Reading Time: 3 mins

జోహార్ మూవీ రివ్యూ

సోషల్ వార్: ‘జోహార్’ రివ్యూ

Rating:2.5 /5
 
లోపాలు లేని వ్యవస్దలు ఉండవు. అయితే ఎంత తక్కువ లోపాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటామనేదాన్ని బట్టి సమాజ వ్యవస్దీకృత న్యాయం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా సంక్షేమ పధకాలు వంటివి సమాజంలో అన్ని వర్గాలకు అందాలి అంటే, ఉపయోగపడాలి అంటే అందుకు తగ్గ ఆదాయాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి. అనవసరమైన ఖర్చులు తగ్గాలి. కానీ రాజకీయనాయకులు చాలా సార్లు తమ స్వలాభం కోసం తీసుకునే కొన్ని నిర్ణయాలు భారీ ఖర్చులకు తెరతీస్తాయి. అలాంటివి వాటి భారం ప్రజలు ఎలా మోయాలి..ఎలా ఆ బరువు క్రింద పడి నలిగిపోతారనే విషయం విశ్లేషణ చేస్తూ వచ్చిన ఈ చిత్రం  ఏ మేరకు ఆకట్టుకుంటుంది…అసలు కథేంటో చూద్దాం.

స్టోరీలైన్..

మొత్తం ఐదు డిఫరెంట్ కథలతో సాగే ఇందులో యంగ్ సీఎం  విజయ్ వర్మ (చైతన్యకృష్ణ)కు రాజకీయాల్లో స్ట్రాంగ్ గా ఉండాలంటే,జనాలంతా తలఎత్తి చూసేలా,తరతరాలు పార్టీ గుర్తు గా నిలిచిపోయేలే చనిపోయిన తండ్రి జ్ఞ్యాపకార్ధం ఒక భారీ విగ్రహాన్ని నిర్మించాలని తలపెడతాడు. అందుకు సెంటర్ ఫండ్స్ లేవని చేతులెత్తేస్తే… రాష్ట్ర సంక్షేమ పథకాల బడ్జెట్ నుంచి కొంత మొత్తం లేపి, విగ్రహం లేపాలనుకుంటాడు. అయితే ఆ సంక్షేమ పథకాల్లో కోత పడితే దెబ్బ పడే దెవరకి…సమాజంలో ఏ వర్గం…ఈ విగ్రహ రాజకీయం క్రింద నలిగిపోతుంది అంటే… ఓ నాలుగు జీవితాలు కనపడతాయి.

శ్రీకాకుళం జిల్లా ప్రాంతంలో ఉండే గంగమ్మ (ఈశ్వరి రావు) భర్త ఉద్దానం కిడ్నీ సమస్యతో పోయాక తన కూతురుపైనే జీవితం పెట్టుకుంటుంది. కానీ ఆమె కూడా అదే కిడ్నీ సమస్యకు గురి అవటంతో పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేద్దామనుకుంటుంటుంది. ఆ విగ్రహానికి తీసిన బడ్జెట్ వల్ల ఆమె కష్టం వస్తుంది.

మరో ప్రక్క వారణాసిలో ఉండే టీ కొట్టు కుర్రాడు(అంకిత్ కోయా)ఓ వ్యభిచారి కూతురు జ్యోతి(ఈస్తర్ అనిల్)ని ప్రేమిస్తాడు. ఆమెని రాజమండ్రి తీసుకొచ్చి, ఇక్కడ టీ కొట్టు పెట్టుకుంటాడు. ఆమె కూడా స్కాలర్ షిప్ కు అప్లై చేసి, డాక్టర్ అవుదామనుకుంటుంది.  కానీ ఆమెకు కానరాని కష్టం ..ఈ విగ్రహం వల్ల వస్తుంది.

రాయలసీమలో వృద్ధ స్వతంత్ర్య యోధుడు బోస్(శుభలేఖ సుధాకర్)శిధిలమవుతున్న తన అనాధ పిల్లల ఆశ్రమానికి కావలసిన నిధుల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నిధి సాంక్షన్ అయ్యిందనుకున్న సమయంలో విగ్రహం వల్ల సమస్య వస్తుంది.

వైజాగ్ రోడ్ల మీద సర్కస్ చేసే బాల(నైనా గంగూలి)తనకిష్టమైన పరుగు పందెంలో ఒలంపిక్స్ మెడల్ తెచ్చుకునే లక్ష్యంతో కష్టపడుతూ ఉంటుంది. ఆమెకు విగ్రహం వల్లే సమస్య ఉత్పన్నమవుతుంది. అసలు వీళ్ళ జీవితాలకు పైన చెప్పిన విగ్రహ రాజకీయ నేపధ్యానికి సంబంధం ఏమిటి? ఆ రాజకీయ పరిణామాలు ఎటు దారి తీశాయి అన్నది అసలు కథ.

