ఎన్టీఆర్ కథానాయకుడు రివ్యూ
జ్ఞాపకాల దొంతర (‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)
రేటింగ్ : : 3.5/5
ఊహాజనితమైన అంశాలను మనకు కావాల్సిన మసాలాలతో కలిపి తెరకెక్కిచటం పని తెలిసిన దర్శకుడుకి నల్లేరు మీద బండి నడక. కానీ బయోపిక్ తెరకెక్కిచటం అనగానే ఓ భాధ్యత..అదీ అందిరికీ తెలుసున్న , పాపులర్ వ్యక్తి జీవితం తెరకెక్కించటం అంటే మామూలు విషయం కాదు. విషయ సేకరణ ఎంత కష్టమో..తమకు దొరికిన అశాల్లో ఎన్ని సినిమాకు పనికొస్తాయో గుర్తించి,వాటిని కలిపి స్క్రిప్టుగా తయారు చేసి తెరకెక్కించటం అంతకన్నా పెద్ద టాస్క్. మరీ ముఖ్యంగా వ్యక్తి నుంచి వ్యవస్దగా మారిన నందమూరి తారక రామారావు జీవితం తెరకెక్కించటం పెద్ద సాహసం. ఆ ఎడ్వంచర్ ని బాలయ్య, క్రిష్ కలిసి,మెలిసి చేసేసారు. మన ముందు ప్రొడక్ట్ పెట్టేసారు. ఈ రోజు రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది..ఈ సినిమాలో ఎన్టీఆర్ గురించి ఏం చెప్పారు..ఆయనలో ఏ పార్శాన్ని ఆవిష్కరించారు వంటి విషయాలు రివ్యూలోచూద్దాం.
కథ
తెలుగుజాతి గుండెల్లో చెరగని జ్ఞాపకం. నిలువెత్తు స్ఫురద్రూపం. క్రమశిక్షణకు పర్యాయపదం. తెలుగువారి ఆత్మగౌరవం ప్రతీక. అన్నీ కలగలిస్తే నందమూరి తారక రామారావు. రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు తదితర పౌరాణిక పాత్రల్లో నటించి తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన యుగపురుషుడు ఆయన. జానపదం, సాంఘికం, పౌరాణికం అనే తేడా లేకుండా అన్ని పాత్రల్లో జీవించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు. ఇలా ఎన్ని చెప్పుకున్నా..ఎంత చెప్పుకున్నా తరగదు. ఆయన జీవితం గురించి మనందరికీ తెలిసిందే. కాబట్టి తెలిసిన కథనే మరోసారి చెప్పుకుంటే..
సినిమా ప్రారంభానికి బసవ రామ తారకం(విద్యాబాలన్) కాన్సర్ తో బాధపడుతూంటుంది. ఆమె ఆ బాధని మర్చిపోవటానికా అన్నట్లు..గతాన్ని గుర్తు చేసుకుంటూ ఆల్బమ్ తిరగేస్తుంటుంది. ఆ క్రమంలో ఎన్టీఆర్ …గత జీవితం పొరలు పొరలు గా మన ముందు ఆవిష్కారమవుతుంది. నందమారు తారక రామారావు (బాలకృష్ణ)విజయవాడలో రిజిస్టర్ ఆఫీస్‌లో రిజిస్టార్ గా జాబ్ వచ్చినా అక్కడి లంచాలు అవీ నచ్చక చేరిన ఉద్యోగం వదిలేస్తాడు. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుని..మద్రాస్ ట్రైన్ ఎక్కుతాడు. అక్కడ నుంచి రామారావు సినీ ప్రయాణం ఎలా మొదలైంది. ఆ జర్నీలో నటుడిగా ఏ అడ్డంకులు ఎదుర్కొన్నారు. ఏ ఎన్నార్ తో (సుమంత్)తో ఆయన అనుబంధం ఏమిటి ..నటుడుగా వెలుగుతున్న ఆయన్ని రాజకీయాలు వైపు నడవటానికి గల కారణం ఏమిటి వంటి విషయాలు తెరపై చూడాల్సిందే.. విశ్లేషణ
ఎన్టీఆర్ గురించి తెలియనిదెవరకి ..ప్రత్యేకంగా బయోపిక్ తీసి మరీ చెప్పాలా…అంతగా ఆయన్ని చూడాలనిపిస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే బోలెడు సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఇక పర్శనల్ లైఫ్ అంటారా..ఎన్ని కథలు విన్నా…అనుకునే వారికి ఈ సినిమా కరెక్ట్ సమాధానం చెప్తుంది. ఎన్టీఆర్ గురించి ఈ తరానికి అందించాల్సిన సమాచారం ఇస్తుంది. ఓ సినిమా హీరోగానే కాకుండా సమాజ నాయకుడుగా ఆయనేంటో నొక్కి చెప్తుంది. ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వారికి ఓ గొప్ప నోస్ట్రాలిజీ ఫీలింగ్ ఇస్తుంది. ఇంతకన్నా ఓ సినిమా నుంచి ఏం ఆశించగలం?
