కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌ హిందీ మూవీ రివ్యూ

Published On: April 22, 2023   |   Posted By:

కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌ హిందీ మూవీ రివ్యూ

సల్మాన్, వెంకీ  ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ రివ్యూ
Emotional Engagement Emoji

👎

బాలీవుడ్‌ భాయీజాన్‌ సల్మాన్‌ఖాన్‌ సినిమా ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’రిలీజ్ అయితే మనకేంటి అంటే అందులో మెగావపర్‌ స్టార్‌ స్పెషల్‌ అప్పియరెన్స్ ఇవ్వటమే. ఈ వార్త వచ్చిన్నప్పటి నుంచీ  మెగాభిమానుల అంచనాలు మామూలుగా లేవు.  సినిమాను, అందులో పాటను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృత‌గా వెయిట్ చేస్తున్నారు. ఆ అంచ‌నాల‌న్నింటినీ ఒక్క దెబ్బతో నీరు కార్చేసో పోగ్రామ్ పెట్టుకున్నారు. అవును…వెంకటేష్, రామ్ చరణ్ ఉన్న సినిమా మనకేమీ స్పెషల్ కాదని ప్రూవ్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అసలు ఈ సినిమా మ్యాటరేంటి..తెలుగు స్టార్స్ ని సినిమాలో ఇరికించాల్సిన పని ఈ బాలీవుడ్ భాయీజాన్ కు ఎందుకొచ్చిందో చూద్దాం.

స్టోరీ లైన్ :

కథ తెలుసుకునే ముందు ఈ సినిమా తమిళంలో వచ్చిన  అజిత్ ‘వీరమ్’కి రీమేక్. అలాగే ఆ సినిమా రీమేక్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ కాటమరాయుడు కథే అని గుర్తు చేసుకోవాలి.  అనాధ అయిన  భాయ్ జాన్ (సల్మాన్ ఖాన్) వేరే పనిలేమీ పెట్టుకోకుండా … కుర్రాళ్లకు సెల్ఫ్ డిఫెన్స్ లో ట్రైనింగ్ ఇస్తుంటాడు. అలాగే తనలాంటి మరో ముగ్గురు అనాథల్నిపోగేసి, సొంత తమ్ముళ్లులా గారాబంగా పెంచుతుంటాడు. అంతేకాదు తామంతా కలిసుండాలని అందుకే పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అవుతాడు. కానీ కుర్రాళ్లు ఖాళీగా ఉండరు కదా..వాళ్లు మరో ముగ్గరు అమ్మాయిలను లైన్ లో పెడతారు. అంతే కాదు తమ అన్న తమ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే , అతన్ని లవ్ లో పడేస్తే బెస్ట్ అని ఫిక్స్ అయ్యిపోతారు. అందుకు ప్రయత్నాలు మొదలెడతారు.

ఈ లోగా వీళ్ల అదృష్టం బాగుండి ..భాయ్‌జాన్‌కు భాగ్యలక్ష్మి (పూజా హెగ్డే) పరిచయం అవుతుంది.  భాయ్‌జాన్ గురించి అబద్ధాలు చెప్పి ఆయనను భాగ్యలక్ష్మి ఇష్టపడేలా చేస్తారు.  భాయ్‌జాన్ కూడా భాగ్యలక్ష్మిని ఇష్టపడతాడు.  ఆమెకు గుండాలంటే నచ్చదు. దీంతో భాయ్ మంచివాడిలా నటిస్తాడు. కానీ భాయ్‌జాన్ ఒక రౌడీ అని తెలుస్తుంది. ఇంతలోనే భాగ్యలక్ష్మిపై అటాక్ జరుగుతుంది. ఈ అటాక్ ఎవరు చేయించారు? భాగ్యలక్ష్మి అన్నయ్య బాలకృష్ణ గుండమనేని (వెంకటేష్) ఎవరు? నాగేశ్వర్‌కు (జగపతిబాబు) ఈ కథతో సంబంధం ఏంటి? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్ :

