Reading Time: 3 mins

తిమ్మరుసు మూవీ రివ్యూ

క్రైమ్ లో క్లాసు: సత్యదేవ్  ‘తిమ్మరుసు’ రివ్యూ
Rating:- 2.75/5

 ” బీర్బల్ త్రయం కేస్ 1: ఫైండింగ్ వజ్రముని “ అనే కన్నడ సూపర్ హిట్ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఓపెన్ అయ్యిన థియోటర్స్ లో రిలీజైంది. జనాలు కరోనా భయంతో థియోటర్స్ కు వస్తారో రారో అనే సందిగ్దావస్ద. ఇటువంటి టైమ్ లో తమ సినిమాపై నమ్మకంతో ధైర్యం చేయటం గొప్ప విషయం. మరో ప్రక్క హీరో సత్యదేవ్ తన నటనతో అందరిని ఆకట్టుకుని ముందుకు వెళ్తున్నారు. అతనికి క్రేజ్,మార్కెట్ ఏర్పడింది. మరి ఏంటి వీరి నమ్మకం…అసలు ఈ సినిమా  కథేంటి..తెలుగు వారికి నచ్చే సినిమాయేనా, వర్కవుట్ అవుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 
స్టోరీ లైన్

2011లో అరవింద్ అనే ఓ క్యాబ్ డ్రైవ‌ర్  హ‌త్య‌కు గుర‌వుతాడు. ఆ నేరం అటుగా నైట్ డ్యూటీ చేసుకుని వెళ్తున్న బార్ లో  పనిచేసే  వాసు(అంకిత్) అనే ఓ కుర్రాడిపై ప‌డుతుంది. సాక్ష్యాలన్నీ అతనికి రివర్స్ లో ఉంటాయి. పోలీసులు, లాయ‌ర్లు కుమ్మక్కే వాసుని ఎనిమిదేళ్లు పాటు జైలుకి పంపిస్తారు.ఇదిలా ఉండగా న్యాయం గెల‌వ‌డ‌మే ముఖ్యం అనుకునే  యంగ్ లాయిర్ రామ‌చంద్ర అలియాస్ రామ్ (స‌త్య‌దేవ్‌) అనుకోని పరిస్దితుల్లో ఈ కేసు టేకప్ చేస్తాడు. వాసు  కేసుని రీ ఓపెన్ చేయిస్తాడు. లోతుల్లోకి తవ్వటం మొదలెడతాడు. ఆ క్రమంలో ఈ  కేసులో అనేక కొత్త నిజాలు, కొత్త విషయాలు, క్రిమినల్స్ బ‌య‌ట‌కు వ‌స్తుంటారు. అస‌లింత‌కీ…ఆ రోజు క్యాబ్ డ్రైవ‌ర్ ని చంపింది ఎవ‌రు? ఆ కేసులోకి వాసు ఎలా ఇరికించారు… ఈ నిజాల్ని రామ చంద్ర ఎలా బ‌య‌ట‌కు తీయ‌గ‌లిగాడు? నిజాలు బయిటకు లాగుతూంటే వాళ్లు ఊరుకున్నారా ..అలాగే వాసు జైలు పాలు కావ‌డంలో పోలీస్ అధికారి భూప‌తిరాజు (అజ‌య్) ఏ పాత్ర ఏమిటి? ఇంత‌కీ క్యాబ్ డ్రైవ‌ర్ అర‌వింద్ హ‌త్య వెన‌క ఎవ‌రున్నారు? ఈ క‌థ‌లో వాలి ఎవ‌రు?అత‌ని పాత్ర ఏమిటి?   అనేదే మిగతా  క‌థ‌.
 
 
స్క్రీన్ ప్లే ఎనాలసిస్ ..

