Reading Time: 2 mins

పహిల్వాన్ మూవీ రివ్యూ

ఓడిన ‘పహిల్వాన్’(రివ్యూ!)

Rating:2.5/5

 
‘కేజీఎఫ్’సూపర్ హిట్  తర్వాత క‌న్న‌డ సినిమాల‌ మార్కెట్ పెరిగింది. దానికి తగినట్లుగా వాళ్ల బ‌డ్జెట్లూ పెరిగాయి. దాంతో అక్కడ హీరోలకు తాము కూడా ప్యాన్ ఇండియా సినిమా తీసి, దేశం మొత్తం కీర్తింపబడాలనే కోరిక మొదలైంది. అలాంటి ఆలోచనల్లోంచి పుట్టిన చిత్రమే ‘ప‌హిల్వాన్’.దేశం మొత్తం రిలీజ్ కదా అని ఈ సినిమాకు భారీ స్థాయిలోనే ఖ‌ర్చు పెట్టారు. ప్ర‌తీ సీన్ రిచ్‌గా క‌నిపించాల‌ని తాప‌త్ర‌య‌ంతో కష్టపడ్డారు. తెలుగులోనూ సుదీప్ పరిచయం ఉండటంతో ఇక్కడా భారీగానే రిలీజ్ చేసారు. ఈ నేపధ్యంలో  దర్శక,నిర్మాతల కష్టం తెరపై కనపడిందా, ప్యాన్ ఇండియా స్దాయిలో రిలీజ్ చేసేటంత కంటెంట్ ఉన్న సినిమాయేనా.. కథేంటి, తెలుగులో వర్కవుట్ అవుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

అనాధ గా ఉంటూ తిండి కోసం తిప్పలు పడుతూ, అందులో భాగంగా గొడవలు, దెబ్బలాటలు, ఫైట్స్ చేస్తూంటాడు కృష్ణ (సుదీప్‌). ఆ క్రమంలో  అతనిలో  ఆ పోరాట నైపుణ్యం,చురుకుదనం   ఓ రోజు శంక‌ర్ (సునీల్ శెట్టి) అనే ఓ కుస్తీ వ‌స్తాదు కళ్ళపడుతుంది. దాంతో అతను  చేర‌దీసి, వీడిలో విషయం ఉంది…ఎప్పిటికైనా మంచి ‘పహిల్వాన్’ అవుతాడని నమ్మి అతనికి కుస్తీలో కిటుకులు నేర్పుతాడు. కృష్ణ కష్టపడి కుస్తీలో  ప‌ట్టు సాధిస్తాడు. కుస్తీ పోటీల్లో నేషనల్స్ వెళ్తాడు అనుకుంటే ఓ అమ్మాయి రుక్మిణి (ఆకాంక్ష సింగ్‌)  ప్రేమ‌లో ప‌డాతాడు. ఆమె ధ్యాసలో పడి  కృష్ణ కుస్తీని   నిర్ల‌క్ష్యం చేస్తుంటాడు. అది గమనించి శంకర్ హెచ్చరిస్తాడు. ఆ అమ్మాయిని వదిలేయమంటాడు. కానీ కృష్ణ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. దాంతో తన మాట కాదని  త‌న‌కు ఇష్టం లేకుండా  పెళ్లి చేసుకున్నందుకు శంకర్ కు కోపం వస్తుంది. దాంతో ‘నా నుంచి నువ్వు నేర్చుకున్న  కుస్తీ విద్య‌ని వదిలేయ్.. ఎప్పుడూ ఎక్క‌డా ప్ర‌ద‌ర్శించ‌కు’ అంటాడు. సరేనని, గురువు ఆజ్ఞతో  కుస్తీని వ‌దిలి దూరంగా వెళ్లిపోతాడు. అయితే ఆ తర్వాత కొన్ని అనుకోని పరిస్దితుల్లో  కృష్ణ బాక్సింగ్ ఛాంపియ‌న్‌ అవుతాడు. ఆ పరిస్దితి లు ఏమిటి… మళ్లీ గురువుకు దగ్గరయ్యాడా…అసలేం జరిగింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  
 

 

