నారప్ప మూవీ రివ్యూ

Published On: July 20, 2021   |   Posted By:

నారప్ప మూవీ రివ్యూ

కట్ అండ్ పేస్ట్ అప్పా: ‘నారప్ప’ రివ్యూ

Rating:2.5/5


వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘అసురన్’ పెద్ద హిట్. చిన్న బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా భారీ లాభాలనే నిర్మాతకు అందించింది. ధనుష్ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. దాంతో  ఈ మూవీ తెలుగులో ‘నారప్ప’టైటిల్ తో దించేసారు. ఈ నేపధ్యంలో ఆల్రెడీ అసురన్ చూసిన వాళ్లకి …మన పరిస్థితులకి తగ్గట్లు, మన నేటివిటీకి తగ్గట్లు మార్చి రీమేక్ చేసారా లేదా ..చేస్తే ఏ మార్పులు చేసారనే ఆసక్తి కలుగుతుంది. అలాగే ధనుష్ చేసిన పాత్రను వెంకటేష్ ఎంతవరకూ పండించారు అని ఇద్దరు అభిమానులు ఎదురుచూస్తారు. తెలుగులోనూ తమళ స్దాయి హిట్ ని ఈ సినిమా నమోదు చేయగలుగుతుందా. వెంకేటేష్ సినిమా అనగానే ఫ్యామిలీ,కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. ఆ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సీరియస్ సినిమాలో అలాంటి మార్పులు ఏమన్నా చేసారా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.  

స్టోరీ లైన్
పండు స్వామి (ఆడుకాలం న‌రేన్‌) పెద్ద భూస్వామి. తనకు ఎంత ఆస్తి ఉన్నా తన ఊళ్లో వాళ్ల పొలాలు అన్ని సొంతం చేసేసుకోవాలనే ఫ్యూడల్ మనస్తత్వం. నయానో,భయానో అందరిచేతా పొలాలు రాయించుకుంటున్న పండుస్వామికి.. నారప్ప(వెంకటేశ్‌) తనకున్న మూడు ఎకరాలు రాయను అనటంతో మండుకొస్తుంది. దాంతో పండుస్వామి…నారప్ప కుటుంబంపై పగపగతాడు. ప్రతీ చిన్నవిషయంలోనూ గొడవకు దిగి రెచ్చగొడతాడు. ఇక  నారప్ప పెద్దకొడుకు మునికన్నా(కార్తీక్‌ రత్నం) కాస్త దూకుడు మనిషి. దాంతో  పండుస్వామి మనుషులతో బహిరంగంగానే గొడవకు దిగుతాడు. దాంతో మునికన్నా… పండుస్వామిని చెప్పుతో కొట్టి అవమానిస్తాడు.  తన మనుషులతో మునికన్న ని దారుణంగా హత్య చేయిస్తాడు. కానీ నారప్పది గొడవలకు వెళ్లే మనస్త్తత్వం కాదు. దాంతో కొడుకు చనిపోయాడు..ఫలానా వాళ్లు చంపేసారు అని తెలిసినా సైలెంట్ గా ఉంటాడు. కానీ  నార‌ప్ప చిన్న కొడుకు సీన‌బ్బ (రాఖీ) మాత్రం త‌న ఆగ్రహాన్ని ఆపుకోలేక‌పోతాడు. త‌ల్లి సుంద‌ర‌మ్మ (ప్రియ‌మ‌ణి) ప‌డుతున్న బాధ చూడ‌లేక‌ డైరక్ట్ గా వెళ్లి పండుస్వామిని న‌రికి చంపేస్తాడు. ఈ క్రమంలో పండుస్వామి మ‌నుషులు సిన్న‌ప్ప‌ని చంప‌డానికి వెంట‌ప‌డ‌తారు. అక్కడ నుంచి పండుస్వామి మ‌నుషుల నుంచి త‌న‌నీ, త‌న కుటుంబాన్నీ నార‌ప్ప ఎలా కాపాడుకున్నాడు?పెద్ద కొడుకు హత్యకు గురైనా నారప్ప ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు? అసలు నారప్ప గతం ఏంటి? చివరకు నారప్ప తన రెండో కొడుకును కాపాడుకున్నాడా? లేదా? అనేదే మిగతా కథ.  చివరకు ఏమైంది…వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
ఎనాలసిస్..

తమిళంలో ఎప్పుడో చాలా కాలం క్రితం వచ్చిన పూమాని రాసిన వెక్కై నవల ఆధారంగా‘అసురన్’ తెరకెక్కించారు. ఆ సినిమాలో ధనుష్ నట విశ్వరూపం చూపించారు. దాని రీమేక్ లో ఎంతసేపూ ధనుష్ ని అనుకరిస్తూ వెంకటేష్, స్క్రిప్టుని అనుసరిస్తూ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ముందుకెళ్లారు. తమదైన క్రియేటివిటీ చూపించటానికి ఇష్టపడలేదు. అదే ఈ సినిమాకు మైనస్ అయ్యిందనే చెప్పాలి. అలా అనుకరిస్తూ పోవటంతో సినిమా జెరాక్స్ కాపీలా తయారైంది. ఎక్కడా మన తెలుగు సినిమా చూస్తున్నట్లు అనిపించదు. తమిళ రీమేక్ అని పదేపదే గుర్తు చేస్తున్నట్లు ఉంటుంది. అయితే కథలోని క్యారక్టర్స్ ను ఏమాత్రం మార్చకుండా ఎమోషన్స్‌ పండించడంతో దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల కొంతమేర సక్సెస్ అయ్యాడని చెప్పాలి.  అయినా ఒరిజనల్ అసురన్ చూసిన ఖచ్చితంగా ఈ నారప్పని దాంతో పోల్చి చూస్తారు. చూసినప్పుడు కొత్తగా ఏమీ అనిపించదు.

