చంద్రముఖి 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
చంద్రముఖి 2 చాలా గొప్ప విజయాన్ని సాధిస్తుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాఘవ లారెన్స్
నా కెరీర్‌లో చంద్రముఖి 2 వంటి గొప్ప సినిమా చేయలేదు – కంగనా రనౌత్
స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ చంద్రముఖి 2. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో అలరించున్నారు. సీనియర్ డైరెక్టర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తోన్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా చంద్రముఖి 2 సినిమాను సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.
హీరో రాఘవ లారెన్స్ పలు ఆసక్తికరమై విషయాల గురించి ప్రస్తావించారు. తన ప్రతీ సినిమా కార్యక్రమంలో డాన్స్ వేసే వికలాంగుల గురించి ఆయన ముందుగా మాట్లాడుతూ నా ప్రతీ సినిమా ఈవెంట్‌లో నా సోదరులో కార్యక్రమం చేయిస్తుంటాను. అందుకు కారణం వారికి డాన్స్ తప్ప మరేదీ రాదు. వాళ్లు ఇంత మాత్రం కష్టపడకపోతే వాళ్ల కుటుంబం పస్తులుండాల్సిందే. వాళ్లు నా సినిమా స్టేజ్‌పై పెర్ఫామెన్స్ చేసినప్పుడు మరేవరైనా చూసి వాళ్లకు మరేదైనా ఫంక్షన్స్‌లో అవకాశం ఇవ్వకపోతారా? అనేదే నా అభిప్రాయం అన్నారు. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ నిర్వహిస్తోన్న చారిటీ సంస్థకు నిర్మాత సుభాస్కరన్ కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. దీనిపై లారెన్స్ స్పందిస్తూ సుభాస్కరన్‌గారు చూడటానికి సీరియస్‌గా కనిపిస్తారు కానీ చిన్నపిల్లాడి మనస్తత్వం ఆయనది. ప్రతీ ఒక్కరినీ ప్రేమతో పలకరిస్తారు.ఆయన్ని కలిసినప్పుడు ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఎంతో పెద్ద మనసుతో ఆయన నా చారిటీకి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఆయన ఇచ్చిన డబ్బుతో నేను ఓ స్థలం కొని ఓ బిల్డింగ్ కడతాను. అందులో నా స్టూడెంట్స్ అందరూ డాన్స్ ప్రాక్టీస్ చేసుకునేలా ఉంటుంది. ఇకపై ఎవరూ నా చారిటీకి డబ్బులు ఇవ్వకండి. ఎందుకంటే నా చారిటీకి నేను ఉన్నాను. అందులోని సభ్యులను నేను చూసుకుంటాను. నిజంగానే మీరు సాయం చేయాలనుకుంటే ఇంకా చాలా చారిటీ సంస్థలున్నాయి. వాటికి అండగా నిలబడండి అన్నారు.
చంద్రముఖి సినిమా గురించి లారెన్స్ మాట్లాడుతూ పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసే సుభాస్కరన్‌గారు నాతో సినిమా చేస్తారా? అని అనుకున్నాను. కానీ చంద్రముఖి 2 వంటి ఓ గొప్ప సినిమాను లార్జర్ దేన్ లైఫ్ మూవీలా నిర్మించారు. ఆయన బ్యానర్‌లో సినిమా చేయటం ఎంతో గర్వంగా ఉంది. ఇక మా డైరెక్టర్ వాసుగారి గురించి చెప్పాలంటే ఆయనకు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. నేను చిన్న సైడ్ డాన్సర్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన డైరెక్టర్‌గా ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. చంద్రముఖి 2ను కూడా ఎంతో గొప్పగా తెరకెక్కించారు. ఈ సినిమా సాధించే విజయం ఆయనకే దక్కుతుంది. కంగనా రనౌత్‌గారు ఈ సినిమాలో నటిస్తారని తెలియగానే ఆశ్చర్యపోయాను. ఆమె చాలా బోల్డ్ పర్సన్. ఆమె ఎలా ఉంటారోనని టెన్షన్ పడ్డాను. ఆమె సెట్స్‌లోకి గన్‌మెన్స్‌తో సహా వచ్చింది. అప్పుడు నాలో ఇంకా భయం పెరిగిపోయింది. తర్వాత నా రిక్వెస్ట్ మేరకు ఆమె గన్ మెన్స్‌ను సెట్ బయటే ఉంచారు. అప్పటి నుంచి