Reading Time: 3 mins

కొండ పొలం మూవీ రివ్యూ

వైష్ణవ్ తేజ్ ‘కొండ పొలం’ రివ్యూ

 Emotional Engagement Emoji (EEE) : 

?


‘తానా’ నవలల పోటీలో ప్రథమ బహుమతికి ఎంపికైన రచన, అందులో హీరోగా  ‘ఉప్పెన‌’లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చేసిన హీరో. ఆ ఇద్దరినీ కలుపుతూ సామాజిక అంశాలను సినిమాలో చొప్పించి హిట్ కొట్టే డైరక్టర్ క్రిష్. ఈ కాంబినేషన్ వినగానే ఖచ్చితంగా ఓ అద్బుతం జరగుతుందనిపిస్తుంది. అయితే నవలను సినిమాగా తెరకెక్కించటం చెప్పుకున్నంత ఈజీ కాదు. అందులోనూ పూర్తిగా అడవి నేపధ్యం ఉన్న కథ. ఎంతోమందికి నచ్చేసి విజువలైజ్ చేసుకున్న కథనం. ఆ రెంటిని బాలెన్స్ చేసుకుంటూ సినిమాటెక్ లిబర్టీని తీసుకుంటూ ఈ కథను ఎలా తెరపై నిలబెట్టారు. నవలకు,సినిమాకు చేసిన మార్పులు ఏమిటి..అసలు సినిమా కథేంటి వంటివిషయాలు రివ్యూలో చూద్దాం.
 
  స్టోరీ లైన్

 గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన ర‌వీంద్ర‌నాథ్ (వైష్ణ‌వ్‌తేజ్‌)కు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ. అదే అతన్ని ఏ ఇంటర్వూలలోనూ పాస్ కానివ్వకుండా అడ్డం పడుతూంటుంది. దాంతో విసుగెత్తి ఇంటికి చేరుకుంటాడు. కానీ ఏం చేయగలడు. అప్పుడు తాత  రోశయ్య(కోట శ్రీనివాసరావు) సలహాతో కొండపొలం కు తన గొర్రెల మందను తీసుకుని బయిలుదేరతాడు. పెద్ద చదువులు చదివిన రవీంద్రకు ఇలా వెళ్లటం బాధగానే ఉంటుంది. కానీ ఫెయిల్యూర్ అతన్ని వెక్కిరిస్తూంటుంది. తన తండ్రి గురప్ప (సాయి చంద్‌)కు కూడా కొడుకు అడవికి వెళ్లటం ఇష్టం ఉండదు.కానీ జీవితం ఎటు విసిరితే అటు వెళ్లాల్సిందే కదా. దాదాపు 45 రోజుల పాటు అడవితో సహజీవనం చేసిన రవీంద్ర ఓ కొత్త మార్పు మొదలవుతుంది.  ఆ అడవికి, అక్కడ జంతువులు ఆ కుర్రాడికి చాలా నేర్పింది.  ఆ తర్వాత యూపీఎస్సీలో ఐ.ఎఫ్‌.ఎస్‌కి ఎంపిక అవుతాడు. ఇంతకీ అడవిలో ఏం జరిగింది..ఓబులమ్మ (రకుల్) పాత్ర ఏమిటి, ఆత్మ‌విశ్వాసాన్ని ఎలా సంపాదించాడ‌నేది మిగ‌తా క‌థ‌.
 
స్క్రీన్ ప్లే ఎనాలసిస్ ..
 
‘కొండపొలం’నవల ఆధారంగా తెరకెక్కిన  ఈ సినిమా బేసిక్ స్టోరీ లైన్ చాలా ఎక్సైంటింగ్ గా ఉన్నదే. కానీ అందుకు తగ్గ స్క్రీన్ ప్లే సెట్ కాలేదు.  కొన్ని కథలు వాస్తవిక ధృక్పధంలో తీయాలని డిమాండ్ చేస్తాయి. అలాంటి కథలను ఎంచుకున్నప్పుడు వాటి డిమాండ్ కు కూడా తల ఒగ్గాలి. అంతేకానీ కమర్షిల్ కోసం హీరోయిన్ ట్రాక్, కామెడీ ట్రాక్, డ్రీమ్ సాంగ్స్ పెట్టకూడదు. దాంతో సినిమాని చూసే ప్రేక్షకుడుకి చాలా డిస్ట్రబెన్స్ కలుగుతుంది. అదే ఈ సినిమాకు జరిగింది. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ చాలా పాపులర్. ఆ నవల గొర్రెల కాపరుల జీవితాలను అద్బుతంగా ఆవిష్కరిస్తుంది. కొన్ని జీవిత సత్యాలను పాత్రలతో చెప్పిస్తుంది. సంఘటలతో మన మనస్సులో నింపే ప్రయత్నం చేస్తుంది. కానీ అలాంటి నవలను తెరపైకి తెచ్చినప్పుడు రెగ్యులర్ సినిమా ధోరణిలో ఇమడదు. హీరోయిన్ పాత్ర కూడా ఆ నవల ..ఓ మామూలు కుర్రాడుని అడవికి పంపి, ధీరోదాత్తుడుగా హీరోగా మారుస్తుంది. ఆ ప్రాసెస్ ని అడ్వెంచర్ గా మలిచి మన ముందు నిలబెడుతుంది. హీరో పాత్రతో జర్ని చేసినప్పుడు మిగతా విషయాలు ఏమీ గుర్తుకు రావు. కానీ తెరపైకు వచ్చినప్పుడు సినిమాటెక్ లిబర్టీస్ తీసుకోవచ్చు కానీ పొసగని కమర్షిల్ ఎలిమెంట్స్ ని బలవంతంగా చొప్పించకూడదు. రకుల్ ప్రీతి సింగ్ పాత్ర కథలోకి వచ్చి చేరినప్పుడే ఆ ఇబ్బంది మొదలైంది. సెకండాఫ్ లో అసలు కథ వదిలేసి, హీరోయిన్ తో సాంగ్స్,రొమాన్స్ ని మొదలెట్టేసారు. దాంతో ఫస్టాఫ్ లో వచ్చిన ఫీల్ మొత్తం సెకండాఫ్ మన నుంచి లాక్కెళ్లిపోయింది. నవలతో ఈ సినిమాకు పోలిక పెట్టకూడదు..ఆ మీడియం వేరే అనచ్చు కానీ ఇది నవలతో సంభందం లేని సినిమా గా చూసినా కూడా విసుగిస్తుంది.   నవలలో చూపించిన భౌగోళిక నైసర్గిక ఆవరణాన్ని పట్టుకుని తెరపై విజువలైజ్ చేయగలగలగటంతో దర్శకుడు తడబడ్డాడు.  హీరో తనకున్న భయాలను ఈ జంగిల్ జర్నీలో పోగొట్టుకోవాలనే ఆర్క్ ని ఈ సినిమా సమర్ధవంతంగా ఆవిష్కరింపలేకపోయింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్  తేలిపోయింది. మొయిన్ పులి ని కథలో విలన్ గా చూపెడదామనుకున్నప్పుడు అది చిరంజీవి మృగరాజు అవకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడా అదే రిపీట్ అయ్యింది. పులితో హీరో ఫైట్ సీన్ ఒకటి చాలా బాగా వచ్చినా మరొకటి తేలిపోయింది. మొదట్లో పిరికివాడిగా క‌నిపించిన హీరో… అడ‌వితో మ‌మేక‌మైన‌కొద్దీ  ధైర్య‌శాలిగా మారే క్ర‌మం, పులితో చేసే పోరాటం నవలకి హైలైట్‌. సినిమా సీన్స్ లో అది చూపించారు కానీ సహజంగా జరిగిన పరిణామంలా అనిపించలేదు.
 


