కొండా మూవీ రివ్యూ

Published On: June 23, 2022   |   Posted By:

కొండా మూవీ రివ్యూ

రామ్ గోపాల్ వర్మ ‘కొండా’ రివ్యూ

Emotional Engagement Emoji

👎

“ప్రతి కథకు, సినిమాకు ఓ క్యారెక్టర్ ఉంటుంది. ఉదాహరణకు… హిట్లర్ లేకపోతే రెండో ప్రపంచ యుద్ధం, గాంధీజీ లేకపోతే భారత స్వాతంత్య్ర పోరాటానికి అర్థమే లేదు. గాంధీ ఒకవైపు, హిట్లర్ మరోవైపు ఉంటే కొండా మురళి మధ్యలో ఉన్నారు. త‌నను జైలులో చంపేస్తారా? అనేదాన్ని ఎదుర్కొని, చావుతో ఆడుకుని, నేడు ఇక్క‌డ కూర్చున్నారు” అంటూ కొండా మురళి నేపధ్యం గురించి చాలా గొప్పగా వర్మ చెప్పారు. అయితే వర్మ చెప్పినంత గొప్పగా ఆయన పాత్రను తెరపైకి ఎక్కించారా..అసలు కొండా మురళి కథను తెరపై ఏ విధంగా చెప్పారు. సామాన్యుడుకు ఈ సినిమా నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథ

1990 లో వరంగల్ లో మొదలయ్యే కథలో.. కొండ మురళి (త్రిగుణ్) ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉన్న ఆవేశపరుడైన విద్యార్దినాయకుడు. అతని ఆవేశం అనేక మందిని శత్రువులగా, కొంతమందిని మిత్రులుగా చేస్తుంది. అదే సమయంలో అతని ఐడియాలజీ నక్సలైట్ నాయకుడు ఆర్కే (ప్రశాంత్ కార్తి) ని ఆకర్షిస్తుంది. మురళిని ఎంకరేజ్ చేసి తమలో కలుపుకుంటాడు. ఇది జరిగిన కొంతకాలానికి నల్ల సుధాకర్ (పృధ్వీ) దృష్టి మురళిపై పడుతుంది. అతను మురళిని తమ పార్టీలో జాయిన్ అవ్వమని ఆహ్వానిస్తాడు. అయితే సుధాకర్ దుర్మార్గుడు. మురళిని తన రాజకీయ అవసరాలకు వాడుకుంటూంటారు. ఇది తెలుసుకున్న మురళిని అంతమొందించాలనుకుంటాడు. అప్పుడు మురళి ఏం చేసాడు..ఆ డెత్ ట్రాప్ నుంచి ఎలా బయిటపడ్డాడు… తన పొలిటికల్ కెరీర్ ని ఎలా బిల్డ్ చేసుకున్నాడు.. కొండా సురేఖతో ఎలా పరిచయం ఏర్పడి, వివాహానికి దారి తీసింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ

బయోపిక్ లు తీయటం వర్మ కు కొత్తమీ కాదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక ఒక కొత్త కథ తనను ప్రేరేపించకపోతుందా తెరకెక్కించకపోతానా అన్నట్లు ఆయన అన్వేషిస్తారు. అయితే ఆయన కు సినిమా ప్రారంభించటంలో ఉన్న ఉత్సాహం తర్వాత తీసేటప్పుడు ఉండదు…అని ఫైనల్ అవుట్ ఫుట్ లు చాలా సార్లు వెక్కిరిస్తూ చెప్పేసాయి. ఈ సారి అదే జరిగింది. కేవలం కేవలం కొండా మురళి,సురేఖలను సంతృప్తిపరచటానికే ఈ బయోపిక్ ప్రాజెక్టు భుజాన ఎత్తుకున్నట్లు అనిపిస్తుంది. ఎక్కడా సామాన్య ప్రేక్షకుడుని దృష్టి లో పెట్టుకున్నట్లు అనిపించదు. మామూలుగా ఆయన తీసే బయోపిక్ లలో వివాదాస్పద అంశాలు కల వాటినే ఎంచుకుని,తనదైన మార్క్ సీన్స్ ని కలిపి వండి వడ్డిస్తూంటారు. ఆ క్రమంలో గతంలో రక్త చరిత్ర మొదలుకొని నిన్న మొన్నటి డి కంపెనీ దాకా సాగాయి. అయితే ఇది కాస్త విభిన్నం.వివాదం అనేది ఎక్కడా ఉండకుండా జాగ్రత్త పడ్డారు. అందుకు తగినట్లుగానే కథ,కథనం చాలా వరకూ డాక్యుమెంటరీగానే సాగుతుంది. ఇది చాలా సార్లు రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రం అంటే నమ్మబుద్ది కాదు. అంత విసుగ్గా ఉంటాయి సీన్స్, అందుకు కల్పించిన సన్నివేశాలు. డైలాగులు అయితే చాలా భారంగా ఏదో పుస్తకంలోంచి తీసి తెరపై చెప్పించినట్లు ఉంటాయి. స్క్రీన్ ప్లే అనేది మర్చిపోయినట్లు ఈ సినిమా అనిపిస్తుంది. ఎక్కడా కన్విక్షన్ అనేది కనపడదు. చూసేవారికి ఇదో పెద్ద గుదిబండలాగేనే అనిపిస్తుంది.

