చోర్‌ బజార్‌ మూవీ రివ్యూ

Published On: June 25, 2022   |   Posted By:

చోర్‌ బజార్‌ మూవీ రివ్యూ

Chor-Bazaar.jpg

 ఆకాష్ పూరి ‘చోర్‌ బజార్‌’ సినిమా రివ్యూ
Emotional Engagement Emoji
👎

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తనయుడు పూరి ఆకాశ్ ని హీరోగా చేయగలిగాడు కానీ నిలబెట్టలేకపోయారు. ఇప్పటిదాకా  కెరీర్ లో తొలి హిట్ ని అందుకోలేకపోయారు. లాస్ట్ ఇయిర్  ‘రొమాంటిక్’తో  పలకరించిన ఆకాష్  ఇప్పుడు ‘చోర్ బజార్’తో ప్రేక్షకులముందుకు వచ్చాడు. ‘జార్జి రెడ్డి’ ఫేమ్ జీవన్ రెడ్డి రూపొందించిన ఈ చిత్రం ఆకాశ్ కెరీర్ కు కలిసొచ్చిందా…ఈ సినిమా కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథ
హైదరాబాద్ సిటీలో దొంగతనం చేసిన వస్తువులు అమ్మే చోర్ బజార్ నేపధ్యంలో  ఈ కథ జరుగుతుంది. అక్కడ పెరిగి పెద్దైన బచ్చన్ (ఆకాష్ పూరి) చెప్పు చేతుల్లో  ఆ బజార్ నడుస్తూంటుంది. కారు టైర్లు దొంగతనం చేసుకుని వచ్చి చోర్ బజార్ లో అమ్మటం వృత్తిగా పెట్టుకుంటాడు బచ్చన్. అంతేకాదు తాను ఓ పెద్ద డబ్బున్న కుటుంబానికి చెందిన వాడిని అని చెప్పి మూగ అమ్మాయి (గెహనా సిప్పీ)ని ప్రేమలో పడేస్తాడు. అయితే ఆ  అమ్మాయి ఇంట్లో చెప్పి తమ పెళ్లికి ఒప్పించడం ఎలాగో తెలియక సతమతమవుతూంటాడు .  ఈ లోగా హైదరాబాద్‌లోని మ్యూజియంలో రూ. 200 కోట్లు విలువ చేసే నిజాం కాలం నాటి వజ్రం దొంగతనం అవుతుంది.   ఆ వజ్రం చోర్ బజార్‌ అనే ఏరియాలో పడుతుంది. దీంతో పోలీసులు ఆ బజార్ ని సోదా చెయ్యటం మొదలెడతారు. అదిలా ఉండగా  చోర్ బజార్ ను మూయించడానికి  ఓ పోలీస్ ఎస్సై (సుబ్బరాజు) ప్రయత్నిస్తుంటారు. ఈ సమస్యలన్నింటినీ బచ్చన్ ఎలా అధిగమించాడు.. తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్

