ఇ టీ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక
అభిమానుల సమక్షంలో ఘనంగా సూర్య ఇ టీ (ఎవరికీ తలవంచడు) చిత్రం ప్రీ రిలీజ్ వేడుక
పాండమిక్‌లో తెలుగు ప్రేక్షకుల వల్లే భారతీయ చిత్రపరిశ్రమకు ధైర్యం వచ్చింది. – సూర్య
సూర్య నటించిన యాక్షన్ థ్రిల్లర్ `ఇటి` (ఎవరికీ తలవంచడు). పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది.
తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మార్చి 10 విడుదల కానుంది.
ఈ సందర్భంగా గురువారం రాత్రి సూర్య ఇ టీ (ఎవరికీ తలవంచడు) ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ దస్‌పల్లాలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు.
`అమ్మాయిలంటే బలహీనులనుకుంటారు. కానీ బలవంతులని నిరూపించుకోవాలి.. అంటూ సూర్య సందర్భానుసారంగా చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ `ఇ.టి.` ట్రైలర్‌లో హైలైట్. అనంతరం సూర్యతోపాటు ముఖ్య అతిథిలు మాట్లాడారు.
హృదయం చెప్పినట్లు చేయండి భవిష్యత్ మీదే – సూర్య. సూర్య మాట్లాడుతూ, రెండున్నరేళ్ళుగా తెలుగు ప్రేక్షకులను చూడలేకపోయాను. నేను ఇక్కడకు రావడం హోం టౌన్‌గా భావిస్తాను. సురేష్‌బాబు, బోయపాటి శ్రీను, గోపీచంద్, రానా వీరందరినీ కలవడం చాలా హ్యాపీగా వుంది. ఓనాడు ఓ సందర్భంలో రానాతో కొద్దిసేపు గడిపాను. చక్కగా నేను ఇచ్చిన సూచనలు విన్నాడు. కరోనా మహ మ్మారిని ఎలా ఎదుర్కోవాలో భారతీయ చిత్ర పరిశ్రమకు చాటి చెప్పింది తెలుగు ప్రేక్షకులే. తెలుగు చిత్ర పరిశ్రమను చూశాకే ఇతర పరిశ్రమలలో ధైర్యం ఏర్పడింది. దానికి కారణం తెలుగు ప్రేక్షకులు సినిమాపై చూపే ప్రేమ, ఆదరణలే. అందువల్లే అఖండ, పుష్ప, భీమ్లానాయక్.. సినిమాలు తెలుగు సినిమా స్టామినాను ఇండియన్ సినిమాకు రుచి చూపించాయి.నేను కూడా పాండమిక్‌లోనే ఆకాశం నీ హద్దురా. జైభీమ్ ద్వారా అందరికీ దగ్గరయినందుకు ఆనందంగా వుంది. ఎప్పటిలాగానే తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాలపై ప్రేమను చూపించారు. మంచి సినిమాకు హద్దులు లేవని తెలియజేసింది. తెలంగాణ, ఆంధ్ర అనేవి నా స్వంత ఇంటిలా భావిస్తాను. నేను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి అందరూ మాట్లాడుతున్నారు.