ప్లస్ లు
ఆర్టిస్ట్ లు కొత్తవారైనా అదిరిపోయే ఫెరఫార్మ్ ఇవ్వటం
వర్మకు అలవాటైన రియిలిస్టిక్ నేరేషన్

మైనస్ లు
వర్మ రెగ్యులర్ స్టైల్ లో నడిచే కథ,కథనం
బోర్ కొట్టే స్క్రీన్ ప్లే

టెక్నికల్ గా …
థ్రిల్ల‌ర్ క‌థ‌ల్ని ఎంత స్పీడుగా చెబితే అంతే ప్ల‌స్సు. ఇలా లేనిపోని ట్రాకులు జోడించుకుంటూ వెళ్తే ఆ వేగం త‌గ్గుతుంది. అది సినిమా ఫ‌లితంపై ప్ర‌భావాన్ని చూపిస్తుంది. వర్మకు ఈ విషయం తెలుసు ఆయన పనిమాలా బోర్ కొట్టించారనిపిస్తుంది. రీసెర్చ్ లేదు..ఏమీలేదు..తనకు తోచిన సీన్స్ కలుపుకుంటూ వెళ్లారని అర్దమవుతుంది. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సాంకేతికంగా పెద్ద హంగులేం లేవు. కెమెరా వర్క్ బాగుంది. ఆర్ట్ డిపార్టమెంట్ బాగా కష్టపడింది. అయితే వర్మ దర్సకత్వంలో ప్ర‌తీ స‌న్నివేశాన్నీ డిటైల్డ్ గా చూపించాల‌నుకోవ‌డం కొన్ని సార్లు ఇబ్బంది పెడుతుంది. అయితే రెండు గంట‌ల్లోనే తేల్చేయటం పెద్ద రిలీఫ్. సినిమాపై, రాసిన స‌న్నివేశాల‌పై ఎంత ప్రేమ ఉన్నా, వాటిని కుదించుకోవాల్సిందే అప్పుడే ఉన్నంతలో హ్యాపీగా అనపిస్తుందనేది ఈ సినిమా చెప్పే పాఠం. లేకపోతే ఈ సినిమా కథకు,నేరేషన్ కు రన్ టైమ్ ఎక్కువ ఉంటే భరించలేము. ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే అనిపించాయి.

ఆర్టిస్ట్ ల చేత చాలా సెటిల్డ్ గా ఫెరఫార్మెన్స్ చూపించారు. రెగ్యుల‌ర్ ఫైట్లు, మూస డైలాగుల జోలికి వెళ్ల‌క‌పోవ‌డంతో వాళ్లు బాగా చేస్తున్నారనిపించింది. కొండా మురళిగా త్రిగుణ్ ఫెరఫెక్ట్ ఛాయిస్. సురేఖ పాత్రలో నటించిన ఇర్రా మోర్‌ చాలా బాగా చేసింది. తన నటనతో కొన్ని సార్లు సర్పైజ్ చేసింది. కమిడయన్ పృథ్వీరాజ్‌ నెగిటివ్ రోల్ లో రాణించారు. కానీ బిగ్రేడ్ ఆర్టిస్ట్ లతో ఈ సినిమాని చుట్టేసిన ఫీల్ వచ్చింది.

చూడచ్చా?
మీరు కొండా మురళి లేదా రామ్ గోపాల్ వర్మ వీరాభిమానులు అయితే ఖచ్చితంగా చూడాలి.

ఎవరెవరు..
నటీనటులు:అదిత్ అరుణ్‌, ఇర్రా మోర్‌, పృథ్వీరాజ్‌, తుల‌సి, ఎల్బీ శ్రీ‌రామ్‌, ‘ఆటో’ రామ్ ప్రసాద్, అభిలాష్ చౌద‌రి, శ్ర‌వ‌ణ్‌ తదితరులు
ఎడిట‌ర్‌: మ‌నీష్ ఠాకూర్‌,
ఛాయాగ్ర‌హ‌ణం: మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి,
సంగీతం: డి.ఎస్‌.ఆర్‌,
కో-డైరెక్ట‌ర్: అగ‌స్త్య మంజు,
నిర్మాణం: కంపెనీ ప్రొడ‌క్ష‌న్‌,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: జ‌క్కుల వెంక‌టేశ్‌,
ద‌ర్శ‌క‌త్వం: రామ్ గోపాల్ వ‌ర్మ‌.
Run Time :2hr 1 Min
విడుదల తేదీ :23rd June 2022