Reading Time: 2 mins

ఫన్నీ డిటెక్టివ్ ఆయా

Rating: 2.5/5

అనగనగా  నెల్లూరులో నడీచీ నడవని   ఓ డిటెక్టివ్ ఏజన్సీ. దానికి హెడ్  ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ (న‌వీన్ పోలిశెట్టి). తన మాజీ లవర్ పేరుతో ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ ( ఎఫ్‌బీఐ ) డిటెక్టివ్ ఏజెన్సీ నడిపే అతని దగ్గరికి నమ్మి వచ్చే కేసు ఒకటీ ఉండదు. ఏదో చిల్లర మల్లర కేసులు పట్టుకుంటూ అదే గొప్ప విద్య అనకుంటూ మురిసిపోతూ తానో పెద్ద షెర్లాక్ హోమ్ అని  మైమరిచి పాటలు గట్రా పాడేసుకుంటూంటాడు. ఎప్పటికైనా తనంటే ప్రపంచం మొత్తం మాట్లాడుకునే పెద్ద కేసు రాబోతుందా అని ఎదురుచూసే అతనికి ఆ క్షణాలు వచ్చేసాయని ఓ రోజు అర్దమవుతుంది. ఎప్పుడూ అంటే ఓ తప్పుడు కేసులో జైలుకు వెళ్ళినప్పుడు అక్కడ పరిచయమైన వ్యక్తి కుమార్తె మర్డర్ గురించి విన్నప్పుడు. దాంతో తన లోని డిటెక్టివ్ ని పూర్తి స్దాయిలో లేపి, కూర్చోపెట్టి , ఆమెను చంపిన హంతుకలను పట్టుకుంటానని మనస్సులో ప్రతిజ్ఞ చేస్తాడు.

తనకు దొరికిన కొద్ది పాటి క్లూస్ తోనే డిటక్షన్ మొదలెట్టి పరుగులుపెడతాడు. అయితే ఆ కేసు అతను ఊహించినంత చిన్నది కాదు. చాలా చాలా పెద్దది. తను తెలియకుండా పెద్ద క్రిమినిల్ విషయంలోకి వచ్చేసేనని తెలిసే సరికి వెనక్కి వెళ్లలేని పరిస్దితి. అప్పుడు ఒక్కో చిక్కుముడిని విడతీస్తూ వరస మర్డర్ కేసుల మిస్టరీ ని విప్పుతాడు. అందరి చేతా శభాష్ అనిపించుకుండాడు. ఈ లోగా ఆ కేసుని పరిష్కరించే క్రమంలో అనేక ప్రమాదాలు ఎదురౌతాయి. ఇంతకీ ఆ మిస్టరీ మర్డర్స్ కేసు ఏమిటి. అతనికి ఆ కేసు పరిశోధనలో ఎదురైన అవరోధాలు ఏమిటి…ఇందులో హీరోయిన్  స్నేహ ( శ్రుతి శ‌ర్మ) క్యారక్టర్ ఏమిటి..ఆమె కు  కథలో ఉన్న పరిథి, పని ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఆ ముడులు మీరు స్వయంగా విప్పుకోవాల్సిందే.
  
ప్లస్ లు మైనస్ లు
 
తెలుగులో దాదాపు ముప్పయ్యేళ్ల క్రితం వ‌చ్చిన ‘చంటబ్బాయ్‌’ త‌ర్వాత అలాంటిది కానీ, ఆ స్థాయి డిటెక్టెవ్ సినిమా కానీ మ‌ళ్లీ రాలేదు.  ఆ లోటుని భర్తీ చేసే లక్షణాలతో వచ్చిన ఈ సినిమా కు ఎంచుకున్న స్టోరీ లైన్, మర్డర్స్, వాటి చుట్టూ అల్లిన సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగున్నాయి. మరీ ముఖ్యంగా  ప్ర‌జ‌లు మూడంగా న‌మ్మే న‌మ్మ‌కాలు, దేవుడు గురించి  జరిగే  రిలీజియ‌స్ క్రైమ్స్ కథ కావటం విశేషం. ఇలాంటి కథ తెలుగు తెర ఇంతకు ముందు చూడలేదు. 

