హీరో చైతన్య రావు మదాడి ఇంటర్వ్యూ
కీడా కోలా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్. ఇందులో వాస్తు పాత్ర చాలా విశేషంగా అలరిస్తుంది: హీరో చైతన్య రావు మదాడి
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రశంసలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా యూనిక్ క్రైమ్ కామెడీ మూవీ కీడా కోలాతో వస్తున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె. వివేక్ సుధాంశు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మిస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై అంచనాలని పెంచింది. కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న హీరో చైతన్య రావు మదాడి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
దర్శకుడు తరుణ్ భాస్కర్ గారు కీడా కోలా అనే ఆలోచన చెప్పినపుడు మీ రియాక్షన్ ఏమిటి ?
తరుణ్ భాస్కర్ గారు నా డ్రీమ్ డైరెక్టర్. ఆయన కథలు, ఆయన పాత్రలకు ఎంచుకునే నటులు చాలా వైవిధ్యంగా, రియల్ లైఫ్ కి దగ్గరగా వుంటారు. ఆయనతో వర్క్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఈ సినిమా కోసం నిర్మాత సాయి గారు కాల్ చేశారు. అప్పుడు తరుణ్ గారిని కలిశాను. స్క్రిప్ట్ ఇచ్చి చదవమని చెప్పారు. చదివాను. చాలా నచ్చింది. అందులో వాస్తు పాత్ర వస్తే బావుండేది అనుకున్నాను. సరిగ్గా ఆ పాత్రే చేయమని అడిగారు. అయితే ఆ పాత్రకి టూరెట్ సిండ్రోమ్ వుంటుంది. మాటల్ని నత్తిలా పలకడం, మాటలు మధ్య ఆగిపోవడం.. ఇలా కాస్త కసరత్తు చేసి చేయాల్సిన పాత్ర ఇది. ప్రాక్టీస్ చేసుకోవడానికి కాస్త సమయం కావాలని అడిగాను. మూడు రోజుల తర్వాత వెళ్లి ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ చూసిన తరుణ్ గారు.. మనకి వాస్తు దొరికేశాడు అని వాళ్ళ టీంకి పరిచయం చేశారు. ఆ మూమెంట్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
తరుణ్ భాస్కర్ నేచురల్ స్టైల్ అలవాటు చేసుకోవడానికి ఎలాంటి కసరత్తులు చేశారు ?
తరుణ్ పాత్ర గురించి వివరంగా చెప్పారు. నేను కూడా ఆ పాత్రని చాలా సహజసిద్ధం గా చేయడానికే ప్రయత్నించాను. మా ఇద్దరికీ బాగా జెల్ అయ్యింది. తరుణ్ కథే నటులని ఎలివేట్ చేస్తుంది. ఆయన సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత వుంటుంది. ఒక్క డైలాగు చెప్పే నటుడికి కూడా రావాల్సిన పేరు వస్తుంది. తనకి నటుల నుంచి పెర్ ఫార్మెన్స్ ఎలా రాబట్టుకోవాలో తెలుసు. ఒకొక్కరికి ఒకొక్క స్టైల్ లో అర్ధం అయ్యేలా చెప్పి కావాల్సింది రాబట్టుకుంటారు. తనతో పని చేయడం యాక్టర్స్ కి చాలా సులువు గా వుంటుంది.
నటుడిగా తరుణ్ భాస్కర్ ని ఎలా చూస్తారు ?
తరుణ్ భాస్కర్ చాలా మంచి నటుడు. వ్యక్తిగా ఆయన చాలా సున్నితమైన మనిషి. సున్నితత్వం వుంటే ఆటోమేటిక్ గా అది నటనలో కనిపిస్తుంది. ప్రతి భావనకి, ఎమోషన్ కి ప్రతిస్పందన నటనలో కనిపిస్తుంది. తన నటన రియల్ లైఫ్ నుంచి వచ్చినట్లుగా ఉండటానికి కారణం అదే.
బ్రహ్మానందం గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
బ్రహ్మానందం లెజెండ్. నడిచే విశ్వ విద్యాలయం ఆయన. ఇందులో ఆయన తాత పాత్ర పోషించారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మాతో చాలా ఫ్రెండ్లీ గా వుండేవారు. చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చారు. బ్రహ్మానందం గారు లాంటి లెజెండరీతో నటించే అవకాశం రావడం నాలాంటి అప్ కమింగ్ యాక్టర్ కి మంచి లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్.
రియల్ లైఫ్ లో వాస్తు లాంటి పాత్రని చూశారా ?
టూరెట్ సిండ్రోమ్ తో ఇబ్బంది పడే వారు మన చుట్టుపక్కల పెద్దగా కనిపించరు. అయితే మాట్లాడుతూ సడన్ గా ఆగిపోవడం, కాస్త నత్తిగా మాటలు పలకడం లాంటి లక్షణాలతో కొంతమందిని చూస్తాం. ఇందులో వాస్తు పూర్తి పేరు వాస్తవ్. అతని పేరు పలకలేడు కాబట్టి షార్ట్ కట్ లో దాన్ని వాస్తు అని పెట్టుకుంటాడు. చాలా పదాలని అలానే మార్చుకుంటాడు. ఒక సమస్య వున్న ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా అందరిలానే మాములు జీవితం గడపొచ్చనేది ఈ పాత్ర అంతర్లీనంగా వుంటుంది.