సాధారణంగా  మ‌ర్డ‌ర్ మిస్ట‌రీలు, మిస్సింగ్ డ్రామాలు కొన్ని ప్రశ్న‌లను ప్రేక్షకుడులోకి వదిలి, నేరేషన్ పై ఆస‌క్తిని రేకెత్తిస్తుంటాయి. అసలేం జ‌రిగింది? ఎందుకు, ఎలా జ‌రిగింది? ఎవ‌రు చేశారు? దాదాపుగా ప్ర‌తీ మర్డర్ మిస్టరీలలోనూ ఇవే ప్ర‌శ్న‌లుంటాయి. కానీ ఒకొక్క‌రూ ఒక్కోలా డీల్ చేసి ఆన్సర్స్ ఇస్తూంటారు.  కానీ  దర్శకులు సాధారణంగా..మొదట్లో అడిగే క్వచ్చిన్సే  ఎప్పుడూ ఆసక్తికరంగా ఉండాల‌ని అనుకుని రాసుకుంటున్నారు.నడుపుతున్నారు. కానీ  ముగింపుకి వచ్చేసరికి ఏదో విధంగా రొటీన్ గా ముగించేస్తున్నారు.`తిమ్మరసు` చూస్తున్న‌ప్పుడు కూడా కొన్ని క్వచ్చిన్ ఫస్టాఫ్ లో సెటప్ విజయవంతంగా చేసారు.అవే మన మైండ్ లో ఎందుకు, ఏమిటి, ఎలా? అని  వేధిస్తుంటాయి. అయితే సెకండాఫ్ లో వాటిని ఆన్సర్స్ మాత్రం ఆస‌క్తిని రేకెత్తించేలా చెప్పలేకపోయారు. తిమ్మరసు చిత్రంలో కావ‌ల్సిన‌న్ని ట్విస్టులూ, ట‌ర్న్‌ల‌ు ఉన్నాయి.  క‌థ‌ని ప్రారంభించిన ప‌ద్ధ‌తి చాలా ఇంటిలిజెంట్‌గా ఉంది.

ఇక క్యాబ్ డ్రైవ‌ర్ హ‌త్య‌తో క‌థ‌ని చాలా ఇంట్ర‌స్టింగ్ గా మొద‌లెట్టి…. ఆ త‌ర‌వాత‌.. లాయ‌ర్ గా స‌త్య‌దేవ్ ఎంట్రీ, దోషో..నిర్దోషో తెలియని స్దితిలో వాసు కేసుని టేక‌ప్ చేయ‌డం – ఇలా ప్ర‌తీ స‌ీన్… ఈ సినిమాపై ఇంట్రస్ట్ ని పెంచుకుంటూ పోతుంది. అలాగే ప్రేక్షకుడుకి వాసుని నిర్దోషి అని ముందే చెప్పేసి, హ‌త్య ఎలా,ఎందుకు జ‌రిగిందో తొలి స‌న్నివేశంలోనే క్లూ ఇచ్చేసి, ఆ త‌ర‌వాత క‌థ‌ని అంతే ఇంట్రస్టింగ్ గా న‌డ‌ప‌డంఈ సినిమా ప్రత్యేక. ఇలాంటి సినిమాలకు  క్లైమాక్స్ ట్విస్టు కీల‌కంగా నిలబడాలి. కానీ అంతగా పండలేదు.
 
 హీరో రామ్ తన తెలివితేట‌ల్ని చూపించ‌డానికి అవకాసం ఉన్నప్పుడుల్లా ప్రదర్శిస్తూనే వచ్చాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ అవి లాజిక‌ల్‌గా ఉండ‌డంతో – టేకాఫ్ బ్ర‌హ్మాండంగా  ఉంది అనిపిస్తుంది. అసలు హంతకుడు ఎవరు…తన దగ్గరకు వచ్చినవాడే హత్య చేసి నాటకమాడుతున్నాడా అనే డౌట్ తో క‌థ ట్రాక్ ఎక్కుతుంది. తర్వాత సాక్షులు  కూడా మిస్స‌వ్వ‌డం,ఆ తర్వాత చనిపోవటంతో కథ లో కావ‌ల్సినంత స‌స్పెన్స్ చోటు చేసుకుంది. సస్పెక్ట్స్  లిస్టు పెరుగుతున్న కొద్ది..అసలు మర్డర్ చేసింది ఎవరో ఎవ‌రో తెలుసుకోవాల‌న్న ఉత్సాహం, ఉత్సుక‌త ఏర్ప‌డ‌తాయి.అలాగే ఓ టైమ్ కు వచ్చేసరికి అసలు ఇన్ని చిక్కుముడుల్ని ద‌ర్శ‌కుడు ఎలా విప్పుతాడా? అనే ఆస‌క్తి క‌లుగుతుంది. అయితే
 
