కోబ్రా మూవీ రివ్యూ

Published On: September 1, 2022   |   Posted By:

కోబ్రా మూవీ రివ్యూ

cobra.jpeg

Cobra:విక్రమ్ ‘కోబ్రా’ మూవీ రివ్యూ
Emotional Engagement Emoji (EEE):

👍

నటుడుగా విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్కక్కర్లేదు. ఈ  అద్బుతమైన నటుడు గత కొంతకాలంగా వైవిద్యం పేరుతో ఎంచుకునే కథల్లో ఒక్కటీ వర్కవుట్ కావటం లేదు. కమల్ హాసన్ వంటి హీరో తో కొలాబరేట్ చేసి చేసిన మిస్టర్ కేకే, మొన్నీ మధ్య వచ్చిన మహాన్ తో సహా సినిమాలు ఏదీ అడలేదు. ఈ నేఫధ్యంలో తాజాగా వచ్చిన చిత్రం ఇది. ఈ సినిమా ట్రైలర్, టీజర్ చూసాక సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ క్రమంలో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది. విక్రమ్ కెరీర్ కు ఏమైనా ప్లస్ అయ్యిందా లేక మూస రూట్ లో వెళ్లిపోయిందా చూద్దాం…

స్టోరీ లైన్ :

మది  (విక్రమ్) ఓ అత్యంత తెలివైన లెక్కలు మాస్టారు…ఓ హంతకుడు. అతను ఎంత పగడ్బందీగా హత్యుల చేస్తాడంటే ఎక్కడా చిన్న క్లూలు కూడా దొరకవు. అలాగని అతను చేసేవేమీ ఆషామాషీ హత్యలు కాదు. ఇంటర్నేషనల్  టాప్ లీడర్స్ ని వేసేస్తూంటాడు. అతనికా స్కిల్స్ ఉన్నాయి. అతను స్కాట్లాండ్ యువరాజు ని  కూడా చంపేసి తప్పించుకోగలడు. అతనికి అనేక గెటప్స్ వేయటం వచ్చు..అనేక పాస్ పోర్ట్స్ ఉన్నాయి. అయితే అతన్ని పట్టుకోవటానికి స్కాట్ లాండ్ ఇంట‌ర్‌పోల్ ఆఫీసర్ అస్లాం (ఇర్ఫాన్ పఠాన్) బయిలుదేరతాడు. అతనికి  క్రిమినాలిజీ స్టూటెండ్  జూడీ(మీనాక్షీ గోవింద్ రాజన్) సాయిం అందుతుంది. కోబ్రా చంపిన ఒరిస్సా ముఖ్యమంత్రి హత్యకు, స్కాట్లాండ్ యువరాజ్ హత్యకు ఉన్న సారూపత్యను పట్టుకుని ఆ కేసులో ముందుకెళ్తారు. ఆ క్రమంలో ఇండియా వచ్చి ఇక్కడ పోలీస్ ల సాయింతో ఇన్విస్టిగేషన్ మొదలెడతాడు. ఇంతకీ కోబ్రా విషయంలో ఇంటర్ పోల్ అధికారి విజయం సాధించాడా..అసలు ఎందుకు ఓ మామూలు లెక్కలు మాస్టర్..ఇంటర్నేషనల్ కిల్లర్ గా మారారు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్క్రిప్టు ఎనాలసిస్ …

