Reading Time: 2 mins

చిత్రపురి కాలనీలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం

సినీ కార్మికులకు అండగా నేనున్నాను మెగాస్టార్ చిరంజీవి

చిత్రపురి కాలనీలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, నిర్మాతలు సి కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, ఎఫ్ డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం, ఫిలించాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, మణికొండ మున్సిపల్ లీడర్స్ తదితరులు పాల్గొన్నారు. నేడు చిత్రపురిలో 1,176 ఎంఐజీ, 180 హెచ్ఐజీ డూప్లెక్స్ ఫ్లాట్స్ ఓనర్స్ కు చిరంజీవి చేతుల మీదుగా ఇంటి తాళాలు అందజేశారు. అనంతరం.

సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తోంది. సినీ రంగానికి, ఇక్కడి కార్మికులకు ఎప్పుడూ అండగానే ఉంటున్నాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వారికి ఇళ్ల నిర్మాణం చేసిన కమిటీకి అభినందనలు. ఏ పనిచేసినా తప్పుఒప్పులు జరుగుతుంటాయి. ధైర్యంగా ముందుకు వెళ్లాలి. ఈ కాలనీలో మంచి నీటి సమస్య ఉందని చెప్పారు. నేను అధికారులతో మాట్లాడి మిషన్ భగీరథ పైప్ లైన్ వచ్చేలా చేస్తా. అలాగే చిత్రపురి కాలనీలోనే రేషన్ షాప్, ఆస్పత్రి నిర్మాణం, ఇతర మౌళిక వసతులు కల్పిస్తాం. అన్నారు.

చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ 22 ఏళ్ల క్రితం ఇదే రోజున 2000 సంవత్సరం డిసెంబర్ 29న చిత్రపురి కాలనీకి పునాది రాయి వేసుకున్నాం. ఇప్పుడు ఇన్నేళ్లకు ఈ పెద్దలందరి చేతుల మీదుగా గృహప్రవేశ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉంది. కార్మికుల గృహ ప్రవేశం అని చెప్పగానే తప్పకుండా వస్తాను అని చిరంజీవి గారు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. మా కమిటీ గెలవగానే మిగిలిన గృహ నిర్మాణాలు పూర్తి చేస్తామని వాగ్ధానం చేశాం. మేము మాటిచ్చినట్లుగానే ఇవాళ ఇళ్లు కట్టి మీకు ఇవ్వడం సంతృప్తిగా ఉంది. చిత్రపురి సొసైటీ లోటు బడ్జెట్ లో ఉన్న క్రమంలో మా కమిటీకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పుడు చిరంజీవి గారి లాంటి పరిశ్రమ పెద్దలు, ప్రభుత్వం నుంచి మంత్రులు మాకు అండగా నిలబడి సపోర్ట్ చేశారు. ప్రస్తుతం మన కాలనీలో మంచినీటి సమస్య సహా కొన్ని మౌళిక వసతుల కొరత ఉంది. ఆ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరించుకుంటాం. అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ మా సినీ కార్మికుల సమక్షంలోకి అతిథిగా రావడం సంతోషంగా ఉంది. మనం తిన్నా తినకున్నా మనకొక ఇళ్లు ఉండటం అనే తృప్తే వేరు. ఆ సొంతింటి కలను మన సినీ కార్మిక సోదరులకు నిజం చేసిన ఈ చిత్రపురి కమిటీ వారికి అభినందనలు. ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సింది స్వర్గీయ ఎం ప్రభాకర్ రెడ్డి గారిని. ఆయన దూరదృష్టితో ఈ సొసైటీ కోసం చేసిన కృషి ప్రశంసనీయం. ఆయన కల ఇవాళ నెరవేరింది. దాసరి, రాఘవేంద్రరావు, భరద్వాజ లాంటి వారందరూ దీన్నోక అద్భుతమైన సొసైటీగా తీర్చిదిద్దారు. భారత దేశంలో మరే సినీ పరిశ్రమలోనూ సినిమా కార్మికులకు ఇంత పెద్ద గృహసముదాయం లేదు. ఈ కమిటీ చాలా నిజాయితీగా పనిచేస్తుండటం వల్లే పనులు జరుగుతున్నాయి. సి కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్లంతా నన్ను ఇండస్ట్రీ పెద్ద అంటున్నారు. వాళ్ల వయసు తగ్గించుకునేందుకు నన్ను పెద్ద అంటున్నారేమో అనిపిస్తోంది. చిత్ర పరిశ్రమ నాకెంతో ఇచ్చింది. అందులో నుంచి నా వంతుగా సినీ కార్మికులకు, కళాకారులకు సాయం చేస్తాను. నేను ఎదిగానని పెద్దరికం చేయాలని లేదు. సినీ కార్మికులకు నేను ఎప్పుడూ అండగా ఉంటాను. అవసరం వచ్చినప్పుడు మీ వెంట ఉండేది నేనే. మీకు కష్టం వస్తే నా ఇంటి తలుపు తట్టండి. అన్నారు.

ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేంద్ర, వైస్ ఛైర్మన్ నరేంద్ర రెడ్డి, కౌన్సిలర్లు వల్లభనేని హైమాంజలి అనిల్ కుమార్, వసంత్ రావు చౌహన్, శ్రీమతి సంయుక్త ప్రభాకర్ రెడ్డి, చిత్రపురి కమిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ యాదవ్, సెక్రటరీ పీఎస్ఎన్ దొర, ట్రెజరర్ లలిత, సభ్యులు డా.అళహరి వీవీ ప్రసాదరావు, బత్తుల రఘు, కొంగర రామకృష్ణ, దీప్తి వాజ్ పాయ్, అనిత నిమ్మగడ్డ, మహానందరెడ్డి, కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.