తుఫాన్‌ హిందీ మూవీ రివ్యూ

Published On: July 16, 2021   |   Posted By:

తుఫాన్‌ హిందీ మూవీ రివ్యూ

లేదు అంత సీన్:  ఫర్హాన్‌ అక్తర్ ‘తుఫాన్‌’ రివ్యూ

Rating:2.5/5

దాదాపు ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ చిత్రం సినీ లవర్స్ కు బాగా గుర్తుండి ఉంటుంది. అందులో రన్నర్‌గా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు క్రియేట్‌ చేశారు ఫర్హాన్‌ అక్తర్‌. ఈ చిత్రానికి ఓం ప్రకాష్‌ మెహ్రా దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో మరో స్పోర్ట్స్‌ మూవీ ‘తుఫాన్‌’ తెరకెక్కుంది. బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో బాక్సర్‌ పాత్రలో ఫర్హాన్‌ కనిపించారు. అసలు సిసలైన బాక్సర్‌గా ఫిజిక్‌ని మార్చుకోవడానికి ఫర్హాన్‌ కసరత్తులు చేసి మరీ చేసారు.  ఈ చిత్రాన్ని వేసవి కానుక‌గా మే 21న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ, కొవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా వాయిదా వేశారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు కాస్త కుదుట‌ప‌డుతుండ‌టంతో సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. ఈ రోజు అమెజాన్‌ ప్రైమ్‌లో  విడుదల చేసారు. ఒక వీధిరౌడీ అనేక పరిణామాల మధ్య చివరకు ఎలా జాతీయస్థాయి బాక్సర్‌ కాగలిగాడనేది చిత్ర కథాంశంతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా…ఈ సినిమా ప్రత్యేకత ఏమిటి..ఇందులో పరేష్ రావెల్ వంటి సీనియర్ నటుడు పాత్ర ఏమిటి… ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ స్దాయిలో వర్కవుట్ అవుతుందా  వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

అజ్జు భాయ్‌ అలియాస్‌ అజీజ్‌ అలీ (ఫరాన్‌ అక్తర్‌) ముంబయిలోని డోంగ్రీలో ఓ చిన్న సైజ్ గ్యాంగస్టర్. అతను స్పెషలైజేషన్ లోన్స్ వసూలు చేయటం. ఎలాంటి వాడి దగ్గర నుంచైనా ముక్కు పిండి  వసూలు చేయగలడు. అయితే అది చాలా సార్లు హింసకు దారి తీస్తుంది. అలీ కు కూడా ఇది ఇష్టమే కాబట్టి సమస్య ఉండదు. కానీ అలీకు ఓ ఆలోచన వస్తుంది. భాక్సింగ్ తనను మరింత పెద్ద వాడిని చేస్తుందని భావిస్తాడు.

దాంతో అజ్జు… బాక్సింగ్‌ బరిలోకి దిగి… తన సత్తా చాటాలని అనుకుంటాడు. అందుకు ప్రభు  (పరేశ్‌ రావల్‌)అనే భాక్సింగ్ ట్రైనర్ సాయం తీసుకోవాలనకుంటాడు. అయితే ముస్లిం అని ప్రక్కన వద్దంటాడు ప్రభు. ఎందుకంటే ప్రభు భార్య టెర్రరిస్ట్ ఎటాక్ లో చనిపోతుంది. అప్పటి నుంచి ముస్లింలు అందరిపై అకారణ ద్వేషం పెంచుకుంటాడు.

