Reading Time: 2 mins

గువ్వా – గోరింక‌ మూవీ రివ్యూ

చాల్లే ఇక : ‘గువ్వా – గోరింక‌’ రివ్యూ

రేటింగ్ : 1/5

లాక్ డౌన్ టైంలో బిజిగా సినిమాలు,వెబ్ సీరిస్ లు చేస్తూ, రిలీజ్ లకు నోచుకుంటున్న  తెలుగు హీరో ఎవరూ అంటే సత్యదేవ్ అనే చెప్పాలి. అయితే ఆ సత్యదేవ్ ప్రారంభం రోజుల్లో అంటే ఇంకా క్లిక్ కాని 2017లో  ఓ సినిమా చేసాడు. ఆ సినిమా అప్పటినుంచి రిలీజ్ కోసం చకోరపక్షిలా ఎదురుచూస్తోంది. ఇన్నాళ్లకు ఓటీటిల పుణ్యమా అని రిలీజ్ అయ్యింది. ఆ సినిమానే  ‘గువ్వా – గోరింక‌’. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర పనిచేసిన బమ్మిడి మోహన్…ఈ సినిమాతో డైరక్టర్ గా లాంచ్ అయ్యారు. ఈ సినిమా కథేంటి..కొత్త దర్శకుడు తన మార్క్ ని చూపెట్టారా…వరస హిట్స్ తో దూసుకుపోతున్న సత్యదేవ్ కెరీర్ కు ఈ సినిమా ఏ మేరకు ఉపయోగపడుతుంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

మెకానిక‌ల్ ఇంజ‌నీర్ స‌దానంద్ (స‌త్య‌దేవ్‌)కి సౌండ్ అంటే ఎలర్జీ. అతని జీవితాశయం సౌండే చేయని వెహికల్ కనిపెట్టాలని..అందుకోసం నిరంతరం నిశ్శబ్దంగా పనిచేస్తూంటాడు. మరో ప్రక్క  శిరీష(ప్రియా లాల్)కి సంగీతం అంటే ప్రాణం…పిచ్చి.వగైరే… వయోలిన్ లో విద్వాంసురాలవ్వాలని ఆమె జీవితాశయం.  తన మాస్టర్స్ డిగ్రీ  పూర్తి చేసాక తండ్రి చెప్పిన బావనే పెళ్లి చేసుకుంటా అని హైదరాబాద్ వస్తుంది. విధి వేర్వేరు ధృవాలులాగ ఉన్న వీళ్లిద్దరితో ఓ ఆట ఆడుకోవాలనుకుంది..కలపాలనుకుంది. అందుకే సదానంద్ ఉన్న అపార్టమెంట్ లో అతని పక్క ఫ్లాట్ లోనే ఆమె దిగుతుంది. ఒకరిని ఒకరు ఎదురుబదురుగా కలుసుకోక పోయినా  టామ్ అండ్ జెర్రీ లా కొట్టేసుకుంటారు. ఆ తర్వాత షరా మామూలుగా వీళ్ళిద్దరూ  ఫ్రెండ్స్ గా మారడం, ప్రేమలో పడటం జరుగుతుంది. వీళ్లిద్దరు ఒకటి అవుతారనగా విధి వీరి మధ్య మరో చిచ్చు పెడుతుంది. అదేంటి…ఈ ప్రేమ జంట ఎలా ఒకటి అవుతారు..చివరికి వీరిద్దరు తమ గోల్స్ ఎలా రీచ్ అయ్యారు అనేది బుల్లి తెరపై చూడాల్సిన మిగతా కథ.

స్క్ర్రీన్ ప్లే ఎనాలసిస్..

