Reading Time: 7 mins

దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ

ఎఫ్2కి మించిన వినోదం ఎఫ్3లో వుంటుంది. ఎఫ్3కి పక్కాగా రిపీట్ ఆడియన్స్ వస్తారు: దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ

”తెలుగు ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవడానికి ఒక లైబ్రరీ లాంటి సిరిస్ వుండాలని ఎఫ్ 2 ఫ్రాంచైజ్ ని చేశాం. ఎఫ్ 2 బిగ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎఫ్ 2లో భార్యభర్తల ఫస్ట్రేషన్ వుంటే ఎఫ్ 3లో మనీ ఫస్ట్రేషన్. ఎఫ్ 3 అందరికీ కనెక్ట్ అయ్యే కథ. ఎఫ్2కి మించిన వినోదాన్ని ఎఫ్3లో చూస్తారు. ఇది ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. అందుకే టికెట్ ధర అందరికీ అందుబాటులో వుండే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ రేట్లు ఉండేలా మా నిర్మాత దిల్ రాజుగారు నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్ 3కి ఖచ్చితంగా రిపీట్ ఆడియన్స్ వస్తారు” అన్నారు బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి.

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పకులుగా నిర్మాత శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ఎఫ్3 ‘ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైమౌతున్న ఈ చిత్రం విశేషాలని మీడియాతో పంచుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన పంచుకున్న ఎఫ్ 3 ‘ఫన్’టాస్టిక్ విశేషాలివి..

ఎఫ్ 2 కథ కాకుండా పాత్రలని ఎఫ్ 3లో తీసుకోవడానికి కారణం ?

సీక్వెల్ ఫ్రాంచైజీ కాబట్టి కొత్తవారిని పెడితే ఎఫ్ 2 ఫ్రాంచైజీ ఫీల్ రాదు. ఎఫ్ 2 ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిన ఎలిమెంట్స్ తో కొత్త కథ చెప్పాం. ఎఫ్ 2లో భార్యభర్తల ఫస్ట్రేషన్ వుంటే ఎఫ్ 3లో మనీ ఫస్ట్రేషన్. ఇది ఇంకా కనెక్ట్ అయ్యే పాయింట్. డబ్బు చుట్టూ వుండే ఆశ అత్యాశ కుట్ర మోసం ఇవన్నీ హిలేరియస్ గా వర్క్ అవుట్ అయ్యాయి. ఎఫ్ 2 సక్సెస్ తో ఆర్టిస్టలందరూ మంచి ఎనర్జీతో పని చేశారు. సునీల్, మురళీ శర్మ, అలీ గారు ఇలా కొంత మంది ఆర్టిస్ట్ లు కొత్తగా యాడ్ అయ్యారు. మోర్ గ్లామర్ అండ్ మోర్ ఫన్ గా వుంటుంది ఎఫ్ 3.

ఇంతమంది ఆర్టిస్ట్ లు వుండగా వెంకటేష్ గారి పాత్రని రేచీకటిగా వరుణ్ తేజ్ పాత్రని నత్తిగా డిజైన్ చేయడానికి కారణం ?

ఎఫ్ 2 నుండి ఎఫ్ 3కి వచ్చేసరికి అంచనాలు ఖచ్చితంగా ఎక్కువగా వుంటాయి. ఫన్ డోస్ పెంచడానికి ఎలిమెంట్స్ ఎక్కువ వుంటే ఇంకా ఎక్కువ చేయగలం. మామూలు పాత్రతో చేసేకంటే ఇలాంటి పాత్రలతో ఎక్కువ ఫన్ చేయొచ్చనిపించి ఈ క్యారెక్టరైజేషన్స్ యాడ్ చేశాం. ఐతే అవే క్యారెక్టరైజేషన్స్ ప్రధానంగా సినిమా వుండదు. నైట్ సీన్స్ వచ్చినపుడు ఆ ఫన్ వాడుకుంటాం, వరుణ్ నత్తి మీరు ట్రైలర్ లో చూసే వుంటారు. అది కేవలం ట్రైలర్ మాత్రమే. సినిమా దాదాపు ముఫ్ఫై చోట్ల ఆ మేనరిజం వచ్చింది. ప్రతిసారి కొత్తగా వుంటుంది. ఇది నిజంగా చాలెజింగ్ అనిపించింది. మాట అడ్డుపడినప్పుడల్లా కొత్త మ్యానరిజం చేయాలి. అనుకున్నపుడు ఈజీగా అనిపించింది కానీ ప్రాక్టికల్ గా ప్రతిసారి కొత్త మ్యానరిజం అంటే సీన్ కంటే ఎలాంటి మ్యానరిజం ఇవ్వాలనే ఒత్తిడి ఎక్కువ వుండేది.