కానీ అలీ  మొండితనంతో బాక్సింగ్‌ నేర్చుకుంటాడు. భాక్సింగ్ పోటీలలో పాల్గొంటాడు. ఓ సారి అలీ తలకు దెబ్బ తగిలితే డాక్టర్ గా చేస్తున్న అనన్య (మృణాల్‌ ఠాకూర్‌) పరిచయం అవుతుంది. ఆమె అతనిలో తుఫాన్ లాంటి శక్తిని చూస్తుంది. దాంతో భాక్సింగ్ ని మొండిగా,బండగా నేర్చుకోకూడదని చెప్తుంది. అప్పుడు టెక్నిక్‌తో నేర్చుకున్న బాక్సింగ్‌ గొప్పతనం తెలుసుకొని… చివరకు బాక్సింగ్‌ గురువు నానా ప్రభు   దగ్గర చేరి శిష్యరికం చేరి భాక్సింగ్ లో మంచి స్దాయికి చేరుకుంటాడు.  స్టేట్‌ ఛాంపియన్‌గా నిలుస్తాడు. ఈలోపు గురువు నానా ప్రభుకు ఓ విషయం తెలుస్తుంది. అది అలీ తన కుమార్తె‌- అనన్య ప్రేమలో ఉన్నాడని. అప్పుడేమవుతుంది.   జాతీయస్థాయి పోటీకోసం దిల్లీ వెళ్ళిన అలీ గెలుస్తాడా.  నానా ప్రభు తన కూతురు ప్రేమించిన అలీని ఓకే చేసాడా వంటి విషయాలతో మిగతా కథ నడుస్తుంది.

స్క్రిప్టు ఎనాలసిస్..

‘భాగ్ మిల్ఖా భాగ్‌’ తర్వాత ఫర్హాన్‌ అక్తర్‌- రాకేష్‌ ఓం ప్రకాశ్‌ మిహ్రా కాంబినేషన్‌లో రానున్న సినిమా ‘తుఫాన్‌’ కానుండడంతో సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా అనటంలో సందేహం లేదు. దానికి తోడు ఈ సినిమాని బాయ్ కాట్ చేయమంటూ చాలా మంది కోరటంతోనూ సినిమాపై అందరి దృష్టీ పడేలా చేసింది. ఇందులో ఫర్హాన్‌ క్యారెక్టర్‌ పేరు అజిజ్‌ అలీ. మ్రునాల్‌ పాత్ర పేరు డాక్టర్‌ పూజా షా. ఈ పేర్లే అభ్యంతరాలకు కారణం అయ్యాయి. బాయ్‌కాట్‌ తూఫాన్‌కు బలం ఇచ్చాయి. ఇది సంప్రదాయానికి విరుద్ధం, మతాంతర కథలను ప్రోత్సహించకూడదని కొందరు వాదిస్తున్నారు. అయితే గతంలో సీఏఏకి వ్యతిరేకంగా ఫర్హాన్‌ నిరసనల్లో పాల్గొన్నాడు. దీంతో రివెంజ్‌ తీర్చుకునేందుకు టైం వచ్చిందని మరికొందరు ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్‌లో చేతులు కలిపారు. అయితే సినిమాలో అంత సీన్ లేదనిపిస్తుంది.

ఎక్కడో ఎవరో చేసిన పనికి… ఆ వర్గం వారంతా అలాంటివారే అనుకుంటూ ఉంటాడు నానా ప్రభు. సినిమా మొత్తం ఆ విషయంలో ఈ రెండు క్యారక్టర్స్ మధ్య చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే ఫైనల్‌గా దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని సరిగ్గా పూర్తి చేయలేకపోయారు. కంక్లూజన్ ఇవ్వలేనప్పుడు భుజాన ఎత్తుకోకూడదు.

ముఖ్యంగా రొటీన్ గా సాగే స్క్రీన్ ప్లే కథలో మెయిన్ ఎలిమెంట్స్ ని మరుగున పరిచింది. మొదట్లో హీరో బేవార్స్ గా ఉండటం..ఆ తర్వాత హీరోయిన్ వచ్చి నీ లక్ష్యం ఇదిగో అని చెప్పటంతో కథ పరమ రొటీన్ గా మారిపోయింది. క్లైమాక్స్ లో ఇరుక్కుపోవటం..బయిటపడటం ఇదంతా సామాన్య ప్రేక్షకుడు ఊహించగలిగేదే. అలాగే గతంలో ఇదే సంస్ద నుంచి వచ్చిన ‘గల్లీ బాయ్‌’ సీన్స్ కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. అలాగే ఎమోషన్ సీన్స్ కూడా కథని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లలేకపోయాయి.  హీరో – హీరోయిన్‌కి ప్రేక్షకుడు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యితేనే ఇలాంటి కథలు నచ్చుతాయి. అలా కథనమే ఈ సినిమాని నీరసపరిచేసింది. కొంచెం కొత్తగా ట్రై చేసి ఉంటేనే ఈ జనరేషన్ ప్రేక్షకుడుకి నాడి పట్టుకోగలం అనే విషయం మర్చిపోయారు.  

