డైరెక్టర్ తేజ విలేకరుల సమావేశం
అహింస’ డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేసిన కమర్షియల్ ఎంటర్ టైనర్. కథ, విజువల్స్, మ్యూజిక్ కొత్తగా ఉంటాయి: డైరెక్టర్ తేజ
వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. జూన్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో డైరెక్టర్ తేజ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
సినీ నేపథ్యం వున్న వారిని పరిచయం చేసినప్పుడు ఎలాంటి సవాళ్లు వుంటాయి ?
రామానాయుడు గారి ఫ్యామిలీ లోని అబ్బాయితో చేశాం. ఇలా సినీ నేపథ్యంలో వున్న పెద్ద కుటుంబాలలోని వ్యక్తులతో చేసినప్పుడు సహజంగానే పోలికలు వస్తాయి. ప్రతిది భూతద్దం పెట్టి చూస్తారు. అభిరాం కొత్తగా వచ్చాడు. కొత్తవారిలో బెరుకు, భయాలు సహజంగా ఉంటాయి. కానీ ఈ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఇంకా ఎక్కువగా చూస్తారు. ఆల్రెడీ స్టార్స్ అయిన వెంకటేష్, రానాలతో పోలిక పెట్టి చూస్తారు. దీంతో వారందరినీ దాటి ముందుకు రావడం చాలా కష్టం.
కానీ ప్రేక్షకులు అటెన్షన్ వుంటుంది కదా ?
ఎం ఉండదండీ ..ప్రేక్షకులు చాలా తెలివైన వారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాకి వెళ్ళాలా ?వద్దా ? అనేది డిసైడ్ అయిపోతారు. స్టార్ ని బట్టి వెళితే అసలు పెద్ద స్టార్స్ కి అపజయాలే రాకూడదు కదా. సినిమాలో ఎమోషన్ వుంటే ట్రైలర్ కి వస్తుంది. ప్రేక్షకులు ఆ ఎమోషన్ కి కనెక్ట్ ఐతే స్టార్ సినిమా ? కొత్తవారిదా ? అనే తేడా లేకుండా వచ్చేస్తారు. ఎమోషన్ కనెక్ట్ అయితే ఎవరి సినిమా అయినా ఆపలేం.
ఇంతకుముందు మీరు పరిచయం చేసిన వారికి అభిరామ్ కి ఎలాంటి వ్యత్యాసం చూపించబోతున్నారు?
కథే చూపిస్తుంది. కథకు ఏం అవసరమో అది చేశాం. ఫలానా స్టార్ అబ్బాయి కాబట్టి ఫలానా ఎలిమెంట్స్ ఉండాలని నేను ఎప్పుడూ సినిమాలు చేయలేదు. కథ ఎటు తీసుకెళితే అటు వెళ్ళడమే నాకు తెలుసు.
అభిరామ్ ని పరిచయం చేయడనికి కారణం?
చాలా సార్లు చెప్పాను. నేను రామానాయుడు గారికి మాట ఇచ్చాను. ఆ మాట కోసమే చేశాను.
మీరు చాలా మంది కొత్తవారిని పరిచయం చేశారు కదా.. ఇప్పటికి చేస్తూనే వున్నారు.. ఇది ఒత్తిడి గా అనిపించడం లేదా ? పెద్ద స్టార్స్ తో పెద్ద సినిమాలు చేయాలనే లెక్కలు వేసుకోరా ?
పెద్ద స్టార్స్ తో ఎక్కువ డబ్బులు కోసం, ఎక్కువ పేరు కోసం చేయాలి. నేను డబ్బులు, పేరు చూశాను. నేను ఒకప్పుడు ఫుట్ పాత్ మీద వుండేవాడిని. ఓ కెమెరామెన్ దగ్గర డబ్బులు ఇచ్చినా, ఇవ్వకపోయినా పని చేసేవాడిని. నా పని చూసి ఆయన బ్రేక్ ఇచ్చారు. పుట్ పాత్ నుంచి వచ్చిన నాకు ఆయన బ్రేక్ ఇచ్చారు. నాలా చాలా మంది వున్నారు. చాలా ప్రతిభ వుండి కూడా ఎలా ఎంటర్ అవ్వాలో తెలీదు. వాళ్ళకి నేను బ్రేక్ ఇస్తాను. లైఫ్ ఇస్తాను. ఎక్కడి నుంచో సినిమాపై ఆసక్తితో అనామకులు వస్తారు. వాళ్లకి ఎవరున్నారు ? నేనున్నాను. నేనున్నంత వరకూ ఇస్తాను. నన్నెవరూ మార్చలేరు (నవ్వుతూ). ఓ పెద్ద స్టార్స్ తో సినిమా చేసినా అందులో కొత్తవారిని పెడతాను.
మీరు పెద్ద సినిమాలు చేయాలనే ఒత్తిడి మీ కుటుంబం నుంచి ఉంటుందా ?
లేదు. వాళ్ళకు డబ్బులు, ఆస్తులపై ఆసక్తి లేదు. ఫలానా వారిలా సినిమా తీయాలని కూడా చెప్పరు.
అహింసలో యాక్షన్ సీక్వెన్స్ లు ఎక్కువగా ఉంటాయని విన్నాం ?
అవును. ఇందులో దాదాపు 14 యాక్షన్ సీక్వెన్స్ లు వున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కథలో వెళ్తుంటాయి. ఇందులో ఓ నాలుగు ఎపిసోడ్స్ కి నేనే ఫైట్ మాస్టర్ గా చేశాను.
ఇన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉండటం కొత్త నటుడికి భారం కాదా?
