జ్యోతిక LLB ( ‘పొన్మంగల్ వందాల్’ రివ్యూ )
Rating:2/5
ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తామని ప్రకటించగానే తమిళ చిత్ర పరిశ్రమలో దుమారం రేగింది. అయినా, సరే మాకుండే సమస్యలు మాకున్నాయి..వాటిని మీరు తీర్చలేరు కదా అంటూ దర్శక-నిర్మాతలు అటువైపే మొగ్గు చూపారు. అమెజాన్ ప్రైమ్ లో డైరక్ట్ గా విడుదలైన తొలి తమిళ సినిమాగా వార్తల్లో నిలిచింది. ఈ నేపధ్యంలో ఈ సినిమా ఎలా ఉంది? జ్యోతిక నటన ఓటీటి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా?థియోటర్ లో రిలీజైతే హిట్టయ్యే సినిమాయేనా…అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ ఇదే..
వెన్బా (జ్యోతిక) 15 ఏళ్ల క్రితం మూసేసిన ఓ లేడీ సైకో కిల్లర్ కేసు తిరిగి ఓపెన్ చేయించే ఓ లాయిర్ . పిటీషన్ పేతురాజ్ (భాగ్యరాజ్) ఆమె తండ్రి. ఆయన కాస్త బిల్డప్ మనిషి కావటంతో..పబ్లిసిటీ కోసం ఇదంతా చేసారని అందరూ భావిస్తారు. అయితే పబ్లిసిటీని మించిన వ్యవహారం ఏదో ఉందని మెల్లిగా అందరికీ అర్దమవుతుంది. ఎందుకంటే ఆ లేడీ సైకో కిల్లర్ కుమార్తె వెన్బా అని రివీల్ అవుతుంది. ఓహో తన తల్లి మీద పడిన సైకో అనే మచ్చను తొలిగించటానికి రంగంలోకి దిగిన కూతురు కథ అని అర్దమవుతుంది. అయితే ఇంత కథకు ఓ విలన్ ఉండాలి కదా. ఉన్నాడు ఆయనే… వరదరాజన్ (త్యాగరాజన్). ఈయన ఈ కేసు రీ ఓపెన్ చేసిన నాటి నుండీ టెన్షన్ పడుతూంటాడు. తన పరువు పోతుందని వణికిపోతూంటాడు. ఆయన సమాజంలో ఓ పెద్ద వ్యక్తి…బిజినెస్ మ్యాన్.పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ రోజు రోజుకీ పేరు పెంచుకుంటున్న పెద్ద మనిషి. ఆయనకు ఈ కేసుకు లింకేంటి…ఆయన ప్రత్యేకంగా ప్రముఖ లాయిర్ రాజారత్నం (పార్దీపన్)ని ఆమెకు పోటీగా రంగంలోకి దించటం వెనక అసలు కారణం ఏమిటి..ఆ ఓ మహిళా కిల్లర్ అసలు కథేంటి..ఈ కేసులో ఇంకెవరి ప్రమేయం ఉంది..వెన్బా ఏ విధమైన ఒత్తిడులు ఎదుర్కుంటుది..ఏ వార్నింగ్ లు తట్టుకుని కేసు గెలుస్తుంది వంటి విషయాలు తెలియాలంటే అమేజాన్ ప్రైమ్ కు లాగిన్ అవ్వాల్సిందే.
ఎలా ఉంది ..
జ్యోతిక ఫెరఫార్మెన్స్ ప్రక్కన పెడితే ఈ సినిమాలో అంత చెప్పుకోదగ్గ విషయం ఏమీ కనపడదు. జ్యోతిక లాయిర్ పాత్ర చేసింది కాబట్టి లీగల్ థ్రిల్లర్ అనుకోవాలి తప్ప..ఆ ఛాయిలు ఏమీ పెద్దగా కనపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే చేసారనిపిస్తుంది. పోనీ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ అందాము అంటే పోలీస్ లు ఓ ప్రొసీజర్ అంటూ ఏదీ ఫాలో కారు. ఇవన్నీ కాదండీ ఓ డిటెక్టివ్ స్టోరీ..ఓ సీరియల్ కిల్లర్ మర్డర్ మిస్టరీని ఛేధించిన విషయం అందాము అంటే ఆ నేరేషన్ కనపడదు. సినిమాలో ఎక్కువ సీన్స్ కోర్ట్ లో ఉన్నాయి కాబట్టి కోర్ట్ రూమ్ డ్రామ్ అని ఫిక్స్ అవ్వాలి. అలాగే డ్రామా అనేదానికన్నా మెలోడ్రామా అంటే పద్దతిగా ఉంటుంది. ఎందుకంటే కన్నీళ్లతోనే కోర్టుని కన్వీన్స్ చేసే లాయిర్ కథ ఇది.
