క్రాక్‌ మూవీ రివ్యూ

Published On: January 10, 2021   |   Posted By:

క్రాక్‌ మూవీ రివ్యూ

రవితేజ కు రైట్ ట్రాక్ :‘క్రాక్‌’ రివ్యూ
 Rating:3/5

2021లో విడుదల అయ్యిన మొదటి పెద్ద చిత్రం క్రాక్ . గతంలో తనకు డాన్ శీను, బలుపు వంటి హిట్ చిత్రాలు ఇచ్చిన గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన  ఈ సినిమా పై రవితేజ చాలా ఆశలే పెట్టుకున్నాడు. అందులోనూ తన బాడీ లాంగ్వేజ్ కు బాగా సెట్ అయ్యే పోలీస్ క్యారక్టర్.  వ‌రుస‌గా ఫ్లాపుల్లో ఉన్న తనను ఒడ్డున పడేస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ట్రైలర్,టీజర్ కూడా అదే నొక్కి చెప్పింది. అన్ని మంచి శకునాలే అనుకుంటున్న సమయంలో రిలీజ్ బ్యాడ్ అయ్యింది. మార్నింగ్ షోకు రావాల్సిన సినిమా సెకండ్ షో దాకా ఫైనాన్స్ సమస్యలు సెటిల్ చేసుకుని థియోటర్ లోకి దిగలేకపోయింది. దాంతో ఫ్యాన్స్ కొంత టెన్షన్ పడ్డ మాట వాస్తవం. అయితే ఈ సినిమా మొత్తానికి వచ్చేసింది. ఎలా ఉంది?హైప్ కు తగ్గట్లే ఉందా?లేక  పాత పోలీస్ కథగానే మిగిలిపోయిందా?రవితేజకు ఈ సినిమా హిట్ ఇచ్చిందా? వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

మూతిమీద మీసమే కాదు బాడీలో రోషం ఉన్న పోలీస్ పోత‌రాజు వీర‌శంక‌ర్ (ర‌వితేజ). క్రిమినల్స్ అంటే కాటెత్తిపోయే సిఐ శంకర్ కు ఓ బలహీనత ఉంది. అదే ఎవరైనా నాకు ఫలానా బ్యాక్ గ్రౌండ్ ఉంది అని అంటే వాళ్ల సంగతి అంతే. అలాంటి శంకర్ ని టచ్ చేస్తాడు ఒంగోలులో ఉండే లోకల్ గూండా క‌ఠారి కృష్ణ (సముద్ర‌ఖ‌ని).తనే చీకటి మహా సామ్రాజ్యానికి ఓ చక్రవర్తిగా వెలుగుతున్న కఠారి కృష్ణ కు శంకర్ ని ఎలాగైనా లొంగతీసుకోవాలనుకుంటాడు. అది సాధ్యం కాకపోవటంతో చంపేసి అడ్డు తొలిగించుకోవాలనుకుంటాడు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. అంతే శంకర్ విశ్వరూపం అతను చూడాల్సి వస్తుంది. అక్కడ నుంచి ఒకరిని మరొకరు పోటా పోటాగా ఢీ కొంటారు. ఈ క్రమంలో శంకర్ ఫ్యామిలీని సైతం కఠారి కృష్ణ టార్గెట్ చేస్తాడు. శంకర్ స్టేషన్ లో పనిచేసే ఓ కానిస్టేబుల్ ని లేపేస్తాడు. అప్పుడు శంకర్ ఎలా అతన్ని మడతెట్టి మర్డర్ నేరం మీదేసి జైల్లో వేసాడు, ఆ తర్వాత ఏమైందనేది మిగతా కథ.
 
స్క్రీన్ ప్లే ఎనాలసిస్

ఇది హీరో క్యారక్టరైజేషన్ చుట్టూ అల్లిన కథ. హీరో ఏటిట్యూడ్ ని బేస్ చేసుకుని అందులోంచి పుట్టే సమస్యలు, వాటిని అతను ఎదుర్కొనే విధానం గా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. అలాగే కథగా చెప్పుకోవటానికి ఈ సినిమాలో ఏమీ లేదు. కానీ ఏదో ఉన్న విషయాన్నే అటు..ఇటూ మార్చి స్క్రీన్ ప్లే చేసి ఇంట్రస్టింగ్ మార్చటంతో కలిసొచ్చింది. జేబులో ఉండాల్సిన నోటు, గోడ‌కి ఉండాల్సిన మేకు, చెట్టుకు ఉండాల్సిన  మామిడికాయ అంటూ కథ చెప్పటం ఇందులో భాగమే. అయితే ఈ నేరేషన్ కొన్ని సార్లు సిల్లీగానూ అనిపిస్తుంది. మరికొన్ని సార్లు థియోటర్స్ లో హీరోకు ఇచ్చే ఎలివేషన్స్ తో అరిపిస్తుంది. మాస్ ప్రేక్షకుడుకి చేత విజిల్స్ వేయించటమే సినిమా లక్ష్యం అన్నట్లుగా సీన్స్ సాగాయి. అయితే అందుకోసం ప్రతీసారి హీరో ఇంట్రడక్షన్ తరహాలో సీన్స్ రావటం మాత్రం విసిగిస్తుంది. ఫస్టాప్ లో హీరో క్యారక్టర్, అదీ విలన్ వైపు నుంచి మొదలెట్టడం ఇంట్రస్టింగ్ గా అనిపించినా, అందులో ఫ్యామిలీ సీన్స్ కలిపటం మాత్రం స్పీడు బ్రేకర్స్ లా అనిపిస్తాయి. ఇంటర్వెల్ కు మాత్రం కథలోకి వచ్చి పెద్ద ఫైట్ తో బ్యాంగ్ ఇస్తాడు. ఇక సెకండాఫ్ లో విలన్..హీరో మధ్య జరిగే సీన్స్ కాస్త లాగినట్లు అనిపిస్తాయి. కానీ అక్కడే అదే యాక్షన్ సీన్స్ తో మ్యాజిక్ చేసి నిలబెట్టే ప్రయత్నం చేసాడు డైరక్టర్. ఇక ఇది ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ కాదు అనుకున్నాడేమో హీరోని తెలివైన వాడుగా చూపటం కన్నా తన కండ,గుండె బలం చూపేవాడిగా చూపటానికే డైరక్టర్ ఆసక్తి చూపాడు.