ఈ పాత్ర చేయడానికి రిఫరెన్స్ గా కొన్ని హాలీవుడ్ సినిమాలు, వీడియోస్ చూశాను. అవి చాలా హెల్ఫ్ అయ్యాయి. వాస్తు పాత్రపై తరుణ్ తో పాటు టీం లో అందరూ చాలా హ్యాపీ గా వున్నారు. తరుణ్ భాస్కర్ బ్రాండ్ నుంచి వస్తున్న వాస్తు పాత్ర తప్పకుండా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో పాత్రలన్నీ వైవిధ్యంగా వుంటాయి. హాలీవుడ్ సినిమాల్లో చూసే టెక్నికల్ బ్రిలియన్స్ కనిపిస్తుంది.
దసరా సీజన్ తర్వాత కీడా కోలా రావడం ఎలా అనిపిస్తుంది ?
తరుణ్ భాస్కర్ సినిమా కోసం ఐదేళ్ళుగా ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆయన ఎలాంటి సినిమాతో వస్తున్నారనే అంచనాలు చాలా వున్నాయి. కీడా కోలా డిఫరెంట్ కంటెంట్ మూవీ. నవంబర్ 3 సినిమా వస్తోంది. సోలో డేట్ దొరికింది. కీడా కోలాతో నవ్వుల నవంబర్ స్టార్ట్ కాబోతుంది.
మిమ్మల్ని, మీ జర్నీని.. ప్రస్తుతం నటుడు కావాలని ప్రయత్నిస్తున్న ఔత్సాహికులు స్ఫూర్తిగా తీసుకోవచ్చా ?
నా జర్నీని స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత సరైన అవకాశాలు రాలేదు. అన్నీ దారులు మూసుకుపోయాయనే భావన కలిగింది. ఇలాంటి సమయంలో 30 వెడ్స్ 21 ఒక్కసారిగా ఫేం తీసుకొచ్చింది. దానితో చాలా మంచి పేరు వచ్చింది. నటుడిగా అందరూ గుర్తు పట్టారు. బ్రేక్ అనేది ఓటీటీ, సినిమా, యూ ట్యూబ్, సోషల్ మీడియా రీల్ ఇలా ఎందులో నుంచి ఆయన రావచ్చు. కానీ ఈ ప్రయాణంలో నిలకడగా వుండటం ముఖ్యం.
కీడా కోలా తో మ్యాగ్జిమమ్ రీచ్ తో పాటు క్రిటిక్స్ దృష్టిలోకి కూడా వెళ్తున్నారు ?ఎలా అనిపిస్తుంది ?
మంచి విమర్శ ఉన్నప్పుడే నటుడిగా మెరుగౌతాం. మనలోని లోటుపాట్లని ఎత్తిచూపితే తర్వాత సినిమాకి ఇంప్రూవ్ చేసుకుంటాం. నిర్మాణాత్మక విమర్శ మంచిదే.
తరుణ్ భాస్కర్ గారు సెట్స్ లో ఎలా వుండేవారు ?
తరుణ్ సెట్స్ లో చాలా సరదాగా వుంటారు. అందరితో ఫ్రెండ్లీ గా వుంటారు. అందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఇస్తారు. తను నటుడు కూడా. యాక్టర్ కి ఎలాంటి ప్రోత్సాహం ఇస్తే ఇంకా మెరుగ్గా చేస్తారో తనకి తెలుసు. తను చాలా సెన్సిటివ్ పర్శన్.
ఈ నగరానికి ఏమైంది సినిమా మీమ్స్ వైరల్ గా వుంటాయి.. ఈ విషయంలో కీడా కోలా ఎలా ఉండబోతుంది?
ఈ నగరానికి ఏమైంది కంటే వందరెట్లు ఎక్కువ మీమ్స్ వస్తాయి. ఇందులో మీమ్ గాడ్ బ్రహ్మానందం తో పాటు నేను, జీవన్, రాగ్ మయూర్ తో చాలా మంచి పాత్రలు వున్నాయి. కథ అంతా అవుట్ అండ్ అవుట్ కామెడీగా వుంటుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, రెండు పాటలపై చాలా మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఇది బిగ్గర్ ఎంటర్ టైనర్. యూత్ తో పాటు అందరికీ కనెక్ట్ అవుతుంది.
కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
షరతులు వర్తిస్తాయి చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. అలాగే పారిజాత పర్వం, హనీ మూన్ ఎక్స్ ప్రెస్ చిత్రాలు వున్నాయి. మరో కొత్త సినిమా అనౌన్స్ మెంట్ కూడా వుంది.