ఎనాలసిస్

మొన్న కౌసల్యా కృష్ణమూర్తి ,ఇప్పుడీ  ‘పహిల్వాన్’ రెండూ రెండే. పరమ రొటీన్ స్పోర్ట్స్ డ్రామాలు. కొత్తదనం మచ్చుకైనా కనపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న సినిమాలు. నిజ జీవితంలో జరిగిన కథను తీసుకుని ఇలాంటి సినిమాలు తీస్తే కాస్తంత విభిన్నంగా ..ప్రేరణగా ఉంటాయి. సినిమాకు నాచురల్ లుక్ వస్తుంది. అంతేకాని నాలుగు గదుల మధ్యన కూర్చుని నాలుగు సినిమా కలిపి వండేసిన  కథ ఇంతకన్నా గొప్పగా ఏముంటుంది. సినిమా ప్రారంభమైన కాసేపటికే ఈ సినిమా ఎందుకుచూడాలి అనిపిస్తుంది. సుదీప్ హీరోయిజాన్ని లేపటమే ఈ సినిమా ఆశయంగా సీన్స్ వస్తూ పోతూంటాయి. కేజీఎఫ్ సినిమాని ఆదర్శంగా పెట్టుకుని హీరో ఎలివేషన్ ఎంత బాగా చేస్తే అంతబాగా వర్కవుట్ అవుతుందనే భ్రమలో ఉండి తీసిన సినిమా అనిపిస్తుంది. ఇక మన తెలుగు వాళ్ల విషయానికి వస్తే…ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా  కథలు బోలెడు గతంలో మనం చూసేసాం.  ‘భ‌ద్రాచ‌లం’, ‘అమ్మానాన్న ఓ త‌మిళ అమ్మాయి’, ‘త‌మ్ముడు’ ఇవన్నీ ఇలాగే సాగుతాయి. అలాగే  హిందీ సినిమా ‘సుల్తాన్’‌, ‘దంగ‌ల్’లను కూడా ఈ సినిమాలో కలిపికొట్టారు.  దానికి తోడు అతి సెంటిమెంట్ సినిమాకు మరో బోర్ వ్యవహారం. ఇంతోటి సినిమాని దేశం మొత్తం రిలీజ్ చేయటం.  క‌న్న‌డ‌లో అంటే సుదీప్‌ కోస‌మైనా ఈ సినిమా చూస్తారేమో. మిగతావాళ్ళకు ఈ హీరో వేషాలు వేసే  ‘ప‌హిల్వాన్‌’ని ఎందుకు భరించాలి. కేవలం హీరో బిల్డప్, భారీ ఖర్చు, భారీ ఫైట్లు ఈ మూడింటి మీద పెట్టిన సీరియస్ నెస్ కథ,కథనం మీద కనిపించపోవటమే సినిమాని దెబ్బ కొట్టింది.



బాగున్నవి..బాగోలేనివి

ప్యాన్ ఇండియా గా ప్లాన్ చేసి బడ్జెట్ బాగా ఖర్చు పెట్టి మంచి టెక్నీషియన్స్ తెచ్చి సినిమాను తీయటంతో విజువల్ గా చూడటానికి బాగుంటుంది. కెమెరా వర్క్, సినిమాకు వేసిన సెట్స్ బాగున్నాయి. అయితే అసలు ఎక్కడైతే కుస్తీ పట్టాలో ఆ విభాగమైన స్క్రిప్టుని వదిలేసారు. బాగా మూస ధోరణిలో వెళ్లిపోయారు. డైలాగులు సోసోగా ఉన్నాయి. ఇక సంగీతం విషయానికి పాటలు భరించటం కష్టం. కానీ యాక్షన్ సీన్స్ కు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది.  గురువుగా సునీల్ శెట్టి ని హిందీ ఆడియన్స్ కోసం తీసుకున్నారేమో కానీ కలిసొచ్చిందేమీ లేదు. నేటివిటి మిస్సవటం తప్ప.  ఆకాంక్ష సింగ్ కు చేయటానికి ఏమీ లేదు. క‌బీర్ విల‌నిజం ఎన్నో సినిమాల్లో చూసిందే.
 

చూడచ్చా
పనిగట్టుకుని పరుగెట్టుకుని మరీ వెళ్లి చూడాలనిపించే సీన్ ఉన్న సినిమా కాదు

తెర వెనక ముందు

నటీనటులు: సుదీప్‌, ఆకాంక్ష సింగ్‌, సునీల్‌ శెట్టి, సుశాంత్‌ సింగ్‌, కబీర్‌ దుహన్‌ సింగ్‌, అవినాష్‌ తదితరులు
సంగీతం: అర్జున్‌ జన్యా
సినిమాటోగ్రఫీ: కరుణాకర.ఎ
ఎడిటింగ్‌: రుబెన్‌
నిర్మాత: స్వప్నకృష్ణ
బ్యానర్‌: జీ స్టూడియోస్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ మోషన్‌ పిక్చర్స్‌, వారాహి చలన చిత్రం(తెలుగు)
దర్శకత్వం: ఎస్‌.కృష్ణ
విడుదల తేదీ: 12-09-2019