డైరక్షన్..మిగతా డిపార్టమెంట్స్

ఈ సినిమాలో డైరక్టర్ కేవలం మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే సీన్స్ చేసుకున్నాడని మొదట ఫ్రేమ్ నుంచి అర్దమవుతుంది కాబట్టి ఇంక ఎక్కువ ఆలోచించాల్సిన పనిలేకుండా ముందుకు వెళ్లిపోతాం. అలాగే కథలోకి సాగతీయకుండా స్పీడుగా వెళ్లిపోవటం కూడా ప్లస్ అయ్యింది. అయితే మాస్ సినిమాకు క్లాస్ ప్రేక్షకులుకు కూడా వస్తారు.అర్బన్ ఆడియన్స్ కూడా ఉంటారు.మల్టిఫ్లెక్స్ లోనూ విడుదల అవుతుందనే విషయం ఎందుకనో డైరక్టర్ దృష్టిలో పెట్టుకోలేదు. రొటీన్ గా కథ రాసుకుని,మాస్ ఎలిమెంట్స్ తో మాయ చేసే వదిలేసాడు.

ఇక ఈ సినిమాకు టెక్నికల్ టీమ్ డైరక్టర్ కు బాగా సాయిం చేసింది.  జి.కె.విష్ణు కెమెరా వర్క్ బాగుంది. మాస్ సినిమాకి కొత్త లుక్ ఇచ్చింది. వేట‌పాలెం ముఠాని ఇంట్రడక్షన్ సీన్స్,  బ‌స్టాండ్ ఫైట్ వంటివి అదిరిపోయాయి. త‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హీరోయిజాన్ని ఓ రేంజిలో లేపింది. పాటల్లో రెండు బాగున్నాయి.  సాయిమాధ‌వ్ బుర్రా నుంచి ఇంత మాస్ డైలాగులు అసలు ఎక్సపెక్ట్ చేయం.  గోపీచంద్ మ‌లినేని తన‌కి కమర్షియల్ ఎలిమెంట్స్ పై ఎంత ప‌ట్టుందో ఈ చిత్రంతో మ‌రోమారు నిరూపించారు.  ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి. ఎడిటింగ్ సెకండాఫ్ లాగ్ లు తగ్గిస్తే బాగుండేది. ఆర్ట్ డిపార్టమెంట్ పనితనం స్పష్టంగా హైలెట్ అయ్యింది. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ సూపర్బ్ అనిపించాయి.

నటీనటుల్లో రవితేజ ఫెరఫెక్ట్ గా తనకు టైలర్ మేడ్ పాత్ర అన్నట్లుగా చెలరేగిపోయాడు. శృతి హాసన్ లో గ్లామర్ లేదు. చెప్పుకోదగ్గ పాత్ర లేదు. విలన్ గా ఈ స్దాయిలో దున్నేస్దాడని సముద్ర ఖని . కూడా ఊహించి ఉండరు. అల వైకుంఠపురం తర్వాత డిఫరెంట్ గా చేసిన పాత్ర ఇది. జయమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ పాత్ర లో కనిపించి మెప్పించింది.  మిగతా పాత్రల్లో అలీ ,చిరాగ్ జానీ, దేవి ప్రసాద్ , మౌర్యాని ,సుధాకర్ , వంశీ చాగంటి , కత్తి మహేష్ వారి వారి పరిధిలో బాగానే చేసారు.
అంకిత మహారణా ఐటెం సాంగ్ లో అందాల ఆరబోతతో కిక్ ఇచ్చింది.

చూడచ్చా
ఖచ్చితంగా ..ఫ్యామిలీతో కలిసి వెళ్లచ్చు

తెర ముందు..వెనుక

బ్యాన‌ర్‌: స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్‌
నటీనటులు: ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌, స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, దేవీప్ర‌సాద్‌, చిర‌గ్ జాని, మౌర్య‌ని, సుధాక‌ర్ కొమాకుల‌, వంశీ చాగంటి తదితరులు.
 సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: జి.కె. విష్ణు
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
ఎడిటింగ్: న‌వీన్ నూలి
ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్ర‌కాష్‌
ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌
పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి
రన్ టైమ్ :2గం|| 34ని||
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని
స‌హ నిర్మాత‌: అమ్మిరాజు కానుమిల్లి
నిర్మాత‌: బి. మ‌ధు
విడుదల తేది: 09/01/2021