అన‌గ‌న‌గా ఓ అతిథి మూవీ రివ్యూ

Published On: November 21, 2020   |   Posted By:

అన‌గ‌న‌గా ఓ అతిథి మూవీ రివ్యూ

రీమేక్ ఇది:’అన‌గ‌న‌గా ఓ అతిథి’ రివ్యూ

Rating:2/5

రీమేక్ అని చెప్పకుండా ప్రమోట్ చేయటం వల్ల ఏం కలిసొస్తుందో కానీ నష్టపోయేవి మాత్రం ఉంటాయి. 2018లో కన్నడలో రూపొంది అనేక అవార్డులు, రివార్డులతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందిన ‘ఆ కరాళ రాత్రి’కి అనగనగా ఓ అతిథి అఫీషియల్ రీమేక్. అయితే ఎందుకనో ఆ విషయం చెప్తూ పబ్లిసిటీ చేయలేదు. ఒరిజనల్ లోని సోల్ మిస్ కాకూడదని,అదే దర్శకుడు దయాళ్ పద్మనాభన్ కి దీని తెలుగు వెర్షన్ అప్పగించారు. ఆయన ఈ సినిమాని ఏ మాత్రం తెలుగైజ్ చేసారు. అసలు ఈ సినిమాలో రీమేక్ చేసేటంత అద్బుతమైన కంటెంట్ ఏముంది. కన్నడ రీమేక్ లు మనకు ఎప్పుడో కానీ అరుదుగా వర్కవుట్ అవ్వవు. మరి ఈ సినిమా ఏ మాత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 
స్టోరీలైన్..

పేద కుటుంబానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటిది మల్లి(పాయల్ రాజ్ పుత్) ఫ్యామిది. అప్పులు చేసి తాగేసే తండ్రి(ఆనంద్ చక్రపాణి), పురుళ్ళు పొస్తూ కుటుంబాన్ని లాగే తల్లి(వీణా సుందర్) ఆ కుటుంబ సభ్యులు. ఈ నేపధ్యంలో పెరిగిన మల్లికు డబ్బు అంటే తీవ్రమైన ఆకాంక్ష…కోరిక..కోరికలు తీర్చని దరిద్రం అంటే పరమ రోత.వయస్సు పెరుగుతున్నా పెళ్లి కానీ తనంటే తనకే విసుగు. ఇలాంటి సిట్యువేషన్ లో ఓ రోజు వీళ్ళింటికి శీను(చైతన్య కృష్ణ) వస్తాడు. అతనో దేశ సంచారి. ఆ రాత్రికి వాళ్లింట్లో ఆశ్రయం ఇవ్వమని కోరతాడు. మొదట కాదన్నా తర్వాత సరేనంటారు. అతనికి కోడి కూర తినాలనిపిస్తుంది. ఆ విషయం వాళ్లకు చెప్తాడు. వాళ్లు చేస్తారు. అయితే ఈలోగా శీను దగ్గర చాలా డబ్బు, నగలు ఉన్నాయని మల్లికి తెలుస్తుంది. అంతే మల్లిలో దురాశ కలుగుతుంది. అతను తినబోయే కోడి కూరలో విషం పెట్టి చంపేసి దాన్ని నొక్కేసి తమ దారిద్ర్యం నుంచి బయిటపడాలనుకుంటారు. అయితే  అక్కడి నుంచి ఆ ఇంట్లో ఊహించని సంఘటనలు ఎదురౌతాయి. ఏమిటా సంఘటనలు..అసలు శీను ఎవరు..ఆ ఇంటినే వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు. చివరకు అతన్ని చంపేస్తారా..క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్