ఎఫ్ 3 ప్రీరిలీజ్ ఈవెంట్ ని డిజైన్ చేసింది మీరేనా ?

అవును. కేవలం స్పీచులే కాకుండా సరదాగా అల్లరి చేయాలనిపించింది. యాంకర్ సుమకి కూడా కుసుమ అని పాత్ర క్రియేట్ చేశాం. ఐతే నేను చెప్పింది తక్కువే. కానీ సుమ అద్భుతంగా చేసింది.

ఎఫ్ 3 అనగానే మరో హీరోకి కూడా అవకాశం వుంటుందా అని అంతా భావించారు. ఎఫ్ 3 మొదలుపెట్టినపుడు మూడో హీరో ఆలోచన ఉందా ?

ఎఫ్ 2 ఫినిష్ అయ్యాక ఎఫ్ 3 గురించి అలోచించినపుడు మూడో హీరో ఆలోచన వచ్చింది. ఐతే అది ట్రంప్ కార్డు . అది ఇప్పుడే వాడేస్తే మళ్ళీ వాడుకోవడానికి ఏమీ వుండదు. అందుకే ఆ ఐడియాని పక్కన పెట్టేశాం. ఎఫ్ 2 స్టార్ కాస్ట్ తోనే వీలైనంత ఫన్ జనరేట్ చేశాం. ఐతే మూడో హీరో కార్డు మాత్రం ఎఫ్ 4లో కానీ తర్వాత సినిమాలో కానీ తప్పకుండా వాడాలి.

కరోనా పాండమిక్ చుట్టూ విషాదాల మధ్య ఇలాంటి ఫన్ ఎలా రాయగలిగారు ?

స్క్రిప్ట్ అంతా పూర్తయిన తర్వాత కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. అందరికీ నష్టం జరిగింది. తెలియకుండానే అందరిలోనూ నిరాశ. ఐతే షూటింగ్ అయిన సీన్స్ ని మళ్ళీ చూసుకుంటూ కాసేపు నవ్వుకుంటూ ఇప్పుడున్న మెంటల్ కండీషన్ కి ఇలాంటి ఫన్ సినిమా ఉపయోగపడుతుందని భావించాం.

ఎఫ్ 2లో వున్న క్యారెక్టరైజేషన్స్ ఎఫ్ 3లో ఉంటాయా ?

పాత్రల బిహేవియర్ అలానే వుంటుంది. ఐతే ఎఫ్ 2లో వెంకటేష్ గారికి ఫ్యామిలీ లేదు. ఇందులో వుంటుంది. ఎఫ్ 2లో వరుణ్ కి ఫ్యామిలీ వుంది. ఇందులో లేదు. ఇలా ప్రతిచోట మీకు స్పష్టమైన తేడా కనిపిస్తుంది.

ట్రైలర్ లో హీరోయిన్స్ ని అత్యాశగా చూపించారు. వారి నుండే ఫన్ వస్తుందా ?

హీరోయిన్స్ అనే కాదు ఇందులో ప్రతి పాత్ర అత్యాశ గానే వుంటుంది. డబ్బు ఎలా త్వరగా సంపాయించాలనే ఆశతోనే వుంటారు. వారి ప్రయత్నాల్లో జరిగే ఫన్ ఇందులో వుంటుంది. ఎంత ఫన్ వుంటుందో అంత మంచి కంటెంట్ వుంటుంది. ఎఫ్ 2లో ఇచ్చిన ముగింపు అందరికీ నచ్చింది. ఇందులో డబ్బు గురించి చెప్పే ఫైనల్ కంటెంట్ కూడా అందరికీ నచ్చుతుంది.

