జల్లికట్టు సినిమా రివ్యూ
కనికట్టు: ‘జల్లికట్టు’ సినిమా రివ్యూ
Rating: 3/5
కొన్ని సినిమాలు చూస్తే అలా ఆలోచనలో పడేస్తాయి. మనమేంటో మనకు తెలియచేస్తాయి. మనలోని మంచి లేదా అవలక్షణాలను మన ముందు నిక్కచ్చిగా ఆవిష్కరిస్తాయి. అలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. ముఖ్యంగా కమర్షియల్ సిని ప్రపంచంలో కొట్టుకుపోయే మన తెలుసు సినిమాకు అది ఊహకు అందనిదే అయినా డబ్బింగ్ పుణ్యమా అని అప్పుడప్పుడూ అలాంటి సినిమా లు మనకు దొరుకుతూంటాయి. ఫుల్ మీల్స్ తిన్న ఫీల్ ని ప్రేక్షకుడుకి కలిగిస్తాయి. అలాంటి సినిమానే ‘జల్లికట్టు’. ఈ సినిమా మన కళ్లకు కనికట్టు కడుతుంది.మనమే ఆ సినిమాలో ఓ భాగం అన్న ఫీల్ కలిగిస్తుంది. అలాంటి ఈ సినిమా రోజు మనం రివ్యూ చేయబోయేది. ఆ సినిమా విశేషాలు చూద్దాం.
స్టోరీ లైన్
కేరళ అటవి ప్రాంతానికి దగ్గరలో ఓ జనావాసం. అక్కడ మాంసం అమ్ముకుని బ్రతికే విన్సెంట్ (వినోద్) కు వీర డిమాండ్. అతను తెచ్చే ప్రెష్ మాంసం, ముఖ్యంగా అడవి దున్న మాంసానికి ఓ రేంజిలో డిమాండ్. అతను దాన్ని తన తండ్రి నుంచి వారసత్వంగా సాధించి వ్యాపారం చేస్తున్నాడు. ఓ రోజు తన వృత్తిలో భాగంగా..విన్సెట్ ఓ అడవి దున్నని చంపబోతాడు. అయితే దానికి ప్రాణభయం. దాంతో తప్పించుకుంటుంది. మొండిగా ఎదురుతిరిగి పారిపోతుంది. ఆ పారిపోయే క్రమంలో ఊరుని నాశనం చేసేస్తుంది. దాని దెబ్బకు పొలాలు, షాపులు,ఇళ్లు, చివరకి బ్యాంక్ లో ఫర్నిచర్ కూడా ముక్కలవుతుంది. దాంతో ఎలాగైనా దాన్ని పట్టుకోవాలనుకుంటారు. కాని అది పట్టుకోవటానికి వచ్చిన వాళ్లను తన పశుబలంతో కుమ్మేస్తుంది. గాయాలైనా జనం ఆగరు. కొందరికి దాన్ని పట్టుకుని..మాంచి మసాలా వేసుకుని మాంసం తినాలని కోరిక. దాంతో ఆ రాత్రి ఆ ఊరు జనాలకి అదో వినోదం. ఊరు ఊరంతా కదిలి దాని వెనక పడుతుంది. ఎలాగైనా దాన్ని పట్టుకోవాలని రకరకాల ఎత్తులు వేస్తారు. వాటిని చిత్తు చేస్తూ పరగెడుతుంది. అంతలా వాళ్లలో సమరోత్సాహం రగిలించిన ఆ దున్న వాళ్లకు దొరికిందా..చివరకు ఏమైంది అంటే సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది.
స్క్రీన్ ప్లే సంగతులు
ఈ సినిమా మన కళ్లదెరుగుగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. అంతలా దర్శకుడు రెగ్యులర్ మేకింగ్ కు భిన్నంగా వెళ్లి ఓ కొత్త ప్రపంచాన్ని మన ముందు ఆవిష్కరిస్తారు. సౌండ్, యాక్షన్ దగ్గర నుంచి అంతా కొత్తగానే ఉంటుంది. ఆర్టిస్ట్ లు మనకు తెలియని వాళ్లైనా ఎక్కడా మనకు అదొ సమస్యగా ఉండదు. అందుకు కారణం దర్శకుడు బిగి సడలని స్క్రీన్ ప్లే. ఎక్కడా పాజ్ కానీ, ఫాస్ట్ ఫార్వర్డ్ కానీ చెయ్యకుండా పాత్రలను పరుగెట్టిస్తాడు. అలాగే పాత్రల గురించి పూర్తిగా మనకు చెప్పకుండా కథ ముందుకు వెళ్తూంటే వాటి వివరాలు రివీల్ అయ్యేలా చేస్తాడు. అయితే సింగిల్ ప్లాట్ అయితే ఇబ్బంది వస్తుందని మల్టి లేయర్స్ గా మరికొన్ని పాత్రలను తీసుకొస్తాడు తెరపైకి. అవి మొదట డైజస్ట్ అవ్వవు. అలాగే వాటికి ముగింపు ఉండదు. ఆ రోజు జరిగిన కథగా చెప్పటంతో..అంత టైమ్ ఇవ్వడు. కానీ పూర్తయ్యేసరికి అన్ని మనకు అర్దమయ్యేలా స్క్రీన్ ప్లే డిజైన్ చేసారు. అయితే సెకండాఫ్ కు వచ్చేసరికి ..ఒకే రకమైన సీన్స్ రిపీట్ అవుతున్నట్లు, సినిమా కదలకుండా అక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది. అదే ఈ సినిమాకు మైనస్. దాన్ని ప్రక్కన పెడితే మంచి ఎక్సపీరియన్స్ ఇస్తుంది.
పశుప్రవృతి
ఆదిమానవుల కాలంలో ఉన్నటువంటి వేట…పశు నైజం మనలో ఇంకా పోలేదని, నాగరికం అనే ముసుగు తీస్తే మనష్యులు ఎలా మారిపోతారో ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపెడుతుంది. అందుకే ఈ సినిమా మిగతావాటి కన్నా విభిన్నంగా కనిపిస్తుంది.
అవార్డ్ లు రివార్డ్ లు
జోసే పెల్లిస్సరీ దర్శకత్వంలో మలయాళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘జల్లికట్టు’. ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోసే తదితరులు కీలక పాత్రలకు ప్రాణం పోసారు. రూ.3కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.20కోట్లు వసూలు చేసింది. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై విమర్శకుల మెప్పు పొందింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో పెల్లిస్సరీ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు.
టెక్నికల్ గా…
ఈ సినిమా దర్శకుడు కొత్తదనం కోసం చేసిన అన్వేషణ ఈ సినిమా. ఇరవై నాలుగు క్రాఫ్ట్ లు ఎంతో కొంత కొత్తదనం ప్రదర్శించారు. ముఖ్యంగా కెమెరా యాంగిల్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ లో వచ్చే సౌండ్స్ చాలా భిన్నంగా ఉంటాయి. ఎక్కడా పాత వాసన తగలకుండా జాగ్రత్తపడ్డారు. డబ్బింగ్ కూడా చాలా బాగా కుదిరింది.
చూడచ్చా
ఖచ్చితంగా..మీరు కొత్త తరహా సినిమా చూడాలని ఇంట్రస్ట్ ఉన్నవారైతే…
తెర వెనుక..ముందు
నటీనటులు : ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోసే, సబుమోన్ అబ్దుసామద్, శాంతి బాలచంద్రన్ తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్: రంగనాథ్ రవీ
సంగీతం: ప్రశాంత్ పిళ్లై
సినిమాటోగ్రఫి: గిరీష్ గంగాధరన్
ఎడిటింగ్: దీపూ జోసఫ్
నిర్మాతలు: థామస్ పానికర్
డైరెక్టర్ : లిజో జోస్ పెల్లిస్సరీ
రిలీజ్ డేట్ :25-09-2020
Run Time: 91 నిముషాలు
ఓటీటి: ఆహా