అయితే బయోపిక్ తీస్తున్నామంటే డైరక్టర్ కి ఓ పెద్ద టాస్క్. ఏ మాత్రం దారి తప్పినా, అది డాక్యుమెంటరీ అయ్యిపోతుంది. ఆయన జీవిత విశేషాలతో కూడిన ప్రత్యేక సంచిక అయ్యిపోతుంది. అవేమీ జరగకుండా ఉండటానికి క్రిష్ శాయిశక్తులా ప్రయత్నించాడు..కానీ కొన్ని చోట్ల ఆ వాతావరణం క్రియేట్ అయ్యిపోయింది. అందుకు కారణం తమ దగ్గర ఉన్న సమాచారం మొత్తం సినిమాలో పెట్టాలనే తాపత్రయం కావచ్చు. ఏ విషయం మిస్సైతే …దాన్ని జనం గుర్తు చేసుకుని..అది లేదేంటి అనుకుంటారనే భయం కావచ్చు. దాంతో లెంగ్త్ పెరిగింది. నేరేషన్ స్లో అయ్యింది.
సాంకేతికంగా
ఎం.ఎం. కీరవాణి అందించిన పాటలు కన్నా..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ చిత్రానికి ఓ కొత్త లుక్ తెచ్చి పెట్టింది. ప్రతి ఫ్రేమూ లో ఆ రోజుల్లో కు తీసుకెళ్లటానికి పనికొచ్చింది. మరీ ముఖ్యంగా బుర్రా సాయిమాధవ్ రాసిన డైలాగులు సీన్స్ ని నిలబెట్టాయి.
బాలయ్యా…సాధించావయ్యా
ఈ సినిమాలో బాలకృష్ణ విశ్వరూపం కనిపిస్తుంది. తన తండ్రి జీవితకాలంలో వేసిన అన్ని పాత్రలను దాదాపు మూడు గంటల సమయం లోపల చూపటం అంటే మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ యువకుడుగా జీవితం, కెరీర్ మొదలు పెట్టిన నాటి నుంచీ, నడివయస్సు దాటేంతవరకూ ఈ సినిమాలో వివిధ దశల్లో ఆయన్ను గుర్తు చేస్తూ బాలయ్య అభినయం సాగుతుంది. అక్కడక్కడా బాలకృష్ణే కనిపించినా…సినిమాలో ఫ్లో లో అది పెద్దగా తేడా అనిపించదు. బాలయ్య తప్ప వేరే వారు ఆ పాత్రను చేసినా, గెటప్,లుక్ తేగలరేమో కానీ తన తండ్రి ని దగ్గర నుంచి చూసిన బాలయ్యను మాత్రం మరిపించలేరు. హ్యాట్యాఫ్ బాలయ్య.
అలా ఎంత బాలయ్య గురించి చెప్పుకున్నా…ఫస్టాఫ్ లో ఆయన ఏజ్ అడ్డం అయ్యిందనిపించింది. దాదాపు అరవైల్లో పడుతున్న ఆయన..ఎన్టీఆర్ ..ఇరవై ఏళ్ల వయస్సుని ప్రెజెంట్ చేసేటప్పుడు మాత్రం ఇబ్బందే అనిపించింది. అయితే సెంకండాఫ్ లో ఆయన ఏజ్ కు తగ్గ సీన్స్ పడటంతో ఫెరఫెక్ట్ గా సింక్ అయ్యింది.
విద్యాబాలన్, మిగతావాళ్లు
ఇక ఈ సినిమాలో బసరరామ తారకంగా విద్యాబాలన్ …మంచి ఛాయిస్. ఆమె కథను లీడ్ చేస్తూ నిలబెట్టింది. ఇక అక్కినేని పాత్రలో సుమంత్, చంద్రబాబునాయుడు పాత్రలో రానా . భవనం పాత్రలో నాజర్, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా డా.భరత్, ఎన్టీఆర్ బావమరిదిగా వెన్నెల కిశోర్.. ఇలా ప్రతీ ఒక్కరు ఆ కాలం దిగ్గజాలను మన ముందు నిలపే ప్రయత్నం చేసారు. మేకప్ లోపం ఉండాలేమో కానీ ప్రయత్నలోపం మాత్రం కాదు.
హైలెట్స్
సినిమాలో ఎన్టీఆర్ గెటప్స్ ని బాలయ్య చేత వేయించి..ఆ రోజులని రీక్రియేట్ చేయటం, ఎమోషన్ సీన్స్ లో డైరక్టర్ ప్రతిభ, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్-ఏయన్నార్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు..ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమ్ రావు పాత్రలో చాలా కాలం తరువాత దగ్గుబాటి రాజా వెండితెర మీద కనిపించటం వంటివి హైలెట్స్ గా నిలిచాయి. మరి ముఖ్యంగా తెలుగు పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ తరలి రావడం గురించి ఎన్టీఆర్, ఏఎన్నార్ ఏమనుకున్నారు అన్న సీన్ వంటివి వారిపై గౌరవం కలగచేస్తాయి.
మైనస్
ఫస్టాఫ్ లో యంగ్ ఏజ్ లో ఉన్న ఎన్టీఆర్ గా బాలయ్యను చూడటం కష్టమైంది. అలాగే లెంగ్త్, స్లో నేరేషన్
ఆఖరి మాట.. చరిత్రను కేవలం వ్యక్తిగత అనుభవాలు, భావోద్వేగాలు, రాజకీయాల దృష్టితో చూస్తూంటాం. అప్పుడు మనకు ఒక వైపు మాత్రమే కనిపిస్తుంది. మరో వైపు అసలు చూడడానికే ప్రయత్నించం. కానీ బయోపిక్ లు వేరు…సాధ్యమైనంత వరకూ అన్ని పార్శాలు ఆవిష్కరించటానికి ప్రయత్నిస్తూంటాయి. అందుకే అవి ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఎన్టీఆర్ బయోపిక్ కూడా అలాంటి ఇంట్రస్టింగ్ విషయమే.
నటీనటులు:
బాలకృష్ణ, విద్యాబాలన్, రానా, సుమంత్, భరత్‌రెడ్డి, దగ్గుబాటి రాజా వెన్నెల కిషోర్, పూనమ్ బాజ్వా, మంజిమా మోహన్, నరేష్, మురళీశర్మ, క్రిష్, రవికిషన్, శుభలేఖ సుధాకర్, రవిప్రకాష్, చంద్ర సిద్ధార్థ, భానుచందర్, ప్రకాష్‌రాజ్, కె.ప్రకాష్, ఎన్.శంకర్, దేవి ప్రసాద్ తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వీఎస్
ఎడిటింగ్: అర్రం రామకృష్ణ
సంభాషణలు: బుర్రా సాయిమాధవ్
నిర్మాత: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
సంస్థ: ఎన్‌బీకే ఫిల్స్మ్, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా
విడుదల తేదీ: 09-01-2019