గుడ్ లక్ సఖి మూవీ రివ్యూ

Published On: January 28, 2022   |   Posted By:

గుడ్ లక్ సఖి మూవీ రివ్యూ

కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ రివ్యూ..

Emotional Engagement Emoji (EEE)

👎

కీర్తి సురేష్ మహానటి తో వచ్చిన కీర్తిని నిలుపుకోలేకపోయింది.  వరుసగా  పెంగ్విన్,  మిస్ ఇండియా అంటూ కొన్ని ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. ఓటీటిలలో రిలీజైన అవన్నీ  చీదేసాయి. ఆ తర్వాత నితిన్ కి జంటగా నటించిన రంగ్ దే సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది  కానీ అదీ ఆడలేదు. ఈలోగా  అంతర్జాతీయ స్థాయిలో అవార్డు పొందిన డైరెక్టర్ డైరెక్టర్ నగేష్ తో ప్రాజెక్టు సైన్ చేసింది. దీంతో ఈ సినిమాపై ముందు నుంచే అంచనాలు నెలకొన్నాయి. పల్లెలో నివసించే యువతులు, వారు ఎదుర్కొనే సమస్యలు ఇలాంటి విషయాలు అన్ని సినిమాలో బాగా చూపిస్తూ ప్రోమో కట్ చేస్తే క్రేజ్ వచ్చింది. లెక్కకు మించిన వాయిదాలతో ఈ రోజు రిలీజైంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది?

స్టోరీలైన్

అనగనగా ఓ రిటైర్డ్ కర్నల్ (జగపతిబాబు). ఆయన తన ఊరుకు వచ్చి అక్కడ వాళ్ళ లైఫ్ లో మార్పులు తేవాలనుకుంటాడు. అందుకు తనకు తెలిసిన విద్యైన షూటింగ్ తో తన ఊరు నుంచి షూటర్స్ తయారు చేయాలనుకుంటాడు. ఇక అదే  ఊళ్లో ఓ తండా అమ్మాయి  సఖి (కీర్తి సురేష్). దురదృష్టం ఆమె భుజాల మీద ఉంటుంది. ఆమె ఓ అల్లరి పిల్ల. అలాంటి ఆమెలో ఓ నిగూఢమైన టాలెంట్ ఉంటుంది. అది గోళీలు గురి చూసి కొట్టడం. ఈ గురి చూసి కొట్టడం షూటర్ కూడా కావాలనే విషయం తెలిసిన వాడు గోలి రాజు (ఆది పినిశెట్టి) . అతను ఆమె చిన్న నాటి ప్రెండ్. దాంతో సఖి ని తీసుకుని ఆ కర్నల్ కు పరిచయం చేసి, ట్రైనింగ్ ఇప్పిస్తాడు.  ఈ ట్రైనింగ్ లో ఆమె రాటుదేలి షార్ప్ షూటర్ అయ్యిందా..తన బ్యాడ్ లక్ సఖి నే పేరుని పోగొట్టుకుందా, మధ్యలో ఆమెకు అడ్డం పడే సూరి (రాహుల్ రామకృష్ణ)  ఎవరు..వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే విశ్లేషణ

గొప్ప స్పోర్ట్స్ డ్రామా సినిమాల సీక్రెట్ ఒకటే..ప్రధాన పాత్ర ఏం సాధించాలనే విషయం కన్నా…ఎందుకు, ఎలా సాధించబోతున్నారనేది ముఖ్యం. ఆ సాధించే ప్రాసెస్ లో వచ్చే సమస్యలే కీలకం. అవి ఎంత కొత్తగా ఉంటే ఆ సినిమాలు అంత జనరంజకంగా మారతాయి. స్పోర్ట్ డ్రామాలు అన్ని కొన్ని అడ్డంకులు…అవి క్రియేట్ చేసే సస్పెన్స్ ని బేస్ చేసుకుంటాయి. అడ్డంకులు ఎంత ఇంట్రస్టింగ్ గా ఉంటే కథ,కథనం అంత ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమాలో అదే మిస్సైంది. ఆమెకు ఇంటర్నల్ కాంప్లిక్ట్ లేదు అవుట్ సైడ్ కాంప్లిక్ట్ లేదు. కథ …స్క్రిప్టు కు అనుగుణంగా వెళ్తూటుంది. ఎక్కడా తర్వాత ఎలా..ఏం జరగబోతోందనే ఆసక్తి క్రియేట్ కాదు. ఈ స్పోర్ట్ డ్రామా కథలతో ఇబ్బంది కరమైన అంశం ఏమిటీ అంటే ఆడియన్స్ కు తెలుసు… సినిమా చివరకు గెలుస్తారు..సాధిస్తారు..వాళ్లలో మార్పు వస్తుందని. దాంతో తెలిసిన కథే అన్నట్లు చూస్తారు. అభేధ్యమైన unbeatable పాత్రలతో ఈ సమస్యలను గెలవచ్చు.

ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మనం ఎన్నో సార్లు విన్నదే  గమ్యం కాదు ముఖ్యం…ప్రయాణమే ప్రధానమే అని. అదే స్పోర్ట్ డ్రామా సినిమాలకు పూర్తిగా వర్తిస్తుంది. రాకీ వంటి సినిమాల సక్సెస్ సీక్రెట్ అదే.  ఆ సూత్రాన్ని  ఇక్కడ అప్లై చేయటం మర్చిపోయారు. చాలా సాదాగా కథ,కథనం నడిపేసారు. ఓ అండర్ డాగ్ ..తనను తాను ప్రూవ్ చేసుకోవటానికి పడే స్ట్రగుల్ గా కథను చూపెడదామనే దర్శకుడు ప్రయత్నం. కానీ అండర్ డాగ్ గా కీర్తి సురేష్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అలాగే స్పోర్ట్ సినిమాల్లో అండర్ కరెంట్ గా మోరల్ ఉంటుంది. కానీ ఇక్కడ లెస్సన్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ అనేది కేవలం బ్యాక్ డ్రాప్ గా చేసుకుని,కథకు  ఓ ప్రత్యేకమైన కాన్వాస్.క్యారక్టర్స్ ప్రెజెంట్  చేయగలిగితే ఈ సినిమా సక్సెస్ అయ్యేది.

దర్శకత్వం…మిగతా విభాగాలు

మొహమాటం లేకుండా మరో మాట లేకుండా ఇది దర్శకుడు నగేష్ కుకునూర్ తీసిన సినిమాల్లో అట్టడగు సినిమా అనేయచ్చు. స్పోర్ట్ డ్రామాని ఎంగేజింగ్ గా తీయలేకపోయారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ పాటలు ప్రక్కన పెడితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ అప్ టు ది మార్క్ లేదు కానీ ఓకే. ఎడిటింగ్ మాత్రం శ్రీకర్ ప్రసాద్ …ఎక్కడా మాట రానియని స్దాయిలో చేసారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ బాగుంది. డైలాగులు సోసోగా ఉన్నాయి. డబ్బింగ్ కుదరలేదు.

ఆర్టిస్ట్ లు ఫెరఫార్మెన్స్ కు వస్తే..

కీర్తి సురేష్ నటన ..పల్లె అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని ఫిక్సై చేసినట్లు ఉంది. తప్ప సహజత్వం లేదు.  ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ అలా చేసుకుంటూ పోయారు. జగపతిబాబుని పాజిటివ్ పాత్రల్లో చూడటం కష్టమే. అలాగే రాహుల్ రామకృష్ణ ఫన్ చేయకపోతే చూడలేం.

నచ్చినవి:
కీర్తి సురేష్ స్క్రీన్  ఫెరఫార్మెన్స్
రన్ టైమ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నచ్చనవి:

ఎమోషన్స్ లేని స్క్రిప్టు
ఎక్కడా స్ట్రాంగ్ కాంప్లిక్ట్ లేకపోవటం
రొటీన్ గా సాగే స్క్రీన్ ప్లే

చూడచ్చా?

వెంటనే థియోటర్ కు వెళ్లి చూడాలనిపించేటంత సినిమా అయితే కాదు

ఎవరెవరు..

నటీనటులు: కీర్తీ సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ తదితరులు
సినిమాటోగ్రఫీ: చిరంతాన్ దాస్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ సంస్థ‌: వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ సహ నిర్మాత: శ్రావ్యా వర్మ సమర్పణ: ‘దిల్’ రాజు (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
నిర్మాత: సుధీర్ చంద్ర పదిరి
దర్శకత్వం: నగేష్ కుకునూర్
రన్ టైమ్: 2h 10m
విడుదల తేదీ: జనవరి 28, 2022