Reading Time: 3 mins

 హీరో విశాల్ మీడియా ముచ్చట

ఎనిమి యాక్షన్ ప్యాక్డ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ: విశాల్

యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేష‌న్‌లో రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైన‌ర్‌ ‘ఎనిమి’. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మించిన ఈ మూవీ దీపావళి సందర్భంగా న‌వంబ‌ర్ 4న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా  హీరో విశాల్ మీడియాతో ముచ్చటించారు. సినిమా గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలు…


దర్శకుడు ఆనంద్ శంకర్ నాకు పరిచయమే లేదు. ఆయన ఒకసారి నాకు ఫోన్ చేసి కథ చెపుతానన్నారు. అప్పుడు ఆయన చేసిన నోటా, ఇరుముగళ్ సినిమాలు చూశాను. తర్వాత జస్ట్ కథ విన్నాను. నేను హీరోగా కథ వినలేదు. కేవలం ఒక ప్రేక్షకుడిగా కథ విన్నా. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.

ఆర్య పేరు చెప్పగానే ఆయనకు షాక్
కథ వినగానే ఇదొక డిఫరెంట్ స్క్రీన్ ప్లే అనిపించింది. మరో రోల్ కోసం నా మిత్రుడు ఆర్య పేరును సజెస్ట్ చేశాను. నేను ఇచ్చే సలహాను ఆయన తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు. కానీ నేను ఇగోకు పోకుండా నాకు అనిపించిన దాన్ని ఆయనకు చెప్పాను. ఆయన వెంటనే షాక్ అయ్యారు. ‘సార్.. నేను నిజంగా ఊహించలేదు. మీరు ఇంకో హీరోకు ఇంత ప్రెజెన్స్ ఇస్తారని.’ అని చెప్పారు. అప్పుడు ఆర్య రోల్ ఇంకాస్త పెంచమని చెప్పాను. అలాగే ఆర్య రోల్ రీరైట్ చేసి అతనికి కూడా కథ చెప్పారు. ఆర్య వెంటనే ఒప్పుకున్నాడు. ఆ ఫైనల్ స్క్రిప్ట్ విన్నాక షూటింగ్ ఎప్పుడెప్పుడా అనిపించింది. నిజంగా స్టోరీ అంత ఆసక్తికరంగా ఉంటుంది.

సింగపూర్ బేస్డ్ స్టోరీ
సింగపూర్‌లో లిటిల్ ఇండియా అనే ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ జరిగే కథ ఇది. అయితే కరోనా పరిస్థితుల దృష్ట్యా అక్కడకు వెళ్లలేము. పోనీ మలేషియాలో చేద్దామనుకుంటే అక్కడ కూడా అదే పరిస్థితి. కరోనా ఫస్ట్ వేవ్‌లో 6 నెలల ఇంట్లోనే కూర్చున్నాం. ఆ తర్వాత ఇక దుబాయ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. కరోనా ప్యాండమిక్‌లో షూటింగ్ స్టార్ట్ చేసిన మొదటి సినిమా మాదే అనుకుంటా. దుబాయ్‌కు వెళ్లి అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేశాం. తర్వాత హైదరాబాద్ వచ్చాం. ఇక్కడ మేము షూటింగ్ చేస్తున్నప్పుడు వేరే ఏ సినిమాల షూటింగ్స్ కూడా లేవు. ఏవో ఒకట్రెండు సీరియళ్ల షూటింగ్ మాత్రమే జరుగుతోంది. ఇక్కడ కూడా కరోనా నిబంధనలు పాటించి త్వరగా షూటింగ్ పూర్తి చేశాం

