యమ్6′ ద్వారా హీరోగా పరిచయం కావడం హ్యాపీగా ఉంది – హీరో ధ్రువ
విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై జైరామ్‌వర్మ దర్శకత్వంలో విశ్వనాథ్ తన్నీరు నిర్మిస్తున్న హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘యమ్6’. ఫిబ్రవరి రెండో వారంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ధ్రువ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం గురించి హీరో ధ్రువ మాట్లాడుతూ ”యమ్6 వంటి మంచి సినిమా ద్వారా హీరోగా పరిచయం అవడం ఎంతో ఆనందంగా ఉంది. నటుడిగా నాకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలన్నది నా చిరకాల కోరిక. నిర్మాత విశ్వనాథ్‌గారు అంతా కొత్తవారితో ఓ సినిమా నిర్మించబోతున్నారని తెలిసి ఆయన్ని కలిశాను. ఫోటో షూట్ చేసి వారం రోజుల్లో ఫోన్ చేస్తామని చెప్పారు. నెలరోజులు దాటినా నాకు ఎలాంటి ఫోన్ రాలేదు. ఇక నాకు ఈ సినిమాలో అవకాశం రాదులే అనుకుంటున్న టైమ్‌లో విశ్వనాథ్‌గారు ఫోన్ చేసి ‘నువ్వు మా సినిమాలో హీరోగా సెలెక్ట్ అయ్యావు. నెక్స్‌ట్ వీక్ షూటింగ్‌కి వెళ్తున్నాం’ అని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. ఆయన చెప్పిన టైమ్‌కే షూటింగ్ స్టార్ట్ చేశారు. నన్ను ఓ కొత్త హీరోలా కాకుండా సొంత తమ్ముడిలా చూసుకున్నారు. అలాగే డైరెక్టర్ జైరామ్‌వర్మగారు నాకు అన్ని విషయాల్లో సహకారం అందించారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఎక్కడా ఇబ్బంది పడకుండా నటించగలిగాను. మంచి కథ, కథనాలతో వర్మగారు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. నా మొదటి సినిమాలోనే ఓ విభిన్నమైన క్యారెక్టర్ చేయడం హ్యాపీగా ఉంది. ఇలాగే ఇకపై కూడా డిఫరెంట్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను. నేను నటించిన ఈ మొదటి సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్‌గారు విడుదల చేయడం మరచిపోలేని అనుభూతిని కలిగించింది. ‘యమ్6’ చిత్రాన్ని, హీరోగా నన్ను ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత విశ్వనాథ్ తన్నీరుగారికి, దర్శకుడు జైరామ్‌వర్మగారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అన్నారు.