నాట్యం మూవీ రివ్యూ

Published On: October 23, 2021   |   Posted By:

నాట్యం మూవీ రివ్యూ

సంధ్యా రాజు ‘నాట్యం’  రివ్యూ

Emotional Engagement Emoji (EEE) : 

👍

సంధ్యారాజు హీరోయిన్ గా పరిచయం అవుతున్న  ‘నాట్యం’  సినిమా రిలీజైంది. వింతేముంది ..ప్రతీ వారం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి. అయితే ఈ సినిమాని అన్నిటిలో అలా ఒకటిగా కలిపి వెయ్యలేం. ఎందుకంటే అంతకు ముందే టీజర్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసారు. అలాగే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ ముఖ్య అతిధిగా వచ్చారు. అలాగే చిరంజీవి మొదలుగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తో సహా  చాలా మంది సెలబ్రెటీలు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఈ నేపధ్యంలో అసలు ఈ సంధ్యారాజు ఎవరు? అనే ప్రశ్న చాలామందిలో కలుగుతుంది. అలాగే ఈ సినిమా ప్రత్యేకత ఏమిటి…సామాన్యులకు నచ్చే సినిమాయేనా లేక కేవలం నృత్యాభిమానులకు నచ్చేదా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

ఆ ఊళ్లో అందరూ క్లాసికల్ డాన్సర్సే. ఆ ఊరి పేరు నాట్యం. అక్కడ ఓ డాన్సర్ సితార (సంధ్యా రాజు) . ఆమె కూడా ఆ ఊరి జనం వెళ్లే దారిలోనే ప్రయాణం. క్లాసికల్ డాన్స్ అంటే ప్రాణం. అయితే  ఆమె జీవితంలో ఓ కోరిక. అయితే ఆ కోరిక తీరదు..వద్దు అంటారు గురువు(ఆదిత్య మేన‌న్‌)  తో సహా అందరూ. అదేమిటంటే… అదేమిటంటే కాదంబ‌రి క‌థ‌ను ఎప్పటికైనా అంద‌రి ముందు ప్రద‌ర్శించాల‌ని. అయితే ఆ క‌థ‌ను ఎవ‌రు ప్రదర్శించాలనుకున్నా వారు చనిపోతూంటారు. చివరకి గురువు గారి భార్య మ‌ర‌ణ‌ంకూడా అలాగే జరిగింది. కానీ సితార పట్టుదల ముందు ఈ భయాలు,బంధనాలు ఏమీ చెయ్యవు. కాదంబరి కథని చెప్పటానికే ఆమె ప్రయత్నం మొదలెడుతుంది. ఈ ప్రయత్నంలో ఎలాంటి అవాంతరాలు వచ్చాయి. ఇంతకీ ఈ కాదంబరి ఎవరు.. సితార తన కోరిక నెరవేర్చుకుందా..చివరకు ఏమైంది విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్ ..

మొదట సంధ్యారాజు గురించి రెండు ముక్కలు చెప్పుకుని తర్వాత ఎనాలసిస్ లో కి వెళ్దాం. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త రామ్ కో గ్రూప్ చైర్మన్ పి.ఆర్.వెంకట్రామరాజాగారి కుమార్తె ఈ సంధ్యారాజు. అలాగే సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకులు బి.రామలింగరాజు గారి చిన్న కోడలే సంధ్యారాజు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మందికి తెలుసు ఆమె ఒక మంచి కూచిపూడి నృత్యకారణి అని, తెలియని వారికి నాట్యం సినిమా ద్వారాపరిచయమయ్యారు. కళాప్రపూర్ణ వెంపటి చిన సత్యం గారు సంధ్యారాజుకి కూచిపూడి నృత్యంలో గురువు. సంధ్యారాజు నర్తించిన కృష్ణశబ్దం అనే వీడియో కు యూట్యూబ్ లో ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక కూచిపూడి నర్తకి వీడియోకి ఈ స్థాయిలో వ్యూస్ రావడం దేశంలోనే ప్రప్రథమం ఇదీ ఆమె గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్.

