డి కంపెనీ మూవీ రివ్యూ
వర్మ ‘డి కంపెనీ’ రివ్యూ
Rating:2/5
రామ్ గోపాల్ వర్మ కు సెపరేట్ ఫాలో ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎన్ని ప్లాప్ లు ఇచ్చినా గ్రేట్ ఫిల్మ్ మేకర్ గా ఆయనకు ఉన్నగుర్తింపు పోలేదు. ప్లాఫ్ వచ్చిన ప్రతీ సారీ…. మొదటి సినిమా ‘శివ’ ని గుర్తు చేసుకుంటారంతా. ఎప్పటికప్పుడు వర్మపై ఆయన ఫ్యాన్స్ లో పిచ్చ ఎక్సపెక్టేషన్స్. ఎప్పటికైనా అద్భుతం సృష్టిస్తాడని గంపెడాశలు. అంతెందుకు ’రాముయిజం’ అంటూ సెపరేట్ గ్రూపే వుంది ఆయనకు. ఇలా ఆయన్ను అభిమానించే వారిని ఎప్పటికప్పుడు డిజప్పాయింట్ చేయటమే పనిగా పెట్టుకున్న వర్మ ఈ సారి ‘డి కంపెనీ’ అంటూ రంగంలోకి దూకాడు. తన క్రేజ్ కు దావూద్ ఇబ్రహీం క్రేజ్ ని ముడేసాడు. అంచనాలు కొద్దగా క్రియేట్ చేసాడు. వాటిని వర్మ ఈ సారైనా అందుకున్నాడా..ఎప్పటిలాగే తూతూ మంత్రం అనిపించేసాడా చూద్దాం.
స్టోరీ లైన్
ఓ చిన్న కానిస్టేబుల్ కొడుకైన దావూద్ ఇబ్రహీం (అశ్వంత్ కాంత్) తన బ్రదర్ సాబీర్ (రుద్ర కాంత్)తో కలిసి ఒక గ్యాంగ్ ను ఏర్పాటు చేస్తాడు. లోకల్ దందాలు మొదలెడతాడు. తన తెలివితేటలతో తక్కువ టైంలోనే ముంబైలో బాగా ఎదుగుతారు. అయితే జీవితం వారిని ఉన్నచోట ఉండనివ్వదు. రకరకాల సమస్యలను వారి ముందు పెడుతుంది. చాకచక్యంగా వాటిని దాటుతారు. హింసనే ప్రధాన ఆయుధంగా నమ్ముకుంటారు. అడ్డొచ్చినవాళ్లని అడ్డంగా తొలిగించుకుంటారు. న్యాయం,ధర్మం అనే మాటలకు అర్దం లేనట్లు బిహేవ్ చేస్తారు. ఈక్రమంలో రైవల్ గ్యాంగ్ లు ఏర్పడతాయి. వాటితో సమస్యలు వస్తాయి. ఈ క్రమంలో దావూద్ ప్రేమించిన సుజాత ( నైనా గంగూలీ)లవ్ స్టోరీ ఒకటి. ఇలా లోకల్ డాన్ గా ఎదుగుతన్న దావూద్ ఇబ్రహీం ప్రయాణం ..అసలు అండర్ వరల్డ్ కింగ్ వైపు ఎలా సాగింది. తన అన్న సాబిర్, లవర్ సుజాత ఏమయ్యారు. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్..
ప్రతీ సారీ వర్మ ఏదో ఒక పబ్లిక్ ఫిగర్ నో లేక వివాదాస్పద వ్యక్తినో పట్టుకుని సినిమా చేయటం, ఫ్రీ పబ్లిసిటి పొందటం కామన్ గా జరుగుతోంది. రక్త చరిత్ర నుంచి ఇదే పద్దతి కొనసాగిస్తున్నారు. సినిమాలో ఏదో ఉంది అని ఆసక్తిరేపటం ఆనక సినిమాలో ఏమీ లేదని తేల్చేయటం కామన్ గా జరుగుతోంది. ఈ సినిమాకూ అదే జరిగింది. వరల్డ్ ఫేమస్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా డి కంపెనీ అని ప్రకటించాడు. తన అభిమానుల్లో కాస్త ఎక్సపెక్టేషన్స్ పెంచాడు. దావూద్ ఇబ్రహీం జీవిత కథ అనగానే….అతను ముంబయిలో చేసిన అరాచకాలు, ఉగ్రవాదులతో కలిసి చేసిన దాడులు లాంటివన్నీ చూపిస్తాడని భావిస్తాము. కానీ అవేమీ సినిమాలో కనిపించలేదు. ‘డి కంపెనీ’ మొదటి భాగంలో చూపించిందంతా ఎనభైవ దశకంలో ముంబయిని గుప్పెట్లో ఉంచుకుని గ్యాంగుల మధ్య అంతర్గత కలహాలే చూపిస్తాడు. మిగతా మనం కోరుకునేవన్నీ సెకండ్ పార్ట్ లో చూపిస్తామని ముగించేసాడు. దావూద్ లోకల్ స్దాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి అతడి ఎదుగుదల అంతా ఇంకో పార్ట్‌లో చూపిస్తాడని చెప్తున్నారు. అయితే ఈ విషయం వర్మ ముందు చెప్పలేదు. దాంతో ఒకేసారి దావూద్ కథంతా చూసేద్దామని ఆశించి కూర్చున్న ప్రేక్షకులకు ఫస్ట్ పార్ట్ షాకిచ్చినట్లైంది.
టెక్నికల్ గా …
సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. ఎడిటింగ్ మాత్రం కాస్త ట్రిమ్ చేయాలనిపిస్తుంది. విజువల్ గా సినిమా బాగానే ఉన్నప్పటికీ…స్క్రిప్టు సమస్యలే బోర్ కొట్టేసాయి. స్క్రీన్ ప్లే అసలు సరిగ్గా రాసుకోలేదు. ముఖ్యంగా నలభై ఏళ్ళ క్రితం ముంబై ఎలా ఉండేదో, దావూద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ లో తక్కువ కాలంలోనే లీడర్ గా ఎలా ఎదిగాడు అనేది బాగానే చూపించాడు రామ్ గోపాల్ వర్మ. అయితే అండర్ వరల్డ్ సీన్స్ కూడా రొటీన్ సాగి విసిగిస్తాయి.
చూడచ్చా
ఒకప్పుటి వర్మను గుర్తు చేసుకుంటూ ఆ తరహా మ్యాజిక్ ‘డి కంపెనీ’ లో ఎక్సపెక్టే చేస్తే పూర్తి నిరాశే కలుగుతుంది.
ఎవరెవరు
నటీనటులు : అశ్వత్ కాంత్-నైనా గంగూలీ-రుద్ర్ కాంత్-ఐరా మోర్-అభిలాష్ చౌదరి-హేరంబ్ త్రిపాఠి-వినోద్ ఆనంద్-రాకీ మహాజన్ తదితరులు
సంగీతం : పాల్ ప్రవీణ్
ఎడిటర్ : సంఘ ప్రతాప్ కుమార్
సినిమాటోగ్రఫీ : మల్హర్ భట్ జోషి
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
నిర్మాత : సాగర్ మాచనూరు
ఓటీటి : స్పార్క్
రన్ టైమ్: 1 గంట 29 నిముషాలు
విడుదల తేదీ: మే 15, 2021