Reading Time: 2 mins

గతం మూవీ రివ్యూ

అద్బుతం కాదు: ‘గతం’ మూవీ రివ్యూ

Rating:2.5/5

గతం బాగుంటేనే భవిష్యత్ బాగుంటుంది…అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాగని గతాన్ని మార్చనూలేము. భవిష్యత్ కు భరోసా ఇవ్వనూ లేము. ఇంత తాత్వికత మీకు ఖచ్చితంగా గతం సినిమా చూసాకా వస్తుంది. ట్విస్ట్ లతో కథ నడపాలన్న దర్శకుడు తాపత్రయం సినిమాని ట్విస్ట్ ల మయం చేసేసింది. అయితే ఆ ట్విస్ట్ లు ఎంతవరకూ అలరించాయి. గతం ప్రేక్షకుడుకి అందమైన గతంలా మిగలనుందా..అసలు గతం వెనుక ఉన్న కథేంటి…ఈ టైటిల్ పెట్టడానికి గల కారణం ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

రిషి (రాకేష్) కు యాక్సిడెంట్ నుంచి కోలుకున్నాక మెమరీలాస్ వచ్చిందని అర్దమవుతుంది. ఆ మెమరీ లాస్ ఎంతలా అంటే తనతో పాటు ఉన్న గర్ల్ ప్రెండ్ అదితి (పూజ కూరపాటి)ని కూడా గుర్తు పట్టలేనంత. అయితే ఆమెను నమ్మి తన గతం తవ్వటం మొదలెడతాడు. తన తల్లి ఎప్పుడో చనిపోయిందని తెలుసుకుని, మిగిలిన తన తండ్రిని కలవటానికి గర్ల్ ప్రెండ్ తో కలిసి బయిలుదేరతాడు. అయితే ఆ జర్నీలో కారు బ్రేక్ డౌన్ అవ్వుతుంది. అప్పుడు అతనికి అటుగా వచ్చిన ఓ వ్యక్తి (భార్గవ)లిప్ట్ ఇస్తాడు. తన కాటేజీకి తీసుకెళ్లి మెకానిక్ వచ్చేదాకా రెస్ట్ తీసుకోమంటాడు. అలాగే అని అక్కడే ఉన్న రిషికు రకరకాల అనుభవాలు ఎదురౌతాయి. తమకు లిఫ్ట్,షెల్టర్ ఇచ్చిన వ్యక్తిని తప్పించుకోవాలనుకుంటారు. అయితే ఈ లోగా తన గర్ల్ ప్రెండ్ అని అంతదాకా భావిస్తూ వచ్చిన ఆమె మీద కూడా డౌట్ వస్తుంది. అయితే ఈ ట్విస్ట్ లు అన్ని అతని జీవితంలో చోటు చేసుకోవటానికి కారణం అతని గతమే అని తెలుస్తుంది. అసలు గతంలో ఏం జరిగింది. కారు బ్రేక్ డౌన్ అయితే లిప్ట్ ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరు..ఇంతకీ గర్ల్ ప్రెండ్ అదితి ఎవరు ..ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
స్క్రీన్ ప్లే విశ్లేషణ

ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లేనే ప్రధానం. అది ఎంత బాగా రాసుకుంటే అంతబాగా వర్కవుట్ అవుతుంది. అయితే దర్శకుడు మాత్రం ఎక్కువగా ట్విస్ట్ లు రాసుకున్నాడు. ఫస్టాఫ్ లో వాటిని బాగానే పేర్చుకుంటూ వెళ్లాడు. అయితే సెకండాప్ కు వచ్చేటప్పుటికి వరసతప్పింది. ఇంక క్లైమాక్స్ కు వెళ్లేటప్పటికి మరీ ప్రెడిక్టుబుల్ గా మారింది. కథలో ట్విస్ట్ ఇచ్చినంతబాగా వాటిని రివీల్ చేయటం జరగలేదు. హడావిడిగా అయ్యిపోయినట్లైంది. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది డిష్ అన్నట్లు…టూ మెనీ ట్విస్ట్ స్పాయిల్ ది స్క్రిప్టు అన్న చందాన మారింది.  వీటితో పాటుగా కథలో అంతర్గతంగా సాగే ఇంటెన్సిటీ, మరికొన్ని ఆసక్తికర అంశాలు బాగానే డిజైన్ చేసుకున్నారు. దాదాపు అతి తక్కువ పాత్రలతోనే మంచి అవుట్ ఫుట్ వచ్చేలా చూసుకున్నాడు. ఇక క్లైమాక్స్ లోనే హై లేకుండా పోయింది. సెకండాఫ్ స్లో గా నడవటం కూడా విసిగించింది. ఏదైమైనా థ్రిల్లర్ సినిమాలకు ఉండాల్సిన రేసీ స్పీడు ఈ సినిమాలో కొరవడింది. అయితే సినిమా చివరిదాకా కూర్చబెట్టగలగటం మాత్రం డైరక్టర్ చేయగలిగాడు.

డైరక్టర్, మిగతా విభాగాలు..

దర్శకుడుగా కిరణ్ కథను.. ఇదే తరహా లో వచ్చిన చాలా హాలీవుడ్ సినిమాల నుంచి ప్రేరణ పొంది రాసుకున్నట్లు అర్దమవుతుంది. హాలీవుడ్ సినిమాలు చూడని వారికి ఆ సీన్స్ అన్ని ప్రెష్ గా అనిపించవచ్చు. అక్కడదాకా సక్సెస్ అయ్యాడు.  అయితే కథ,కథనం రాసుకోగలిగాడు కానీ దాని ఎగ్జిక్యూషన్ మాత్రం ఆ స్దాయిలో లేదు. ఆ అనుభవలేమి దర్శకత్వంలో కనపడుతుంది. ట్విస్ట్ లు వర్కవుట్ అయ్యనట్లుగా కథ వర్కవుట్ కాలేదు. ముఖ్యంగా ఇంట్రవెల్ ట్విస్ట్ బాగుంది. డైలాగులు సోసోగా ఉన్నాయి. ఇక నటీనటుల్లో ప్రధానపాత్రధారులిద్దరూ బాగానే చేసారు. మిగతావాళ్లంతా సోసాగా చేసారు. శ్రీచరణ్ పాకాల ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ ని ఎలివేట్ చేయటంలో సక్సెస్ అయ్యింది. కెమెరా వర్క్ సూపర్బ్ గా ఉంది. ఎడిటింగ్ ఇంకా బాగా చేయచ్చు. ముక్యంగా సెకండాఫ్ ని వదిలేసారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
 
చూడచ్చా

థ్రిల్లర్ అభిమానులు..ఫస్టాఫ్ వరకూ నిరభ్యంతరంగా చూడచ్చు.

ఎవరెవరు..

నటీనటులు : భార్గవ పోలుదాసు, రాకేశ్ గలేభే, పూజిత కురపర్తి, హర్ష వర్ధన్ ప్రతాప్, లక్ష్మీ భరద్వాజ్ తదితరులు.
మ్యూజిక్ : శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి
దర్శకత్వం : కిరణ్ కొండమడుగుల
నిర్మాత : ఎస్ ఒరిజినల్స్, ఆఫ్ బీట్ ఫిల్మ్స్
ఓటీటి:అమేజాన్ ప్రైమ్
రన్ టైమ్: 1గం|| 41ని||
రిలీజ్ డేట్ :06-11-2020