నేను స్వచ్చంధ సేవా సంస్థను ప్రారంభించడానికి స్పూర్తి చిరంజీవిగారే. రక్తదాన శిబిరాలతో కోట్లమందిలో మార్పును తీసుకువచ్చారాయన. అలాంటి మార్పు కొద్ది మందిలో తీసుకువచ్చినా ఎంతో మేలు జరుగుతుందని నేను అగరం ఫౌండేషన్ స్థాపించా. ఆ సంస్థ నుంచి వచ్చిన తొలి తరం 5వేల మంది ఇప్పుడు కాలేజీకి వెళుతున్నారు. కఫర్ట్ జోన్‌లో వుంటే ఎవరికీ ఎదుగుదల వుండదు. కరోనాను మరిచిపోయి హృదయం ఏంచెబితే అది చేయండి. అప్పుడే అందరికీ అద్భుతమైన భవిష్యత్ వుంటుంది. ఇక ఇ.టి. సినిమా నాకు స్పెషల్ మూవీ. నేను రామ్ లక్ష్మణ్‌తో చేసిన ఫైట్స్ బాగా వచ్చాయి. ముఖ్యంగా ఇంటర్‌వెల్ బ్లాక్ అద్భుతంగా వచ్చింది. వినయ్ చక్కటి పెర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రియ అన్ని ఎమోషన్స్‌ను బాగా పండించింది. నా తొలి పుట్టినరోజు వేడుకకు హాజరైన సత్యరాజ్ మామతో నేను చేసిన తొలి సినిమా ఇది. పదేళ్ళ తర్వాత రత్నవేలుతో కలిసి చేస్తున్న సినిమా. దర్శకుడు పాండిరాజ్‌తోనే నా నిర్మాణ సంస్థ మొదలైంది. ఎంతోమంది ప్రత్యేకమైన వ్యక్తులు ఈ సినిమాలో వున్నారు. కండలతోపాటు హృదయం కూడా కనిపిస్తుంది. ప్రేక్షకులు గుర్తుపెట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళే ఎన్నో విషయాలు ఈ సినిమాలో వున్నాయి. అలాగే జానీ మాస్టర్ నా నుంచి బెస్ట్ డాన్స్ రాబట్టాడు. ఇ.టి. సినిమా అందరినీ టచ్ చేసే సినిమా. ఈ సినిమాలో ఓ డైలాగ్ వుంటుంది. మీ అందరూ సంతోషంగా వుండాలనుకోవడమే నాకు సంతోషం.. ఈ సినిమాకూడా అలాగే సంతోసంగా ఆదరించి ప్రేమను చూపించాలని కోరుకుంటున్నాను అన్నారు.
ముఖ్య అతిథి మలినేని గోపీచంద్ మాట్లాడుతూ, సూర్య గురించి చాలా విషయాలు చెప్పాలి. నేను ఎవరో తెలీయకుండానే నాకు ఇచ్చిన గౌరవం మర్చిపోలేను. సూర్య భిన్నమైన కాన్సెప్ట్‌లను ఎంచుకుని చేస్తుంటారు. అందుకే సూర్య చేసిన సినిమాలతో తెలుగు వారి లోగిళ్ళలో దగ్గరయ్యారు. గజని, సింగం, ఆకాశమే నీ హద్దురా, జైభీమ్ వంటి చిత్రాలు ఆయన్నుంచి వచ్చి అద్భుతమైన విజయాన్ని చవిచూశాయి. నేను దర్శకుడిని కాకముందు గజని బ్లాక్ బస్టర్. సూర్య చేసిన సింగంకు పెద్ద ఫ్యాన్ నేను. నేను కోడైరెక్టర్ నుంచి దర్శకుడుగా అవ్వాలనుకున్న తరుణంలో డాన్ శ్రీను చేయాలనుకుంటున్నా. ఇంకా లైమ్‌లైట్‌లోకి రాలేదు. ఆ సమయంలో ఓ సందర్భంలో లొకేషన్ కోసం కారకుడి వెళ్ళాను. అక్కడ సింగం షూట్ జరుగుతుంది. అప్పుడు అనుష్కను చున్నీతో లాగే యాక్షన్ సీన్ జరుగుతోంది. యాక్షన్‌లో కొత్తగా కనిపించారు ఆయన నాకు. ఒకసారి కలుద్దామనుకున్నాను. విషయం తెలుసుకుని నేనెవరో తెలియకపోయిన నాపై చూపిన ఆదరణ మర్చిపోలేను. ఇప్పుడు ఇ.టి. ట్రైలర్ చూశాను. అద్భుతంగా వుంది. రత్నవేలు విజువల్స్ బాగున్నాయి. ఈ చిత్ర టీమ్ కు ఆల్ ది బెస్ట్. అన్నారు.
