అంచనాలు పెంచుతున్న విజయ్ సర్కార్
దక్షిణాదిన ఇప్పుడు విజయ్ ‘సర్కార్’ సినిమా ఫీవర్ నడుస్తోంది. రోజురోజుకి సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అందుకు విజయ్, మురుగదాస్‌ల కాంబినేషన్ ఒక కారణమైతే, బలమున్న కథ కావడం మరో కారణం. ఓటును ప్రజలు ఎలా దుర్వినియోగ పరచుకుంటున్నారు అన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. కేరళలోని కొల్లాం జిల్లాలో 175 అడుగుల విజయ్ కటౌట్‌ను ఏర్పాటు చేసి అక్కడి అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే కర్ణాటక, కేరళలో దీపావళి రోజున 24 గంటలూ సినిమాను ప్రదర్శించేలా అక్కడి ప్రభుత్వాలు అనుమితినిచ్చాయి.
అంటే దీపావళి రోజున ఒక్కో థియేటర్‌లో ఏకధాటిగా 8 షోలు పడబోతున్నాయనమాట. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు స్పందన బావుంది. ‘అతనొక కార్పొరేట్ మోన్ట్సర్. అతను ఏ దేశం వెళ్లినా అక్కడ ఎదిరించిన వాళ్ళను అంతం చేస్తాడు. ఎలక్షన్ల కోసం ఇప్పుడతను ఇండియాకి వచ్చాడు’ అని విజయ్ గురించి చెప్పిన డైలాగులు, ‘మీ ఊరి నాయకుడిని మీరే కనిపెట్టండి.. ఇదే మన సర్కార్’ అని విజయ్ పలికిన సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విజయ్, కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్‌కుమార్ నటీనటులుగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అశోక్ వల్లభనేని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.