ఇదేమీ కొత్త కథ కాదు… కాకపోతే వెంకటేష్ ఈ కథలోకి ఎలా వచ్చాడు అని తెలుసుకోవాలనే ఆత్రుత ఉంటే మాత్రం ఆసక్తి కలుగుతుంది అంతే. అయితే వెంకీ ఈ కథలో పూజకు అన్నయ్యగా కనిపిస్తాడు. అంతకు మించి కొత్తగా ఏమీ ఉండదు. సెకండాఫ్ అంతా  హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లోనే నడిపేసారు. దానికి తోడు   ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ‘వెల్‌కం టు సౌత్ ఇండియా’ అని వేసి ఉత్సాహం చూపించారు. ఈ మార్పులు తప్పించి కాటమరాయుడుకు ఈ సినిమాకు పెద్ద తేడా ఏమీ ఉండదు. సల్మాన్ తరహా సీన్స్ కొన్ని కొత్తగా కలిపారు అంతే. మరో ప్రక్క వెంకటేష్, జగపతిబాబు, భూమిక, రోహిణి హట్టంగడిలు ఉన్న సెకండాఫ్ చూస్తుంటే మనకు ఇక్కడ లోకల్ ప్లేవర్ మాట ప్రక్కన పెట్టి ఏదో వింత లోకంలో ఉన్నట్లు, తెలంగాణా సంప్రదాయాలకు సంభందించి డాక్యుమెంట్ చూస్తున్నట్లు అనిపిస్తుంది. మనకు ఉత్సాహం తెప్పించటానికి  సెకండాఫ్‌లో సగం డైలాగులు తెలుగులోనే ఉంటాయి. కొన్నిసార్లు ఒకే వాక్యంలో కూడా సగాన్ని హిందీలో, మిగతా సగాన్ని తెలుగులో చెప్పించే గొప్ప ప్రయోగం చేసారు. ఇక కథ గా చూస్తే ఎప్పుడో తమిళంలో 2014లో రిలీజైన ఈ చిత్రాన్ని ఇప్పుడు సల్మాన్ రీమేక్ చేయాలనుకోవటం కథా దారిద్రాన్ని సూచిస్తోంది. ప్రతీ తమిళ, లెదా తెలుగు రీమేక్ ఆడేయదు కదా. మనకే అప్పుడు సోసోగా వర్కవుట్ ఈ చిత్రం హిందీలో దుమ్ము దులిపేసే దమ్ము ఉందనుకోవటం భ్రమే.

ఆర్టిస్ట్ లు ఫెరఫార్మెన్స్ విషయానికి వస్తే :

సల్మాన్ ఖాన్ కొత్తగా ఊడబొడిచిందేమీ లేదు. తన రొటీన్ బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ .   హీరోయిన్ గా పూజాహెగ్డే అక్కడా ఏమీ వర్కవుట్ అవదేమో అనిపించేంత డల్ గా ఉంది. కానీ కాస్త  అందంగా కనిపించింది. సల్మాన్-పూజా కెమిస్ట్రీ దారుణంగా ఉంది. వెంకటేష్ ఎందుకు ఈ క్యారక్టర్ చేసాడా అనిపిస్తుంది.  రామ్ చరణ్ ఉన్నది కొద్ది క్షణాలే. అది యూట్యూబ్ లో చూసుకోవచ్చు. జగపతిబాబు విలన్ గా మనకు తెలిసిన మొహమే.

టెక్నికల్  గా :

సినిమాటోగ్రఫ్రీ, ఎడిటింగ్‌ గొప్పగా లేవు కానీ ఓకే. రవి బస్రూర్‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మొత్తం 8మంది సంగీత దర్శకులు ఈ సినిమాకు పాటలు ఎందుకు ఇచ్చారో అర్దం కాదు. డైరక్టర్  ఫర్హద్‌ సమ్జీ పెద్దగా కష్టపడలేదు. లేదా కష్టపడనివ్వలేదేమో. అజిత్‌ ‘వీరమ్‌’  తీసుకుని, ‘కాటమరాయుడు’కలిపి కిచిడి చేసేసాడు.

చూడచ్చా?

సల్మాన్ అభిమానులు అయితే భరించగలగుతారు. వెంకటేష్  కోసమో, రామ్ చరణ్ కోసమో అయితే అసలు అటు వైపు వెళ్లాల్సిన పనిలేదు.

నటీనటులు :

సల్మాన్‌ఖాన్‌, వెంకటేశ్‌, పూజాహెగ్డే, జగపతిబాబు, భూమిక తదితరులు;

సాంకేతికవర్గం :

నేపథ్య సంగీతం: రవి బస్రూర్‌
పాటలు: హిమేశ్‌ రేష్మియా, షాజిద్‌ ఖాన్‌, దేవిశ్రీ ప్రసాద్‌ తదితరులు ;
సినిమాటోగ్రఫీ: వి.మణికందన్‌;
ఎడిటింగ్‌: మయూరేష్‌ సావంత్‌;
నిర్మాత: సల్మాన్‌ఖాన్‌;
రచన, దర్శకత్వం: ఫర్హద్‌ సమ్జీ;
Run Time: 2h 24m
విడుదల: 21-04-2023