నాకు టైం కుదిరినప్పుడు సూర్యతో సినిమా చేస్తా- బోయపాటి.మరో ముఖ్య అతిథి బోయపాటి శ్రీను మాట్లాడుతూ, రామ్ లక్ష్మణ్ ఫైట్సే కాదు మాటలు కూడా బాగా చెబుతారని ఈ స్టేజీమీద వారు చెప్పిన మాటలబట్టి అర్థమైంది. సూర్యగాదరి సినిమాలు ఏ హీరో చేయని భిన్నమైన కథలతో చేస్తుంటారు. గజని నుంచి బైభీమ్ వరకు ఆయన సినిమాలే ఆయన అభిరుచికి నిదర్శనం.మరోవైపు స్వచ్చంధ సంస్థ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సూర్యగారు ఛారిటీ ద్వారా గుండెజబ్బు వున్నచిన్న పిల్లలకు సైతం సాయం చేస్తున్నారు. ఈ ఛారిటీ చేస్తున్న సేవల వల్ల సూర్యగారి జనరేషన్ అంతా బాగుండాలని కోరుకుంటున్నా. ఈ ఛారిటీ ద్వారా సేవలు చేయడం అనేది తెలుగులోనూ ముందుగానే మన హీరోలు చేస్తున్నారు. కేన్సర్ ఆసుపత్రి ద్వారా బాలయ్యబాబు ఎంతో మంది జీవితాల్లో వెలుగును చూపారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌తోనూ ఎంతో మందిని జీవితాల్లో చిరునవ్వును వెలిగించారు.అందుకే సూర్యలాంటి మంచి మనసు వున్నవారు మనకు చాలా అవసరం. తెలుగు ప్రేక్షకులు బాషతో సంబంధంలేకుండా మంచి సినిమాలను ఏ భాషలో వచ్చినా ఆదరిస్తారు. సూర్య సినిమా మన సినిమా అని ఫీలవుతారు. రజనీకాంత్ తర్వాత సూర్య అంటే మనవాడు అని తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. అలాంటి సూర్యగారి నుంచి వస్తున్న ఇ.టి. సినిమా ప్రేక్షకులు ఆదరించే సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. బయోపిక్‌లు చేయడం వేరు. బయోపిక్‌ల నుంచి యువతకు స్పూర్తి కలిగించేలా చిత్రాలు చేయడం గొప్ప విషయం. ఆకాశమే నీ హద్దురా, జైభీమ్ వంటి సినిమాలను అలా చేసి అద్భుతంగా ఆయా పాత్రలను పండించారు. సూర్యతో ఓ సినిమా చేయాలనుంది . నాకు టైం కుదిరినప్పుడు సూర్యగారికి వీలు చిక్కినప్పుడు తప్పకుండా ఓ సినిమా చేస్తాను.. అఖండ, పుష్ప, భీమ్లానాయక్ తో తెలుగు సినిమా నిండుకుండలా వుంది. అందులో ఇ.టి. కూడా వుండాలని కోరుకుంటున్నాను అన్నారు.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ, నేను సూర్యగారి`పితామగన్` సినిమా చూసి సూర్యకు అభిమానిని అయ్యా. ఆ తర్వాత పదేళ్ళనాడు సూర్యగారు నా సినిమాను ఎడిటింగ్‌లో చూసి నన్ను కారులో ఎక్కించుకుని నా నటనపై నాలుగు గంటలు క్లాస్ పీకారు. అదే నన్ను బళ్ళాలదేవ్, డేనియల్ శేఖర్‌ని చేసింది. మా కట్టప్పతో (సత్యరాజ్)తో ఐదేళ్ళనుంచి ఓ సినిమా చేశాం. ఆయన్నుంచి చాలా విషయాలు తెలుసుకున్నా. దర్శకుడు పాండ్యరాజ్‌కు శుభాకాంక్షలు. ఇ.టి. కి మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నానన్నారు.
డి.సురేష్‌బాబు మాట్లాడుతూ, ఇ.టి. సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. సూర్య `సింగం` 4,5,6, అన్ని వస్తాయని ఫ్యాన్స్ ఉత్సాహం చూస్తే అనిపిస్తుంది. రామ్ లక్ష్మణ్‌తోపాటు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.
సినిమాటోగ్రఫీ రత్నవేలు మాట్లాడుతూ, సూర్యతోపాటు నా కెరీర్ ఒకేసారి ప్రారంభమైంది. ఇంతకుముందు సన్నాఫ్ కృష్షన్ సినిమా చేశాను. 20 ఏళ్ళనాడు సూర్యను ఎలా చూశానో ఇప్పటికీ అలానే వున్నారు. సినిమాలోనే కాదు రియల్ లైప్ హీరో. తన ఫౌండేషన్‌తో పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇ.టి. కమర్షియల్ సినిమా అయినా మంచి సందేశం వుంది. రోబో తర్వాత తెలుగులో పలు సినిమాలు చేశాను.దర్శకుడు పాండిరాజ్ మంచి సినిమాలు తీస్తారు. ఈ సినిమా షూర్‌గా హిట్ అవుతుందనే నమ్మకముంది అన్నారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, సూర్యకు అభిమానులు హైదరాబాద్‌లో మంచి స్వాగతం పలికారు. రత్నవేలు. పాండ్యరాజ్‌తోపాటు అందరు టెక్నీషియన్స్‌కు ఆల్ ది బెస్ట్. ఈ మధ్యే సూర్య నటించిన జైభీమ్ ఓటీటీలో ఇరగతీసింది. ఆకాశమే నీ హద్దురా కూడా అలాగే ఆదరణ పొందింది. ఇలా ప్రతి సినిమాను భిన్నమైనవిగా సూర్య చేస్తున్నారు. ఇండియన్ హీరోలలో సూర్యది ప్రత్యేక శైలి. కథల ఎంపిక కూడా చక్కగా ఎంపిక చేసుకుంటున్నారని తెలిపారు.