ఎఫ్ 3కి డ్రైవింగ్ ఫోర్స్ ఎఫ్ 2 అని భావిస్తున్నారా ?

ఖచ్చితంగా. ఎఫ్ 2లేకపోతె ఎఫ్ 3 లేదు. బాలీవుడ్ లో గోల్ మాల్ వున్నట్లు మనకీ నవ్వుకోవడానికి ఒక లైబ్రరీ లాంటి సిరిస్ వుండాలని ఎఫ్ 2 ఫ్రాంచైజ్ ని చేశాం. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది.

తెలుగులో ఫ్రాంచైజ్ అనేది కొత్త కదా ?

ఫ్రాంచైజ్ కొత్తకానీ తెలుగు ప్రేక్షకులు కామెడీ బావుంటే రిజెక్ట్ చేసిన సినిమా ఒక్కటీ లేదు. మంచిగా వాళ్ళకి వినోదం పంచితే చాలు. స్టొరీ పరంగా ఎఫ్ 2 కంటే ఎఫ్ 3 కోసం చాలా గ్రౌండ్ వర్క్ చేశాం.

ఎఫ్ 3లో మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా ?

ఎఫ్ 2తో పోల్చుకుంటే తక్కువే. ఎఫ్ 3 అంతా డబ్బు చుట్టూ తిరిగే కంటెంట్. ట్రైలర్ లో కనిపించిన బంగారం షాపు సీన్ అందరి లైఫ్ లో ఉండేదే. ఐతే దాన్ని కొంచెం ఫన్ గా చేశాం.

దాదాపు అందరూ తెలిసిన నటులనే పెట్టారు. బడ్జెట్ అనుమతించిందా ?

ఇందులో వుండే నటులు ఆ పాత్రలకు వారే కరెక్ట్ అనిపించింది. సునీల్ గారు అంటే నాకు ప్రత్యేక అభిమానం. పదేళ్ళ తర్వాత ఆయన హిలేరియస్ రోల్ చేస్తున్నారు. మళ్ళీ వింటేజ్ సునీల్ ని చూస్తాం. అలీ గారిది కూడా అద్భుతమైన పాత్ర. టెర్రిఫిక్ గా చేశారు.

ఇంత మంది అరిస్ట్ లతో పని చేయడం ఎలా అనిపించింది ?

చాలా కష్టపడ్డాం. కార్వాన్ లన్నీ చూస్తే మినీ మియాపూర్ బస్ డిపోలా వుండేది. ఒక సీన్ లో 70షాట్లు వుంటే ముఫ్ఫై నుండి మొదలుపెట్టెవాడిని. ఎవరు ముందు వస్తే వాళ్ళ షాట్ తీసుకుంటూ వెళ్ళడమే. అన్నపూర్ణ గారు, వై విజయ గారు కొంచెం త్వరగా వస్తారు. వాళ్ళ షాట్స్ ముందే తీసేవాళ్ళం. కరోనా సమయంలో వాళ్ళపై ఎక్కువ కేర్ తీసుకున్నాం. వెంకటేష్ గారు ఇంకా కేరింగ్ వుంటారు. మా టీంలో ఆయన్ని కరోనా టచ్ చేయలేదు.

పూజా హెగ్డే తో పాట చేయాలనే ఆలోచన మొదటి నుండి ఉందా ?

పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత పూజా యాడ్ అయింది. ముగ్గురు హీరోయిన్స్ తో ‘ఊ హ ఆహా ఆహా’ పాటని తీశాం, తర్వాత వచ్చే సెలబ్రేషన్స్ పాట కొంచెం స్పెషల్ గా వుండాలని ఒక స్టార్ హీరోయిన్ గెస్ట్ గా వస్తే బావుంటుదని భావించాం. కథలోనే పూజ హెగ్డే గా వస్తుంది తను.

నత్తి క్యారెక్టర్ కి ప్రేరణ ఉందా ?

ఆహా నా పెళ్ళాంట సినిమాలో బ్రహ్మానందం గారు చేసిన పాత్ర నా ఫేవరేట్. నత్తిని ఒక హీరో పాత్రకి యాడ్ చేయడం కొత్తగా అనిపిస్తుంది.

