ఉప్పెన సక్సెస్ సెలబ్రేషన్స్
రాజమండ్రిలో జరిగిన ఉప్పెన సక్సెస్ సెలబ్రేషన్స్
లాక్‌డౌన్ తర్వాత ఇతర రాష్ర్టాలు, భాషల వారు సినిమాల్ని విడుదల చేయడానికి భయపడుతున్నారు. తెలుగు ప్రేక్షకులపై నమ్మకంతో నిర్మాతలు ధైర్యంగా ఈ సినిమాను విడుదలచేశారు. ఉప్పెనను విజయవంతం చేసి తెలుగు సినిమాకు ప్రేక్షకులు ప్రాణంపోశారు. ఇతర భాషల వారిలో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపారు అని అన్నారు రామ్‌చరణ్.
వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ఉప్పెన. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. బుచ్చిబాబు సానా దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం రికార్డు వసూళ్లతో విజయవంతంగా దూసుకపోతుంది.
ఈ సినిమా బ్లాక్‌బస్టర్ సెలబ్రెషన్స్ బుధవారం రాజమండ్రిలో జరిగాయి. ఈ వేడుకకు అగ్ర హీరో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ కరోనా కష్టాల నుంచి తొందరగా ఒక్క సినీ పరిశ్రమనే వందశాతం రికవరీ అయ్యింది. కొత్త వాళ్లను నమ్మి భారీ వ్యయంతో ఉప్పెన చిత్రాన్ని నిర్మాతలు ధైర్యంగా నిర్మించారు. వైష్ణవ్‌తేజ్ తొలి సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం కుదరడం అదృష్టం. తన సంగీతంతో దేవిశ్రీప్రసాద్ ఈసినిమాకు ప్రాణంపోశారు. కృతి తన నటనతో ప్రేక్షకుల హృదయాల్ని గెలచుకుంది. ఈ సినిమాతో సుకుమార్ లాంటి ఉత్తమ గురువుకు తగిన బెస్ట్ స్టూడెంట్‌గా బుచ్చిబాబు నిరూపించుకున్నాడు. మొదటి సినిమాతోనే రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తున్నాడు. ఇండస్ట్రీలో అరంగేట్రం హీరో కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఉప్పెన నిలుస్తుందని నమ్ముతున్నా. వైష్ణవ్‌తేజ్ పైకి సైలెంట్‌గా కనిపించినా అతడి లోపల పెద్ద ఆగ్నిపర్వతం ఉంది. మా అందరిలో కెల్లా నిలకడగా ఆలోచిస్తుంటాడు. తొలి సినిమాలోనే వైష్ణవ్ అద్వితీయ అభినయాన్ని కనబరిచాడు. వైష్ణవ్‌లా నేను నటనలో పరిణితిని చూపించడానికి ఏడు, ఎనిమిది సినిమాలు పట్టింది. వైష్ణవ్‌తేజ్ హీరో అవ్వాలని అనుకున్నప్పుడు మొదట చిరంజీవి, పవన్‌కల్యాణ్ ప్రోత్సహించారు. అలాంటి గొప్ప వ్యక్తులు మా అందరి జీవితాల్లో ఉండటం అదృష్టంగా భావిస్తున్నా అని అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు గొప్ప హృదయమున్న వారు అని మరొక్కమారు నిరూపించారు.ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేయడం ఆనందంగా ఉంది. సుకుమార్ తొలుత ఈ కథ విన్నారు. మంచి సినిమా అవుతుందని కలిసి చేద్దామని మాతో కలిసి ప్రయాణించారు. దర్శకుడు బుచ్చిబాబు మా సంస్థకు మరచిపోలేని మంచి సినిమా ఇచ్చారు అని అన్నారు.
తొలుత ఈ సినిమాలో నటించడానికి సంశయించా. కానీ బుచ్చిబాబు పట్టుదలతో నాతో ఈ సినిమా చేయించారు.నా నుండి చక్కటి నటనను రాబట్టుకున్నారు.తెరపై ఉండేవారితో పాటు తెర వెనుక ఉన్న వారందరి కష్టానికి ప్రతి ఫలమే ఈ విజయం అని వైష్ణవ్‌తేజ్ అన్నారు.
దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ నా సక్సెస్‌ను తన సక్సెస్‌గా భావించి నన్ను ప్రోత్సహిస్తున్న గురువు సుకుమార్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటా. చరణ్‌గారి ద్వారా వైష్ణవ్‌ను కలిసి హీరోగా నటించడానికి ఒప్పించగలిగా. ఉప్పెన లాంటి ైక్లెమాక్స్‌ను అంగీకరించడానికి చాలా ధైర్యముండాలి. చిరంజీవి గారు ఒప్పుకున్నారు కాబట్టే మెగాస్టార్ అయ్యారు. ఈ సినిమాను చిరంజీవిగారికి అంకితం ఇస్తున్నాను అన్నారు. దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ తన శిష్యుడిపై సుకుమార్ పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమాతో బుచ్చిబాబు నిజం చేశారు. ప్రేక్షకులకు థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందివ్వాలని నిర్మాతలు చాలా రోజులు ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు ఫలితం లభించింది. అరంగేట్రంతోనే వైష్ణవ్‌తేజ్ స్టార్ అయిపోయాడు. సినిమా చూసి కృతిశెట్టితో ప్రేక్షకులంతా ప్రేమలో పడుతున్నారు అని పేర్కొన్నారు.
హీరోయిన్ కృతిశెట్టి మాట్లాడుతూ ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ చిత్రం గొప్ప సక్సెస్ సాధించింది. బేబమ్మగా నన్ను ఆదరించి ఉప్పెనంత ప్రేమ చూపించారు. రంగస్థలం చిత్రంతో రామ్‌చరణ్ గారికి నేను పెద్ద అభిమానిగా మారిపోయాను. ఆయన మా వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకావడం ఆనందంగావ ఉంది. సుకుమార్ గారు మా సినిమాకు లైట్‌హౌస్‌లా దారిచూపించారు. దర్శకుడు బుచ్చిబాబు నాకు ఈ చిత్రంలో అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానుఅన్నారు. రాజమండ్రి ఎంపీ భరత్ తదితరులు పాల్గొన్నారు. శ్రేయాస్ మీడియా ఈ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు.