Reading Time: 3 mins

జగమే తంత్రం మూవీ రివ్యూ

చూస్తే అంతం: ‘జగమే తంత్రం’ రివ్యూ

Rating:2/5

ధనుష్ హీరో , ‘పిజ్జా’, ‘పేట’ సినిమాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరక్షన్ అనగానే ట్విస్ట్ లతో కూడిన ఓ డిఫరెంట్ సినిమా వస్తుందని అందరూ ఆశిస్తాము.అదే ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్  పెరగటానికి కారణమైంది. థియోటర్ రిలీజ్ అయితే ఖచ్చితంగా ఓ రేంజిలో ఓపినింగ్స్ ఉండేవి. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా థియేటర్స్ ని స్కిప్ చేసి, టాప్ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీచేసారు. ప్రపంచవ్యాప్తంగా 17 భాషల్లో రిలీజైన మరి ఈ జగమే తంత్రం ఎలా ఉంది,కథేంటి, ఆ టైటిల్ పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఉందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం..

స్టోరీ లైన్

లండన్ గ్యాంగ్ స్టర్ పీటర్(జేమ్స్ కాస్మో)కి తమిళనాడు నుంచి వచ్చి లండన్ లో సెటిల్ అయిన శివదాస్(జోజు జార్జ్) పెద్ద తలనొప్పిగా మారుతాడు.  పీటర్ కి పోటీగా గ్యాంగ్ స్టర్ గా శివదాస్ ఎదగటం తట్టుకోలేకపోతాడు. అంతేకాదు ఓ వివాద విషయంలో శివదాస్ గ్యాంగ్ పీటర్ కజిన్ ని చంపేస్తారు. దాంతో పీకలదాకా కోపం తెచ్చుకున్న పీటర్ శివదాస్ ని లేపేయాలనుకుంటాడు. అందుకోసం సరైన వ్యక్తి కోసం వెతుకుతూంటాడు. అతను లండన్ కు కొత్తవాడై ఉండటం, తమిళవాడై ఉండటం కావాలి. ఆ క్రమంలో  మధురై లోకల్ డాన్ సురులి(ధనుష్) గురించి తెలిస్తుంది. డబ్బు కోసం ఏదైనా చేసే సురలికు భారీ డబ్బు ఆశపెట్టి లండన్ కి ఆహ్వానిస్తారు.

అలాగే సురలి లోకల్ గా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుని అక్కడ నుంచి ఓ నెల పాట తప్పుకుందమనుకుంటాడు. ఈ లోగా ఈ ఆఫర్..దాంతో లండన్ లో వాలిపోతాడు సురలి. పీటర్ కోరుకున్నట్టే సురులి చాలా జాగ్రత్తగా స్కెచ్ వేసి శివదాస్ బిజినెస్ ని దెబ్బ కొట్టడమే కాకుండా చంపేస్తాడు. అయితే శివదాస్ చనిపోయాక ఓ విషయం రివీల్ అవుతుంది. అది తెలుసుకున్న సురలి తను ఎంత తప్పు చేసానో అని ఫశ్చాతాప పడతాడు. అక్కడ నుంచి సురలి తీసుకునే నిర్ణయం ఏమిటి..ఫైనల్ గా ఏం జరుగుతుంది. ఈ కథలో హీరోయిన్ పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్..