సత్యరాజ్ మాట్లాడుతూ. ఇ.టి. అంటే ఎవర్ టాలెంట్ సూర్య. నాకు రానా తోపాటు సురేష్‌బాబు బెస్ట్ ప్రెండ్ లాంటివాడు. ఇ.టి. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ, మనసు అందంగా వుంటే మనిషి అందంగా వుంటారని సూర్యనుద్దేశించి వ్యాఖ్యానించారు.
ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ, భీమ్లానాయక్‌లో రానా అద్భుతంగా చేశౄడు. అఖండ బోయపాటి మైండ్ బ్లోయింగ్. ముంబైలో నెంబర్1 యాక్షన్ డైరెక్టర్ అని చెబుతన్నారు. రాజమౌళి తర్వాత సౌత్ ఇండియన్ ఫిలింస్‌లో తెలుగు సినిమాలు ఒక గౌవరం వుంది. పాండిరాజ్ కుటుంబ సినిమాలు తీస్తారు. ఏషియన్ టీమ్, దిల్‌రాజుకు కంగ్రాట్స్ తెలియజేశారు.
అభిమానిగా `గజని2` తీయాలని కోరుకుంటున్నా- జానీ
జానీ మాస్టర్ మాట్లాడుతూ, పాండ్య రాజ్ గారు మొదటి సినిమా నుంచి నాకు అవకాశం ఇస్తున్నారు. సాంగ్ కంపోజ్ చేయడం వేరు కెమెరాతో బందించడం గ్రేట్. కెమెరామెన్ రత్నవేల్ చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఇమాన్ ఆకట్టుకునే సంగీతం ఇచ్చారు. నేను చాలా మంది హీరోలను చూశాను. సూర్య జెంటిల్‌మెన్. ఆడపిల్లలకు ఎంతో గౌరవం ఇస్తారు. తోటి ఆర్టిస్టులతో ఎప్పుడూ చనువు తీసుకోవడం నేను చూడలేదు. సూర్య ఎవరు ఏమి చెప్పినా ఓపిగ్గా వింటారు. అది ఆయనలోనిప్రత్యేకత. కొరియోగ్రాఫర్ చెప్పిన బిట్ నేర్చుకోవడమేకాకుండా. ఇంకా మెరుగుదలకుడాన్సర్ నుంచి కూడా గ్రహిస్తారు. భర్త అనేవాడు సూర్యలా వుండాలి. జనూన్ పర్సన్. నేను షూట్‌లో వుండగా సూర్య ఇంటినుంచి భోజనం వచ్చేది. సూర్య అభిమానిగా `గజని2` తీయాలని కోరుకుంటున్నాను. హీరోయిన్ ప్రియ చాలా త్వరగా స్టెప్‌లు నేర్చుకునేది. గ్లామర్‌తోపాటు డిసిప్లిన్ వున్న నటి అని తెలిపారు.
2డి ఎంటర్‌టైన్‌మెంట్ రాజశేఖర్ పాండ్యన్ మాట్లాడుతూ, నేను సినిమా చూశాను. సూర్య అభిమానిగా చాలా ఇష్టపడ్డాను. పాండ్యరాజ్ అద్భుతంగా తీశారు. సన్‌టీవీ సంస్థ చక్కటి సినిమా తీశారు. రామ్ లక్ష్మణ్ ఫైట్ ఇంతవరకు తమిళ్‌లో చూడలేదు. అంత బాగా చేశారు. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
వినయ్ రాయ్ మాట్లాడుతూ, సన్ పిక్చర్స్ వండర్‌ఫుల్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సినిమా ఈనెల 10న చూసి ఎంజాయ్ చేయండని పేర్కొన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ప్రియాంక మోహన్, ఏషియన్ ఫిలింస్ జాన్వీ, అమ్మిరాజు, 2డి ఎంటర్‌టైన్‌మెంట్ రాజశేఖర్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.