ఆ మధ్యన హిందీలో జాలీ ఎల్ ఎల్ బి, జాలీ ఎల్ ఎల్ బి 2 అంటూ రెండు సినిమాలు వచ్చాయి. వాటిని చూసి అలాంటి కథ చేసుకున్నాడు దర్శకుడు అని స్పష్టమవుతుంది. ఓ సినిమాని చూసి ప్రేరణ పొంది మరో సినిమా చెయ్యటం కొత్తా కాదు..తప్పూ కాదు..వింత అంతకన్నా కాదు కాబట్టి దాన్ని లెక్కలోకి తీసుకోనక్కర్లేదు. కానీ అలాగే తీయాలన్న తాపత్రయం ఉంది చూసారూ..అది ఇబ్బంది పెట్టే వ్యవహారం. అలాగే సినిమాకు తీసుకున్న చైల్డ్ అబ్యూజ్ అంశం సమాజంలో చర్చించదగ్గదే. దాని చుట్టూ ఈ కోర్ట్ రూమ్ డ్రామా అల్లారు. అదీ ఓకే. కాకపోతే అంతా డైలాగులతో చెప్పేస్తే ఇంక సినిమాకు అర్దమేంటి..నాటకానికి సినిమాకు తేడా ఏముంటుంది. కాస్తంత విజువల్ సెన్స్ తో ముందుకు వెళ్లాలి కదా. అంతేకాకుండా ఎంత హీరోయిన్ ఓరియెంటెడ్ కథ అయితే మాత్రం ఆ పాత్రను మరీ ప్యాసివ్ గా మార్చేయాలా..కోర్టులో వాదించటం తప్ప ఆ పాత్ర..నిజ నిర్దారణ కోసం ఏమీ కృషి చెయ్యదు. అలా చెయ్యలేని పాత్రను తెరకెక్కించి ఉపయోగం ఏమిటి.. అసక్తి అనేది ఉండదు కదా.
ఓటీటి రిలీల్ విషయం..
ఈ సినిమాని ఓటీటిలో రిలీజ్ చెయ్యాలన్న పట్టుదల చూసి సూర్య …పొరపాటున కంగారుపడి ఈ నిర్ణయం తీసుకుున్నాడా అనిపించింది. అదే సమయంలో ఏ నిగూఢ అవసరం ఉండి ఈ సినిమాని థియోటర్ రిలీజ్ దాకా ఆగకుండా ఓటీటికు వచ్చేసాడు అనే సందేహమూ వచ్చింది. అయితే ఈ సినిమా ప్రారంభమైన పదినిముషాల్లోనే మన సందేహాలకు సమాధానం దొరికేస్తుంది. ఈ సినిమా ఫెరఫెక్ట్ ఓటీటి మాల్ అని కన్ఫర్మ్ అవుతుంది. థియోటర్ లో రిలీజ్ చేసినా పెద్దగా ఒరిగేదేమీ లేదని తెలుస్తుంది. ఆ విషయం పసిగట్టిన సూర్య ధైర్యంగా కాకుండా తెలివిగా ఈ దారి ఎంచుకున్నాడని క్లారిటీ వచ్చేస్తుంది. సినిమా పూర్తిగా టీవిలో నడిచే సీఐడీ సీరియల్ ని తలపిస్తుంది. అసలు ఓ టైమ్ లో అయితే ఓటీటి కోసమే చేసారేమో అని డౌట్ కూడా వచ్చేస్తుంది. ఇన్ని ఒకేసారి బుర్రలోకి వచ్చేసాక…మిగతా సినిమా పూర్తి చేయటం కేవలం ఎదురుగా సినిమా ఉంది, క్లైమాక్స్ ఏదో త్వరగా చూద్దామనే ఆలోచన కు దారి తీయిస్తుంది. ఇలాంటి సినిమాలు థియేటర్ రిలీజ్ స్కిప్ చేయటమే బెస్ట్.
టెక్నికల్ గా
అయితే ఈ కోర్టు డ్రామా లో జ్యోతిక, పార్తిబన్, భాగ్యరాజా లాంటి గొప్ప స్టార్ల నట ప్రతిభ మెస్మరైజ్ చేస్తుంది. ట్విస్ట్ అక్కడక్కడా మెరుస్తాయి.ఈ చిత్రాన్ని సూర్య తన సొంత బ్యానర్ లోనే కాస్తంత రిచ్ గానే నిర్మించారు. టెక్నికల్ గా ఎడిటింగ్ ఏమంత బాలేదు. కెమెరా వర్క్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే అమిరింది. కథ,కథనం మరింత నావెల్టీగా ఉంటే బాగుండేది. దర్శకత్వం సోసోగా ఉంది. ఏదో చెప్పాలని తాపత్రయం కనపడుతోంది కానీ దాన్ని విజువలైజ్ చేసి తెరకెక్కించే సామర్ధ్యం అయితే కొరవడింది.
చూడచ్చా..
చూస్తే నష్టమేమీ లేదు…కొద్దిపాటి కాలక్షేపం అంతే
తెర వెనక..ముందు
నటీనటులు: జ్యోతిక, పార్తిబన్, కె.భాగ్యరాజ్, త్యాగరాజన్, పాండియరాజన్, ప్రతాప్ పోతన్ తదితరులు
సంగీతం: గోవింద వసంతన్
ఎడిటింగ్: రుబెన్
సినిమాటోగ్రఫీ: రాంజీ
నిర్మాత: సూర్య
కథ, దర్శకత్వం: జె.జె.ఫెడ్రిక్
బ్యానర్: 2డీ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల: అమెజాన్ ప్రైమ్