అమ్మాయి మూవీ రివ్యూ

Published On: July 15, 2022   |   Posted By:

అమ్మాయి మూవీ రివ్యూ

RGV: వర్మ‘అమ్మాయి..డ్రాగన్ గర్ల్’రివ్యూ

Emotional Engagement Emoji
👎

ఒకప్పుడు బ్రూస్లీ నటించిన హాలీవుడ్ చిత్రం ఎంటర్ ది డ్రాగన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికి ఆ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సినిమాతో బ్రూస్లీ కొన్ని కోట్ల మందికి అభిమానపాత్రులయ్యారు. మొదటి నుంచి రాంగోపాల్ వర్మకు కూడా బ్రూస్లీ అంటే ఎనలేని అభిమానం. తన సినిమాలలోని ఫైట్స్ ఆయనను స్ఫూర్తిగా చేసుకుని చేసినవే అని వర్మ చెబుతుంటారు. ఇదిలావుండగా…ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ పేరుతో తన దర్శకత్వంలో ఆర్జీవీ ఇప్పుడు ఓ సినిమాను రూపొందించి వదిలారు. పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన మొదటి ఇండియన్ చిత్రంగా దీనిని ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉంది…వర్మ ప్లాఫ్ లకు అడ్డుకట్ట వేసే చిత్రం అవుతుందా?

స్టోరీ లైన్

బ్రూస్ లీ బాగా ఇష్టపడుతూంటుంది పూజా (పూజా భలేకర్). తన అక్క నిస్సహాయురాలైన కారణంగా జీవితం నాశనం కావడంతో స్వీయ రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంది. మరో ప్రక్క తన రోజూ వారి ఖర్చులు కోసం మోడలింగ్ చేస్తుంటుంది. ఆ క్రమంలో ఫోటోగ్రాఫర్ నీల్ (పార్థ్ సూరి)తో ప్రేమ వ్యవహారం నడుస్తుంది. ఆమె తను మార్షిల్ ఆర్డ్స్ నేర్చుకోవటం కోసం వైజాగ్ వచ్చి అక్కడ డ్రాగన్ స్కూల్ లో చేరుతుంది. అయితే కోట్ల విలువ చేసే ఆ స్కూల్ ఉండే ఏరియా మీద లోకల్ డాన్ వి. ఎం. (అభిమన్యు సింగ్) కన్ను పడుతుంది. దాన్ని ఎలాగైనా ఖాళీ చేయించాలని ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో డ్రాగన్ స్కూల్ నిర్వాహకుడు లుయ్ (తియాంగ్లాంగ్ షి)ని చంపేస్తాడు. దాంతో తన గురువు చివరి కోరిక మేరకు ఆ స్కూల్ నిర్వహణ బాధ్యతను తన భుజానికెత్తుకున్న పూజా దాన్ని ఎలా కాపాడింది? వి.ఎం.కుఎలా బుద్ధి చెప్పింది? ఆమె ప్రేమ కథ ఏమైంది అన్నది కథ.

ఎనాలసిస్…

మొదటి నుంచి విభిన్నచిత్రాలు చేస్తూ..ఓ ప్రత్యేక పంథా కు తెరతీసిన వర్మ కు ఎప్పటి నుంచో మార్షల్ ఆర్ట్స్ కు గ్లామర్ ను మేళవించి సినిమా చేయాలని ఉంది. ఆ సరదా తీర్చుకున్నారే తప్ప మరో కొత్త ట్రెండుకు తెర తీయబోతున్నారని చెప్పిన మాటలన్ని అబద్దం. సినిమా కు అవసరమైన బేసిక్ స్క్రిప్టుని కూడా ప్రక్కన పెట్టి కేవలం ఫైట్స్ మీద బేస్ అయ్యి సినిమా పూర్తి చేసారు. ఎక్కడా కథలో ఇంటెన్సిటీ కానీ, ఇంట్రస్ట్ కానీ కలగకుండా జాగ్రత్తలు తీసుకుని చేసినట్లు ఉంటుంది. కథలో ఫస్టాఫ్ మొత్తం అర్దం పర్దం లేని ఓ లవ్ స్టోరీ తో నడుస్తూంటుంది. సెకండాఫ్ లోకి అసలు కథలోకి వచ్చారు. అయితే అక్కడా ఏమీ గొప్పగా ఉండదు. మొత్తం గతంలో చూసిన సినిమాల్లో సీన్స్ తీసుకుని అందులో ఫైట్స్ కు ప్లేస్ ఇచ్చుకుంటూ రాసినట్లు ఉంటుంది. ఎక్కడా ట్విస్ట్ లు ఉండవు. హై ఇచ్చే ఎలిమెంట్స్ ఉండవు. విలన్ ..ఓ స్కూల్ లేదా ఇనిస్టిట్యూట్ ప్లేస్ ని కబ్జా చేయాలనుకోవటం, దాన్ని హీరో వచ్చి కాపాడటం…అనేది చాలా సినిమాల్లో చూసిందే. అయితే ఇక్కడ హీరోయిన్ అదే తేడా. అలాగే రెగ్యులర్ గా సినిమాలో హీరోని భయపెట్టడానికి హీరోయిన్ ని కిడ్నాప్ చేస్తారు. కానీ ఇక్కడ హీరోని కిడ్నాప్ చేస్తారు. అంతే తేడా. ఇంతకు మించి స్క్రిప్టులో మాట్లాడుకోవటానికి పెద్దగా ఎలిమెంట్స్ లేవు. విలన్ ని స్ట్రాంగ్ గా చూపెట్టడం కానీ, హీరోయిన్ ని,విలన్ కు మధ్య యాక్షన్ డ్రామా కానీ క్రియేట్ చేయ జరగలేదు. దాంతో చాలా బోర్ వచ్చేస్తుంది. ఏదో నాలుగు పాటలు, ఆరు ఫైట్స్ అన్నట్లు సినిమా సాగింది అంతే.

