Reading Time: 3 mins

ఆరడుగుల బుల్లెట్ మూవీ రివ్యూ

గోపిచంద్  ‘ఆరడుగుల బుల్లెట్’ రివ్యూ


Emotional Engagement Emoji (EEE) : 

?

‘ సీటీమార్’ సక్సెస్‌ గోపిచంద్ కు మరిన్ని ఆఫర్స్ తెచ్చి పెట్టిందో లేదో కానీ , అతని  పాత సినిమా  దుమ్ము దులుపుకుని రిలీజ్ అయ్యింది. 2012 లో మొదలైన ఈ సినిమా ఇప్పటికి థియోటర్స్ మొహం చూసింది. అప్పటి కథ,కథనం ఈ కాలానికి నప్పేవేనా, ఈ సినిమా మేకింగ్ ఇప్పటి జనరేషన్ కు ఎక్కుతుందా, అసలు సినిమా కథేంటి, సినిమాలో యాక్షన్ సీన్స్ బాగున్నాయా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

బేవర్స్ గా తిరిగే శివ (గోపీచంద్)కు ఫ్యామిలీ అంటే ప్రాణం. అయితే అతని తండ్రి మూర్తి (ప్రకాశ్ రాజ్)కు ఇలా తన కొడుకు ఆవారాగా ఉండటం కోపం తెప్పిస్తూంటుంది. ఎప్పుడూ గొడవలు పడుతూంటాడు. ఆయనో గవర్నమెంట్ ఎంప్లాయి. దాంతో తన పరిచయాలతో ఓ బిల్డర్ తో మాట్లాడి ముంబైలో శివకు ఉద్యోగం వేయిస్తాడు.కానీ ప్యామిలీని వదిలి దూరంగా ఉండలేని శివ అక్కడ గొడవపెట్టుకుని  వచ్చేస్తాడు. మరో ప్రక్క ఈ గ్యాప్ లో  న‌య‌న (న‌య‌న‌తార‌)తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాడు. ఆమె కూడా శివ ప్రేమ‌ని ఒప్పుకుంటుంది. కానీ… తండ్రి మూర్తి మాత్రం `ఉద్యోగం సద్యోగం లేని నా కొడుకు పెళ్లికి పనికి కాదు. నువ్వు పెళ్లి చేసుకోకు` అని న‌య‌న ముందే శివ‌ని అవ‌మానిస్తాడు. అంతేకాదు ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో ప‌డి తింటున్నావ్‌.. అంటూ శివ‌ని ఇంట్లోంచి గెంటేస్తాడు. ఈలోగా ఆయనకి బెజవాడ ట్రాన్స్ ఫర్ అవుతుంది. నిజాయితీపరుడైన శివ తండ్రికి అక్కడ బెజవాడని తన కన్నుసన్నలతో శాసించే  కాశీ (అభిమ‌న్యు సింగ్) అనే గుండా నుంచి ఓ ప్ర‌మాదం వ‌చ్చి ప‌డుతుంది. ఆ తర్వాత ఊహించనవి విధంగా ఆ గూండాతో శివకు గొడవ జరుగుతుంది. ఆ రౌడీయిజం ఉచ్చులోంచి శివ ఎలా బయటపడ్డాడు?   త‌న తండ్రిని, కుటుంబాన్నీ శివ ఎలా కాపాడాడు? తనను తప్పుపట్టే తండ్రితోనే శభాష్ అని ఎలా అనిపించుకున్నాడు? కుటుంబం కోసం లవర్ ని దూరం చేసుకున్న శివ, తిరిగి ఆమె ప్రేమను ఎలా పొందాడు? అనేది మిగతా కథ.

 స్క్రీన్ ప్లే ఎనాలసిస్..

