కలర్ ఫోటో మూవీ రివ్యూ

Published On: October 24, 2020   |   Posted By:

కలర్ ఫోటో మూవీ రివ్యూ

పాత ఫొటోకు కొత్త కలర్: కలర్ ఫోటో సినిమా రివ్యూ
 
రేటింగ్ : 2.5/5

ఓ అబ్బాయి ప్రేమ కథలో సాధారణంగా ఆస్తులు..అంతస్దులు..పేద గొప్పా,కులం, మతం వంటి కాంప్లిక్ట్ లు ఉంటూటాయి. కానీ శరీర రంగు కూడా సమస్యగా మారుతుందా..నల్లగా ఉండే అబ్బాయిల ప్రేమ కథలు ఎలా ఉంటాయి..ఈ విషయం చెప్పదలుచుకున్నారు ‘కలర్ ఫోటో’ దర్శక,నిర్మాతలు. కొత్త కాంప్లిక్ట్..సరిగ్గా డీల్ చేస్తే ఓ వ్యక్తిత్వ వికాస సినిమాలాగ చాలా మందికి ప్రేరణ ఇస్తుంది. ఈ మద్యకాలంలో హిందీలో ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. బట్టతల చుట్టూ కథ అల్లి హిట్ కొట్టారు. అలాగే ఈ సినిమా కూడా వర్కవుట్ అవుతుందా…అసలు కథేంటి..సునీల్ పాత్ర ఏమిటి..ఈ సినిమా మనోళ్లుకు నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

జయకృష్ణ (సుహాస్),దీప్తి (చాందిని చౌదరి) ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. జయకృష్ణ పాలు అమ్ముకుని కుటుంబాన్ని లాక్కొస్తూ ,చదువుకునే కుర్రాడు. అంతేకాదు తను నలుపుగా ఉంటాను కాబట్టి అమ్మాయిలు ఎవరూ తనని ఇష్టపడరు అనే అభిప్రాయం బలంగా ఉన్నవాడు. మరో ప్రక్క దీప్తి ..ఓ పెద్దింటి అమ్మాయి. సినిమా హీరోయిన్ లా అందగత్తె.  వాళ్లిద్దరి ప్రేమకు ..శారీరక రంగు ఏమాత్రం అడ్డం రాలేదు. కానీ ఆ ప్రేమ పెద్దదై పెళ్లికి దారి తీస్తుందేమో అనుకునే సమయానికి మాత్రం ఆమె అన్న  రామరాజు(సునీల్)రూపంలో వస్తుంది. అతనో పోలీస్. తన చెల్లికి బాగా కలర్ ఉన్నఉన్న కుర్రాడిని ఇచ్చి పెళ్లి చేయాలని జీవితాశయం పెట్టుకున్నవాడు. మరి అతని ఆశయం నెరవేరిందా..లేక జయకృష్ణ ప్రేమ గెలిచిందా..చివరకు ఏమైంది.. తెలియాలంటే ఆహా ఓటీటీలో  సినిమా చూడాలి .

స్టోరీ..స్క్రీన్  ప్లే..