అయితే సినిమాలో చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ లేవా అంటే… బ్రూస్ లీ పూర్వీకులకు చెందిన దక్షిణ చైనాలోని జూనన్ పట్టణానికి కథను తీసుకెళ్ళడం బాగుంది. అలాగే అక్కడి 62 అడుగుల బ్రూస్ లీ విగ్రహాన్ని చూపించడంతో పాటు ఓ పాటనూ వర్మ చిత్రీకరించాడు. అవన్ని బ్రూస్ లీ అభిమానులకు నచ్చుతాయి. ఇక చైనా లేడీ ఫైటర్ ముఖీ మియాతో షూట్ చేసిన ఫైట్ సీన్ ఇంట్రస్టింగ్ గా ఉంది. కాకపోతే హీరోయిన్ ..ఏదో మోడల్ అని ఓ మాట అనేసి సినిమా అంతా ఆమెను టూ పీస్ బికినీలోనే చూపింతే ప్రయత్నం మాత్రం వర్మ చేసిన దారుణం. చివరకు ఫైట్స్ లోనూ హీరోయిన్ తో గ్లామర్ ప్రదర్శన చేయించారు.

ఇండో చైనీస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ చిత్రంలో టైటిల్ పాత్రధారి పూజా భలేకర్ చేసిన రిస్కీ ఫైట్స్ అత్యంత ఆకర్షణీయంగా, వళ్ళు గగుర్పొడిచేవిధంగా ఉండనున్నాయని మాత్రం చెప్పచ్చు. పై పెచ్చు ఆమె గ్లామర్ కూడా ఒక హైలైట్ అనుకోవాలనే డైరక్టర్ ఉద్దేశ్యం. అయితే అదృష్టవశాత్తు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు కాబట్టి వాటిని రీచ్ కావాల్సిన పని కూడా లేదు.

టెక్నికల్ గా
దర్శకుడుగా వర్మ నుంచి ఈ మధ్యకాలంలో వస్తున్న చౌకబారు చిత్రాల్లో ఇదొకటి. ఆయన సినిమాల్లో ఉంటే టెక్నికల్ బ్రిలియన్స్ కూడా పోయింది..ఉన్నంతలో కెమెరా వర్క్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ..సోసో గా ఉన్నాయి.

మార్షిల్ ఆర్ట్స్ వచ్చిన ఓ అమ్మాయిని తీసుకొచ్చి సినిమా చుట్టాయాలనేది డైరక్టర్ ఆలోచన. తక్కువ బడ్జెట్ లో చాలా భాగం ఊరు పేరు లేని ఆర్టిస్ట్ లతో ఈ కాన్సెప్ట్ డిజైన్ చేసిన‌ట్టుంది. సినిమాలో ఏ క్యారక్టర్ కు మనం కనెక్ట్ కాము.

నటీనటుల్లో…పూజ భలేకర్ గురించి వేరే వారు గురించి మాట్లాడుకోవటం దండగ. పూజా ఆశ్చర్యపరుస్తుంది. యాక్షన్ పార్ట్స్ లో ఆడియెన్స్ మతి పోగొడుతుంది. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఓకే అనిపించింది. విలన్ గా అభిమన్యు సింగ్ బాగా చేసాడు. క్లైమాక్స్ సీన్ లో డిజైన్ చేసిన యాక్షన్ బ్లాక్ కూడా మెప్పిస్తుంది.

చూడచ్చా..
ఇంత చదివాక కూడా ఇదే సందేహం వస్తే ఖచ్చితంగా వెళ్లి చూడటమే.

తెర వెనక..ముందు

నటీనటులు: పూజా భలేకర్, మియా ముఖి, అభిమన్యు సింగ్, రాజ్ పాల్ యాదవ్ తదితరులు
దర్శకత్వం :రామ్ గోపాల్ వర్మ
సంగీతం: పాల్ ప్రవీణ్ కుమార్
ఛాయా గ్రహణం: యుకే సెంథిల్ కుమార్
నిర్మాతలు : నరేష్ టి ,శ్రీధర్, రామ్ గోపాల్ వర్మ
Run Time: 133 నిమిషాలు
విడుదల తేదీ :15-07-2022