తరుణ్ అరోరా ఇంటర్వ్యూ
స్టైలిష్ విలన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన నటుడు తరుణ్ రాజ్ అరోరా. `ఖైదీ నంబర్ 150` తర్వాత మళ్లీ `అర్జున్ సురవరం`లో ప్రతినాయకుడిగా నటించాడు. కథానాయికగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమైన అంజలా జవేరి భర్తే తరుణ్ అరోరా. ఇటీవల `అర్జున్ సురవరం` విడుదలైన సందర్భంగా తరుణ్ అరోరా తో ఇంటర్వ్యూ…
నా కెరీర్ మొదట మోడలింగ్ తో స్టార్ట్ అయ్యింది. అందుచేత నేను ప్రతి సినిమాలో స్టైలిష్ గా కనిపిస్తాను. అది నటనలోనూ కనిపించేలా చూసుకోవడం నా బాధ్యత. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యానని సంతృప్తి ఉంది.
నిఖిల్ అర్జున్ సురవరం లో చాలా మంచి పాత్రలో నటించాను. తమిళ చిత్రం `కణితన్`కి రీమేక్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాతృకలో కూడా నేనే నటించా. అక్కడ కథ ప్రధానంగా హీరో, విలన్ల మధ్యే సాగుగుతుంటుంది. తెలుగులో మాత్రం ఇతర పాత్రలకి కూడా ప్రాధాన్యం దక్కింది. సెంటిమెంట్ కూడా తోడైంది. అది సినిమాకి మరింత మేలు చేసింది. చూసినవాళ్లంతా బాగుంది అంటున్నారు.
యాక్టింగ్ భాషకి సంబంధించిన మ్యాటర్ కాదు. భావం ముఖ్యం. ఎక్కడైనా భావాలు, భావోద్వేగాలు ఒకే రకంగా ఉంటాయి. అయితే హిందీలో నా సంభాషణల్ని ఒక గంట ముందు చెబితే సరిపోతుంది, ఇక్కడైతే ఇంకొంచెం ముందు చెబుతుంటారు. కాకపోతే నాకు భాషలతోనూ, ప్రాంతాలతోనూ నాకున్న అనుబంధం ప్రత్యేకంగా ఉంటుంది. నేను అస్సోంలో పుట్టా. చదువుల కోసమని చెన్నై వచ్చా. బెంగుళూరులో మోడల్‌గా కొనసాగా. అలా అన్ని సౌత్ ఇండియా సిటీస్ తో నాకు అనుబంధం ఉంది. హిందీ చిత్రాల్లో అవకాశాలు రావడంతో ముంబై వెళ్లా. అక్కడ్నుంచి ఇప్పుడు తెలుగులో అవకాశాలు వచ్చాయి, మళ్లీ దక్షిణాదికి వచ్చా. ఎక్కడికి వెళ్లినా నువ్వు అక్కడివాడివి కదా అంటుంటారు. అయితే ఇప్పుడు చాలామంది నన్ను సౌత్ విలన్ అని పిలుస్తుంటారు. ఈ గుర్తింపు నాకు చాలు అనుకుంటున్న.
నా భార్య అంజలా జవేరి నటన గురించి నాకెప్పుడూ ఎలాంటి సలహాలు ఇవ్వదు. నీకు నచ్చింది చేయ్ అంటుంది. నేను చేసిన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంది.
కొన్ని సినిమాల్లో చేసిన పాత్రలు సంతృప్తినివ్వకపోవడంతో మళ్ళీ మోడలింగ్ లోకి వెళ్ళాను. ఆ సినిమాలతో నిర్మాతలకి డబ్బులొచ్చాయి కానీ, సరైన పాత్రలు అనిపించలేదు. దాంతో మోడలింగ్‌వైపు వెళ్లాలనిపించింది. కానీ అప్పుడు చేసిన ఆ తప్పులు, అప్పుడు చేసిన ఆ సినిమాలు ఇప్పుడు బాగా పనికొస్తున్నాయి. నేను చేసిన తప్పులు నన్ను చాలా నేర్పించాయి.
అంజలా జవేరి నేను ముంబాయిలో ప్రేమలో పడ్డాం. నేను మోడలింగ్ చేసేవాడిని, ఆమె నటిగా ఉంది, ఆ సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ముందు నేనే ప్రేమని వ్యక్తం చేశా. అప్పుడు తను దక్షిణాదిలో సినిమాలు చేస్తుంది. నేనేమో మోడల్‌గా ఉన్నా. ఒక ఈవెంట్లో కలుసుకున్నప్పుడు ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్నాళ్లు స్నేహితులుగా ఉన్నాం. తర్వాత ప్రేమ, పెళ్లి. మాకు పిల్లలు లేరు, పిల్లలు వద్దు అనునకున్నాం. మేమే ఒకరికొకరు పిల్లల్లాగా ఉంటాం.
అంజలా జవేరి మంచి కథ కోసం ఎదురు చూస్తోంది. గ్లామర్ పాత్రలు చేయడానికి ప్రస్తుతం చాలా మంది యంగ్ హీరోయిన్స్ ఉన్నారు. ఈ దశలో తనకి తగ్గ కథ, పాత్ర చేయాలని ప్రయత్నం చేస్తోంది. త్వరలో ఆమె నటించే చిత్ర వివరాలు తెలియజేస్తాము.