సాధారణంగా ఓ సినిమాలో ఒకటి లేదా రెండు సబ్ ప్లాట్స్ ఉంటాయి. కానీ ఈ సినిమా కథలో లెక్కకు మించి ఉంటాయి. ఓప్రక్కన వజ్రం దొంగతనం..మరో ప్రక్క హీరో లవ్ స్టోరీ,    చోర్‌ బజార్‌  జనం సమస్యలు, ఉమెన్‌ ట్రాఫికింగ్, అమితాబ్‌ బచ్చన్‌ మీద అభిమానంతో ఇళ్లు వదిలేసి వచ్చిన  అమ్మాయి కథ వంటివి చాలా వచ్చి పోతూంటాయి. ఏదో వెబ్ సీరిస్ కు రాసుకున్న కథని ఇలా సినిమా చేసేసారా అనే డౌట్ వస్తుంది.  ఇవి చాలనట్లు డెడ్ స్లోగా నడిచే  స్క్రీన్‌ప్లే, గందరగోళంతో కలగలిసిన సీన్లు తెరపై ఏం జరుగుతోందో అర్దం కాదు. హీరో కథలో భాగంగా మిగతా కథలు వచ్చి పోతూంటే ఏ సమస్యా రాదు. కానీ సబ్ ప్లాట్స్ ఎక్కువై అసలు హీరో కథ తక్కువైపోతుంది. అలాగే చాలా కథలు అసలు హీరోకు సంభందం ఉండవు. వాటిలోకి వెళ్లి హీరో కూడా ఏమీ చెయ్యలేడు. అలాంటప్పుడు వాటిని తెరపై ఆవిష్కరించి ఏం లాభం అనిపిస్తుంది. దానికి తోడు పక్కా గోదావరి యాసతో మాట్లాడే సునీల్ తో తెలంగాణా స్లాంగ్ మాట్లాడించటం ఓ కామెడీ. అన్నిటికన్నా మరో హాస్య ప్రహసనం వజ్రం అని చెప్పబడే వస్తువు చుట్టు జరిగే విన్యాసాలు. మనకు ఎక్కడా అది వజ్రం అనిపించకపోవటం టెక్నీషియన్స్ ప్రతిభే అని చెప్పాలి. ఇక ఎంతో హైప్ క్రియేట్ చేస్తూ చాలా కాలం తర్వాత కమ్ బ్యాక్ అయిన అర్చన పాత్రకు పెట్టిన ఫ్లాష్ బ్యాక్  అయితే దారుణం. పల్లెలో ఉండే అర్చనకు అమితాబ్ బచ్చన్ అంటే ప్రాణం.  బచ్చన్ తో పెళ్లి అని ఎవరో చెప్పగానే ఇంట్లో ఉన్న డబ్బు నగలన్నీ పట్టుకుని అతడితో వచ్చేసి తర్వాత తీరిగ్గా  మోసపోయానని తెలుసుకుని నదిలో దూకబోతుంది. అప్పుడే పసిబిడ్డ ఏడుపు వినిపించి.. అతణ్ని తీసుకుని చోర్ బజార్ చేరుతుంది. ఆ కుర్రాడే హీరో. ఆ పిల్లాడుకి  బచ్చన్ సాబ్ అని పేరు పెడుతుంది. ఇలా అది నిజమో..వెటకారమో తెలియనట్లు కథ నడిచిపోతుంది. ఇలాంటి కథనుంచి ఇంకేమి ఎక్సపెక్ట్ చేయగలం.

టెక్నికల్ గా…

స్క్రిప్టు పరంగా చాలా పూర్ గా ఉన్న ఈ సినిమాలో డైలాగులు అంతంత మాత్రమే. అలాగే సురేష్ బొబ్బిలి పాటలు జస్ట్ ఓకే అన్నట్లుంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏదో లాగేసారు. మనస్సు పెట్టి చేయలేదు. చాలా చోట్ల తమన్ హడావిడి గుర్తు వస్తుంది. జగదీష్ చీకటి కెమెరా వర్క్ లో  విజువల్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చల్తాహై.  దర్శకుడుగా దళం.. జార్జిరెడ్డి చిత్రాలు తీసిన  జీవన్ రెడ్డి ఈ సినిమా తీసాడంటే నమ్మబుద్ది కాదు.

నటీనటుల్లో …

ఈ సినిమాలో  పూరి ఆకాష్ నటన చూస్తూంటే తన తండ్రి సినిమాలో హీరోలు గుర్తు వస్తూంటారు. నటన బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి.  ఎమోషనల్ సీన్లో హావభావాలు బాగా పలకలేదు. డైలాగ్ డెలవరీ బాగుంది. హీరోయిన్ గా నటించిన కొత్త అమ్మాయి గెహనా చూడ్డానికి బాగానే అనిపిస్తుంది. సీనియర్ నటి అర్చన  చాలా పేలవమైన పాత్ర.  సునీల్, సుబ్బరాజు  వంటి  సీనియర్స్ ఉన్నా ఫలితం లేదు.

చూడచ్చా

సినిమాని చివరి దాకా చూడటం కష్టమే అనిపిస్తుంది. ఇది బోర్ బజారే.

ఎవరెవరు..

నటీనటులు: ఆకాష్ పూరి, గెహనా సిప్పీ, అర్చన, సునీల్, సుబ్బరాజు తదితరులు
దర్శకుడు: జీవన్‌ రెడ్డి
నిర్మాత: వీఎస్ రాజు
సంగీతం: సురేష్‌ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి
Runtime:2 hours 13 minutes.
విడదల తేది: జూన్ 24, 2022