Reading Time: 2 mins
అల్లంత దూరాన చిత్రం మీడియా స‌మావేశం
న‌టికి సంతృప్తి అనేది వుండదు – రాజ‌మౌళి వంటి వారి చిత్రాల్లో న‌టించాల‌నుంది  -ఆమ‌ని
`అల్లంత దూరాన` చక్కటి ప్రేమకథతో విజువల్‌ ఫీస్ట్‌గా రూపొందింది – ఆమ‌ని, హ్రితిక శ్రీనివాస్‌
విశ్వ కార్తికేయ హీరోగా, సీనియర్ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాస్‌ హీరోయిన్ గా న‌టించిన చిత్రం `అల్లంత దూరాన`. చ‌లపతి పువ్వల దర్శకత్వంలో ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి నిర్మించారు.
తెలుగు, తమిళ భాషలలో రూపొందిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా ఆదివారంనాడు సంస్థ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన‌ మీడియా స‌మావేశంలో న‌టి ఆమ‌ని, హ్రితిక శ్రీనివాస్ చిత్రం గురించి, కెరీర్ గురించి ప‌లు విష‌యాలు ఇలా తెలియ‌జేస్తున్నారు.
ఆమ‌ని మాట్లాడుతూ,  చక్కటి ప్రేమకథతో విజువల్‌ ఫీస్ట్‌గా ఉంటుంది. కెమెరామెన్‌, సంగీతం, ద‌ర్శ‌కుడు వారి ప‌నిత‌నం ఈ సినిమాకు వ‌న్నె తెచ్చింది. విశ్వ కార్తికేయ బాల‌న‌టుడిగా చేసి హీరో అయ్యాడు. అదేవిధంగా నా మేన‌కోడ‌లు హ్రితిక శ్రీనివాస్ కూడా ప‌దేళ్ళ‌నాడు త‌మిళంలో `చాప్లిన్‌ చామంతి` అనే సినిమాలో పూర్తిస్థాయి పాత్ర పోషించి మెప్పించింది. ఒక‌వైపు చ‌దువు, మ‌రోవైపు న‌టన అనేది త‌న‌కు ఇష్టం. అందుకే ఆ సినిమా త‌ర్వాత చ‌దువుపై శ్ర‌ద్ధ పెట్టింది. ఇక ఈ సినిమాలో హ్రితిక కాంబినేష‌న్లో సీన్లు వున్నాయి. త‌ను పెద్ద డైలాగ్ కూడా సింగిల్ టేక్‌లో చెప్పేసింది.
– న‌టిగా సినిమారంగంలోని సాధ‌క‌బాధ‌ల‌న్నీ త‌న‌కు చెప్పాను. త‌ను నా సినిమాలే కాకుండా ఇత‌ర హీరోయిన్ల సినిమాలు చూసి వారినుంచి న‌ట‌న నేర్చుకుంది.
– ఇక నేను బాపు, కె. విశ్వ‌నాథ్‌, ఎస్‌.వి. కృష్ణారెడ్డి, కె. రాఘ‌వేంద్ర‌రావు వంటి వారి సినిమాల్లో ప‌నిచేయ‌డం వ‌ల్ల చాలా నేర్చుకున్నా. అది ఇప్పుడు చేసే సినిమాల‌కు చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది.
– న‌టికి ఎన్ని పాత్ర‌లు చేసినా సంతృప్తిరాదు. ఇంకా ఏదో చేయాల‌నే త‌ప‌న వుంటుంది. నాకు అమ్మ‌వారి పాత్ర‌, పోలీసు పాత్ర ఇలా మ‌రికొన్ని భిన్న‌మైన పాత్ర‌లు చేయాల‌నుంది.
– అలాగే ద‌ర్శ‌కుడులో రాజ‌మౌళి, సుకుమార్‌, పూరీ జ‌గ‌న్నాథ్‌, మ‌ణిర‌త్నం ఇలాంటివారి చిత్రాల్లో న‌టిస్తే న‌టిగా ఇంకా మెరుగులు దిద్దుకోగ‌లుగుతాం.