ఆమెతో ఫ్రెండ్ షిప్ చేయటం ప్రారంభించాను. అద్భుతంగా పాత్రలో ఒదిగిపోయారు. ఇక కీరవాణిగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన వర్క్‌ను టెన్షన్‌లా ఫీలై చేయరు. ఈ సినిమాతో నాకు ఆవిషయం అర్థమైంది. అలా ఎంజాయ్ చేస్తూ చేస్తారు కాబట్టే అంత మంచి సంగీతాన్ని మా సినిమాకు అందించారు. సినిమాటోగ్రాఫర్ రాజ శేఖర్, ఆర్ట్ డైరెక్టర్ తోటతరణిగారు, ఎడిటర్ ఆంటోని సహా ఎంటైర్ నటీనటులు, సాంకేతిక నిపుణులతో చంద్రముఖి 2 వంటి గొప్ప సినిమా చేశాం. తప్పకుండా ఈ సినిమా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది అన్నారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మాట్లాడుతూ నేను నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఇన్నేళ్లలో చంద్రముఖి 2 వంటి గొప్ప సినిమా చేయలేదు. అసలు విషయమేమంటే నాకు అవకాశం కావాలని ఎవరినీ అడగలేదు. తొలిసారి డైరెక్టర్ పి.వాసుగారినే అడిగాను. ఈ సినిమాలో వాసుగారు నా పాత్రతో పాటు ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది. లారెన్స్ మాస్టర్ చాలా మందికి పెద్ద ఇన్‌స్పిరేషన్. ఆయన చిన్న డాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు హీరో, దర్శకుడు రేంజ్‌కు ఎదిగారు. ఎంతో మంచి మనసున్న వ్యక్తి. ఎలాంటి పరిస్థితులనైనా చిరునవ్వుతో స్వీకరిస్తారు. అలాంటి గుణం చాలాతక్కువ మందికే ఉంటుంది. తోటతరణిగారు, నీతూ లుల్లా, రాజశేఖర్‌గారు ఇలా చాలా మంది గొప్ప టెక్నీషియన్స్‌తో వర్క్ చేశాను. ఇక వడివేలుగారికి నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఆయన ఈ సినిమాలో తనదైన స్టైల్లో అందరినీ నవ్విస్తారు. కీరవాణిగారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచమంతా ఆయన గురించి గొప్పగా మాట్లాడింది. ఆయనకు ఆస్కార్ అవార్డ్ వస్తే నాకే వచ్చినట్లు సంతోషపడ్డాను. ఆయన మ్యూజిక్ డైరెక్షన్‌లో సినిమా చేయటం ఓ మంచి ఎక్స్‌పీరియెన్స్. ఇక సుభాస్కరన్‌గారు ఎంతో మంచి వ్యక్తి. చాలా ప్యాషన్‌తో గొప్ప సినిమాలను నిర్మిస్తున్నారు. ఆయన రూపొందించిన చంద్రముఖి 2 మంచి విజయాన్ని సాధిస్తుంది అన్నారు.
డైరెక్టర్ పి.వాసు మాట్లాడుతూ డైరెక్టర్‌గా ఇప్పటి దర్శకులతో పోటీ పడాలనే ఆలోచిస్తుంటాను. ఆ కోణంలో ఆలోచించే చంద్రముఖి 2ను రూపొందించాను. లైకా ప్రొడక్షన్స్ అంటేనే అద్భుతం. బ్రహ్మాండమైన సినిమాలను నిర్మించారు. నిర్మిస్తున్నారు. సుభాస్కరన్‌గారు తమిళ చిత్ర సీమకు దొరికిన గొప్ప నిధి. ఓ టెక్నీషియన్‌గా నా జర్నీ ప్రారంభమై నాలుగు దశాబ్దాలు అయిన విషయం మీరు చెప్పేంత వరకు నాకు తెలియలేదు. దర్శకుడిగా నేను చేసిన ప్రయాణంలో నాకు తమ సపోర్ట్ అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు, నటుడిగా నన్ను ఆదరించిన వారికి ధన్యవాదాలు. చంద్రముఖి 2ని లారెన్స్‌తో చేస్తున్నామని రజినీకాంత్‌గారికి చెప్పగానే సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుందని ఆయన అన్నారు. సుభాస్కరన్‌గారికి తగ్గట్లు లైకా ప్రొడక్షన్స్ సీఈఓ తమిళ్ కుమరన్‌గారు కుదిరారు. ఆయనైతే లైన్ విని సినిమా చేద్దామని అన్నారు. అక్కడ నుంచే ఈ సినిమా ప్రయాణం ప్రారంభమైంది. కథను డెవలప్ చేసిన తర్వాత పూర్తి కథను ముందుగా విన్నది వడివేలుగారే. ఆయనకు వెంటనే నచ్చింది. ఆయనలాంటి కమెడియన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నవ్వించి మన బాధలను