టెక్నికల్ గా…

ఇలాంటి సినిమాల్లో కొన్ని సీన్స్ సహజసిద్ధంగా రావాలంటే  రియల్‌ స్టంట్స్‌ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే సినిమాల్లో డ్రామా పెంచితే ప్రేక్షకులకు రుచించదు.  దీన్ని దృష్టిలో పెట్టుకునే  ఫర్హాన్‌ ఆక్తర్‌ ఈ  ‘తుపాన్‌’ చిత్రంలో ప్రొఫెషనల్‌ బాక్సర్లతో తలపడ్డాడు. ఇందు కోసం హరియాణా, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన బాక్సర్లుతో పాటు ఒక విదేశీ బాక్సర్‌ను కూడా సినిమాలో నటింపజేశారు. ఆ విదేశీ బాక్సర్‌తోనే క్లైమాక్స్ ఫైట్‌ ఉంది. ముఖ్యంగా ఆ సన్నివేశాల కోసం ఫర్హాన్ ఎంతో కష్టపడటం తెరపై కనిపించింది.   పరేశ్‌ రావల్ సినిమాలో సెటిల్డ్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇస్తూ..కీ సీన్స్ ని నిలబెట్టాడు.

ఇక ఈ సినిమాని నిలబెట్టింది మాత్రం సినిమాటోగ్రాఫర్‌ మాత్రమే. ‘గల్లీబాయ్‌’ తరహా మ్యాజిక్ ‘తుఫాన్‌’లోనూ చూపించాడు. శంకర్‌ – ఎహసాన్‌ -లాయ్‌ సంగీతం జస్ట్ ఓకే. రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మెహ్రా కూడా మమ అనిపించేసాడు. రన్ టైమ్ బాగా ఎక్కువ అనిపించింది. ఎడిటర్ ఎందుకనో వదిలేసాడు. డైలాగుల్లో  బాక్సింగ్‌ రింగ్‌ను ఇంటితో పోలుస్తూ నానా ప్రభు చెప్పేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. బాక్సింగ్‌ గురించి నానా ప్రభు.. చెప్పే ఎమోషనల్‌ డైలాగ్స్‌ కూడా నచ్చుతాయి.  

చూడచ్చా

గొప్పగా ఏమీ లేదు..ఓ సారి ఖాళీగా ఉంటే లుక్కేయచ్చు.  ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ స్దాయిని ఎక్సపెక్ట్ చేయద్దు

ఎవరెవరు..

నటీనటులు: ఫరాన్‌  అక్తర్‌, మృణాల్‌ ఠాకూర్‌, పరేశ్‌ రావల్‌, మోహన్‌ అగషే, హుస్సేన్‌ దలాల్‌ తదితరులు;
సంగీతం:  శంకర్‌ ఎహసాన్‌ లాయ్‌;
సినిమాటోగ్రఫీ: జే ఓజా;
ఎడిటింగ్‌: మేఘ్నా సేన్‌;
నిర్మాతలు: రితేశ్‌ సిద్వానీ, ఫరాన్‌ అక్తర్‌, రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా;
రచన: అంజుమ్‌ రాజబలి, విజయ్‌ మౌర్యా;
దర్శకత్వం: రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మెహ్రా;
విడుదల: 16/07/2021
ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌
రన్ టైమ్: రెండు గంటల 41 నిమిషాల