– న‌టిగా నేను పీక్ స్టేజ్ లో వుండి ఆ త‌ర్వాత పిల్ల‌ల పెంప‌కం వ‌ల్ల గేప్ తీసుకున్నా. ఇప్పుడు న‌టించ‌డానికి వీలు క‌లుగుతుంది. అందుకే ఇత‌ర భాష‌ల‌కంటే నాకు పేరుతెచ్చిన తెలుగు రంగంపైనే దృష్టి పెట్టాను.
– ఒక‌ప్ప‌డు హీరోయిన్ల‌కు, కేరెక్ట‌ర్ ఆర్టిస్ట‌లకు కూడా ప్రాధాన్య‌త వుండేది. కానీ రానురాను అది లోపించింది. హీరోయిన్‌లు కూడా నామ మాత్రంగానే క‌థ‌లో భాగ‌మైపోయారు. ఇందులో ఎవ‌రి త‌ప్పులేదు. ట్రెండ్ ను బ‌ట్టి ఫాలో అవ్వ‌డ‌మే.
– ఒక‌ప్పుడు ఫిలిం కాబ‌ట్టి కెమెరాముందు జాగ్ర‌త్త‌గా న‌టించేవారు. ఇప్పుడు డిజిట‌ల్ అయ్యేస‌రికి ఎన్ని టేక్ లు అయినా ద‌ర్శ‌కుడు ఈజీగా తీసుకుంటున్నాడు.
–  మేం న‌టిగా ఒక్కో మెట్టు ఎక్క‌డానికి తిరుప‌తి మెట్లు ఎక్కినంత క‌ష్ట‌ప‌డేవాళ్ళం. కానీ ఇప్ప‌టి న‌టీమ‌ణుల‌కు చాలా అవ‌కాశాలు వున్నాయి. వెబ్ సీరిస్‌, ఓటీటీ, సీరియ‌ల్స్‌, లేక‌పోతే స్వంతంగా యూట్యూబ్‌లోనైనా చేసుకోవ‌చ్చు.  అని తెలిపారు.
హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ మాట్లాడుతూ, నేను న‌టి అవుతాన‌ని అన‌గానే ఇంట్లో వారికి అత్త‌మ్మ వుంద‌నే ధైర్యంతో ఓకే చెప్పేశారు. న‌ట‌న‌లో అత్త ఇన్‌స్పిరేష‌న్ అయితే ఒక్కో సినిమాలో ఒక్కో హీరోయిన్ నుంచి ప‌లు అంశాలు నేర్చుకున్నా. నాకు క్లాసిక‌ల్ డాన్సంటే ఇష్టం. అందులో మాదురీ దీక్షిత్ అంటే నాకు స్పూర్తి. నేను న‌ట‌న‌లో ఎటువంటి శిక్ష‌ణ తీసుకోలేదు. ప‌దేళ్ళ‌లోనే చాప్లిన్ చామంతి అనే త‌మిళ సినిమాలో బాగా న‌టించాన‌ని అంద‌రూ చెప్పారు. ద‌ర్శ‌కుడు సీన్ చేసే ముందు డైలాగ్‌లు ఇచ్చేవారు. తెలుగు, త‌మిళంలో ఆ డైలాగ్‌లు రాత్రి పూట చ‌దివి సింగిల్ టేక్‌లో చెప్పాను. మా అత్త కూడా ఆశ్చర్య‌ప‌డింది. న‌టిగా ఎటువంటి కొల‌మానాలు పెట్టుకోలేదు. కేరెక్ట‌ర్ బాగుండి. క‌థ‌కు స‌రిప‌డుతుందంటే ఆ పాత్ర చేయ‌డానికి సిద్ధం. నేను తాజాగా త‌మిళంలో అశోక్ హీరో న‌టించిన సినిమాలో చేశాను. అది నిన్న‌నే విడులైంది. క‌న్న‌డ‌లో ఓ సినిమా చేశాను. ఇప్పుడు తెలుగులో ఈ సినిమా చేశాను. ముందుముందు మంచి పాత్ర‌లు వ‌స్తాయ‌ని అనుకుంటున్నాన‌ని తెలిపారు.
చిత్ర  స‌మ‌ర్ప‌కురాలు శ్రీమతి కోమలి మాట్లాడుతూ, చిత్రం బాగా వ‌చ్చింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ఫైన‌ల్ ద‌శ‌కు చేరుకున్నాయి. త్వ‌ర‌లో విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు.