Reading Time: 3 mins

జేమ్స్ మూవీ రివ్యూ

పునీత్ చివరి సినిమా ‘జేమ్స్’ రివ్యూ

?

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆకస్మిక మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం అభిమానులకు, కన్నడ చిత్ర పరిశ్రమకు మాత్రమే కాదు కన్నడ ప్రజలకు కూడా నేటికీ తీరని లోటు.   పునీత్ చివరి సినిమా ‘జేమ్స్’ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు మార్చి 17 పునీత్‌ జయంతి సందర్భంగా ‘జేమ్స్’ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. కన్నడతో పాటు హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసారు. ఈ చిత్రం ఎలా ఉంది…కథేంటి.. తెలుగు వాళ్లకు నచ్చే సినిమాయేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Storyline:

సెక్యూరిటీ ఏజెన్సీ హెడ్ గా చేస్తున్న సంతోష్ (పునీత్ రాజ్ కుమార్) తన వృత్తికు న్యాయం చేయటం కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. దాంతో అతన్ని ఎక్కడెక్కడి వాళ్లు కాంటాక్ట్ చేస్తూంటారు. ఈ క్రమంలో విజయ్ గైక్వాడ్ (శ్రీకాంత్) కి పర్శనల్  సెక్యూరిటీ అవసరం అవుతుంది. అతనిదో అండర్ వరల్డ్  ఫ్యామిలీ. సంతోష్ ని పిలిచి భారీ మొత్తం ఆఫర్ చేసి  తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ల ఫ్యామిలీని పెద్ద ధ్రెట్ నుంచి కాపాడి దగ్గర అవుతాడు. అంతేకాదు  విజయ్ గైక్వాడ్  చెల్లెలు నిషా (ప్రియా ఆనంద్) ..సంతోష్ తో ప్రేమలో పడుతుంది.  ఇది గమనించిన విజయ్ తన చెల్లిని సంతోష్ కు ఇచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు. అయితే లాస్ట్ మినిట్ లో విజయ్ కు సంతోష్ గురించి ఓ విషయం తెలుస్తుంది.  సంతోష్ అలియాస్ జేమ్స్ వచ్చింది గైక్వాడ్ ఫ్యామిలీని కాపాడడానికి కాదని, వాళ్ళని అంతమొందించడానికని తెలుస్తుంది. అసలు సంతోష్ అలియాస్ జేమ్స్ ఎవరు? గైక్వాడ్ ఫ్యామిలీని ఎందుకు చంపాలనుకుంటాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “జేమ్స్” చిత్రం.అతను జేమ్స్ అని అర్దమై భయపడిపోతాడు. ఇంతకీ విజయ్ కు సంతోష్ గురించి తెలిసిన విషయం ఏమిటి, జేమ్స్ ఎవరు…విజయ్ ఫ్యామిలికు దగ్గర అవటం వెనక ఉన్న అసలు కథేంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Screenplay Analysis:

ఇది ఆ మధ్యన విడుదలై  డిజాస్టర్ అయిన ఎన్టీఆర్ సినిమా ‘రామయ్యా వస్తావయా’, రామ్ చరణ్ వినయ విధేయరామ సినిమాని పోలిన  స్క్రీన్ ప్లే నడకతో వుంది ఈ సినిమా.  వాస్తవానికీ ఇలాంటి యాక్షన్ నే నమ్ముకున్న సినిమాల్లో కథలేకపోయినా వచ్చే నష్టమేం లేదు. మెయిన్ కథలోహీరో,విలన్  గొడవల్ని చూపిస్తున్నప్పుడు ఓ రెండు మాటల్లో బ్యాక్ స్టోరీ చెప్పేస్తే సరిపోయేది. అలా చేయకుండా సెకండాఫ్ లో అరగంట  ప్లాష్ బ్యాక్ చెప్పి స్క్రీన్ టైమ్ తినేసారు. దాంతో విలన్ కు హీరో ఎవరో తెలిసే సరికి ఇంటర్వెల్ వచ్చేసింది. సెకండాఫ్ లో అసలు హీరోకు, విలన్ కు ఉన్న సంభందం ఏమిటో తెలయటానికే సరిపోయింది. మరి విలన్ ,హీరో మధ్యన వార్ ఎప్పుడూ అంటే అందుకు టైమ్ లేకుండా పోయింది. దాంతో హీరో క్యారక్టర్ యాక్షన్ ప్యాసివ్ గా మారింది.సెకండాఫ్ లో విలన్ లేచి యాక్షన్ లోకి  వచ్చేవరకూ హీరో ఏపనీ లేక పనికిరాని సీన్స్ తో కూడిన స్క్రీన్ ప్లే  ఎత్తుకుని బోరుకొట్టిస్తాడు.  ఇంటర్వెల్లో ముగిసి పోయిన కథని మళ్ళీ ఎత్తుకుంటాడు. ఇంటర్వెల్ దగ్గరే విలన్ ని లేపేస్తే అసలు సెకండాఫ్ కు చోటే లేదు కదా. అసలు ఎందుకు వదిలేసాడో మనకైతే అర్దం కాదు. వెంటవెంటనే ఏవేవో సీన్స్ వేసేస్తూ యాక్షన్ సీన్స్ కుమ్మరించేస్తూ  ప్రేక్షకుల్ని కట్టిపడేయ్యాలనే తపన తప్పించి ఏమీ కనపడదు. స్క్రీన్ ప్లే అనేదే  ఈ సినిమాకు లేదని చెప్పాలి.

బాగున్నవి

పునీత్ రాజ్ కుమార్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్
బీజీఎం
విలన్స్ గా చేసిన శ్రీకాంత్, శరత్ కుమార్ లుక్స్

బాగోలేనివి

కథ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం
ముఖ్యంగా సెకండాఫ్,  ప్లాష్ బ్యాక్

Analysis of its technical content:

పునీత్‌ రాజ్‌కుమార్‌ కిది కొత్త తరహా పాత్రేం కాదు, ఇలాటి బరువు గల పాత్రలు కెరీర్ ప్రారంభం నుంచీ నటిస్తూనే వున్నాడు. ఆ కోవలోనే ఈ నటనా వుంది. ఈ మాస్  పాత్రకి డైలాగుల బలం  తోడ్పడే లా సీన్స్ రాసుకుననారు.  కానీ ఆ డైలాగులుకు సరబడ సీన్స్ లేవు. సన్నివేశాల్ని ఉద్విగ్నభరితం చేసే ఒక్క డైలాగూ పేలదు. అలాగే, పాటల్లోనూ ఫ్యాన్స్ కేరింతలు కొట్టే ఒక్క డాన్సు మూవ్ మెంటు కూడా లేకపోవడం మరో లోటు! ఫైట్స్ మాత్రం కేక.  కేజీఎప్ తరహాలో సీన్ సీన్ కీ వైవిధ్యం కనబర్చే యాక్షన్ ని క్రియేట్ చేసి, పునీత్  ని హైప్ చేస్తూ యాక్షన్ కోరియోగ్రఫీ చేశారు. ఐతే ఇంటర్వెల్ సీన్లో హింస ఎక్కువైపోయింది అనిపిస్తుంది. ఇక ఇలాంటి సినిమాకు అవసమైన బ్యాక్ గ్రౌండ్ సెట్ అయ్యింది. అయితే పాటల్లో ట్రేడ్ మార్క్ సాంగ్ మాత్రమే బాగుంది.  నిర్మాణ విలువలు ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టుగా ఉన్నాయి.  సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. అన్నిటి కన్నా ముఖ్యంగా సినిమా యాక్షన్ బ్లాక్స్ గురించే చెప్పుకోవాలి.   స్టైలిష్ గా పునీత్ పై డిజైన్ చేసిన ఫైట్ లు ఫ్యాన్స్ కు  పండగ చేసుకునేలా ఉన్నాయి. ఎడిటింగ్ , తెలుగు డబ్బింగ్ ఓకే. డైరక్టర్ గా చేతన్ కుమార్ అంత సీన్ లేదనిపించాడు

CONCLUSION:
చూడచ్చా?
పునీత్  రాజ్ కుమార్ అభిమాని అయితే కథతో సంభందం లేకుండా ఎమోషన్ తో కనెక్ట్ అవుతారు.లేకుంటే కష్టమే.

Movie Cast & Crew
ఎవరెవరు..
బ్యానర్: కిశోర్ ప్రొడక్షన్స్,
పునీత్ రాజ్‌కుమార్, డాక్టర్ శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్ కుమార్, ముఖేష్ రిషి, ఆదిత్య మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
సంగీతం: చరణ్ రాజ్,
సినిమాటోగ్రఫీ: స్వామి జె గౌడ,
ఆర్ట్: రవి శాంతేహైక్లు,
పీఆర్వో: బి. వీరబాబు
ఎడిటింగ్: దీపు ఎస్ కుమార్,
నిర్మాత: కిశోర్ పత్తికొండ,
Run Time : 149 నిముషాలు
విడుదల తేదీ: 17, మార్చి 2022