కథ,కథనం
 
ఇలా నాలుగైదు కథలను మరో కథతో ముడి పెట్టి చెప్పటాన్ని ఆంథాలజీ అంటారు. ఇదే నేరేషన్ లో సాగే ఈ కథ స్టోరీ లైన్ గా బాగుంది, కానీ విస్తరణ దిశలో దశ కోల్పోయింది. అన్ని ఒకే రకమైన బాధలుగా కనపడతాయి. అలాగే ఈ కథలో పరిష్కారం అనేది సైతం కనపడదు. ఇది కాస్తంత వెలితిగా ఉంటుంది. ఓ రాజకీయవర్గాన్ని టార్గెట్ చేస్తూ కథ చేయాలనే తపనే తప్ప..ఆ కథకు ముగింపు ఆలోచించలేదు దర్శకుడు. సమస్యను చూపించి వదిలేయటానికి దాన్ని సినిమాగా తీయాల్సిన పనిలేదు. అయితే రెగ్యులర్ రొటీన్ అంశాలను ఎత్తుకోకుండా ఇలా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న విగ్రహ రాజకీయాలను స్పృశిస్తూ సినిమా చేయటం మాత్రం గొప్ప విషయమే. అలాగే కాస్తంత కథను పరుగెట్టించాల్సింది. మెల్లిగా నత్త నడక నడవటంతో సినిమా బోర్ కొట్టేసింది చాలా చోట్ల. దానికి తోడు ఎక్కడా ఎంటర్టైన్మెంట్ అనేది లేకుండా పోయింది. ఉద్దానం కిడ్నీ సమస్య, వేశ్య కూతురు చదువుకువాలనుకోవటం, అనాధ పిల్లల కోసం ఆశ్రమం ఫండ్స్ ఇవన్ని ఎన్నో సార్లు సినిమాల్లో వాడిసిన అంశాలే కావటంతో చాలా ప్రెడక్టుబులిగా అనిపించింది.
 
నటీనటులు, దర్శకత్వం…

మొదట హైలెట్ గా చైతన్య కృష్ణ గురించి చెప్పుకోవాలి.  చాలా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో  సిఎంగా చైతన్య కృష్ణ అందులో కూల్ గా ఒదిగిపోయాడు.   ఈశ్వరిరావు, శుభలేఖ సుధాకర్ లు వంటి సీనియర్స్.. తమకలవాటైన రీతిలో అనుభవంతో అలవోకగా చేసుకుంటూ పోయారు.  యువ నటి ఈస్తర్ కూడా తన రోల్ ను నీట్ గా ప్లే చేసింది.  గంగూలీ విషయానికి వస్తే ఇంతకాలం వరకు గ్లామరస్ రోల్స్ లో కనిపించిన ఈమె ఈ చిత్రం ద్వారా ఒక సరికొత్తగా ఆమెను ఆవిష్కరించుకుంది అని చెప్పాలి.  కొత్త వాళ్ళు సైతం తమ యాక్టింగ్ తో మెప్పించడం ఇందులో స్పెషల్ ఎట్రాక్షన్. ఇక దర్శకుడు ఎక్కడా డీవియేట్ అవకుండా సినిమాని బాగా నడిపించారు. అందరి నుంచి మంచి నటన రాబట్టారు.

టెక్నికల్ గా
 
ఈ సినిమాకు బాగా కలిసొచ్చినవి.. కెమెరా పనితనం,బ్యాక్గ్రౌండ్ స్కోర్ . చాలా సీన్స్ ఈ రెండింటి వల్లే నిలబడ్డాయంటే అతిశయోక్తి కాదు. అలాగే  దర్శకుడు కథనం పరంగా చెప్పిన కొన్ని ఎలిమెంట్స్ కూడా  కూడా బాగున్నాయి. నిర్మాణ విలువలు..రిచ్ గా ఉన్నాయి. మిగతా డిపార్టమెంట్స్ సినిమా స్టాండర్డ్స్ తగ్గట్లే ఉన్నాయి.
 
చూడచ్చా…

ఓ విభిన్న తరహా చిత్రం చూద్దామనుకుంటే మంచి ఆప్షన్.

ఎవరెవరు..
 
నటీనటులు: నైనా గంగూలీ, చైతన్య కృష్ణ, ఎస్తర్ అనిల్, ఈశ్వరి రావు, శుభలేఖ సుధాకర్..
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం:తేజ మర్ని
నిర్మాత: సందీప్ మర్ని
సంగీతం: ప్రియదర్శన్
రన్ టైమ్: 2 గంటల 2 నిమిషాలు
రిలీజ్ డేట్: ఆగష్టు 14, 2020