Reading Time: 2 mins

దర్శకుడు డా అనిల్ విశ్వనాథ్ ఇంటర్వ్యూ

మాఊరి పొలిమేర చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా నిరూపించుకున్న దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం మా ఊరి పొలిమేర-2 పొలిమేర చిత్రానికి సీక్వెల్ ఇది. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గౌరికృష్ణ నిర్మాత. నవంబరు 3న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా సోమవారం చిత్ర దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్ పాత్రికేయులతో ముచ్చటించారు.

సాధారణంగా భారీ చిత్రాలకు మాత్రమే సీక్వెల్ చేస్తుంటారు. కానీ మీరు మా ఊరి పొలిమేర లాంటి చిన్న చిత్రానికి సీక్వెల్ చేయడానికి కారణం ?
కథ రాసుకున్నప్పుడే తప్పనిసరిగా సీక్వెల్ చేద్డామని అనుకున్నం. కథలో వున్న సీరియస్ నెస్, ఇంకా చెప్పాలనుకున్న కథ మిగిలిపోవడంతో పార్ట్ 2లో ఆ కథను చెబుదామని అనుకున్నాం. ఎక్కడైతే పార్ట్ 1 ముగిసిందో.. పార్ట్ 2 అక్కడే మొదలవుతుంది. ఇది పక్కా సీక్వెల్.

ప్రచార చిత్రాలు చూస్తుంటే కార్తికేయ చిత్రానికి పొలిమేరకు పోలిక వున్నట్లు అనిపిస్తుంది?
సినిమా విడుదల తరువాత కార్తికేయకు మా కథకు ఎటువంటి సంబంధం లేదని తెలుస్తుంది. గుడి అనే కామన్ పాయింట్ తప్ప కార్తికేయ చిత్రానికి మా చిత్రానికి ఎటువంటి సంబంధం లేదు.

మొదటి పార్ట్ లో ఊహించని ట్విస్ట్ లు వుంటాయి. పతాక సన్నివేశాలు కూడా చాలా థ్రిలింగ్ గా వుంటుంది. పార్ట్ 2లో
ఎటువంటి ట్విస్ట్ లు వుంటాయి?
మొదటి పార్ట్ చూసిన వాళ్లు అందులోని ట్విస్ట్ లను బాగా ఎంజాయ్ చేశారు. పార్ట్ 2పై వాళ్లలో అంచనాలు పెరిగాయి. అందుకే పార్ట్ 2 స్క్రీన్ ప్లేను మరింత బలంగా తయారు చేసుకున్నాను. ఈ చిత్రంలో ప్రేక్షకులు ఊహించలేని ఎనిమిది ట్విస్ట్ లు వుంటాయి. తప్పకుండా పార్ట్ 1కు మించే విధంగా దానితో పొల్చితే దాదాపు పది రెట్ల థ్రిల్ ను ఫీలవుతారు. పతాక సన్నివేశాలు షాకింగ్ గా వుంటాయి. పొలిమేర 3 కూడా వుంటుందని ప్రకటించాను. దీనికి సంబంధించిన కథ కూడా రెడీ గా వుంది.

మా ఊరి పొలిమేర పార్ట్ 1కు మీకు లభించిన కాంప్లిమెంట్స్?
వాస్తవంగా పార్ట్ 1 ఓటీటీలో విడుదల కావడంతో నాకు పెద్దగా రెస్పాన్స్ తెలియలేదు. మేము ఎటువంటి ప్రచారం లేకుండానే చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశాం. సినిమా చూసిన తరువాత చాలా మంది బాగుందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ ఫోన్ చేసి అభినందించారు. ఆయన దర్శకుడిగా నీకు మంచి భవిష్యత్ వుంది అని చెప్పడంతో నాలో నాపై మరింత నమ్మకం పెరిగింది.

సత్యం రాజేష్ ఈ చిత్రాన్ని ఓన్ చేసుకుని చేశాడని అనిపిస్తుంది?
సత్యం రాజేష్ ఎంతో తపనపడే వ్యక్తి. నటుడిగా ఎటువంటి పాత్రను ఇచ్చిన చేయగలడు. సత్యం రాజేష్ దర్శక, నిర్మాతల పట్ల ఎంతో గౌరవం వున్న వ్యక్తి.

మా ఊరి పొలిమేర 2 థియేటర్ లోనే విడుదల చేద్దామని అనుకున్నారా?
ఈ సినిమాను థియేటర్ లోనే విడుదల చేద్ధామని అనుకున్నాం అనుకున్నట్లుగానే సినిమాను చేశాను. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు వంశీ నందిపాటి గారి సహకారంతో చాలా గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. బన్నీవాస్ గారు చూడటం ఆయనకు నచ్చడంతో మా సినిమా పెద్ద రేంజ్ కు వెళ్లింది. ఈ సినిమాకు వీరి వాళ్లే మంచి బజ్ ఏర్పడింది.

ఈ చిత్ర కథానాయిక కామాక్షి మీ దర్శకత్వ శాఖలో భాగం చేసుకోవడానికి కారణం
ఆమెకు దర్శకత్వం మీద ఆసక్తి వుండటంతో నేను కూడా ఓకే అన్నాను. మొదట్లో పెద్దగా నమ్మలేదు. తరువాత ఆమె ప్రతిభ చూసి నాకు నమ్మకం పెరిగింది. తెలుగులో ఫీమేల్ డైరెక్టర్స్ కూడా తక్కువే. ఆమె తప్పకుండా తెలుగులో మంచి దర్శకురాలు అనిపించుకుంటుందనే నమ్మకం వుంది.

మీ తదుపరి చిత్రం ?
పొలిమేర 2 కంటే ముందు మరో సినిమా చేయాలనుకుంటున్నాను.ఎందుకంటే వెంటనే పొలిమేర 2 చేస్తే నన్ను అందరూ చేతబడుల దర్శకుడు అంటారేమో (నవ్వుతూ)