Reading Time: 3 mins

అరణ్య మూవీ రివ్యూ

Image

రానా ‘అరణ్య’ మూవీ రివ్యూ

Rating: 2.5/5

ఒకప్పుడు అడివిలో బిక్కుబిక్కు మంటూ గడిపారు మనుషులు. ఇప్పుడు ఆ భయం పోయి…హద్దుమీరి ఆశమీరి అడవినే గుప్పెట్లో పెట్టుకున్నారు..ఇప్పుడు జనారణ్యంలో అడవిది బిక్కుబిక్కు బతుకైంది ! ఎవరో అన్నట్లు …నాగరికత కొండచిలువ పాక్కొంటూ తనవేపే వస్తోంటే గజగజ వణుకుతోంది అడవి! అలాంటి అడవిని రక్షించేదెవరు…దాన్ని మనుష్యుల నుంచి కాపాడేదెవరు.. రోజు రోజుకీ  చిక్కి శల్యమవుతున్న అడవిని, అందులో జంతువలను కార్పోరేట్ ప్రపంచం నుంచి కాపాడే మొనగాడెవరు…నాగరికత పగబట్టినట్లుగా తనను నరికేస్తూంటే.. అడవిప్పుడు కొన ఊపిరితో వుంది. అభయారాణ్యలు  పలచనయి చులకనవుతున్నాయి. ఈ అరణ్య రోదనను వినిపించటానికి ప్రభు సాల్మన్ నడుం బిగించారు. సినీ మాధ్యమంతో కొంత ఎవేర్నెస్ తెద్దామనుకున్నాడు. అందుకు రానా తన వంతుగా అండగా నిలిచాడు. ఈ క్రమంలో వచ్చిన ‘అరణ్య’ ఎలా ఉంది..చిత్రంలో ఏం చెప్దామనుకున్నారు. ఎంతవరకూ ఆ మెసేజ్ ని జనరంజకంగా ఇచ్చారనేది రివ్యూలో  చూద్దాం.
 
స్టోరీ లైన్

నరేంద్ర భూపతి అలియాస్ అరణ్య(రానా దగ్గుబాటి)  తాత అప్పట్లో తన ఆస్ది అయిన  500 ఎకరాల అటవీ ప్రాంతాన్ని  వన్య ప్రాణ సంరక్షణ కోసం ప్రభుత్వానికి రాసిచ్చేస్తాడు. ఆ స్పూర్తిని తీసుకున్న మనవడు అరణ్య…అక్కడే ఆ అడవిలోనే పెరిగి,  ఏనుగులకు గత 40 ఏళ్లుగా సంరక్షకుడిగా ఉంటాడు. అలాగే అక్కడే.., లక్షకి పైగా చెట్లు నాటి  రాష్ట్రపతి చేత ఫారెస్ట్ మాన్ అఫ్ ఇండియా అవార్డు అందుకుంటాడు.  అలా అరణ్య జీవితం జంతువులతో ముడి పడి ముందుకు వెళ్తున్న సమయంలో …అటవీ శాఖ మంత్రి కనకమేడల రాజగోపాలం(అనంత్ మహదేవన్) రూపంలో అతని ఆశయానికి గండి పడుతుంది. అడవి ఏనుగుల జీవితాలకు ముప్పు ఏర్పడుతుంది. ఆ అడవిలో 60 ఎకరాల్లో ఒక స్మార్ట్ సిటీ కట్టాలని డిసైడ్ అయ్యి ఆ మంత్రి అందుకు సంభందించిన కాంట్రక్ట్ ని ఒకళ్లకి ఇచ్చేస్తాడు. అరణ్య ఈ విషయమై తగువుపడతాడు. అయినా అరణ్య రోదనే అవుతుంది. దాంతో ఆ  ప్రాజెక్టుని ఆపించడం కోసం అరణ్య కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటాడు.  పనులు ఆపకపోవడమే కాకుండా అరణ్య పిచ్చి వాడని ముద్రవేసి  జైల్లో పెడతారు. అరణ్య జైల్లో ఉండగానే తమ స్ట్రాటజీ అమలు చేస్తారు. అతను జైలు నుంచీ వచ్చే సరికి 60కిమీ విస్తీర్ణంలో గోడ కట్టేస్తారు. దాంతో ఆ అడవిలోని ఏనుగులకు నీళ్లు ఉండదు. ఇది చూసిన అరణ్య విల విల్లాడిపోతాడు. అక్కడి నుంచీ అరణ్య ఆ ఆడవి కోసం, ఆ ఏనుగుల కోసం ఎలా పోరాడాడు?పవర్ చేతిలో ఉన్న  కనకమేడల రాజగోపాలం ఎలా అడ్డుకునే ప్రయత్నం చేసాడు? చివరకు ఆ గోడల్ని పడగొట్టించి మళ్ళీ ఆ ప్రాంతాన్ని ఎలా దక్కించుకున్నాడు అనేది మిగతా సినిమా కథ.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్

ప్రకృతి మానవుడికి అందించిన గొప్ప ఆస్తి అడవి. సహజ సిద్ధమైన అడవులను నాశనం చేస్తుండటంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని విపత్తులు సంభవిస్తున్నాయి. మరో వైపు అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులు నానాటికి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 1986లోనే భారత ప్రభుత్వం అటవీ విధానాన్ని తీసుకొచ్చింది. భూ భాగంలో 33 శాతం అడవులు ఉండాలని నిర్దేశించారు.ప్రభుత్వం అటవీ సంరక్షణ చర్యలు చేపట్టినా క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలు ఉండటంలేదు. ఇలాంటి విషయాలు మనకు పుస్తకాల్లో, మీడియా కథనాల్లో ఉంటాయి. వీటిని తెరకెక్కించాలంటే చాలా ధైర్యం కావాలి. అందుకు హీరో రానా, నిర్మాతను, డైరక్టర్ ని ఖచ్చితంగా అభినందించాలి.

ఈ సినిమాకు పెద్ద మైనస్ గా నిలిచింది స్క్రీన్ ప్లే అని చెప్పాలి.  ఫారెస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా జాదవ్‌  స్పూర్తితో తయారైన ఈ కథ రానా పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆ పాత్రకు లవ్ స్టోరీ,కామెడీ వంటివి పెట్టలేమని విష్ణు విశాల్ పాత్రని తీసుకున్నారు. అయితే ఆ క్యారక్టర్ సినిమాలో సెట్ కాలేదు. దానికి తోడు ఎడిటింగ్ లో అర్దాంతరంగా ఆ పాత్రను కట్ చేసేయటంతో అది తుది,మొదలు లేని పాత్రగా మిగిలింది. సినిమా ఫస్టాఫ్ లో చాలా సేపు కనపడే ఆ పాత్ర కథలో ఏమన్నా ఛేంజెస్ తెస్తుందేమో అని ఎక్సపెక్ట్ చేస్తాం. అలాంటిదేమీ లేకుండా ముగియటం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అలాగే ఫస్టాప్ లో ఈ చిత్రం కథ ఏమీ జరగినట్లు ఉండదు. రానా క్యారక్టర్ జైలులోకి వెళ్లి గోడ కట్టాకే కథ కాంప్లిక్ట్స్ లోకు ప్రవేశిస్తుంది. అయితే ఆ సీన్ ముగిసేసరికి సెకండాఫ్ వచ్చేసింది. అయితే క్లైమాక్స్ ఎమోషన్ ఈ కథకు బాగా కుదిరింది. ఆ సీన్స్ ని బేస్ చేసుకునే మిగతాదంతా అల్లి ఉంటారని అర్దమవుతుంది. ఓ నిజ జీవిత డ్రామా తెరకెక్కించాలనకున్నప్పుడు డాక్యూ డ్రామా అయ్యినా నిజాయితీ ప్రయత్నం చెయ్యాల్సిందే. దానికి తోడు కథనంలో కూడా ఎమోషనల్ ప్రేక్షకుడుని కనెక్ట్ చేయలేకపోయారు. ఏనుగుల సమస్యను డైలాగుల్లో చెప్పటంతో అది మనకు అంతగా రిజిస్ట్రర్ కాదు. దాంతో ఏదో మిస్ అయ్యారనిపిస్తుంది. వీటికి తోడు లాజికల్ గా మిస్ అయిన అంశాలు సినిమాకి డిస్కనెక్ట్ అయ్యేలా చేస్తాయి.   ఏదైమైనా ఎమోషనల్ జర్నీని క్లియర్ గా చూపించి ఉంటె కనెక్ట్ అయ్యేవాళ్లం.

