‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ రివ్యూ

Published On: December 12, 2019   |   Posted By:

వర్మ రాజ్యంలో వేస్ట్ బిడ్డలు (‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ రివ్యూ )

 Rating:2/5

మనకున్న ఇంట్రస్టులే జనాలకు ఉండాలనుకోవటం ఎప్పుడూ సమస్యే. అందులోనూ మన పగ, ప్రతీకారాలను జనాలపై రుద్దాలనుకోవటం, అందుకు సినిమా మాధ్యమాన్ని ఎన్నుకోవటం రామ్ గోపాల్ వర్మ వంటి విషయం ఉన్న దర్శకుడు చేయదగ్గ పనికాదు. ఆ విషయం ఆయనకు తెలిసినా తెలియదన్నట్లు నటిస్తూ…తనను తాను తగ్గించుకుంటూ రాజకీయ రొచ్చులోకి దిగబడుతూ సినిమాలు చేయటం మొదలెట్టారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ..ఏదో ఎలక్షన్ మూడ్ లో ఓ పార్టీవాళ్లు భుజాన వేసుకున్నారు. కానీ ఇప్పుడు ఎవరికి ఏ అవసరం లేదు. పొలిటికల్ సినిమాల ఆవస్యకత అసలు లేదన్నట్లు జనాలు ఉన్నారు. ఇటువంటి టైమ్ లో టైటిల్ లోనే కులాలను గుర్తు చేస్తూ వాటి మద్య వైషమ్యాలు రగిల్చేలా ట్రైలర్స్ వదులుతూ, రకరకాల ఇబ్బందులును దాటి ఈ సినిమాని మన ముందుకు తెచ్చారు. ఈ సినిమా ఎలా ఉంది. రాజకీయాలను క్లోజ్ గా ఫాలో అయ్యేవారికైనా నచ్చుతుందా…అసలు ఏమటి ఈ సినిమా విషయం వంటివి తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.

స్టోరీలైన్…

2019లో జరిగిన ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. వీయస్ జగన్నాథ రెడ్డి (అమల్ అజ్మీర్) భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యాడు. అది గత ముఖ్యమంత్రి వెలుగుదేశం పార్టీ అధినేత బాబుకు, ఆయన కుమారుడుకు అంతులేని బాధను కలిగిస్తుంది.ఎలాగైనా జగన్నాథ రెడ్డిని..ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేయాలని స్కెచ్ లు వేయనారంభిస్తారు. దానికి తోడు జగన్నాథ రెడ్డి కు జనాల్లో మంచి పేరు వచ్చేస్తుంది.అది బాబుకు పుండు మీద కారం రాసినట్లుంది. ఏదో ఒకటి చేసి జగన్నాథ రెడ్డిని ఇరుకున పెట్టాలని చూస్తాడు. అదే సమయంలో బాబుకి శాశన సభలో జగన్నాథ రెడ్డి,ఆయన అనుచరుల నుంచి పరాభవం ఎదురౌతుంది. తోక తొక్కిన తాచులా మారతాడు. వెంటనే  తన ప్రధాన అనుచరుడు దయనేని రమను సీన్ లోకి తెచ్చి, దారుణమైన ఆరోపణలు చేయిస్తాడు. ఆ ఆరోపణలు నిజం చేసే ప్రయత్నం చేస్తాడు.  ఈ క్రమంలో ఓ రోజు అనుకోకుండా బెజవాడ బెంజ్ సర్కిల్ లో దయనేని రమా దారుణ హత్యకు గురి అవుతాడు. ఎవరు చేసారో తెలియదు. సిట్ ఎంక్వైరీ మొదలవుతుంది. అంతా సీఎం హత్య చేయించాడని భావిస్తాడు.అందుకు తగినట్లుగా ప్రచారం జరుగుతూంటుంది. ప్రభుత్వం కూలిపోయే పరిస్దితి వస్తుంది. సీఎం రాజీనామా చేస్తాడు.  రమను చంపిదెవరు.. తెర వెనక జరిగిందేమిటి…అసలు నిజం ఏమిటి…బాబుకు ఈ హత్యలో ఉన్న పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ,స్క్రీన్ ప్లే

