ఎ.ఆర్.రెహమాన్ ప్రెస్‌మీట్
99 సాంగ్స్` సినిమా జర్నీతో మ్యూజిక్‌ను నేను చూసే కోణం మారింది: ఎ.ఆర్.రెహమాన్
ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ కాంబినేషన్లో రూపొందిన ప్రేమకథా చిత్రం `99 సాంగ్స్`. ఇహాన్ భట్, ఎడిల్సీ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 16, 2021న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రెస్‌మీట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా…
నిర్మాత, ఆస్కార్ అవార్డ్ విజేత ఎ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ – ‘‘రమేష్‌నాయుడుగారు, కోటిగారు, చక్రవర్తిగారు .. ఇలా తెలుగు సినిమాలతో నా అనుబంధం కొనసాగుతూనే ఉంది. కె.విశ్వనాథ్‌గారు, బాలచందర్‌గారు, రాఘవేంద్రరావుగారు, మణిరత్నంగారు .. వంటి దర్శకుల నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. సంగీతమే ప్రపంచంగా బతికాను. అదే స్ఫూర్తితో ఓ కథను రాశాను. ఈ ప్రయాణంలో నేను చాలా అనుభవాలను ఫేస్ చేశాను. వాటన్నింటినీ బేస్ చేసుకుని ఓ సినిమాగా రూపొందించాను. తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఎంతగా ఆదరిస్తారో తెలిసిందే. మా 99 సాంగ్స్ సినిమా విషయానికి వస్తే.. 2001లో నేను లండన్ వెళ్లినప్పుడు నా స్నేహితుడు ఒకరు నీ దగ్గర ఏమైనా కథ ఉందా? అని అడిగారు. నేను మ్యూజిక్ కంపోజర్‌ని కదా, నా దగ్గర కథ ఎందుకు ఉంటుందని అనుకున్నాను. కానీ తర్వాత జీవితంలో చాలా కథలకు, సంగీతంతో లింకు ఉంటుందనే భావన వచ్చింది. తర్వాత నేను ఫిల్మ్ మేకింగ్, కెమెరా తదితర విషయాలకు సంబంధించి వర్క్‌షాప్స్‌కు అటెండ్ అయ్యాను. తర్వాత ఈ కథను రాసుకున్నాను. ఇహాన్‌కు హీరోగా తీసుకున్నప్పుడు కథలోని పాత్ర పరంగా తనకు మ్యూజిషియన్ కాబట్టి.. తను ఏడాది పాటు సంగీతం నేర్చుకున్నాడు. ఈ జర్నీలో మ్యూజిక్‌ను నేను చూసే కోణం మారింది. కేవలం కంపోజర్‌గానే కాకుండా కథకుడిగా, నిర్మాతగా, నటుడిగా మ్యూజిక్ కోణాన్ని ఆలోచించడం ప్రారంభించాను. 99 సాంగ్స్ విషయంలో నిర్మాతగా చాలా సిన్సియర్‌గా ఉన్నాను. ప్రయత్నాన్ని సిన్సియర్‌గా చేయకపోతే దెబ్బ తింటామని తెలుసు. అందువల్ల 99 సాంగ్స్ సినిమాను నాకు సన్నిహితంగా ఉండేవారికి చూపించి సలహాలు, సూచనలు తీసుకున్నాను. ప్రతి డైలాగ్, సన్నివేశంలో లిప్ సింక్‌తో సహా సూట్ అయ్యేలా కేర్ తీసుకున్నాను. హీరోగా ఎవర్ని తీసుకోవాలని అనుకున్నప్పుడు దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల మందిని ఆడిషన్స్ చేశాం. కానీ ఎవరూ సూట్ అయినట్లుగా ఫీల్ కాలేదు. మళ్లీ నేను ఆడిషన్‌కు వచ్చిన అందరి కుర్రాళ్ల ఫొటోలను చూసే క్రమంలో కాశ్మీర్ నుంచి వచ్చిన ఇహాన్ ఫొటోను చూశాను. తను నచ్చడంతో తను హీరోగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు’’ అన్నారు.
ఇహాన్ భట్ మాట్లాడుతూ – ‘‘నేను ఎ.ఆర్.రెహమాన్‌గారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆడిషన్స్ కోసం కాల్ వచ్చినప్పుడు చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో వెళ్లి ఆడిషన్స్‌లో పాల్గొన్నాను. కొన్ని నెలల తర్వాత నేను సెలక్ట్ అయినట్లు నాకు ఫోన్ వచ్చింది. నేను హీరోగా ఎంపిక అయ్యానని చెప్పగానే ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాను. ఎ.ఆర్.రెహమాన్‌గారు నిర్మాతగా, సంగీత దర్శకుడిగా అందరికీ తెలుసు. కానీ ఆయన అంతకు మంచిన మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఆయన నన్ను ఎంతో ఇన్స్పూర్ చేశారు. గైడ్ చేశారు. రెహమాన్‌గారు చెప్పిన తర్వాత ఏడాది పాటు పియానో నేర్చుకున్నాను. చెన్నైలో ఉన్నప్పుడు రెహమాన్‌గారు వారి కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారు’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ – ‘‘రెహమాన్ ప్రతి సాంగ్‌ను హృదయానికి హత్తుకునేలా కంపోజ్ చేస్తాడు. ఈ సినిమాతో మరోసారి రెహ్మాన్ అద్భుతమైన సంగీతం ఉండేలా చూసుకున్నాడు. తనకు 99 సాంగ్స్ నిర్మాతగా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
లిరిక్ రైటర్స్ కళాప్రభ, రాకేందు మౌళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.