డబ్బున్న అమ్మాయి..డబ్బులేని అబ్బాయి ప్రేమ కథకు  వర్ణవివక్షను జోడించిన వదిలిన సినిమా ‘కలర్ ఫొటో’. ఐడియా లెవిల్ లో అద్బుతం అనలేం కానీ మంచి పాయింటే అి చెప్పగలం.సాధారణంగా ఇలాంటి సినిమాలు తమిళంలో ఎక్కువగా వస్తూంటాయి. దర్శకుడు, రచయత ఇద్దరు కూడా ఈ సినిమాని తమిళం సినిమాలనే ఇన్ఫూలియన్స్ అయ్యినట్లున్నారు. మనకు చాలా చోట్ల ఆ తమిళ సాంబారు వాసన వస్తూంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే తమిళ సినిమానే చూస్తున్నట్లు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లేలో కొన్ని జిమ్మిక్కులు చేద్దామనుకున్నారు కానీ అవేమీ అంత ఇంపాక్ట్ గా లేవు. సాయి రాజేష్ రెగ్యులర్ టచ్ అయిన ఫన్ ని మాత్రం ఇందులో బాగా మిస్ అవుతాం. హృదయ కాలేయం, కొబ్బరి మట్టలాంటి కామెడీలో పావు వంతు కూడా ఇక్కడ మీకు దర్శనమివ్వదు. సీరియస్ నోట్ తో సినిమాని లాగేస్తాడు. డైరక్టర్ ఈ సినిమాని ఓ క్లాసిక్ లా మలవాలన్న తాపత్రయం ఉన్నట్లుంది. స్లో నేరేషన్ ని చాలా చోట్ల ఆశ్రయించాడు. అలాగే  కథను నడిపించడంలో మాత్రం చాలా వరకు తడబడ్డాడు. సినిమాలోని మెయిన్ పాయింట్ లోకి ఇంట్రవెల్ దాకా రాడు.  ఇక సెకండాఫ్ లో కథ స్టార్ట్ అయ్యింది అనుకుంటే.. హీరోయిన్ తన ప్రేమను హీరోకి చెప్పడం,  సాంగ్స్, హీరోయిన్ అన్నయ్య ఎంట్రీ, వీరి ప్రేమకి అడ్డుచెప్పడం ఇలా అన్ని రొటీనే. వీటిని తట్టుకోవటం కష్టం.
 
 
టెక్నికల్ గా..

సుహాస్ లో మంచి న‌టుడు నటుడు ఉన్నాడని,మంచి కామెడీ టైమింగ్ ఉందని గతంలోనే ప్రూవ్ అయ్యింది. అతని బాడీ లాంగ్వేజ్ కు తగ్గ పాత్రే కావటంతో లీనమై చేసాడు. ఇక ఎమోషన్ సీన్స్ ని  బాగా పండించాడు . కానీ..ఎందుకో కామెడీ యాంగిల్ ని వదిలేసారు.  చాందిని చౌద‌రి మంచి ఆర్టిస్టే కానీ బ్రేక్ రాలేదు అని అనిపిస్తుంది.  వైవా హ‌ర్ష‌కి ఇరక్కొట్టి వదిలాడు.  విలన్ గా సునీల్..ఫెరఫెక్ట్. కానీ అతని సీన్స్  మాత్రం మిస్ ఫిట్.

సంగీత దర్శకుడుగా కాలభైరవ ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కారు. చిన్న సినిమా కదా అని ఎక్కడా లైట్ తీసుకోకుండా అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్,పాటలు ఇచ్చారు. ఇక తొంబైల నాట కథా వాతావరణాన్ని క్రియేట్ చేయటానికి  సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డిపార్టమెంట్ పడ్డ కష్టం కనపడుతుంది. ఎడిటర్ ..ఫస్టాఫ్ ని మరింత షార్ప్ గా కట్ చేసి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అదిరిపోలేదు కానీ ఆ కథకు సరపడా ఖర్చు పెట్టారు.
 
చూడచ్చా…

మరీ తీసిపారేసే సినిమా కాదు..అలాగని అద్బుతం కాదు. ఓ సారి కాలక్షేపానికి చూడచ్చు

తెర వెనక..ముందు

నటీనటులు : సుహాస్, చాందినీ చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులు.
సంగీతం: కాలభైరవ,
 కథ: సాయి రాజేష్ నీలం,
ఆర్ట్: క్రాంతి ప్రియం,
కెమెరామెన్: వెంకట్ ఆర్ శాఖమురి,
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్,
ఫైట్స్: ఎ.విజయ్,
సమర్పణ: శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్త్సైన్మెంట్స్,
సహ నిర్మాత : మణికంఠ
నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం : సందీప్ రాజ్
రన్ టైమ్:2గం|| 1ని||
ఎక్కడ చూడాలి? : ఆహా (ఓటీటీ)
విడుదల తేదీ: 23 – 10- 2020