Reading Time: 2 mins

చూసీ చూడంగానే మూవీ రివ్యూ

చూసినట్లే అనిపించినా…(‘చూసీ చూడంగానే’ రివ్యూ)
Rating:2.5/5

కొత్త దర్శకులు ఇండస్ట్రీకు పరిచయం అవుతున్నారంటే ఏదో కొత్తదనం ఎక్సెపెక్ట్ చేస్తాం. మరీ ముఖ్యంగా మహిళా దర్శకురాలు పరిచయం అవుతోందంటే విభిన్న కోణాలతో కూడిన కథతో చెప్పే సినిమా కోసం ఎదురుచూస్తాం. అయితే ఈ మహిళా దర్శకురాలు …అందరిలాగే ఓ లవ్ స్టోరీ తో లాంచ్ అయ్యింది. మరి తన దృష్టి కోణం నుంచి కొత్తగా ప్రేమ కథను ఆవిష్కరించటానికి  ప్రయత్నించిందా.  ఈ కథలో ఆమె కొత్తగా చెప్పిందేమిటి.. మహిళా దర్శకురాలు కాబట్టి ఎమోషన్స్, సెన్సిబులిటీస్ హై గా ఎక్సెపెక్ట్ చేయచ్చా… మేకింగ్ ఎలా ఉంది. ఈ సినిమాతో పరిచయమవుతున్న హీరో ఎలా చేసారు వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

ఫొటో గ్రాఫర్ అవ్వాలనుకున్న సిద్ధూ (శివ) , తల్లి మాటపై మెకానికల్ ఇంజినీరింగ్ చేస్తూంటాడు. అక్కడ కాలేజ్ మీట్ ఐశ్వర్య (మాళవిక)తో ప్రేమలో పడతాడు.నాలగేళ్ల ప్రేమ అనంతరం అతనికి బ్రేకప్ చెప్పి ఆమె వెళ్లి పోతుంది. దాంతో దేవదాసులా కొంతకాలం గడిపిన సిద్దు చదువుకు బై చెప్పి వెడ్డింగ్ ఫొటో గ్రాఫర్ గా మారతాడు. ఈ క్రమంలో శ్రుతి(వర్ష)పరిచయం అవుతుంది. లవ్ ఎట్ ఫస్ట్ అనుకుని ప్రయాణిస్తూ, ఆమెను ఇంప్రెస్ చేస్తున్న సిద్దూకు ఓ నిజం తెలుస్తుంది. అదేమిటంటే…శ్రుతి కాలేజ్ రోజుల నుంచే సిద్దుతో ప్రేమలో ఉందని. అయితే అప్పుడే ఆమె ఈ విషయం సిద్దుకు ఎందుకు చెప్పలేదు. ఆమెకు ఐశ్వర్య గురించి తెలుసా…శ్రుతి ప్రేమ కథ వెనక ఉన్న సీక్రెట్ ఏమిటి…చివరకు సిద్దు ప్రేమ కథ ఏ మలుపు తిరిగింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

స్క్రీన్ ప్లే విశ్లేషణ

ప్రేమ కథల్లో కొత్తగా కంటెంట్ ఏమీ ఉండదు. ఎన్నో సార్లు తెరపైకి ఎక్కిన పాయింటే ఉంటుంది. అయితే దాని ప్రెజెంటేషన్ కొత్తగా చెయ్యాల్సి ఉంటుంది. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చెయ్యాల్సి ఉంటుంది. అది మిస్సైంది. అక్కర్లేని సీన్స్ తో సినిమా కిచిడిలా తయారైంది. సినిమాలో బలమైన కాంప్లిక్ట్ లేకపోవటంతో పాత్రలన్నీ పాసివ్ గా సాగుతున్న ఫీలింగ్ వస్తుంది. అందరూ విధికి వదిలేసి జీవితాన్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది.