 ఆకతాయి కొడుకుని తండ్రి దూరంగా పెట్టడం, ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే ఆ కొడుకే వచ్చి కాపాడతాడు. ఆ తండ్రి కొడుకును ఎంతలా అపార్ఠం చేసుకున్నాడు.. ఎంతలా మిస్ అయ్యాడు.. ఆ ఫ్యామిలీని అతను ఎలా కాపాడాడు అనేదే కథ. ఇలాంటి కథలు ఇప్పటికే తెలుగు తెర బోలెడు చూసింది. అయితే ఇలాంటి కథలకు అసెంబ్లీ రౌడీ లాంటి సెకండాఫ్ ఉంటేనే వర్కవుట్ అవుతుంది. ఎందుకంటే కథ సెటప్ మొత్తం అదే. అలాగే రౌడీయిజం నశించాలి అని అప్పట్లో రాజశేఖర్ హీరోగా వచ్చిన చిత్రం కూడా ఇలాంటిదే. వాటిల్లో హైలెట్ అయిన ఎలిమెంట్స్ ఈ సినిమాలో మిస్సయ్యాయి. దానికి తోడు  బెజవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిత్రాలు చాలా ఉన్నాయి. ఆ రౌడీయిజాన్ని మరోసారి ఎదుర్కొనే హీరో కథే ఇది. ఈ సినిమా ఎనిమిదేళ్ల క్రితం ఎలాంటి కథ,కథనాలు వచ్చేవో గుర్తు చేస్తుంది. అయితే అప్పుడే రిలీజ్ అయ్యి ఉన్నా ఈ సినిమా ఆడి ఉండేదా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే కథ అప్పటికే ఓ పదేళ్లు అవుట్ డేటెడ్ వ్యవహారంలా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే అనేది పట్టించుకున్నట్లు కనపడదు. సీన్స్ వరసపెట్టి వేసుకుంటూ వెళ్లిపోయారు. ఇగో విలన్ నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునే హీరో క్యారక్టరైజేషన్ ,సీన్స్ చూస్తూంటే ఎన్టీఆర్ తో చేసిన అశోక్ సినిమా బాగా గుర్తుకు వస్తుంది. కొడుకును అపార్థం చేసుకునే తండ్రి, తండ్రిని అర్థం చేసుకోలేని కొడుకు, వీరి మధ్యలో తనను ప్రేమించే వ్యక్తికి ఫ్యామిలీ పట్ల ఉండే కమిట్ మెంట్ ను గ్రహించని లవర్, పోలీస్ వ్యవస్థ అనేదే లేనట్టుగా రెచ్చిపోయే రౌడీ… ఇలాంటి అంశాలతో అల్లిన ఈ కథను బేస్ చేసుకుని ఎవరు మాత్రం ఏం చేయగలరు. ఇవన్నీ చాలదన్నట్లు కథలోకి రావటానికి ఇంటర్వెల్ దాకా టైమ్ తీసుకోవటంతో ఫస్టాఫ్ లో ఏమీ జరగినట్లు అనిపించదు. అందరూ ఊహించగలిగే ప్రెడిక్టబుల్ ఇంటర్వెల్. పోనీ సెకండాఫ్ లోఅయినా కథ పరుగెడుతుందా అంటే అదీ ఉండదు. ప్రీ క్లైమాక్స్ లో మెయన్ ప్లాట్ లోకి వస్తాము. విలన్ కాశీ స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది. కానీ కథకు అవసరం అనిపించినప్పుడే సీన్ లోకి వస్తాడు. ఫ‌స్టాఫ్ లో ఎమ్మెస్ నారాయ‌ణ‌, సెకండాఫ్ లో బ్ర‌హ్మానందాన్ని కామెడీ, మ‌ధ్య‌లో ఇంట్ర‌వెల్  ఫైటు. కామెడీ చాలా సినిమాల్లో చూసిన సీన్స్ తోనే సాగుతుంది. చివరి అరగంట తప్పా చెప్పుకోవటానికి ఏమీ లేదు. నిజానికి మేకింగ్ స్టైల్ ఆ కాలంది అయినా కథలో దమ్ము ఉంటే ఇప్పుడూ బాగుందనిపిస్తుంది. సీన్స్ కూడా అందుకు తగినట్లు ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి ట్విస్ట్ లు, టర్న్ లు లేకుండా సినిమా కథ నడుస్తుంది. వక్కంతం వంశీ ఇలాంటి కథ ఇచ్చారా అనే సందేహం వస్తుంది. ఇంక స్టంట్స్, వైర్ వర్క్ లు ఇప్పుడు నడవటం లేదు. అవి ఇప్పుడు చూస్తూంటే ఇబ్బందిగానే అనిపిస్తాయి.  