ఓ చిన్న ఇంట్రస్టింగ్  స్టోరీలైన్…నిజం చెప్పాలంటే ఓ షార్ట్ ఫిలిం కు తగ్గ కాన్సెప్టు. కానీ దాన్ని సినిమాలా సాగ తీసారు. దాంతో ఫస్టాఫ్ లో సరైన సీన్స్ లేక కేవలం క్యారక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవటానికే సమయం తీసుకున్నారు. సెకండాఫ్ లోనూ ఏదో ఆర్ట్ సినిమాలా సాగతీత కొనసాగింది. మెల్లిగా సీన్స్ నడుస్తూంటాయి. ఎక్కడా పరుగు ఉండదు. కన్నడంకు ఆ నేరేషన్ ఓకేనేమో కానీ తెలుగుకు కాస్త ఇబ్బందే. దానికి తగ్గట్లు మనకు ఇక్కడ తెలుగులో పాయిల్ రాజపుత్ ని ఎంచుకున్నారు. ఆమె నటిగా చాలా బాగా చేసింది. అందులో వంక పెట్టలేము కానీ..పాయిల్ అనగానే ఆర్ ఎక్స్ 100 చూసి ఓ ఎక్సపెక్టేషన్స్ ఏర్పడుచుకున్న ప్రేక్షకుడు పరిస్దితి ఏమిటి. ఇంక ఈ సినిమా చూస్తూంటే ఏదో డ్రామా చూస్తున్న ఫీల్ కలగటం కూడా యాధృచ్చకమేమీ కాదు. లిమిటెడ్ బడ్జెట్ అయ్యిండవచ్చు కానీ నాటకం చూస్తున్నట్లు అనిపించటం ఏమిటి..ఎక్కడో క్లైమాక్స్ లో వచ్చే ఆ ట్విస్ట్ కోసం అంతసేపు వెయిట్ చేయాల్సి రావటం ఏమిటి…ఇదంతా దర్శకుడు తెలుగుకు రీమేక్ చేసినప్పుడు గమనించుకోవాల్సిన అంశాలు. ఏదో చేతిలో సబ్జెక్టు ఉంది.నిర్మాత ఉన్నాడు కదా అని ఇలా రీమేక్ చేస్తే ..అది డబ్బింగ్ వ్యవహారంలా తయారైంది.
 
బాగున్నవి

కాన్సెప్టు
క్లైమాక్స్
పాయిల్ గ్లామర్
చైతన్యకృష్ణ నటన

బాగోలేనివి

ఫస్టాఫ్ ల్యాగ్
తెలుగుతనం లేకపోవటం
కమర్షియల్ అంశాలు మచ్చుకు కూడా లేకపోవటం
స్లో నేరేషన్
 
దర్శకత్వం,మిగతా విభాగాలు

సినిమాలో డ్రామాకు ఎక్కువ స్కోప్ ఉంది. థ్రిల్ కు తక్కువ అవకాసం ఉంది. దాన్ని ట్విస్ట్ లతో ఏ మార్చాలని చూసారు దర్శకుడు. అయితే త‌క్కువ లొకేష‌న్లు, త‌క్కువ పాత్ర‌లతో నీటుగా కథను నడిపించాడు. ఫెరఫెక్ట్ గా డైరక్టర్ తన వనరలను వినియోగించుకున్నాడు. అస‌వ‌ర‌మైనదేదీ కనపించదు. అయితే అదే సమయంలో సినిమా ఎక్సపీరియన్స్ ని ఇచ్చే సినిమాటిక్ ల‌క్ష‌ణాలు ఈ క‌థ‌లో క‌నిపించ‌వు. మిగతా విభాగాల్లో కెమెరా వర్క్ బాగుంది. పాయిల్ రాజపుత్ నటన, చైతన్య కృష్ణ క్యారక్టరైజేషన్ బాగున్నాయి. కాకపోతే క్యారెక్టర్ డీటెయిలింగ్ సరిగా లేకపోవడంతో  ఆడియన్స్ కనెక్ట్ అవ్వటం కష్టం. కెమెరా వర్క్ తప్ప  టెక్నికల్ గా ఆ స్దాయిలో ఒక్క డిపార్టమెంట్ లేరు. ప్రొడక్షన్ డిజైన్ & సెట్ వర్క్ మరీ దారుణం. డైలాగ్స్ సహజత్వం కోసం పాకులాడి..విసుగెత్తించారు. ఇవన్ని సరిపోనట్లు..ఇది గోదారి జిల్లాలో జరిగిన ఓ కథ అనివేసారు. కానీ కామిడీ ఏంటంటే ఇది ఓ కన్నడ రీమేక్.

చూడచ్చా

ఓ సారి లుక్కేయచ్చు కానీ ఎక్కువ ఎక్సపెక్ట్ చేయద్దు

ఎవరెవరు..

నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ, ఆనంద చక్రపాణి, వీణా సుందర్ నల్ల వేణు తదితరులు
 నిర్మాతలు: రాజా రామమూర్తి, చిదంబరం నడేసన్
దర్శకత్వం: దయాళ్ పద్మనాభన్
ఆర్ట్: విఠల్ కోసనం
మాటలు: కాశీ నడింపల్లి
సినిమాటోగ్రఫి: రాకేశ్ బీ
సంగీతం: అరోల్ కోరేలి
బ్యానర్: ట్రెండ్ లౌడ్
రన్ టైమ్: 90 నిముషాలు
రిలీజ్ డేట్: 2020-11-20
స్ట్రీమింగ్ ఓటీటి: ఆహా యాప్