ఇక సినిమా విషయానికి వస్తే…ఇలాంటి నృత్య ప్రధాన సినిమాలు గతంలో విశ్వనాధ్ గారు…జంధ్యాల గారు ఎటెమ్ట్ చేసారు. తమిళంలోనూ కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు అలాంటి సినిమాలు రావటం లేదు. జనాలు చూస్తారో లేదో కానీ నిర్మాతలు మాత్రం ధైర్యం చేయటం లేదు. ఇలాంటి సమయంలో హిట్,ఫ్లాఫ్ అనే విషయాలను ప్రక్కన పెట్టి ఇలాంటి టైటిల్ ,కథతో సినిమా చేయటం మాత్రం గొప్ప విషయమే.  అయితే స్క్రీన్ ప్లే  పరంగా ఈ సినిమా సరిగ్గా నడవదు. చెప్దామనుకున్న కథని సినిమాటెక్ గా ప్రెజెంట్ చేయలేకపోయారు.ఫస్టాఫ్ లో పెద్దగా కథ చెప్పే ప్రయత్నం చేయకుండా నడిపేసారు.  సినీ ప్రారంభంలో నాట్యం గ్రామం.. అందులోని దేవాలయం.. దాని వెనుకున్న క‌థ‌ను ఇంట్రస్టింగ్ గా ఉందనుకునే లోగా రొటీన్ సీన్స్ స్టార్టవుతాయి. ఇంట్రవెల్ దగ్గర కథలోకి వచ్చారు. ఇక కథ పరుగెడుతుంది అనుకుని ఉత్సాహపడతాం. కానీ సెకండాఫ్ బాగా ఎమోషనల్ గా తీర్చిదిద్దారు. అదీ విసుగెత్తిస్తుంది.
 అయితే కాదంబరి ప్లాష్ బ్యాక్ తో పాటు కొన్నిఎమోషన్ సీన్స్  సినిమా ఉండటమే ఉన్నంతలో  కలిసొచ్చింది. నాట్యంతో కథ చెప్పడం అనే ఐడియాని తెరపై కు తీసుకురావటంతో ఫెయిలయ్యారు. కాస్త అనుభవం ఉన్న దర్శకుడు చెయ్యాల్సిన సినిమా అనిపిస్తుంది. మంచి పాయింట్ ని, గొప్ప కళాకారణి ప్రతిభను వృధా చేసినట్లు అర్దమవుతుంది. అయితే  టైటిల్ కు తగ్గట్టుగానే ఇది శాస్త్రీయ నృత్యం నేపథ్యంలో సాగే సినిమా అయినా ఈ సినిమాలో కేవలం నృత్యం మాత్రమే ఉండదు… అంతకు మించిన బంధాలు, భావోద్వేగాలు ఉంటాయి. ఒక విద్యార్థినికి, గురువుకి మధ్య ఉన్న అందమైన అనుబంధం…నర్తకి కావాలనే ఆమె తపన, అందుకు ఎదురైన అడ్డంకులు ఈ సినిమాలో చూపించటం నచ్చుతుంది.

ఏదైమైనా మన  జీవన విధానంలో, సాంప్రదాయ కళలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు . సాంప్రదాయ కళలు అనగానే ముందుగా తోచేవి శాస్త్రీయ నృత్యం, సంగీతం.  సంస్కృతీ సాంప్రదాయాల పరంగా మన భావి తరాల వారిపై, కళలకు ఉండగల ప్రభావం గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. అలాగే  హిందూ పురాణాలు, ఇతిహాసాలకు చిత్రరూపం కల్పించడంలో చిత్రకారులు,నృత్యకళారాలు ఒక్కొక్కరిది ఒక్కో శైలిలో ముందుకు వెళ్తున్నారు.  అదే విధంగా సంధ్యా రాణి కూడా పౌరాణికాంశాలకు తనదైన శైలిలో దృశ్యరూపం కల్పించారు. తన కళను నలుగురు చూపించాలనే ఆలోచన మాత్రమే కాకుండా దాని ద్వారా మన భారతీయ సంస్కృతిని ఆ కళ ద్వారా మరోసారి గుర్తు చేసే ప్రయత్నం అభినందించదగినదే. ఇలాంటి సినిమాల  ద్వారా సౌందర్య భావనను వ్యక్తపరచటం అనేది అరుదైన విషయం.

నటీనటుల్లో …

  సితారగా కూచిపూడి డ్యాన్సర్‌ సంధ్యారాజు ఫెరఫెక్ట్. అయితే ఆమెలోని నటికన్నా డాన్సరే డామినేట్ చేసారు.  గురువుగా ఆదిత్య మీనన్ వంకపెట్టలేని విధంగా సెట్ అయ్యారు. ఇక క్లాసికల్‌ డ్యాన్సర్‌ హరిగా కమల్ కామరాజు, వెస్ట్రన్ డ్యాన్సర్‌ రోహిత్‌గా రోహిత్ బెహాల్  మెప్పించారు. ఊరి పెద్దగా శుభలేక సుధాకర్‌, హీరోయిన్‌ తల్లిగా భానుప్రియ తమ పాత్రల పరిధిమేర నటించారు.

టెక్నికల్ గా …
ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ శ్రవణ్ భరద్వాజ్ సంగీతం. పాటలతో పాటు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించాడు. పాటలు కూడా  కథలో భాగంగా నడిచాయి. సినిమాటోగ్రఫీ అద్బుతం అనలేం కానీ . ఎడిటింగ్‌పై ఇంకాస్త షార్ప్ గా చెయ్యాల్సిందనిపిస్తుంది.

చూడచ్చా..

‘స్వర్ణకమలం’  ‘సాగర సంగమం’ . ‘ఆనందభైరవి’ వంటి క్లాసిక్స్ ని గుర్తు చేసుకోకుండా చూస్తే బాగుందనిపిస్తుంది. మంచి సినిమా చూసామనిపిస్తుంది. అయితే ఆ నృత్యాభిరుచి ఉంటేనే సుమా.

తెర వెనక..ముందు
నిర్మాణ సంస్థ : నిశృంకళ ఫిల్మ్‌
న‌టీన‌టులు: సంధ్యారాజు, కమల్ కామరాజు,  రోహిత్ బెహాల్, ఆదిత్య మీనన్, శుభలేక సుధాకర్, భానుప్రియ తదితరులు
సంగీతం :శ్రవణ్ బరద్వాజ్
సినిమాటోగ్రఫీ : రేవంత్ కోరుకొండ
నిర్మాత:  సంధ్యారాజు
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వం,ఎడిటింగ్, ఛాయాగ్రహ‌ణం: రేవంత్ కోరుకొండ‌;  
రన్ టైమ్ : 2h 16m
విడుదల తేది : అక్టోబర్‌ 22, 2021