ఒకప్పుడు కోడి రామకృష్ణ వంటివారు రాజకీయ ప్రాధాన్యత ఉన్న సెటైర్ చిత్రాలు చేసేవారు. అయితే వాటికో నిబద్దత ఉండేది. సినిమా చూసిన వారికి రాష్ట్ర రాజకీయాలపై ఓ అవగాహన వచ్చేది. అయితే ఈ సినిమా ఆ కోవలోకి చేరదు. కావాలని ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ సాగుతుంది. సినిమాలో ఆసక్తికర అంశంగా క్రైమ్ ఎలిమెంట్ అయిన మర్డర్ ఉన్నా..దాన్ని సరిగ్గా డీల్ చేయలేదు. మర్డర్ చుట్టూ జరిగే రాజకీయం చూపెట్టాలని వర్మ చేసే ప్రయత్నం ఫలించలేదు. స్క్రిప్టుపై మరింత కసరత్తు చేసి ఉంటే కథ వేరే విధంగా ఉండేది. కేవలం వివాదం చేసి కలెక్షన్స్ రాబట్టాలనే యావ తప్పించి మరేమీ ఈ సినిమా లో ఏమీ కనపడదు. దానికి తోడు సెన్సార్ కట్స్ పంటిక్రింద రాయిలా విసిగిస్తూంటాయి. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే…చాలా కాలం క్రితం ఆగిపోయిన వ్యవహారంలా ఉంటుంది. ఇప్పటికాలం ప్రేక్షకులకు తగినట్లు ఉంటుంది. పరమ రొటీన్ గా రొట్టకొడ్డుగా సీన్స్ సాగుతూంటాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే సీన్స్ అయితే పరమ బోరింగ్ గా,స్లో గా సాగి విసిగిస్తాయి. క్రైమ్ ఎంటరైన దగ్గరనుంచి మరింత స్పీడుగా సీన్స్ పరుగెడతాయనుకుంటే ఫలితం లేకుండా పోయింది.

అయితే…
ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ పడ్డ కష్టం మాత్రం కేవలం ఆంధ్రాలో లీడింగ్ రాజకీయనాయకులను పొట్రెయిట్ చేయటంలో కనిపిస్తుంది. యాజటీజ్ గా వారి రూపు రేఖలు దింపేసాడు. వారి మాడ్యులేషన్, హావభావాలు ఫెరఫెక్ట్ గా సింక్ చేసాడు. అది తప్పించి సినిమాలో ఏమీ లేదు.

బ్రహ్మీ ఎక్కడ
ఈ సినిమాలో బ్రహ్మానందం ఉన్నట్లు ట్రైలర్ లో చూపెట్టారు. అయితే సినిమాలో ఆయన పాత్రకు ఉన్నది ఒకే డైలాగు. అంటే ఆయన క్రేజ్ ని వాడుకోవాలనుకున్నారు తప్ప పాత్ర ఇవ్వలేదు. ఇక స్పీకర్ గా పమ్మినేని బాగా నవ్వించారు.

సాంకేతికంగా…
ఈ సినిమాలో వర్మ టచ్ ఏమీ కనపడదు. ఆయన మ్యాజిక్ ఏమైపోయిందా అనిపిస్తుంది. అయితే కెమెరా వర్క్ బాగుంది. సైటైర్స్ అక్కడక్కడా నవ్వించాయి. రీరికార్డింగ్ ఓకే.  

చూడచ్చా…
థియోటర్ కు వెళ్లి ఆవేశపడి చూసేటంత సినిమా కాదు..టీవిలో వచ్చినప్పుడు కూల్ గా ముక్కలు ముక్కలుగా చూడచ్చు.


తెర వెనక..ముందు
నటీనటులు : అజ్మల్ అమీర్, ధనుంజయ్ రుక్మకాంత్ ప్రభునే, బ్రహ్మనందం, అలీ, పృథ్వీ తదితరులు
దర్శకత్వం : సిద్దార్థ తాతోలు
నిర్మాత : అజయ్ మైసూర్
బ్యానర్ : టైగర్ ప్రొడక్షన్, అజయ్ మైసూర్ ప్రొడక్షన్
 మ్యూజిక్ : రవి శంకర్
 సినిమాటోగ్రఫి : జగదీష్ చీకటి
ఎడిటింగ్ : అన్వర్ అలీ
రిలీజ్ డేట్ : 2019-12-12