ఈ సినిమా  ట్రైలర్ చూసి ఇది ఓ రేంజిలో  పరుగులు పెడుతూ.. ఇంటెన్స్ గా  సాగిపోయే థ్రిల్లర్ మూవీ అనుకుంటాం. కానీ ఇదంతా ఊరికే బిల్డప్ మాత్రమే అని సినిమా చూస్తున్నపుడే అర్థమవుతుంది. ట్రైలర్  అదిరిపోయే రేంజిలో కట్ చేయించిన దర్శకుడు.. ఆ నైపుణ్యాన్ని సినిమాలో ఫస్టాఫ్ దాకా కొంతవరకూ కొనసాగించాడు కానీ సెకండాఫ్ లో  ఎంతమాత్రం చూపించలేకపోయాడు. అవసరం లేని బిల్డప్.. గందరగోళంగా సాగే కథాకథనాలు ‘కోబ్రా’ను నీరుగార్చేశాయి. దర్శకుడు ఈ సినిమాతో ఏం చెప్పాలనుకున్నాడన్నది ‘ఎండ్’ టైటిల్స్ పడ్డాక కూడా చాలా మందికి  అర్థం కాదంటే ఎంత గందరగోళంగా సినిమాను నడిపించాడో అర్థం చేసుకోవచ్చు. సినిమా నిజంగానే ఏదో కఠినమైన లెక్కను సాల్వ్ చేస్తున్నట్లు ఉంటుంది. పోనీ ఆ లెక్కలో అంత లాజిక్ కనిపించదు. విక్రమ్ కేవలం తన గెటప్ లకే కనెక్ట్ అయ్యి ఓకే చేసాడనిపిస్తుంది. కాసేపు ఇది శంకర్ తీసిన అపరిచితుడు , కమల్ దశావతారం లను గుర్తు చేస్తుంది. అంతకు మించి కొత్తదనం మనకు ఏమీ ఇవ్వలేదు.  సరైన కథ రాసుకోకుండా.. కథనంలో బిగి లేకుండా కేవలం టేకింగ్ తో నెట్టుకొచ్చేయాలనే దర్శకుడు ప్రయత్నం పూర్తిగా ఫలించలేదు.ఈ క్రమంలో ఫస్టాఫ్ సెటప్ సీన్స్ తో ఇంటర్వెల్ దాకా కథనం పరుగెట్టినా, సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ వచ్చేసరికి కథ చతికిల పడింది. తెరపై ఏం జరుగుతోందో  అర్దం కాకపోయినా ..ఏం జరగబోతోందో అనేది మాత్రం ఎక్సపెక్ట్ చేసేయగలిగారు.  డానికి సరిపోయే పాయింట్ ఎంతమాత్రం కాదది. సెకండాఫ్ లో సస్పెన్స్ వీడే సన్నివేశం కూడా తేలిపోవడంతో  సినిమాపై ఆసక్తి దాదాపుగా చచ్చిపోతుంది.ప్లాష్ బ్యాక్ లోని నత్తనడక..అనాసక్తికర సన్నివేశాలు కూడా విసిగిస్తాయి… ఇక్కడి నుంచి ప్రేక్షకులు విక్రమ్ నుంచి హీరోయిజం.. యాక్షన్ ఎపిసోడ్లు ఆశిస్తారు. కానీ కథా వివరణలో ఇవన్నీ కొట్టుకుపోయాయి. ఉన్నంతలో క్లైమాక్స్ ..ఫైట్,.. ఛేజింగ్ సీన్లు పడటంతో  కాస్త మెరుగ్గా నడుస్తుంది.ఏదైమైనా సెకండాఫ్ కు వచ్చేసరికి  సినిమా గ్రాఫ్ పడిపోతుంది.

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్…

నటుడుగా విక్రమ్… కథల ఎంపికలో పొరబాట్లు చేస్తున్నాడు కానీ.. తనకు ఇచ్చిన పాత్ర ఏదైనా దానికి పూర్తి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాడు విక్రమ్. మరోసారి కథ విషయంలో ఆయన తప్పులో కాలేశాడని అర్దమవుతుంది. కానీ లెక్కల మాస్టరు, కోబ్రా పాత్రలో ఆయన పెర్ఫామెన్స్ అదుర్స్. విక్రమ్ లుక్.. బాడీ లాంగ్వేజ్.. ఫిజిక్ అన్నీ కూడా పాత్రకు స్మార్ట్ గా  సెట్టయ్యాయి. కానీ పాత్ర లుక్,క్యారెక్టర్ డిజైనింగ్ ల  మీద పెట్టినంత శ్రద్ధ.. కథ,స్క్రీన్ ప్లే లో లేకపోవడమే విచారకరం. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి సినిమాలో ఆమె  ఉందంటే ఉంది. కొన్ని సన్నివేశాల్లో ఆమె అభినయం బాగుందనిపిస్తుంది కానీ.. ఈ పాత్ర సినిమాకు కానీ.. ఈ పాత్ర వల్ల ఆమె కెరీర్ కు కానీ పెద్దగా ఉపయోగం ఉన్నట్లు కనపడదు.  మిగతా నటీనటులందరూ  పెర్ఫామెన్స్ ప్రత్యేకంగా చెప్పుకునేలా కాదు కానీ బాగానే చేసారు.

ఇక క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కి సినిమాలో కీలక పాత్రలో నటించగా ఆయన కూడా తనదైన శైలిలో అద్భుతంగా నటించారు.   అప్పట్లో కమల్ హాసన్ ..పది గెటప్ లలో కనపడటానికి ఓ కథ రాసుకుని దశావతారం అనే సినిమాని తెరకెక్కించారు. ఆ సినిమాలో గెటప్స్, పాటలు జనాలకు బాగానే నచ్చాయి. ఇప్పుడు విక్రమ్ కూడా తనలోని నటుడుని ఆవిష్కరిస్తూ …వెరైటి గెటప్స్  తో తన అభిమానులకు అలరించటానికి మన ముందుకు వచ్చారనిపిస్తుంది.

టెక్నికల్ గా ….

సినిమా ఎలా ఉన్నా ‘కోబ్రా3’కు అసలైన హీరో మాత్రం ఎఆర్ రెహమాన్ నే. నేపథ్య సంగీతం మామూలుగా ఇవ్వలేదు. ఫస్ట్ సీన్  నుంచి చివరి దాకా చాలా స్టైలిష్ గా.. గూస్ బంప్స్ ఇచ్చేలా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. కానీ చాలా చోట్ల రెహమాన్ ఎంత ఎలివేట్ చేయాలని చూసినా సన్నివేశాల్లో బలం లేక సినిమా తేలిపోయింది.  ఛాయాగ్రహణం కూడా చాలా స్టైలిష్ గా.. రిచ్ గా సాగింది. విజువల్స్ హాలీవుడ్ సినిమాల్ని తలపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు.  అలాగే అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్ కూడా అనుకున్నంత గొప్పగా, అద్భుతంగా ఉండదు. బాగా నిరాశ పరిచాడు . సరైన కథ రాసుకోకుండా.. కథనంలో బిగి లేకుండా కేవలం టేకింగ్ తో నెట్టుకొచ్చేయాలని చూడటమే సినిమాని దెబ్బ తీసింది.  సినిమా లో ఇంటర్వెల్, క్లైమాక్స్ అలాగే ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా కుదిరాయి.

చూడచ్చా?:

విక్రమ్ అభిమానులకు నచ్చుతుంది. మిగతా వాళ్లు కాస్తంత ఓపిక చేసుకుని చూడాలి

నటీనటులు : విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, కె.ఎస్. రవికుమార్, రోషన్ మాథ్యూ, మృణాళిని రవి, మియా జార్జ్, మీనాక్షీ గోవింద్ రాజన్, జాన్ విజయ్, ‘రోబో’ శంకర్ తదితరులు
సినిమాటోగ్రఫీ : హరీష్ కన్నన్
సంగీతం: ఏఆర్ రెహమాన్
నిర్మాత : ఎస్ఎస్ లలిత్ కుమార్
తెలుగులో విడుదల: ఎన్వీ ప్రసాద్ (ఎన్వీఆర్ సినిమా)
రచన, దర్శకత్వం : ఆర్ అజయ్ జ్ఞానముత్తు
Run time:3h 3m
విడుదల తేదీ: ఆగస్టు 31, 2022