టెక్నికల్ గా…

ఈ సినిమాలో హైలెట్స్ .  విజువల్స్ అండ్ మ్యూజిక్ అని చూసిన ఎవరైనా చెప్పగలుగుతారు. రియల్ లొకేషన్స్ లో షూట్ చేసిన విజువల్స్ అద్బుతంగా ఉన్నాయి. అయితే ఆ విజువల్స్ కు యాడ్  చేసిన సిజి షాట్స్ మాత్రం సింక్ కాలేదు.  సిజి షాట్ చాలా డిస్టర్బన్స్ గా అనిపిస్తాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రీరికార్డింగ్ చాలా సీన్స్ కు ప్లస్ అయ్యింది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఫీల్ ని పెంచుతూ. రసూల్ పూకుట్టి చేసిన సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఎడిటింగ్ లో ఎక్కువ జంప్ కట్స్ , లాగ్ ఎక్కువ.  ఎరోస్ నిర్మాణ విలువలు బ్యానర్ స్దాయికి తగ్గట్లు లేవు. డైలాగులు జస్ట్ ఓకే. దర్శకుడు లో ప్రయత్న లోపం అయితే కనపడదు. కష్టం తెరపై చాలా సీన్స్ లో కనపిస్తుంది.

నటీనటుల్లో రానా దగ్గుబాటి ఇంత చిన్న వయస్సులో అంత బరువైన పాత్రను అవలీలగా చేసుకుంటూ పోయాడు. పూర్తి డిఫరెంట్ గెటప్, మ్యానరిజమ్స్, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో చాలా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తాడు.  విష్ణు విశాల్ కథకు ఉపయోగపడకపోయినా తనకిచ్చిన పాత్రలో బాగా చేసాడు. జోయా హుస్సేన్, శ్రియ పిల్లాన్కర్ లవి చిన్న పాత్రలు. రఘుబాబు ని కామెడీకి వాడారు.నెగిటివ్ క్యారక్టర్స్ లో  కనిపించిన అనంత్ మహదేవన్, రవి కాలే లు బాగా చేశారు.
 
చూడచ్చా…

నిజ జీవిత వ్యక్తి  స్పూర్తితో, మంచి  మెసేజ్ తో వచ్చిన ‘అరణ్య’ని కొన్ని లోపాలు పట్టించుకోకపోతే ప్యామిలీతో చూడచ్చు.

తెర ముందు..వెనక..

నటీనటులు :  రానా దగ్గుబాటి,  విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్‌ తదితరులు
నిర్మాణ సంస్థ : ఈరోస్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థ
దర్శకత్వం : ప్రభు సాల్మన్
సంగీతం : శాంతను మొయిత్రా
సినిమాటోగ్రఫీ : ఏఆర్ అశోక్ కుమార్
ఎడిటింగ్ : భువన్ శ్రీనివాసన్
డైలాగ్స్ : వనమాలి
రన్ టైమ్: 2 గంటల 42 నిమిషాలు
విడుదల తేది : మార్చి 26, 2021