ముఖ్యంగా దర్శకురాలు శేష సింధు రావుపై హాలీవుడ్ రొమాంటిక్ కామెడీల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆ ఎలిమెంట్స్ తీసుకొచ్చి  తెలుగు సినిమా లవ్ స్టోరీ ని చెయ్యాలనుకుంది. ఓ చిన్న సైజు హాలీవుడ్ రొమాంటిక్ కామెడీలా ఈ సినిమాని  ప్రెజంట్ చెయ్యాలనుకుందని అర్దమవుతుంది. హాలీవుడ్ వెనక రోజుల్లో వచ్చిన క్లాసిక్ రొమాంటిక్ కామెడీల్లో ఉండే ఎమోషన్స్ మనకు ఈ సినిమాలో కనపడతాయి. ప్రేమ యూనివర్శిల్ కాబట్టి ఎక్కడవి..ఎక్కడైనా పనికొస్తాయి. అయితే ఇలా చేయచ్చుఅనే  ఐడియా వరకూ బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్ లో పెద్దగా ఫలించలేదనిపిస్తుంది. సినిమాలో అక్కడక్కడా మంచి మూమెంట్స్ ఉన్నా చాలా చోట్ల ఫోర్సెడ్ ఎమోషన్స్  వాటిని వర్కవుట్ కానివ్వలేదు. అసలు ఇంటర్వెల్ దాకా కథలో ఏ మార్పు రాకపోతే ఎంత బోరు అనే విషయం దర్శకురాలు మర్చిపోయింది. అయితే సెంకడాఫ్ కొద్దిలో కొద్ది సినిమాని కాపాడింది.

కొత్త హీరో ఎలా చేసాడంటే..

 ఇక ఈ సినిమాలో హీరోగా పరిచయమైన శివ కందుకూరి తన పాత్రకు తగ్గట్లు.. లవ్ సీన్స్ లో  బాగానే నటించాడు. అలాగే ఎమోషనల్ సీన్స్ లోనూ బాగానే ఎఫెర్ట్ పెట్టాడు. క్లైమాక్స్ సీన్ లో కొత్త హీరో అనిపించడు. చాలా అనుభవం ఉన్నవాడిలా చేసుకుంటూ పోయాడు. సరైన సినిమాలు పడితే కుర్రాడు నిలబడతాడు.  


టెక్నికల్ గా

కొత్త దర్శకురాలు శేష్ సింధూ రావ్ లవ్,ఫన్  సీన్స్ బాగా డీల్ చేసింది. హీరో -హీరోయిన్ చుట్టూ అల్లుకున్న డ్రామా కూడా బాగానే నడిపింది.  అలాగే ఏ లవ్ స్టోరీ సక్సెస్ కు అయినా సంగీతం, సినిమాటోగ్రఫీ మూలంగా నిలవాలి. గోపీ సుందర్ సంగీతం లో రూపందిన పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ అక్కడక్కడా బాగుంది. ఎడిటర్ సినిమాని ఇంత స్లోగా నడపకుండా ఉండాల్సింది.  నిర్మాణ విలువల విషయానికి వస్తే… చాలా లిమెటెడ్ బడ్జెట్ లో చేసారని స్పష్టమైపోతోంది. సహజంగా డైలాగులు ఉండాలనే తాపత్రయంలో అర్దం పర్దం లేని డైలాగులు చాలా చోట్ల వాడారు. ఏదైమైనా రైటింగ్ సైడ్ మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది.

చూడచ్చా…
రొమాంటిక్ కామెడీలు ఇష్టపడేవారికి ఈ సినిమా ఫరవాలేదనిపిస్తుంది. మిగతా వాళ్లకు విషయం లేదనిపిస్తుంది.

తెర వెనక..ముందు
న‌టీన‌టులు: శివ కందుకూరి, వ‌ర్షా బొల్ల‌మ్మ‌, మాళ‌విక స‌తీష‌న్‌, పవిత్ర లోకేష్, అవసరాల శ్రీనివాస రావు తదితరులు.
సినిమాటోగ్ర‌ఫీ: వేద‌రామ‌న్‌
సంగీతం: గోపీ సుంద‌ర్‌
ఎడిటింగ్: ర‌వితేజ గిరిజాల‌
నిర్మాత‌: రాజ్ కందుకూరి
ద‌ర్శ‌క‌త్వం: శేష్ సింధూ రావ్