ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ 2024
ఘనంగా ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ 2024
తెలుగు సినిమా అభివృద్ధికి పాటుపడిన ఎంతోమంది గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలను సత్కరించేందుకు ఏర్పాటు చేసిన ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ 2024 కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. “తెలుగు ఫిల్మ్ అండ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరమ్ చైర్మన్ నాగబాల సురేష్ ఆధ్వర్యంలో ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవార్డ్స్ కార్యక్రమానికి విజన్ వివికె హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్” సంస్థ అధినేత వి.వి.విజయ్ కుమార్ స్పాన్సర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మురళీ మోహన్, రోజా రమణి, వీకే నరేష్, అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, చంద్రబోస్, రాజ్ కందుకూరి, ప్రవాసాంధ్ర ప్రముఖులు టాక్ షో ప్రయోక్త కిరణ్ ప్రభ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మాజీ పోలీస్ అధికారి గోపీనాథ్ రెడ్డి, ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్, జర్నలిస్ట్ ప్రభు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి ఐ. ఎ. ఎస్. ముఖ్య అతిథిగా హాజరై అవార్డ్ విన్నర్స్ ని అభినందించడం విశేషం.
ఈ కార్యక్రమంలో తొలుత “తెలుగు ఫిల్మ్ అండ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరమ్” చైర్మన్ నాగబాల సురేష్ మాట్లాడుతూ.. తెలుగు టి.వి. కార్మికుల సంక్షేమం కోసం ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు విజన్ వివికె హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత విజయ్ గారు ముందుకొచ్చి వివిధ విభాగాల కార్మికులకు వాళ్ల వెంచర్ నుంచి 101 ప్లాట్లను కేటాయించారు. తెలుగు ఫిల్మ్ అండ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరమ్ పెట్టడానికి కూడా ఆయన సహకారం ఉంది. తెలుగు సినిమా లెజెండ్స్ జీవితాలపై డాక్యుమెంటరీస్ రూపొందించాను. వాళ్లు తెలుగు సినిమా అభివృద్ధికి తమ జీవితాలను త్యాగం చేశారని తెలుసుకున్నాను. ఒక చిన్న కెమెరా పట్టుకుని మొదలైన తెలుగు సినిమా ప్రస్థానం ఇవాళ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. మన ఇండస్ట్రీకి సేవ చేసిన అలాంటి గొప్పవారిని స్మరించుకోవడం నేటి తరం బాధ్యత. ఆ ప్రయత్నంలో భాగంగానే ఘనంగా ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ నిర్వహిస్తున్నాం అన్నారు.
దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీకి మేము ఏం సేవ చేయలేదు. ఒక్కొక్కరం ఒక్కో ఆశతో ఇండస్ట్రీకి వచ్చాం. అయితే వచ్చాక కుటుంబ జీవితం కోల్పోయాం. ఉదయం ఇంటి నుంచే లొకేషన్ వెళ్తే ఎప్పుడు తిరిగి వస్తామో తెలియదు. అలా కొన్నేళ్లు గడిచిపోయాయి. 50 ఏళ్లుగా మేము ఇండస్ట్రీలో ఉంటున్నాం. చెన్నైలో ఉండేప్పుడు రోజు కలిసేవాళ్ళం. హైదరాబాద్ వచ్చాక కలవడం బాగా తగ్గిపోయింది. మనం ఇలాంటి అవార్డ్స్ ఇవ్వలేకపోయాం. సురేష్, విజయ్ లాంటి వాళ్లు మొదలుపెట్టినప్పుడైనా సపోర్ట్ చేద్దాం. ఇవాళ ఈ కార్యక్రమానికి రాని వాళ్లకు ఇంటికి వెళ్లి మరీ అవార్డ్స్ ఇద్దాం. నెక్ట్ ఇయర్ అయినా వాళ్లంతా వచ్చేలా చేద్దాం అన్నారు.
నటి రోజా రమణి మాట్లాడుతూ.. ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచన రావడం సంతోషకరం. ఇక్కడికి మురళీ మోహన్, నరేష్ వచ్చారు. ఇటీవలే మురళీ మోహన్ గారి 50 ఇయర్స్ సెలబ్రేషన్ ఫంక్షన్ ఘనంగా జరుపుకున్నాం. నాతో పాటు కే ఆర్ విజయ, షావుకారు జానకి, వాణిశ్రీ, కాంచన వంటి ఎందరో సీనియర్స్ ఉన్నారు. వాళ్లను ఇక్కడికి పిలవడం వాళ్లకు దూరాభారం అవుతుంది. అందుకే మనమే చెన్నై, బెంగళూరు.. వాళ్లు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్లి అవార్డ్స్ ఇద్దామని చెప్పాను. సురేష్ వాళ్లు కూడా సరేనన్నారు. నన్ను ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగం చేసినందుకు సంతోషంగా ఉంది అన్నారు.
