ఉదారత చాటుకున్న స్టిల్ ఫొటోగ్రాఫర్ సాయిరామ్ మాగంటి

Published On: June 5, 2020   |   Posted By:

ఉదారత చాటుకున్న స్టిల్ ఫొటోగ్రాఫర్ సాయిరామ్ మాగంటి

లాక్‌డౌన్‌లో ఉదారత చాటుకున్న సీనియర్ స్టిల్ ఫొటోగ్రాఫర్ సాయిరామ్ మాగంటి

సుమారు రెండు నెలలుగా క‌రోనా(కోవిడ్ 19) వైరస్ ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి ఎప్పటికి తొలగిపోతుందో తెలియదు కానీ.. ప్రజలందరూ ప్రాణాలను అరచేతుల్లో పట్టుకుని బతుకుతున్నారు. మందు కనిపెట్టని ఈ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తుంది. ఈ మహమ్మారి నుంచి రక్షించేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్ అనే ఆయుధం ప్రయోగించి చాలా వరకు సక్సెస్ అయ్యాయి. ఈ లాక్‌డౌన్‌లో సామాన్య ప్రజల బాధలు వర్ణనాతీతం. వారిని ఆదుకునేందుకు గొప్ప మనసున్న మారాజులు ఎందరో ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. వారిలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ స్టిల్ ఫొటోగ్రాఫర్ సాయిరామ్ మాగంటి ఒకరు. లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి.. రీసెంట్‌గా సడలింపులు వచ్చే వరకు ఆయన.. తనకు సాధ్యమైనంతగా ప్రజలకు సహాయ కార్యక్రమాలు నిర్వహించారు.

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దగ్గర 17 సినిమాలకు స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించిన సాయిరామ్ మాగంటి.. ఈ లాక్‌డౌన్‌లో కార్డు లేని అసిస్టెంట్ డైరెక్టర్స్‌కి, ఆ అసిస్టెంట్ డైరెక్టర్స్‌కి ఉండే అసిస్టెంట్స్‌కి, కార్డులేని ఆర్టిస్ట్ అసోసియేషన్ వారికి, అర్చకులకు నిత్యావసరాల పంపిణీ చేశారు. అంతేకాకుండా సుమారు 600కి పైగా కుటుంబాలకు కూరగాయలు అందించారు. అలాగే ఎండల్లో నిలబడి డ్యూటీ చేస్తున్న పోలీస్ వారికి రుచికరమైన మరియు పోషకాలతో నిండిన పానీయాలు అందజేశారు. హైదరాబాద్ మూసాపేట నుంచి ఎస్.ఆర్. నగర్ వరకు దారిలో కనిపించిన పేద ప్రజలకు సాంబార్ రైస్, కర్డ్ రైస్, టమోట రైస్ ప్యాకెట్లను అందజేశారు. ఇలా ఈ లాక్‌డౌన్‌లో ఎందరికో తనకు సాధ్యమైనంతగా సహాయం అందించారు.  

ఈ సందర్భంగా సాయిరామ్ మాగంటి మాట్లాడుతూ.. ‘‘సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయడంలో ఉండే ఆనందం ఎంతో గొప్పది. ఆ ఆనందం నేను పొందాను. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. సహాయం అందించగలిగే స్థాయిలో నన్ను నిలబెట్టిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నాతో పాటు నడిచి, డిస్ట్రిబ్యూషన్‌లో సహకారం అందించిన నటి సౌమ్యకు, తోడ్పాటును అందించిన నా బ్రదర్స్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సహాయ కార్యక్రమాల్లో సహకారం అందించిన అడిషనల్ డిసిపి మద్యపాటి శ్రీనివాసరావుగారికి కృతజ్ఞతలు. త్వరలోనే ఇప్పుడున్న పరిస్థితులు తొలగిపోయి, అందరికీ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.  

ప్రస్తుతం ‘క్రాక్, ఉప్పెన, నాంది’ వంటి చిత్రాలకు సాయిరామ్ మాగంటి స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.