దిల్ రాజు గారితో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ ప్రయాణం ఎలా వుంది ?

దిల్ రాజుగారితో అలా కుదురుతుంది. ఆయనతో ప్రయాణం కంఫర్ట్ బుల్ గా వుంటుంది. నాకు ఏం కావాలో ఆయనకి తెలుసు. ఒక ఫోన్ కాల్ తో పనైపొద్ది. దిల్ రాజు గారి సినిమా అంటే నాకు హోం బ్యానర్ లాంటింది.

కామెడీ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. ఈవీవీ , జంధ్యాల గారి స్థానాన్ని భర్తీ చేయాలనా ?

నిజం చెప్పాలంటే ప్రస్తుతానికి ఆ స్థానమే ఖాళీగా వుంది. కానీ నేను మాస్ సినిమాలు చేయలానే వచ్చాను. అయితే కామెడీ ఉంటేనే నా సినిమా ఫుల్ ఫిల్ అవుతుంది. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ . ఈ మూడు సినిమాల్లో ఎంత మాస్ వుందో అంత కామెడీ వర్క్ అవుట్ అయ్యింది. ఇంకా లార్జ్ స్కేల్ ఆడియన్స్ కి రీచ్ కావాలని ఎఫ్ 2 ని ఒక స్ట్రాటజీ ప్రకారం చేశాను. ఎఫ్ 2 ఓవర్సిస్ లో 2 మిలియన్ కొట్టింది. ఎక్కడ ఖాళీ వుందో చూస్తూ సినిమాలు చేయాలి. ఎఫ్ 2తో ఒక కామెడీ బ్రాండ్ వచ్చేసింది. దాన్ని సరిచూసుకోవడానికి సరిలేరు నీకెవ్వరు లో ట్రైన్ ఎపిసోడ్ పెట్టుకున్నాం. సరిలేరు నీకెవ్వరు ఫల్ యాక్షన్ మాస్ సినిమా. ఇప్పుడు ఎఫ్ 3తో మళ్ళీ ఫ్యామిలీ సినిమా చేశాం. తర్వాత చేయబోయే బాలయ్యగారి సినిమా మాస్. సినిమాకి సినిమాకి డిఫరెన్స్ చూపించుకుంటూ వెళితే ఫస్ట్ మనం బోర్ కొట్టం. మార్కెట్ లో ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారనేదాని చెక్ చేసుకున్నట్లయితే ఫ్లాప్ అవ్వాకుండా బయటపడవచ్చు. అది తర్వాత ఎంత హిట్ అవుతుందనేది ఆడియన్స్ నిర్ణయిస్తారు.

కామెడీ సినిమా తీయడం కష్టం. కామెడీ పండకపొతే అపహాస్యం పాలవ్వాల్సి వస్తుంది. మీరు ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ?

కంప్లీట్ కామెడీ సినిమా తీస్తే ఈ సమస్య వుంటుంది. నేను చేసిన సినిమాల్లో వినోదం ప్రధానంగా వుంటుంది తప్పితే సినిమా అంతా కామెడీ పెట్టను. ఎఫ్ 2లో కామెడీ బిట్స్ అండ్ పీసస్ గా వెళుతుంటుంది. చివర్లో ఒక బలమైన కంటెంట్ వుంటుంది. ఒక సోల్ వుంటుంది. అది కనెక్ట్ కాకపొతే సినిమా ఆ స్థాయికి వెళ్ళదు. సరిలేరు నీకివ్వరు లో కూడా ఆర్మీ నేపధ్యం ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది. ఎమోషనల్ కనెక్షన్ ఉంటేనే సినిమాలు గొప్ప విజయాన్ని సాధిస్తాయి. ఎఫ్ 3లో కూడా ఎంత కామెడీ వుంటుందో అంత కంటెంట్ వుంటుంది.

ఎఫ్ 3లో మెసేజ్ వుంటుందా ?

స్పెషల్ గా మెసేజ్ లా వుండదు. అది నిజంలా వుంటుంది. డబ్బుతో మనం ఎలా వుండాలనేది చెప్తాం. ఈ కంటెంట్ కి అందరూ కనెక్ట్ అవుతారు. స్క్రిప్ట్ అద్భుతంగా కుదిరింది. పెన్ను బాగా పలికింది. (నవ్వుతూ)

ఎఫ్ 3 అంటే ఏం చెప్తారు ?