ఇది డ్రీమ్ టీమ్
చాలా తక్కువ సినిమాలకు మంచి టెక్నీషియన్స్, మంచి కాస్ట్ దొరుకుతారు. కొన్ని సినిమాల్లో వీళ్లు కాకుండా వీళ్లు ఉంటే బాగుండేది అని సినిమా అయిపోయాక అనిపించేది. కానీ ఈ సినిమా విషయంలో అలాంటిదేమీ అనిపించలేదు. నిజంగా ఇది డ్రీమ్ టీమ్. అందరూ పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. సినిమాటోగ్రాఫర్ ఆర్‌డీ రాజశేఖర్‌తో ఇది నా మూడో సినిమా. చాలా మంది ఆందంగా కనిపించావు అని చెప్పారు. అంత బాగా చూపించారు ఆర్‌డీ రాజశేఖర్. ఇక తమ్ముడు థమన్ చేసిన సాంగ్స్ చాలా బాగా హిట్ అయ్యాయి. సామ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వచ్చింది. రవివర్మ, బ్రిందా మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ కూడా బాగా కుదిరింది. ఇక డైరెక్టర్ ఆనంద్ శంకర్ ఏం చెప్పారో అది ఒక్క ముక్కకూడా తగ్గకుండా చెప్పిన దానికంటే ఎక్కువగా వచ్చింది. ఇదొక ట్రీట్‌లా ఉంటుంది.

నిర్మాత రాజీ పడలేదు
ఈ సినిమా నిర్మాత వినోద్‌కు నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఏ నిర్మాత కూడా ఇలాంటి ప్రయత్నం చేయలేరు. సినిమా కోసం 50 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఆయనకు ఓటీటీ నుంచి టేబుల్ ప్రాఫిట్ ఆఫర్ వచ్చింది. అయినా కూడా డబ్బుకు ఆశపడలేదు. ఈ విజువల్ ట్రీట్ సినిమాను థియేటర్లో చూస్తేనే బాగుంటుందని డిసైడ్ అయ్యారు. రెండు నెలలు వెయిట్ చేశారు. కరెక్ట్‌గా ఇప్పుడు దీపావళి కలిసొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాజిక్ నా కెరీర్‌లో కొన్ని సార్లే జరిగింది. నా కెరీర్‌లో ఇది బెస్ట్ సినిమా అవుతుంది. ప్రేక్షకులు ఇంటర్నేషనల్ మూవీలా ఫీలవుతారు.

యాక్షనే కాదు.. డైలాగులు కూడా
ఈ సినిమా కేవలం యాక్షన్ అనే కాదు.. అన్నీ అద్భుతంగా ఉంటాయి. ‘నీ గురించి అన్నీ తెలిసిన నీ మిత్రుడే నీకు అతిపెద్ద శత్రువు’ అనే డైలాగ్ ఒక ఫైట్‌తో సమానం. ఇందులో ఫైట్స్ కంటే ఇంటలిజెన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఫ్రెండ్స్‌గా ఉన్న ఇద్దరు శత్రువుల్లా ఎలా మారారు?.. తర్వాత వాళ్లు ఎప్పుడు కలుస్తారు అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇక వాళ్లిద్దరూ కలిశాక సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. క్లయిమాక్స్ సింగపూర్‌లోని 56 అంతస్థుల బిల్డింగ్‌పై జరిగినట్టు హైఎండ్ గ్రాఫిక్స్‌తో చేశాం. ఫస్ట్ కాపీ చూశాక ఈ సినిమాను దేవీ థియేటర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, గుంటూరు, పాలకొల్లు థియేటర్లలో చూడాలనిపించింది. క్లయిమాక్స్ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

ఇందులో మెసేజ్ కూడా ఉంది
ఈ సినిమా కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అనుకుంటున్నారు. ఇందులో ఒక మెసేజ్ కూడా ఉంది. ఇది యాక్షన్ ప్యాక్డ్ మెసేజ్ ఓరియెంటెడ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఫర్‌ఫెక్ట్ దీపావళి గిఫ్ట్‌లా ఉంటుంది. అందురూ తప్పకుండా థియేటర్లలోనే చూడండి.