చాలా చోట్ల మనం గెస్ చేయలేని సీన్స్ క్రియేట్ చేసారు. అయితే అంతా బాగానే ఉన్నా కథనం విషయం దగ్గరకు వచ్చేసరికి నీరు కార్చేసారు. ఫస్టాఫ్ సెటప్ కే ఎక్కువ టైమ్ తీసుకోవటంతో బోర్ వచ్చేస్తుంది. సెకండాఫ్ కి గానీ కథలోకి వెళ్లరు. అదే కాస్త ఇబ్బంది. అయితే  కథకు అవసరంలేని పాటలు, ఫైట్లు వంటి కమర్షియల్ హంగులకు దూరంగా  ఉండటం కలిసొచ్చింది. కేవలం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను మాత్రమే నమ్ముకుని ఒక మంచి థ్రిల్లర్ సినిమాను ప్రేక్షకులకు అందించటం చాలా వరకూ సక్సెస్ అయ్యారు. స్లో నేరేషన్ సినిమాకు వెనక్కి లాగితే  ట్విస్ట్ లు సినిమా పైకి లేపాయి.

కొత్త కుర్రాడు, కొత్త డైరక్టర్ కలిసి ..

ఈ సినిమా హీరోగా చేసిన  నవీన్ పోలిశెట్టి యూట్యూబ్ ద్వారా జనాలకు పరిచయమే కానీ హీరోగా ఇది తొలి సినిమా. అయితే చాలా సినిమాలు చేసినట్లు మనకు అనిపిస్తాడు. అందుకు కారణం అతను నటనలో చూపించే ఈజ్. ఫన్ సీన్స్ లోనే కాక డ్రమిటిక్ సన్నివేశాల్లోనూ అదరకొట్టాడు. ఇక దర్శకుడు కూడా షాట్ డివిజిన్ నుంచి డైలాగులు దాకా ప్రతీది కొత్తదనం చూపాలనే తాపత్రయం కనపడుతుంది. ఫస్టాఫ్ లో కాస్త డ్రాగ్ చేయటం తగ్గితే మరింత బాగుండేది. సెకండాఫ్ మాత్రం చాలా బెస్ట్ గా, గ్రిప్పింగ్ గా సెట్ అయ్యింది. ట్విస్ట్ లను బాగా నేరేట్ చేసాడు. డైలాగ్ లు అక్కడక్కడా బాగా పేలాయి.

టెక్నికల్ గా 

మార్క్ కె.రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో  పాటు, స‌న్నీ కూర‌పాటి కెమెరా వర్క్ బాగుంది.  అయితే వాటిని సపోర్ట్ చేసే తీరులో  ప్రొడక్షన్ వ్యాల్యూస్ లేవు. బాగా పూర్ గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా సినిమాలో ఎక్కువమంది తెలియని ఆర్టిస్ట్ లు ఉండటంతో చాలా సార్లు కన్ఫూజ్ అవుతాం. ఏదైమైనా డిటెక్టివ్ సిని లవర్స్ కు ఇది డీసెంట్ ట్రీట్.
 
చూడచ్చా

వీకెండ్ ని ఈ సినిమాతో ఎంజాయ్ చేయచ్చు. 

తెర వెనక..ముందు

న‌టీన‌టులు: న‌వీన్ పోలిశెట్టి, శృతి శ‌ర్మ త‌దిత‌రులు
స్క్రీన్‌ప్లే: న‌వీన్ పోలిశెట్టి 
సంగీతం: మార్క్ కె.రాబిన్‌ 
సాహిత్యం: కె.కె
ఛాయాగ్రహ‌ణం: స‌న్నీ కూర‌పాటి 
క‌ళ‌: క్రాంతి ప్రియం 
నిర్మాత‌: రాహుల్ యాద‌వ్ న‌క్కా
క‌థ‌, మాట‌లు, ద‌ర్శక‌త్వం: స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె  
సంస్థ‌: స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీ: 21-06-2019
మ్యూజిక్: మార్క్ క్రోబిన్
కెమెరామెన్: సన్నీ కురపాటి
ఎడిటర్: అమిత్ తిరుపతి
ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం
కాస్టూమ్ డిజైనర్: మౌనిక యాదవ్, వనజా యాదవ్