నిజానికి ఫన్ ఫస్ట్రేషన్, మోర్ ఫన్ అని పెట్టాం. కానీ ఇక నుండి ఎఫ్ 3 అంటే ఫ్యామిలీ కూడా. ఇందులో ఎఫ్ ఎప్పటికీ వుంటుంది కాబట్టి సినిమాని అభిమానించే వాళ్ళంతా మన ఫ్యామిలీనే.

ఎఫ్ 3 చూడాలంటే ఎఫ్ 2 మరోసారి చూడాలా ?

ఎఫ్ 2 చూసిన వారికి అందులో పాత్రలు గుర్తుండి వుంటాయి. ఆ గుర్తులు చాలు. మళ్ళీ ఎఫ్ 2 చూడాల్సిన పని లేదు.

పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు లో హీరోయిజం వుంటుంది. ఎఫ్ 2, ఎఫ్ 3 లో అది మిస్ అయ్యామనే ఫీలింగ్ ఉందా ?

ఎఫ్ 2, ఎఫ్ 3 లో ఆ ఛాన్స్ లేదు. నేను ఇలా ఫిక్స్ అయ్యే చేస్తున్నా. నాకూ ఒక చేంజ్ ఓవర్ కావాలి. బాలయ్య గారి సినిమాలో పూర్తి యాక్షన్ హీరోయిజం వుంటుంది. దిని తర్వాత మళ్ళీ ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి ఎంటర్ టైనర్ చేయాలని వుంది. ఇలా చేంజ్ ఓవర్ వుండటం నాకూ హాయిగా వుంటుంది. అన్నిటికంటే ముందు ఆరోగ్యం బావుంటుంది. ఒక యాక్షన్ సినిమాలో పదిహేను రోజులు ఫైట్ తీస్తే రోజూ దుమ్మే. ఎంత దుమ్ము లోపలి వెళుతుందో తెలీదు. మూడు యాక్షన్ సినిమాలు చేశాక ఎఫ్ 2కి రావడానికి ఇదో కారణం. నాకు డస్ట్ ఎలర్జీ. దుమ్ముకారణంగా బ్రెత్ లెస్ నెస్ , ఆయాసం వచ్చేది. కొద్దిరోజులు ఆరోగ్యంగా వుందామని ఎఫ్ 2 మొదలుపెట్టా. (నవ్వుతూ). బాలయ్య గారిది మళ్ళీ యాక్షన్ సినిమా. ఐతే ఇప్పుడు మాస్క్ లు వచ్చాయి కాబట్టి ఫర్లేదు.

టికెట్ల రేట్లు తగ్గించడం ఎఫ్ 3కి ఎంత కలిసొస్తుంది ?

హైదరాబద్ లో కొన్ని ప్రీమియం మల్టీప్లెక్స్ లో తప్ప మిగతా అన్ని చోట్ల టికెట్ ధరలు అందరికీ అందుబాటులోకే తెచ్చాం. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఫ్యామిలీ అంతా కలసి వెళ్ళడానికి వీలుగా వుంటే ఒకటి రెండుసార్లు చూస్తారు. నిజానికి ఎఫ్ 3కి కూడా ఎక్కువ బడ్జెట్ అయ్యింది. అయితే టికెట్ ధర ఆడియన్స్ కి కంఫర్ట్ గా వుండటం ముఖ్యం. ఇది ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. అందుకే టికెట్ ధర అందరికీ అందుబాటులో వుండే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ రేట్లు ఉండేలా మా నిర్మాత దిల్ రాజుగారు నిర్ణయం తీసుకున్నారు.

ఎఫ్ 2కి ఎఫ్ 3కి వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పని చేయడంలో ఎలాంటి డిఫరెన్స్ గమనించారు. ?