అవార్డ్ కమిటీ మెంబర్, జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ కార్యక్రమంలో చాలా మంది పెద్దలు పాల్గొని ఉండాల్సింది. వివిధ కారణాల వల్ల వాళ్లు రాలేకపోయారు. ఇవాళ సిటీలో ఉన్న పొలిటికల్ టెన్షన్ వాతావరణంతో పాటు షూటింగ్స్ కారణంగా రాలేకపోయారు. అయినా వాళ్ల ఇంటికి వెళ్లి ఈ అవార్డ్స్ ఇవ్వబోతున్నాం. ఎలాగైనా ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం అన్నారు.
విజన్ వివికె హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత విజయ్ మాట్లాడుతూ.. సినిమాలను చూసి స్ఫూర్తి పొంది ఎంతోమంది తమ జీవితాల్లో గొప్పవాళ్లు అయినవాళ్లు ఉన్నాను. నేను కూడా సినిమా అభిమానినే. నేను వృత్తిపరంగా రియల్ ఎస్టేట్ లో ఉన్నా సినిమా ఇండస్ట్రీని అభిమానిస్తాను. అలాంటి ఇండస్ట్రీ కోసం ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు నాగబాల సురేష్ గారితో మాట్లాడి ఈ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించాలనుకున్నాం. ఇవాళ ఈ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పెద్దలు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నా అన్నారు.
మురళీ మోహన్ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీ మూలాలను మర్చిపోకుండా, మన పరిశ్రమకు పునాది వేసిన వాళ్లను గుర్తుంచుకునేందుకు ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించడం అందరూ అభినందించాల్సిన విషయం. రోజారమణి, నరేష్, నేను.. మేమంతా ఇండస్ట్రీకి వచ్చి చూస్తుండగానే ఏళ్లకేళ్లు గడిచిపోయాయి. తెలుగు సినీ పరిశ్రమకు నంది అవార్డ్స్ మళ్లీ ఇవ్వాలని ఇదే వేదిక మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కోరాం. ఆయన సీఎం రేవంత్ గారికి చెప్తా అన్నారు. చెప్పిన వారంలోనే ప్రకటన ఇచ్చారు. గద్దర్ గారి పేరు మీద నంది అవార్డ్స్ ఇస్తామన్నారు. ఈ ఏడాది గద్దర్ అవార్డ్స్ ఇస్తారని కోరుకుంటున్నా అన్నారు.
వీకే నరేష్ మాట్లాడుతూ.. నేను 8 ఏళ్ల వయసులో బాల నటుడిగా ఇండస్ట్రీకి వచ్చాను. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. మురళీ మోహన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకోవడం చాలా హ్యాపీగా ఉంది. కళాకారుడికి నిజమైన సంతోషాన్నిచ్చేది అవార్డ్స్ మాత్రమే. నేను నా ప్రతిభ వల్లే ఇన్నేళ్లు పరిశ్రమలో ఉన్నాను అనుకుంటే తప్పు. సినిమా టీమ్ వర్క్. డైరెక్టర్ మీడియం. నేను ఒక మహిళా దర్శకురాలికి బిడ్డగా పుట్టాను. ఈ అవార్డ్స్ కార్యక్రమంలో సినీ పెద్దలంతా పాల్గొనాలని కోరుకుంటున్నాను అన్నారు.
అంతర్జాతీయ ఖ్యాతి పొందిన టాక్ షో ప్రయోక్త కిరణ్ ప్రభ మాట్లాడుతూ.. ఇంతమంది ప్రముఖులు పాల్గొన్న ఈ ఐకాన్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో నన్ను సత్కరించటం ఆనందంగా ఉంది. టాక్ షోస్ ద్వారా చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందిస్తున్న ప్రముఖుల జీవిత చరిత్రలను ఆవిష్కరిస్తున్న నా కృషికి ఈ అవార్డు మరింత స్ఫూర్తిని ఇచ్చింది అన్నారు.
ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమాన్ని ప్రముఖ యువ నటుడు, ప్రయోక్త కృష్ణ కౌశిక్ తన చక్కని వ్యాఖ్యానంతో రక్తి కట్టించారు.
ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమాన్ని ప్రముఖ యువ నటుడు, ప్రయోక్త కృష్ణ కౌశిక్ తన చక్కని వ్యాఖ్యానంతో రక్తి కట్టించారు.