గ్యాంగస్టర్ కథలు కత్తి మీద సాములాంటివి..ప్రతీది గాడ్ ఫాధర్ కథలాగే పేపరుపై అనిపిస్తుంది. తెరకెక్కేసరికి సరిగ్గా డీల్ చేయకపోతే అది గాడిద ఫాధర్ కథ అవుతుంది. ఈ సినిమా కూడా కొంచెం అటూ ఇటూ గా అలాగే తయారైంది. ఎక్కడో మొదలైన కథ ఎక్కడికో వెళ్తుంది.  “ఒక‌డు ఎక్క‌డ పుట్టాడో అది కాదు వాడి సొంతూరు వాడు ఎక్క‌డ జీవితం మొద‌లెట్టాడో అదే వాడి సొంతూరు“… అనే డైలాగ్ ఈ సినిమాలో ఉంది.అలాగే ఈ కథ ఎక్కడో మొదలవుతుంది. సెకండాఫ్ లో హఠాత్తుగా వేరే యాంగిల్ తీసుకుంటుంది. అప్పుడు అసలు ఈ కథ..అంతరార్దం ఏమిటనే డౌట్ వస్తుంది. లోకల్ డాన్ లండన్ కు వెళ్లటం అంటూ సాగే కథ హటాత్తుగా శ్రీలంక శరణార్దుల వైపు టర్న్ తీసుకోవటం ఇబ్బంది కలిగించే అంశం. అది తమిళ వాళ్లకు ఎలా ఉంటుందో కానీ మనకు మాత్రం డైజస్ట్ చేసుకోవటం కష్టమే. పోనీ ఫస్టాఫ్ ఏమన్నా అదిరిపోయిందా అంటే…సురులి లండన్‌ రావటం, డాన్‌గా మారడం అంతా సినిమాటెక్ గానే సాగుతుంది.ఆ సీన్స్ అన్నీ పరమ రొటీన్ గా సాదాసీదాగానే ఉంటాయి. ఎప్పుడైతే శివదాస్‌ మర్డర్ జరిగిందో కథలో మలుపు వస్తుంది. అయితే అప్పటి వరకూ  తన స్వార్థం కోసం పని చేసిన సురులి తమిళ శరణార్థుల కష్టాలు తెలుసుకున్న తర్వాత వాళ్ల తరపున నిలబడి పోరాటం మొదలు పెడతాడు. అదీ మనకు పరమ రొటీన్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటివి మనం ఆర్ నారాయణ మూర్తి సినిమాలు నుంచి అవతార్ దాకా బోలెడు చూసేసాం. ఇంక ఇందులో కొత్తేముంది. అంటే ఏమీ లేదు అని తేలిపోతుంది.  
 
దర్శకత్వం..మిగతా విభాగాలు

కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ విషయానికి వస్తే.. ఎప్పటిలాగే మేకింగ్ హాలీవుడ్ స్టైల్ లోనే ఉంది. అయితే అందుకు తగ్గ కథ లేదు. అతని గత చిత్రం పేటలాగానే సెకండాఫ్, ముఖ్యంగా క్లైమాక్స్ బాగా వీక్ గా ఉన్నాయి. ఇక  శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. వివేక్ హర్షన్ ఎడిటింగ్ కూడా బాగుంది కానీ మరికొంత ట్రిమ్ చేసి లెంగ్త్ తగ్గించాలి. ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఓ రేంజిలో ఉన్నాయి.

నటీనటుల్లో …

సురులిగా ధనుష్ సూపర్బ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అయితే ఇంతకు ముందు  ‘పుదుపెట్టై’, ‘మారి’, ‘వడాచైన్నై’ లలో ఇలాంటి క్యారక్టర్ చేసిందే కావటంతో కొత్తగా అనిపించలేదు.హాలీవుడ్ యాక్టర్ జేమ్స్ కాస్మో   ప్రెజన్స్  కొత్త ఫీల్ ని ఇచ్చింది. జోజు జార్జ్, ఐశ్వర్య లేక్ష్మి లని సరిగ్గా వాడుకోలేదు.‘నాయట్టు’, ‘జోసెఫ్‌’ లాంటి చిత్రాలతో ఎంతటి సహజ నటుడో నిరూపించుకున్న జోజీ జార్జ్‌ తేలిపోయారు. ఇక ఎమోషనల్ సీన్స్ లో ఐశ్వర్య చాలా బాగా చేసింది.

చూడచ్చా?

ధనుష్ వీరాభిమానలు తప్ప మిగతావారికి కష్టమే.

తెరవెనక..ముందు

బ్యానర్లు: వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైనర్‌మెంట్

నటీనటులు: ధనుష్, ఐశ్వర్య లక్ష్మీ, జేమ్స్ కాస్మో, జోజు జార్జ్, కలైయరాసన్, బాబా భాస్కర్ తదితరులు

 కథ, దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్

 నిర్మాతలు: ఎస్ శశికాంత్, చక్రవర్తి, రామచంద్ర

మ్యూజిక్: సంతోష్ నారాయణన్

సినిమాటోగ్రఫి: శ్రేయాస్ కృష్ణ

ఎడిటింగ్: వివేక్ హర్షన్

ఓటీటీ రిలీజ్: నెట్ ఫ్లిక్స్

రన్ టైమ్:2గంటల,37ని

రిలీజ్ డేట్: 2021-06-18