టెక్నికల్ గా..

కథ పాతది, మేకింగ్ పాతది. టెక్నికల్ గా ఇప్పటి సినిమాలతో పోల్చి చూడలేము. అలాగే  సీజీలో చేసిన  కొన్ని సీన్లు  డీఐ చేయ‌కుండా వదిలేసారు. మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. పాటలు సోసోగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగోలేదు. ఆర్ట్ డైరక్షన్ బాగుంది. ఎడిటింగ్ స్టైల్స్ కూడా అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయాయి. యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నంతలో బాగున్నాయి. ఒక్క ‘లైఫ్ అంటే గాలిపటం’ సాంగ్ ఆకట్టుకుంటుంది.  ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అప్పట్లో ఈ సినిమాపై బాగానే ఖర్చుపెట్టారని అర్దమవుతుంది. దర్శకత్వం విషయానికి వస్తే… 2012లో బూపతి పాండియన్ దర్శత్వంలో ఈ సినిమా మొదలైంది. కథాంశంపై విబేధాల కారణంగా అతడు తప్పుకోగా డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. కానీ ఆయన కూడా గ్రిప్పింగ్ గా చేయలేకపోయారు. అబ్బూరి రవి మాటలు కూడా సినిమాకు తగ్గట్లే ఉన్నాయి

నటీనటుల్లో…

గోపీచంద్ బాగానే చేసాడు కానీ …షూటింగ్ గ్యాప్ ల వల్ల అనుకుంటా..ఒక్కోసారి ఒక్కోరకంగా బాడీ షేప్ మారుతూ వచ్చింది. అయితే అతను ఇలాంటి పాత్ర వెయ్యటం రొటీన్ కాబట్టి…రొటీన్ గానే చేసుకుంటూ వెళ్లాడు.ఇక నయనతార ఫన్, ఎమోషన్ చేయించే ప్రయత్నం చేయించారు కానీ ఏదీ పండలేదు. కోట శ్రీనివాసరావు, ఉత్తేజ్, చలపతి రావు, జీవా ఒక్కో సీన్ లో కనపడతారు. ఇప్పటికే కాలం చేసిన ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్ రెడ్డి, గుండు హనుమంతరావులను ఈ సినిమాలో చూడొచ్చు. మిగతా పాత్రల్లో అభిమన్యుసింగ్, సలీమ్ బేగ్, రమా ప్రభ, సంధ్యాజనక్, మధునందన్, సురేఖావాణి, సన, గీతాసింగ్ తదితరులు నటించారు. సెకండాఫ్ లో బ్రహ్మానందం కనపడతాడు కానీ అవుట్ డేటెడ్ కామెడీ.

నచ్చినవి:
 
యాక్ష‌న్ సీన్స్
మ‌ణిశ‌ర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నచ్చనవి:

కథ,కథనం
విల‌న్‌ స్ట్రాంగ్ గా లేకపోవటం
కామెడీ

చూడచ్చా

గోపీచంద్ కు వీరాభిమానులైతే తప్ప భరించటం కష్టం
 
తెరవెనుక..ముందు
నటీనటులు: గోపీచంద్, నయనతార,ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్,రమాప్రభ, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: ఎం.బాలమురుగన్
కథ: వక్కంతం వంశీ
మాటలు: అబ్బూరి రవి
నిర్మాత: తాండ్ర రమేష్
రన్ టైమ్: 2గంటల, 21 నిముషాలు
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బి.గోపాల్
రిలీజ్ డేట్: 8,అక్టోబర్ 2021