తొలగించే డాక్టర్ ఆయన. కీరవాణి ఆస్కార్ సాధించి ప్రపంచం అంత తనవైపు తిరిగేలా చేసుకున్నారు. అయితే తను మాత్రం చాలా నెమ్మదిగా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఈ సినిమాకు ఆయన మ్యూజిక్ పెద్ద ఎసెట్. సినిమా అంతా ఓకే అయ్యింది కానీ చంద్రముఖి పాత్రకు ఎవరికీ తీసుకోవాలా? అని అర్థం కాలేదు. ఆ సమయంలో కంగనాగారికి ఓ కథ చెబుదామని వెళ్లినప్పుడు ఆమె చంద్రముఖి 2 గురించి అడిగారు. ఆ పాత్రలో ఎవరు నటిస్తున్నారని అన్నారు? ఇంకా ఎవరినీ తీసుకోలేదని చెప్పగానే మీకు అభ్యంతరం లేకపోతే నేను నటిస్తాను అని అనగానే నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆమె ఆ పాత్రను అంత గొప్పగా చేసింది. ఇక లారెన్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో ఆయన రెండు డైమన్షన్స్‌లో అద్భుతంగా నటించారు. ఈ సినిమా ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు అన్నారు.
ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ ఆస్కార్ అవార్డ్ తర్వాత నేను మ్యూజిక్ చేసిన సినిమా చంద్రముఖి 2.ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పి.వాసుగారికి థాంక్స్. వాసుగారు మంచి డైరెక్టరే కాదు మంచి సింగర్ కూడా. ఆయనకు నా నెక్ట్ మూవీలో సింగర్‌గా అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను. రాఘవ లారెన్స్ సపోర్ట్‌తో మంచి సాంగ్స్ వచ్చాయి. వడివేలుగారి కామెడీనే చంద్రముఖి 2 సినిమాకు పెద్ద హైలైట్. కంగనా రనౌత్ నా ఫేవరేట్ ఆర్టిస్ట్. ఆమెతో కలిసి వర్క్ చేయటం హ్యపీగా ఉంది. అనుకున్న సమయంలో సినిమాను కంప్లీట్ చేయటానికి ఏడుగురు ప్రోగ్రామర్స్‌తో కలిసి వర్క్ చేశాను. చంద్రముఖి 2 చిత్రాన్ని సుభాస్కరన్ అన్ కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు అన్నారు.
కమెడియన్ వడివేలు మాట్లాడుతూ నేను ఈ మధ్య కాలం సినిమా రంగానికి దూరంగా ఉన్నాను. ఇప్పుడు మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. మామన్నన్ సినిమా తర్వాత చంద్రముఖి 2 సినిమాతో అలరించబోతున్నాను. మామన్నన్ తర్వాత చంద్రముఖి 2 సినిమాతో మరోసారి ఆకట్టుకోబోతున్నాను. సుభాస్కరన్‌గారు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు.తమిళ్ కుమరన్‌గారి సపోర్ట్ మరచిపోలేను. వాసుగారు తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను చేశాను.చంద్రముఖి 2 కథను నేనే ముందుగా విన్నాను. నాకు నచ్చగానే తమిళ్ కుమరన్‌గారికి ఫోన్ చేసి బావుందని అన్నాను. తర్వాత సుభాస్కరన్‌గారిని కలిసినప్పుడు చంద్రముఖి 2 కథ బావుందని అన్నాను. తర్వాత సినిమాలో మురుగేశన్‌గా అలరించబోతున్నాను. కంగనా రనౌత్‌గారు అద్భుతంగా నటించారు. సినిమాలో పని చేసిన నటీనటులు, ఇతర టెక్నీషియన్స్‌కి అవకాశం ఇచ్చిన వారికి థాంక్స్ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ ఆర్.డి.రాజశేఖర్, ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి, సహా మహిమ, సృష్టి తదితరులు చంద్రముఖి 2 పెద్ద విజయాన్ని సాధించాలని కోరారు.
ఆస్కార్ అవార్డుతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచిన మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణికి నాలుగు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న దర్శకుడు పి.వాసుకి లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ సన్మానం చేశారు.