Reading Time: 2 mins

డిస్నీ హాట్ స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్




ప్రస్తుతం సినీ ప్రపంచంలో ఓటీటీ సంస్థల హవా ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఇక ఇది వరకు ప్రాంతీయ భాషల మీద అంతగా ఫోకస్ పెట్టని ఓటీటీ సంస్థలు అన్నీ కూడా ఇప్పుడు కొత్త అడుగులు వేస్తున్నాయి. ప్రతీ భాషలోని కంటెంట్‌పై ఓటీటీ దృష్టి పెడుతోంది. ప్రాంతీయ భాషల్లోకి ఓటీటీ సంస్థలు అడుగుపెడుతున్నాయి. ఈ క్రమంలోనే డిస్నీ హాట్ స్టార్ కూడా తెలుగులోకి రాబోతోంది. డిస్నీ హాట్ స్టార్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించ బోతోన్నారు. మన వినోద విశ్వం అనే ట్యాగ్‌లైన్‌తో రామ్ చరణ్ డిస్నీ హాట్ స్టార్‌ను ప్రమోట్ చేయనున్నారు.

తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించేందుకు, అలరించేందుకు డిస్నీ హాట్ స్టార్ అన్ని రకాలుగా ప్రణాళికలను సిద్దం చేసింది. టాలీవుడ్ టాప్ స్టార్‌ హీరోల సినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఇక జాతీయ, అంతర్జాతీయ స్థాయి చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. అంతేకాకుండా వీవో ఐపిఎల్ 2021, ఐసీసీ టీ20 వరల్డ కప్ 2021ను కూడా తెలుగు వారికి అందిస్తోంది.

డిస్నీ హాట్ స్టార్ సంస్థ కంటెంట్ హెడ్ సౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ.. ‘ఇండియాలోని కంటెంట్‌ను కొత్త పుంతలు తొక్కించేందుకు మేం ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాం. ఇక ఇప్పుడు తెలుగు వినోద ప్రపంచంలోకి అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉంది. మా ప్రేక్షకుల కోసం మరింత విభిన్నమైన కంటెంట్‌ను అందించేందుకు క్రియేటివ్ మైండ్స్‌తో జత కడుతున్నాం. ఇప్పటికే మాస్ట్రో, అనబెల్లె సేతుపతి వంటి చిత్రాలతో ముందుకు వచ్చాం. ప్రస్తుతం ప్రాంతీయ కంటెంట్‌కు ఉన్న ఆదరణ అందరికీ తెలిసిందే. గత ఏడాది తమిళంలో అడుగుపెట్టాం. సక్సెస్ సాధించాం. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నాం’ అని అన్నారు.

డిస్నీ హాట్ స్టార్ గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘ఇండియాలో కంటెంట్‌కు దిక్సూచిలా డిస్నీ హాట్ స్టార్ నిలుస్తోంది. ఏ క్లాస్ గ్లోబల్‌, ఇండియన్, ప్రాంతీయ భాషల చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తోంది. సినిమాలే కాకుండా వివిధ భాషల్లో వెబ్ సిరీస్‌లను తీసుకొస్తోంది. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్‌లోకి డిస్నీ హాట్ స్టార్ ప్రవేశిస్తుండటంతో టాలీవుడ్‌లోని మేకర్స్, నటులకు అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. తెలుగు వినోద ప్రేమికులను తమ కంటెంట్‌తో డిస్నీ హాట్ స్టార్ అలరిస్తుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.

ప్రస్తుతం డిస్నీ హాట్ స్టార్‌లో నితిన్, నభా నటేష్, తమన్నా నటించిన మాస్ట్రో, విజయ్ సేతుపతి, తాప్సీ కాంబోలో వచ్చిన అనబెల్లె సేతుపతి అందుబాటులో ఉన్నాయి. ఇక అంతే కాకుండా స్వాత్రంత్య్ర‌ సమరానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్‌లో తెరకెక్కించిన అన్ హర్డ్ వెబ్ సిరీస్ కూడా ప్రసారం అవుతోంది. హైద్రాబాద్ స్టేట్ విలీనంపై అప్పటి పరిస్థితుల ఆధారంగా ఆదిత్య కేవీ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌ను రాధికా లావు, ఎల్లనర్ ఫిల్మ్స్ నిర్మించారు. ఇక ఇవే కాకుండా రీసెంట్‌గా ఘర్షణ, 9 అవర్స్, ఝాన్సీ వంటి సినిమాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక రియాల్టీ షో అభిమానులను ఆకట్టుకునేందుకు నాగార్జున బిగ్ బాస్ షో కూడా అందుబాటులో ఉంది.