ఇక సెకండాఫ్ లో వచ్చే  నార‌ప్ప ఫ్లాష్ బ్యాక్ పెద్ద ఆసక్తిగా లేదు.   ఎమోష‌న్స్ క‌ట్టిప‌డేసినా కొంత విసిగించింది.దానికి తోడు వెంకటేష్ పెద్ద వయస్సు వాడిగా కనిపడటం ఎబ్బెట్టుగా లేదు కానీ యువకుడు మాత్రం .. వయస్సు కనపడబోయింది.  ఇక డైరక్టర్ తెలివిగా..ఈ క‌థ‌లో ఎక్క‌డా కులం ప్ర‌స్తావ‌న తీసుకురాలేదు. అయితేనేం తెరపై చెప్పేదంతా  పూర్తిగా అర్దమవుతుంది.  అలాగే తమిళ ఆడియన్స్ వేరు..తెలుగు ఆడియన్స్ వేరు. మనవాళ్లు ఎంటర్టైన్మెంట్ కు పూర్తి ప్రయారిటీ ఇస్తారు. ఈ సినిమాలోఅదేమీ కనపడదు. అవకాసం కూడా లేదు. అలాగే తెలుగుకు వచ్చేటప్పటికీ సగటు తెలుగు ఆడియన్స్ ఆ స్థాయి ఎమోషన్ ని రిసీవ్ చేసుకోవటం కాస్త కష్టమే అనిపిస్తుంది. దాంతో మనకు ఈ సినిమా ఓ రివేంజ్ స్టోరీలాగ కనపడినా ఆశ్చర్యపడక్కర్లేదు.
 
టెక్నికల్ గా..

సినిమాలో సంగీతం,పాటలకు పెద్దగా ప్రయారిటీ లేకున్నా ఉన్న ఒక్క పాట బాగుంది అనిపిస్తుంది, ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తుందనటంలో సందేహంలేదు, ఫైట్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్ట్స్  లెవల్ లో ఉంది అని చెప్పాలి. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం గురించి చెప్పాలంటే..డైరెక్టర్ వెట్రీమారన్ డైరెక్షన్ ని అనుకరించకుంటూ వెళ్లిపోయారు. వెంకటేష్ రోల్ ని ఎక్కడ ఎలివేట్ చేయాలో అక్కడ పెర్ఫార్మెన్స్ రాబట్టాలో అదే చేసారు. డైలాగులు విషయానికి వస్తే …రాయ‌ల‌సీమ మాండ‌లికంలో సంభాష‌ణ‌లు రాసినా… కొన్ని చోట్ల ఆ విషయం మర్చిపోయిన కొన్ని క్యారక్టర్స్  మామూలు తెలుగు మాట‌లు మాట్లాడేస్తుంటాయి. యాస విష‌యంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే  బాగుండేది.‘వాళ్లను ఎదిరించడానికి అది ఒక్కటే దారి కాదు. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప’ అనే డైలాగు బాగుంది.
 
నటీనటుల్లో..
 
క్షన్, ఎమోషనల్   సీన్స్ లో వెంకటేష్ చాలా బాగా చేసారు. అయితే ప్లాష్ బ్యాక్ లో వచ్చే వెంకటేష్ తేలిపోయాడు. సుందరమ్మ పాత్రలో ప్రియమణి ,ముని కన్నాగా కార్తీక్ రత్నం, సిన్నబ్బగా రాఖీ, బసవయ్యగా రాజీవ్ కనకాల, లాయర్ వరదరాజులుగా రావు రమేష్, శంకరయ్యగా నాజర్  ఇలా అందరూ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది.


చూడచ్చా
అసురన్ చూడని వాళ్ళకు బాగుందనిపిస్తుంది.
 
తెర ముందు..వెనుక


నటీనటులు: వెంకటేశ్‌, ప్రియమణి, కార్తీక్‌ రత్నం, రావు రమేశ్‌, నాజర్‌, రాజీవ్‌ కనకాల, అమ్ము అభిరామ్‌ తదితరులు

సంగీతం: మణిశర్మ;

సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు;

ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌;

నిర్మాత: కలైపులి ఎస్‌.థాను, డి.సురేశ్‌బాబు;

రచన: వెట్రిమారన్‌(అసురన్‌);

స్క్రీప్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల;

బ్యానర్‌: సురేశ్‌ ప్రొడక్షన్స్‌, వి.క్రియేషన్స్‌;

విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

రన్ టైమ్:2 గంటల 35 నిముషాలు

విడుదల తేదీ:20 జూలై,2021