అవగాహన ఉంది. తెలుగు స్పష్టంగా ఎలా మాట్లాడాలి అనే దానిపై ఆమె చాలా విషయాలను నేర్పించారు. లక్ష్మి పార్వతి గారితో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నాను.
– తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు నన్నెంతో ఆదరిస్తున్నారు. అందుకే నేనెప్పుడూ హైదరాబాద్ రావాలన్నా సంతోషపడతాను. ఇక్కడ ఆహారం, సంస్కృతి, సంప్రదాయాలంటే నాకు చాలా ఇష్టం. తెలుగు భాషను అర్థం చేసుకోగలుగుతున్నాను. త్వరలోనే మాట్లాడుతాను.
– బాలకృష్ణగారి 101వ సినిమాలో ఆయనతో కలిసి నటించాను. ఇప్పుడు ఆయన 106వ సినిమా చేస్తున్నారు. నాకంటే చాలా స్పీడుగా సినిమాలు చేస్తున్నారు. ఆయనతో మరో సినిమా చేసే అవకాశం వస్తే, తప్పకుండా నటిస్తాను.
– తెలుగులో ఇది నా మూడో సినిమాలో మరో సినిమా తనీశ్‌తో కలిసి నటించాను. త్వరలోనే అది కూడా విడుదలవుతుంది. ఇప్పుడు కొత్త కథలను వింటున్నాను. త్వరలోనే వాటి వివరాలు తెలియజేస్తాను. రాధాకృష్ణ రిలీజ్ తర్వాత గ్యారెంటీగా నాకు మంచి పాత్రలు వస్తాయని భావిస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.