తనకి వచ్చిన కష్టాలనుంచి బయటపడే ప్రయాణంలో యాక్షన్ సీక్వెన్స్ లు పెట్టాం తప్ప ఫలానా ఫైట్ లో వందమందిని కొట్టాలనే లెక్కలు వేసుకుని పెట్టలేదు. అది మనకి చేతకాదు కూడా (నవ్వుతూ). ఇది ఒక ఫిలాసఫీని బేస్ చేసి చేసిన కథ. అహింస వాదంపై సరైన క్లారిటీ లేదు. దేశంలో చాలా హింసాత్మక సంఘటనలు జరిగాయి. అహింస వాదాన్ని ఫాలో అయితే అవి జరగకూడదు. ఫాలో కాకపోవడానికి కారణం.. మనకి అది అర్థం కావడం లేదు. దానిని క్లారిటీగా చెప్పలేదు. అసలు అది కరెక్టా కాదా ? దాన్ని ఎలా ఫాలో అవ్వాలి ? అనే కాన్సెప్ట్ ని పట్టుకొని మంచి కమర్షియల్ కథే చేశాం.
మధ్యప్రదేశ్ అడవుల్లో షూట్ చేయడానికి కారణం ?
లోకేషన్స్ చాలా బాగున్నాయి. కొత్త లోకేషన్స్. ఇప్పటివరకూ ఏ సినిమాలో రాలేదు. కథ చెప్పినపుడు విజువల్, ఆడియో, నేపథ్యం అన్నీ కొత్తగా ఉండాలని అక్కడ షూట్ చేశాం.
ఆర్పీ పట్నాయక్ తో చాలా కాలం తర్వాత మ్యూజిక్ చేయించారు ?
మ్యూజిక్ చాలా పవర్ ఫుల్. ఆ మ్యూజిక్ నుంచి కథ చెప్పడానికి ప్రయత్నిస్తుంటాను. ట్యూన్ , లిరిక్స్ అన్నీ కథని ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే భారం ఎక్కువగానే వేస్తాను.
ఆర్పీ పట్నాయక్ చాలా పాటలు ఇచ్చారు. అనూప్ నేపథ్య సంగీతం చేశారు. ఇద్దరూ కలిసే చేశారు.
గీతక తీవారిని ఎంచుకోవడానికి కారణం ?
ఐదుగురిని ఎంపిక చేశాం. నా కథలో ఎమోషన్ సరిగ్గా తేగలరా లేదా అని చూశాం. మా టీం తక్కువ మార్కులు ఈ అమ్మాయి కే వేశారు. సరే పెట్టేద్దామని పెట్టేశాం(నవ్వుతూ)
సినీ నేపథ్యం వున్న వారిని పరిచయం చేసిన్నపుడు ఒత్తిడి ఉంటుంది కదా ? సురేష్ బాబు గారు సెట్స్ కి వచ్చారా ?
నా కంటే అభిరామ్ మీద ఎక్కువ ఒత్తిడి వుంటుంది. సురేష్ బాబు గారు ఒకసారి వచ్చారు. ‘’నాన్న నువ్వు వుంటే నేను చేయను’’ అన్నాడు అభి.(నవ్వుతూ) ఇన్ని సినిమాలు చేసిన వెంకటేష్, రానాకి కూడా సురేష్ బాబు గారు సెట్ కి వస్తే ఒక టెన్షన్ వచ్చేస్తుంది. (నవ్వుతూ). ఆయన దృష్టి వేరుగా వుంటుంది.
రానా గారితో చేసే సినిమా ఎలా వుంటుంది ?
రాక్షస రాజు అనే టైటిల్ అనుకుంటున్నాం. పాలిటిక్స్, క్రైమ్ నేపథ్యంలో వుంటుంది. గాడ్ ఫాదర్ తరహా సినిమా. ఆచంట గోపీనాథ్ గారు దీనికి నిర్మాత. జూన్ 6 రామానాయుడు గారి పుట్టిన రోజు. ఆ రోజు నుంచి స్టార్ట్ చేద్దామని రానా అన్నారు.
మీరు ఒక ఎగ్జిబిటర్ కూడా.. ఇప్పుడు థియేటర్ బిజినెస్ ఎలా వుంది ? వ్యక్తిగతంగా ఎగ్జిబిటర్స్ రన్ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది కదా?
థియేటర్ బిజినెస్ బాగుంది. నిజానికి థియేటర్ అమ్మేస్తే చాలా డబ్బులు వస్తాయి. బ్యాంకు లో వేసుకొని హాయిగా కూర్చోవచ్చు. నాకు అది ఇష్టం లేదు. నష్టమైన లాభమైన పని చేస్తూ ఉండాలి. స్టూడియో, థియేటర్ నాకు గుడి లాంటివి. ఈ గుడిలో మొదలై ఆ గుడిలో రిలీజ్ అవుతాయి. ఈ రెండు గుళ్ళ మధ్య సూపర్ స్టార్స్ తయారవ్వడం జరుగుతుంది. ఈ రెండు గుళ్ళని కాపాడుకోవాలి.
మీ లక్ష్యం ఏమిటి ?
అహింస విజయం సాధించి డబ్బులు వస్తే ఆ డబ్బుతో మళ్ళీ సినిమాలు తీస్తా. నా డైరెక్షన్ కాకుండా కొత్త దర్శకులని కొత్తరకం సినిమాలు తీసే దర్శకులని, ఇండస్ట్రీ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళే దర్శకులని తీసుకురావాలని నా కోరిక. రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం, శేఖర్ కమ్ముల, తేజ.. ఇలా అందరికీ ఒక్కొక్క స్టైల్ వుంది. ఇలా కొత్త స్టైల్ వుండే దర్శకులని చిత్రం సినిమా పై పరిచయం చేయాలని నా కోరిక. దీని వలన సినిమా ఇంకా బెటర్ అవుతుంది.