ఓటీటి కామెడీ బ్రో ( ‘గులాబో సితాబో’ రివ్యూ)
Rating:2.5/5
కామెడీ సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అందులోనూ స్టార్స్ చేస్తే ఇంక చెప్పేదేముంది…నవ్వేసుకోవటానికి నించున్న పళంగా రెడీ అయ్యిపోతాం. అందుకేనేమో అమితాబ్, ఆయుష్మాన్ ఖురారా కాంబో కామెడీ అనగానే ఓటీటిలో మంచి క్రేజ్ వచ్చేసింది. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసే పరిస్దితి ఏర్పడింది. ఈ క్రేజ్ ని డైరక్టర్ క్యాష్ చేసుకోగలిగాడా…ఓటీటిలో ఇది సూపర్ హిట్ అనిపించుకుందా..అసలు ఈ చిత్రం కథేంటి..అమితాబ్ పాత్రేంటి, ఆయుష్మాన్ తో కలిసి చేసే ఫన్ ఏంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
లక్నోలో ఓ పెద్ద భవంతి. దాని పేరు ఫాతిమా మహల్. దాని యజమాని రాలు బేగమ్(ఫరూక్ జఫర్) . ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్న మీర్జా షేక్ (అమితాబ్ బచ్చన్) అందులో అద్దెకు ఉంటున్న వాళ్ల దగ్గర అద్దెలు వసూలు చేస్తూండటమే ఏకైక పనిగా పెట్టుకుంటాడు. అయితే ఆ ప్యాలెస్ లో ఉండే బాన్‌కీ(ఆయుష్మాన్ ఖురానా) ఆయనకు కొరకరాని కొయ్యలా తయారవుతాడు. అద్దె కట్టమంటే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందామనుకుంటాడు. దాంతో లీగల్ గా అతనిపై కోర్టుకి వెళ్లి ఖాళీ చేయిద్దామనుకుంటాడు. ఈ లోగా అనుకోని అవాంతరం వచ్చి పడుతుంది. ఆ భవంతిపై పురావస్తు శాఖ కన్ను పడుతుంది.
ఆర్కియాలజీ డిపార్టమెంట్ ఆఫీసర్ గ్యానేష్ శుక్లా(విజయ్ రాజ్) ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని , ఇది పురాతన కట్టడం క్రింద వస్తుందని గవర్నమెంట్ కు ప్రతిపాదన పెడతాడు. దాంతో ఇక ఈ భవంతిని అమ్మేయటం బెస్ట్ అనుకుని లాయర్ క్రిస్టోఫర్(బ్రిజేంద్ర కాలా) సాయింతో అమ్మకానికి పెడతాడు. మీర్జాని అయితే మ్యానేజ్ చేయచ్చు కనీ ఇలా వేరే వాళ్లకు అమ్మేస్తే తమ పరిస్దితి ఏమిటనేది బాన్ కీ ఆందోళన. దాంతో మిగతా అద్దెకున్న వాళ్లతో కలిసి …అమ్మకుండా అడ్డుపడుతూంటాడు. అయితే అసలు అమ్మాలంటే ముందు దాని యజమానురాలు..మీర్జా భార్య బేగమ్ ఒప్పుకోవాలి కదా…ఆమె ఏమంటుంది..చివరకు ఈ కథ ఎటు మలుపు తీసుకుంటుంది అనేది మిగతా కథ.
స్క్రీన్ ప్లే
ఈ సినిమా ఎక్సపెక్టేషన్స్ ని రీచ్ కాలేదనే చెప్పాలి. ఫస్టాఫ్ ఫన్ తో బాగానే నడిచినా..సెకండాఫ్ కు వచ్చేసరికి చల్లబడిపోయింది. దానికి తోడు చాలా స్లోగా కథ నడుస్తూంటుంది. పెద్దగా సంఘటనలు జరగవు. సినిమా అంతా ఆ ప్యాలస్ చుట్టూ తిరగుతూంటడంతో మనకు ఆ ప్యాలెస్ లో ఓ కుర్చీ వేసుకుని బయిటకు కదలకుండా లాక్ డౌన్ లో ఉన్నట్లు ఫీలింగ్ వస్తుంది. ఒకే అంశానికి సినిమాని పరిమితం చేయాలనే ఆలోచనతో దర్శకుడు సీన్స్ రిపీట్ అవుతున్న విషయం మర్చిపోయారు. దాంతో అమితాబ్ , ఆయుష్మాన్ ఖురానా ఎంత తమ నటనతో లాక్కెళ్లదామని ప్రయత్నించినా అది అక్కడే ఉంటానని మొరాయించింది కథ.
స్క్రీన్ ప్లే పై మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. దాంతో మీర్జా క్యారక్టర్ మేకప్ , క్యారక్టరైజేషన్ బాగున్నా..ఎమోషనల్ గా ఏ దశలోనూ అవి కనెక్ట్ కాలేదు. కథ ప్రారంభమైన స్టోరీ ప్లాట్ వదిలేసి..లాయర్, ఆఫీసర్ చుట్టూనే సీన్స్ తిరగటంతో బోర్ కొట్టేసింది. రొటీన్ అనుకున్నా మీర్జా పాత్ర నిస్సహాయుడిగా మారినప్పుడు అద్దెకుండేవాళ్ళంతా ఏకమై అతనికి అండగా నిలబడి ఉన్నా కథనం బాగుండేదేమో అనిపించేది. అలాగే బాంకే పెద్ద చెల్లెలు ఉద్యోగం కోసం గ్యానేష్ శుక్లాకు వల వేయడం వంటి సీన్స్ బాగోలేవు. ఏదైమైనా మరీ ఇంత చిన్న కథ తీసుకున్నప్పుడు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చూసుకుంటే ఖచ్చితంగా గులాబో సితాబో ఇంకో స్థాయిలో ఉండేది.
టెక్నికల్ గా..
చిత్రం టెక్నికల్ టీం వరకు బాగానే కష్టపడింది. శంతను మొయిత్రా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అయితే అభిషేక్-అనుజ్ లు ఇచ్చిన పాటలు తేలిపోయాయి. అవిక్ ముఖోపాధ్యాయ కెమెరా వర్క్ మాత్రం బాగుంది. ఫాతిమా ప్యాలెస్ ని తన కెమెరా తో ఓ పాత్రగా మార్చి, ఆ భవంతిలో తిరుగుతున్నట్టే అక్కడి వాతావరణాన్ని ఫీలయ్యేలా కలర్ స్కీం ని సెట్ చేసారు. ఆర్ట్ డైరెక్టర్ వర్క్ అదరకొట్టారు. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేయాల్సింది. రోనీ లాహిరి-శీల్ కుమార్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
చూడచ్చా
పగలబడి నవ్వేసుకుందామని కాకుండా అమితాబ్ వెరైటి గెటప్ ని, ఆయుష్మాన్ ఖురానా కొత్త చిత్రం చూస్తున్నాం అని ఫిక్సైతే చూడచ్చు.
తెర ముందు..వెనక
నటీనటులు: అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా, విజయ్ రాజ్, బ్రిజేంద్ర కాలా, ఫరూఖ్జఫర్, సృష్టి శ్రీవాస్తవ తదితరులు
సంగీతం: శంతన్, అభిషేక్ అరోరా, అంజూ గార్గ్
సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ
ఎడిటింగ్: చంద్రశేఖర్ ప్రజాపతి
రచన: జుహి చతుర్వేది
నిర్మాత: రోని లహ్రి, షీల్ కుమార్
దర్శకత్వం: సూజిత్ సర్కార్
విడుదల: అమెజాన్ ప్రైమ్