Reading Time: 2 mins

పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి అభినందన సభ

ఈ ‘పద్మశ్రీ’… వారందరిదీ! – దర్శకుడు కె.విశ్వనాథ్ ఆత్మీయ అభినందన సభలో… గీత రచయిత సీతారామశాస్త్రి 

చేంబోలు సీతారామశాస్త్రిని ‘సిరివెన్నెల’ చిత్రంతో సిరివెన్నెల సీతారామశాస్త్రిని చేసి, సినీ రంగంలో జన్మనిచ్చి, ప్రోత్సహించిన దర్శకులు కె. విశ్వనాథ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. నా ఈ అభ్యున్నతికి కారణం నాకు జన్మనిచ్చిన తల్లితండ్రులు, సినీ జన్మనిచ్చిన విశ్వనాథ్, పెంచిపోషించిన సినిమా తల్లి, ఇన్నేళ్ళు నా వెన్నంటి ఉండి కలసి ప్రయాణించిన ఎందరెందరో నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, గాయకులు, నా కుటుంబసభ్యులు. అందుకే, తెలుగులో సినీ గేయకవితా రచనకు తొలిసారి దక్కిన ఈ ‘పద్మశ్రీ’ నాది… కాదు వారందరిదీ! అందుకే, ఇది నాకు అభినందన కాదు… ఆశీర్వాద సభగా భావిస్తున్నా” అని ప్రముఖ సినీ గీత రచయిత సీతారామశాస్త్రి అన్నారు.

ఆయనకు ఇటీవలే భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించిన సందర్భంగా కళాత్మక చిత్రాల దర్శకుడు, ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ గ్రహీత కె. విశ్వనాథ్ హైదరాబాద్‌లోని తమ స్వగృహంలో బుధవారం సాయంత్రం ‘చిరువెన్నెలలో సిరిమల్లెలు’ పేరిట చిరు ఆత్మీయ అభినందన జరిపారు.

సినీ, సాంస్కృతిక రంగాల నుంచి వచ్చిన పలువురు ప్రముఖుల సమక్షంలో సీతారామశాస్త్రి దంపతులనూ, ఆయన మాతృమూర్తినీ విశ్వనాథ్ కుటుంబం సాదరంగా సత్కరించింది.

”ఈ పురస్కారం రావడం ఆలస్యమైందా, ముందుగా వచ్చిందా లాంటి మాటలను అటుంచితే, రావాల్సిన వ్యక్తికి రావడం ఆనందంగా ఉంది. స్వయంకృషి, సాధనతో ఈ స్థాయికి ఎదిగిన సీతారామశాస్త్రి తన మొదటి చిత్రం ‘సిరివెన్నెల’ రోజుల లానే ఇప్పటికీ నిగర్వంగా ఉండడం విశేషం. సాహితీ మానస పుత్రుడైన శాస్త్రి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదిస్తున్నా” అని విశ్వనాథ్ అన్నారు. 

సరిగ్గా 87 ఏళ్ళ క్రితం తెలుగు సినిమా పుట్టినరోజైన ఫిబ్రవరి ఆరునే ఈ అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం బాగుందనీ, శాస్త్రి గారికి వచ్చినందుకు ‘పద్మశ్రీ’నే అభినందించాలనీ దర్శకులు వి.ఎన్. ఆదిత్య, ఇంద్రగంటి మోహనకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి, కాశీవిశ్వనాథ్, బి.వి.ఎస్. రవి, కె. దశరథ్, రచయితలు జనార్దన్ మహర్షి, బుర్రా సాయిమాధవ్, రామజోగయ్యశాస్త్రి, అబ్బూరి రవి, నిర్మాతలు రాజ్ కందుకూరి, ఏడిద శ్రీరామ్, నటుడు జిత్‌మోహన్ మిత్రా, ‘మా’ శర్మ, యాంకర్ ఝాన్సీ తదితరులు గుండె లోతుల్లో నుంచి తమ అనుభవాలు, అనుభూతులను పంచుకున్నారు.

విశ్వనాథ్, సీతారామశాస్త్రి కలయికలోని వివిధ చిత్రాల్లోని ఆణిముత్యాల లాంటి కొన్ని పాటలను ప్రముఖ నేపథ్య గాయనీ గాయకులు ఉష, శశికళ, హరిణి, సాయిచరణ్ గానం చేశారు.

వేణుగాన విద్వాంసుడు నాగరాజు, నటి – నాట్యకళాకారిణి ఆశ్రిత వేముగంటి, ‘సప్తపది’ చిత్రం ఫేమ్ సబిత కొన్ని పాటలకు తమ కళా ప్రదర్శనతో మరింత రక్తి కట్టించారు.  

సంగీత దర్శకుడు మణిశర్మ, నటులు గుండు సుదర్శన్ సహా పలువురు హాజరైన ఈ వేడుకలో ‘ఎవ్వాని భావ జలధిలో కైతలమ్మ నిండార తానమాడె…’ అంటూ విశ్వనాథ్ అప్పటికప్పుడు తన ఆశు వచనమాలికతో సీతారామశాస్త్రిని ఆశీర్వదించడం విశేషం. ఎనిమిది పదుల పై బడిన మాతృమూర్తికి సీతారామశాస్త్రి పాదాభివందనం చేయడం, ఆమె భావోద్వేగానికి గురై కుమారుణ్ణి ఆశీర్వదించి,  ఆప్యాయంగా ముద్దు పెట్టుకోవడం, సినీ కుటుంబమంతా కలసి బృందగానం చేస్తుండగా శాస్త్రి దంపతులు దండలు మార్చుకోవడం, శాస్త్రి సైతం ‘సిగ్గు పూబంతీ…’ అంటూ ఆ పాటలో అందరితో గొంతు కలపడం… ఇలా ఎన్నో భావోద్విగ్న ఘట్టాలు, ఆనందక్షణాలు చోటుచేసుకున్నాయి. ఓ కుటుంబ వేడుకలా సాగిన ఈ ఆత్మీయ అభినందనను మరింత ఆర్ద్రంగా మార్చాయి.