టెక్నికల్ గా …

క్రిష్ దర్శకుడు కావటంతో సినిమాకు టెక్నికల్ హంగులు బాగానే కుదిరాయి. కెమెరా వర్క్ అయితే అప్ టుది మార్క్ ఉంది. అయితే విఎఫ్ ఎక్స్ వర్క్ వర్కవుట్ కాలేదు.. కీరవాణి సంగీతం సినిమాకు ఏమీ కలిసి రాలేదు. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా తేలిపోయింది. ఉన్నంతలో ‘ర‌య్ ర‌య్ ర‌య్యారే’ బీజీఎం బాగుంది. ఇక సినిమాకి మాట‌లు ప్రత్యేకంగా నిలిచాయి.‘అవతలి వాళ్ళ చెప్పులో కాలు పెడితే కానీ తెలియదు అందులో ఎన్ని ముళ్ళు ఉన్నాయో’,‘అడవికి చుట్టంచూపుగా వెళ్ళాలి అంతేకానీ చెట్లు నరకడం, జీవాలను చంపడం చేయకూడదు’ వంటి డైలాగులకు అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
 నటీనటుల్లో వస్తే వైష్ణవ్ తేజ ఫెరఫెక్ట్ ఆప్షన్ అనిపించారు .  ఓబులమ్మగా రకుల్ బాగానే ఉంది కానీ కథలో ఆమె పాత్ర కలవలేదు.ఫోర్సెడ్ గా అనిపిస్తాయి ఆమెతో ఉన్న సీన్స్. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కనపడేవి రెండు సీన్స్ అయినా అద్బుతం అనిపిస్తారు.ఇక అందరిలోకి సూపర్ గా చేసింది ఎవరూ అంటే సాయిచంద్. హేమ, రవిప్రకాశ్, మహేశ్ విట్ట, రచ్చ రవి, అశోక్ వర్థన్ వంటి సీజనల్ ఆర్టిస్ట్ లు ఓకే అన్నట్లు నటించారు.  దర్శకుడు క్రిష్ గెస్ట్ గా అలా వచ్చి వెళ్తారు.


నచ్చినవి
వైష్ణవ్ తేజ్ నటన
 అడవి నేపథ్యాన్ని ఓ సీరియస్ కాజ్ కు వాడటం
ఆలోచింప చేసే డైలాగులు
  అడవిలో గొర్రలపై  పెద్ద పులి దాడిచేసినప్పుడు హీరో కాపాడే సీన్  

నచ్చనవి
పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సెకండాఫ్ లో పూర్తిగా డ్రాప్ అయ్యిపోవటం
  వి.ఎఫ్.ఎక్స్ లో దమ్ము లేకపోవటం, పులి కూడా గ్రాఫిక్స్ అని తెలిసిపోవటం
 
చూడచ్చా

నవలా చిత్రాలు ఈ మధ్యన రాలేదు కదా..ఓ సారి చూద్దామనుకుంటే ఓ లుక్కేయచ్చు.

తెర వెనక..ముందు

బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్
నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి చంద్, కోట శ్రీనివాసరావు, నాజర్, అన్నపూర్ణ, హేమ, ఆంథోని, రవి ప్రకాశ్, మహేశ్ విట్టా, రచ్చ రవి తదితరులు
సినిమాటోగ్రఫి: జ్ఞానశేఖర్ వీఎస్
 మ్యూజిక్: ఎంఎం కీరవాణి
ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
రచన: సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి
నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి
రన్ టైమ్ :2గంటల, 22 నిముషాలు
రిలీజ్ డేట్: 2021-10-08