ఎఫ్ 2తో పోల్చుకుంటే ఎఫ్ 3లో వారితో పని చేయడంలో ఇంకా కంఫర్ట్ పెరిగింది. ముఖ్యంగా వెంకటేష్, వరుణ్ తేజ్ బాగా క్లోజ్ అయ్యారు. ఎలాంటి రియాక్షన్ ఇవ్వాలనే దానిపై వాళ్ళమధ్య ఒక అండర్ స్టాడింగ్ వచ్చింది. వరుణ్ తేజ్ కామెడీ పరంగా ఇందులో అద్భుతంగా చేశారు. మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. వెంకటేష్ గారికి ధీటుగా చేశారు వరుణ్ తేజ్.

నత్తి అనేది కాంట్రవర్షి అయ్యే అవాకాశం ఉందా ?

నేను జంధ్యాల గారి ‘ఆహా నా పెళ్లంటా’ ప్రేరణతో చేశా. ఎవరైనా వివాదం చేస్తే ఇదే చెప్తా( నవ్వుతూ) నత్తి అనేది పోషకార లోపం వల్ల వచ్చిందని సినిమాలో చూపించాం.

బేసిగ్గా హీరోలు ఇమేజ్ ని వదిలిపెట్టి ఇలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడరు.. మీరు చెప్పినపుడు ఎలా ఫీలయ్యారు?

కొన్ని సినిమాలు చేయడానికి ఇమేజ్ దాటి రావాలి. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు స్టార్ డమ్ పక్కన పెట్టి ఎంటర్ టైనర్లు చేస్తుంటారు. లక్కీగా వెంకటేష్ గారు నాకు దొరికారు. ఆయన బోర్డర్ దాటి కూడా కొన్ని సీన్లు చేసేస్తారు. కామెడీ సినిమా చేసేటప్పుడు అలానే వుండాలి. ఈ పాత్రలు చెప్పినపుడు వెంకటేష్, వరుణ్ తేజ్ చాలా ఎక్సయిట్ అయ్యారు. వెంకటేష్ గారి రేచీకటి ట్రాక్ చాలా బావుంటుంది.

దేవిశ్రీ ప్రసాద్ గారి తో మళ్ళీ పనిచేయడం ఎలా అనిపించింది ?

దేవిశ్రీ ప్రసాద్ గారితో ఇది నా మూడో సినిమా. మంచి ఆల్బమ్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా వండర్ ఫుల్ గా వచ్చింది.

హీరోయిన్స్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి ?

ఎఫ్ 2 కంటే హిలేరియస్ గా వుంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా మెహరీన్ ఎడ్జ్ తీసుకుంటుంది, సెకండ్ హాఫ్ లో తమన్నా లీడ్ కి వస్తుంది. హీరో హీరోయిన్ అనడం కంటే ఎఫ్ 3 క్యారెక్టర్స్ ఆధారంగా నడిచే సినిమా. ఒకొక్క పాత్రలో ఒక్కో హై వుంటుంది.

రిటైర్మెంట్ స్టేజ్ లో అన్నపూర్ణ, వై విజయ గారికి మంచి పాత్రలు పడ్డాయి కదా ?

అవును. చాలా బాగా చేశారు. చాలా క్రమశిక్షణ గల నటులు. ఇంత క్రమశిక్షణ గల నటులని నేను చూడలేదు. చెప్పిన టైంకి సెట్స్ లో వుంటారు. బహుశా ఆ జనరేషన్ అంతా అంతే.

బాలయ్యగారి సినిమా ఎప్పుడు. ఎలా వుండబోతుంది ?

సెప్టెంబర్- అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్తాం. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాణం. బాలకృష్ణ గారు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో ఆ పవర్ కి తగ్గట్టే సినిమా వుంటుంది. ఫన్ వుంటుంది కానీ అంత బిగ్గర్ గా వుండదు. మేము ఇద్దరం కలసి కొత్త మార్క్ లోకి వస్తాం.

మీకు ఇష్టమైన హీరో ?

అందరు హీరోలూ ఇష్టం. రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టం.

రాజేంద్ర ప్రసాద్ గారితో చేసిన గాలి సంపత్ రిజల్ట్ నిరాశ పరిచిందా ?

నా స్నేహితుడు సాయి, రాజేంద్ర ప్రసాద్ కోసం నిలబడి చేసిన సినిమా అది. ఫలితం మాట పక్కన పెడితే నా స్నేహితుల కోసం చేసిన సినిమా అనే తృప్తి వుంది.