టెక్నికల్ గా …

అక్కడక్కడా చిన్న మార్పులు తప్ప కన్నడ వెర్షన్ ని యాజటీజ్ ఫాలో అయ్యిపోయారు దర్శకుడు. అదే క్రమంలో చేసిన కొన్ని మార్పులు పెద్దగా పేలలేదు. ఇక టెక్నికల్ గా  సినిమా మంచి స్టాండర్డ్స్ లో  ఉంది.  శ్రీచ‌ర‌ణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అప్పు కెమెరా ప‌నిత‌నం సినిమాకు ప్లస్ అయ్యారు. సినిమాకు సరబడ తక్కువబడ్జెట్ లో క్వాలిటీగా నిర్మించారు. ద‌ర్శ‌కుడు శరణ్‌ కొప్పిశెట్టి కన్నడ సినిమాను తెలుగు నేటివిటి మార్చుకుని న‌డిపిన తీరు బాగుంది.కొన్ని సార్లు మ‌న ద‌గ్గ‌ర చెప్ప‌డానికి నిజం ఉన్నా, విన‌డానికి మ‌నిషి ఉండ‌డు`వంటి డైలాగులు బాగున్నాయి. పాటలు లేకపోవటం పెద్ద రిలీఫ్. ఎడిటింగ్ కూడా లాగ్ లు లేకుండా బాణంలా దూసుకుపోయింది. అయితే ఎన్ని అనుకున్నా సినిమాలో బిల్డప్ కు తగ్గట్లుగా సినిమా అయితే లేదు.
 
నటీనటుల్ విషయానికి వస్తే ..స‌త్య‌దేవ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సినిమాతో  అది మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నారు. పాత్రకు తగినట్లు తన నటనను పెంచుకుంటూ,తగ్గించుకుంటూ పోయారు. అలాగే లిఫ్ట్ ఫైట్ లో యాక్షన్ హీరోలా రెచ్చిపోయారు. ప్రియాంక జ‌వ‌ల్కర్ సినిమాకు ఏ మాత్రం కలిసి రాలేదు. బ్ర‌హ్మాజీ క్యారక్టరైజేషన్, డైలాగులు ఫన్నీగా ఉన్నాయి. వాసుగా క‌నిపించిన కుర్రాడు చాలా స‌హ‌జంగా న‌టించాడు.
   
చూడచ్చా..
కన్నడ ఒరిజనల్ సినిమా చూసిన వాళ్లకు కష్టం. మిగతా వాళ్లు ఇష్టపడతారు.

ఎవరెవరు..
 
 సంస్థ‌: ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్, ఎస్‌.ఒరిజిన‌ల్స్
న‌టీన‌టులు: సత్యదేవ్‌,  ప్రియాంక జవాల్కర్‌‌, బ్రహ్మాజీ, అజయ్‌, అల్లరి రవిబాబు, అంకిత్, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌ తదితరులు;
 సంగీతం:  శ్రీచరణ్‌ పాకాల;
ఛాయాగ్రహణం: అప్పూ ప్రభాకర్‌;
 క‌ళ‌: కిరణ్‌ కుమార్‌ మన్నె;
ఫైట్స్: వెంకట్ మాస్టర్,  రియల్‌ సతీశ్‌;
నిర్మాతలు: మహేశ్‌ కోనేరు, సృజన్‌;
దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి;
రన్ టైమ్‌: 127 నిముషాలు
 విడుద‌ల తేదీ‌: 30-07-2021