రొమాంటిక్ కామెడీల్లో విభిన్న అభిప్రాయాలు, ఆలోచనలతో ఉన్న ఇద్దరు విధి వశాత్తు కలవటం..ఆ తర్వాత విడిపోవటం..చివరకు ఒకరినొకరు అర్దం చేసుకుని ప్రేమతో ఆలింగనం చేసుకోవటం అనే స్క్రీన్ ప్లే తో నడుస్తుంటుంది. ఈ సినిమా కూడా అందుకు మినహాయింపు కాదు. అయితే ఈ స్క్రీన్ ప్లేలో ఒక పెద్ద టాస్క్ ఉంటుంది. హీరో,హీరోయిన్స్ ఇద్దరూ చివరకు కలుస్తారనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే అదెలా అనేది సినిమా చివరి వరకూ ఆసక్తిగా నడిపించాలి. ఈ కథలో … హీరో,హీరోయిన్స్ ఇద్దరూ  ప‌క్క ప‌క్క ఫ్లాటుల్లో ఉంటారు. ఒక‌రికి సౌండే ప్ర‌పంచం, ఇంకొక‌రికి అదంటేనే చిరాకు,విసుగు‌. అలాంటి ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌ల‌తో పరిచ‌యం మొద‌లై, అది స్నేహంగా మారి, ప్రేమ‌గా పరిమళిస్తుంది. ప‌క్క ప‌క్క గ‌దుల్లో ఉండి చూడ‌కుండానే ప్రేమించుకోవటం ఈ కథలో పెద్ద మలుపు. మ‌రి ఇద్ద‌రూ చివ‌రికి ఎలా క‌లుసుకున్నారు? ఎండ్ సస్పెన్స్. ఇవన్నీ డైరక్టర్ ఫ్రేమ్ ల వారిగీ ఈ ప్రేమ కథలో పేర్చుకున్నాడు. అయితే అందుకు తగ్గ సీన్స్ ఆసక్తి కరంగా వేసుకోలేకపోయారు. ఎంతసేపు ప్రక్క ప్రక్క గదుల్లో ఉన్నవాళ్లిద్దరు ఎప్పుడు కలుస్తారు అనే విషయమై నడుపుదామనుకున్నారు. కానీ అది షార్ట్ ఫిలిం కంటెంట్ లా కదలు,మెదులు లేకుండా అక్కడే ఉండిపోయింది. దానికి తోడు బడ్జెట్ ప్లాబ్లమో మరేమో కానీ లిమెటెడ్ లొకేషన్స్. దాంతో విసుగు వస్తూంటుంది. సబ్ ప్లాట్ లు కూడా ఆసక్తి కరంగా లేవు. పైగా తెలిసిన కథే చూస్తున్న ఫీలింగ్..కథని సాగతీయకుండా స్క్రిప్టు రాసుకుని ఉంటే మరింత ఇంట్రస్టింగ్ గా ఉండేది. అన్నిటికన్నా ప్రధానం…హీరో పాత్రకు సౌండ్ ఎలర్జీ అన్నారు కానీ అందుకు తగ్గ క్యారక్టరైజేషన్స్ ..రీజన్స్ తో బిల్డ్ చేసుకోలేదు. అవన్నీ స్క్రీన్ ప్లేలో బిగిని సడలించేసాయి.

దర్శకత్వం..మిగతా విభాగాలు

ఈ సినిమా స్క్రిప్టు విషయంలోనే ఫస్ట్ ఫెయిల్యూర్. ఇక డైరక్షన్ కూడా అంతంత మాత్రమే. కథలో ఉన్న ఎమోషన్ ని తెరపైకి తీసుకురాలేకపోయారు. కథలో కొత్త మలుపులు లేవు..ఇంట్రస్టింగ్ గానూ చెప్పలేకపోయారు. ఇక దర్శకుడు సోదరుడు బమ్మిడి జగదీశ్వరరావు రాసిన  డైలాగ్స్ చాలా సింపుల్ గా బాగున్నాయనిపిస్తాయి , కానీ ఎమోషనల్ సీన్స్ లో తేలిపోయినట్లు అనిపించాయి. ఇక టెక్నికల్ గా హైలెట్ ఆర్ట్ డైరక్టర్ వర్క్ .. అలాగే మైల్స్ రంగస్వామి సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.  ఆ తర్వాత వరసలో సురేష్ బొబ్బిలి మ్యూజిక్.  ప్రణవ్ మిస్త్రీ ఎడిటింగ్ మాత్రం బాగా లాగ్ లు వదిలేసినట్లు ఉంది. చిన్న బడ్జెట్ అయినా ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి. నటీనటుల్లో సత్యదేవ్ ఎప్పటిలాగే బాగా చేసారు.  కాకపోతే షూటింగ్ ని అవకాసం దొరికినప్పుడల్లా చేయటం వల్లనేమో …సత్యదేవ్ లుక్ లో చాలా సార్లు మార్పులు వచ్చేసాయి. హీరోయిన్ మాత్రం సినిమాకు పెద్ద మైనస్.

చూడచ్చా…

సత్యదేవ్ వీరాభిమాని అయితే ఓ లుక్కేయచ్చు..

తెర వెనక..ముందు

నటీనటులు: సత్యదేవ్, ప్రియా లాల్, ప్రియదర్శి, చైతన్య, ప్రభాకర్, ఫిష్ వెంకట్ తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి,
కెమెరా: మైలేసం రంగస్వామి,
ఆర్ట్: సాంబశివరావు,
ఎడిటింగ్: ప్రణవ్ మిస్త్రి,
మాటలు: జగదీశ్వరరావు బమ్మిడి.
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ బమ్మిడి.
నిర్మాతలు: దాము రెడ్డి కొసనం, దళం జీవన్ రెడ్డి,
రన్ టైమ్: 1 గంట 57 నిముషాలు
విడుదల తేదీ: డిసెంబర్ 17, 2020
ఓటీటి: అమెజాన్ ప్రైమ్