పుష్పక విమానం మూవీ రివ్యూ
పుష్పక విమానం మూవీ రివ్యూ
Emotional Engagement Emoji (EEE) :
‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో అచ్చమైన మనింటి కుర్రాడిగా మెప్పించారు ఆనంద్ దేవరకొండ. ఆ ఉత్సాహంలో ఈ సారి కూడా తాను విభిన్నమైన కాన్సెప్టుతోనే ముందు కొచ్చానని పుష్పక విమానం ట్రైలర్ తో హామీ ఇచ్చారు. హీరో పెళ్లాం లేచిపోవటమే కాన్సెప్టు తెలుగు తెరమీద మీదే కాదు దాదాపు ఇండియన్ తెరమీదే కొత్తే. దాంతో ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ అదిరిపడి చూసారు. ఫన్ ఉంటుందని ఆశపడ్డారు. ఆ ఆశలను ఏ సినిమా ఏమేర అందుకుంది, కమల్ సూపర్ హిట్ పుష్పక విమానం తరహాలో ఈ సినిమా కూడా నవ్వించిందా, జనాలకు నచ్చేస్తుందా, అసలు ఈ చిత్రం కథేంటి, ఈ కుర్రాడు ఈ సినిమాలో ఏం చేసాడో చూద్దాం పదండి.
స్టోరీ లైన్
చిట్టిలంక సుందర్ (ఆనంద్ దేవరకొండ) గవర్నమెంట్ టీచర్. అతడికి ఈ మధ్యనే మీనాక్షి (గీతా సైని) తో పెళ్లవుతుంది. అయితే శోభనం రాత్రే వీళ్లిద్దరి మధ్యా అభిప్రాయ బేధాలు వచ్చి తారాస్దాయికి వెల్తాయి. ఆ తర్వాత ఆమె మీనాక్షి తనకు నచ్చిన వాడితో జంప్ అవుతుంది. దాంతో సుందర్ ఉలిక్కిపడతాడు. ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిస్తే సొసైటిలో తన వాల్యూ ఏమిటి..జనం ఏమనుకుంటాడు అని భయపడతాడు. దాంతో తను పని చేసే స్కూల్లో, తన అపార్టమెంట్ లో అందరితో ఈ విషయం లీక్ కాకుండా ఉండటం కోసం ప్రయత్నాలు మొదలెడతాడు. తన భార్య ఉన్నట్లే బిల్డప్ ఇస్తూంటాడు. అంతేకాదు షార్ట్ ఫిలింలలో పనిచేసే రేఖ (శాన్వీ మేఘన) ని తన భార్యగా కొన్నాళ్లు నటించమని కోరతాడు. అంతా బాగానే ఉందనుకునేలోగా మరో ట్విస్ట్ పడుతుంది. మీనాక్షి మర్డర్ అవుతుంది. దాంతో పోలీస్ లు సుందర్ వెంటపడతారు. అప్పుడు సుందర్ ఈ సమస్యల నుంచి బయిటపడటానికి ఏమి చేసాడు.ఆమెను ఎవరు చంపేసారు. తన నుంచి వెళ్లాక మీనాక్షికు ఏం జరిగింది అనేది మిగతా కథ.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్ …
ట్రైలర్ లోనే ఈ సినిమా మెయిన్ పాయింట్ చెప్పేసారు. ఓ టీచర్ తన పెళ్లాం లేచిపోతే ఫేస్ చేసే పరిస్దితి ఏమిటి..సమాజం ఎలా డిస్కషన్ పెడుతుంది..ఇలాంటి ఫన్ తో నడిచే డార్క్ కామెడీ అని అర్దమైంది. అయితే సినిమా కు వెళ్లాక అదో మర్డర్ మిస్టరీ గా తేలింది. కేవలం ట్రైలర్ లో చూపెట్టింది..సినిమా ఫస్టాఫ్ లో కొద్దిసేపు వచ్చేదే కానీ, మిగతాదంతా వేరే కథ అని చూసేవారికి ట్విస్ట్ పడింది. అందుకు కారణం డైరక్టర్ రాసుకున్న స్క్రీన్ ప్లే..ట్రీట్మెంట్ దశలో దారి తప్పటం. ఎప్పుడైతే హీరో వేరే అమ్మాయిని తీసుకొచ్చి తన భార్యగా పరిచయం చేసాడో అక్కడే కథనం దారి తప్పింది. ఆ తర్వాత దాని కంటిన్యూషన్ లాగ లేచిపోయిన అమ్మాయి హత్యకు గురి అవటంతో కథ ప్రక్కకు వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ లేచిపోయిన అమ్మాయి ఎక్కడికి వెళ్లిందో .ఆమె హత్యకు కారణమేంటో హీరో తేల్చి చెప్పాల్సి వచ్చింది. అలా ఫన్ గా మొదలైన కథ చివరకు మర్డర్ మిస్టరీగా మారి విసిగెత్తించింది. అప్పట్లో తొంబైల్లో రాజేంద్రప్రసాద్ చేసే కొన్ని కామెడీలు ఇలా మర్డర్ మిస్టరీ దారి పట్టేవి. అప్పటి రోజులు వేరు..ఇప్పుడు మారిన ప్రేక్షకులు వేరు. ఇప్పుడు సింగిల్ పాయింట్ ఎజెండా..ఎక్కడ మొదలెట్టారో దాని చుట్టూనే కథ చెప్పాలి..తిప్పాలి. ముగించాలి. అది ఈ సినిమా చేయలేకపోయింది. మూస ఫార్ములాలోకి వెళ్ళటంతో మంచి ఎత్తుగడ కూడా కలిసి రాలేకపోయింది. దాంతో ట్రైలర్లో ఒక హిలేరియస్ రైడ్ లాగా కనిపించిన ‘పుష్పక విమానం’ఆ దిశగా వెళ్లక తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఎస్ఐగా సునీల్ పాత్రతో సాధించిందీ ఏమీ లేదు. హీరో,హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ అంతంత మాత్రమే. ఇలా కథ,కథన సమస్యతో మంచి పాయింట్ ఎత్తుకున్నా ఫలించలేదు. అలాగని మర్డర్ చేసిందెవరు అనే పాయింట్ చుట్టూ కథని ఇంటెన్స్ తో నడుపుతూ స్క్రీన్ ప్లే సెట్ చేసుకోలేకపోయాడు. ఏదైమైనా సరైన కాంప్లిక్ట్స్ లేని కథలు కంచికే అని మరోసారి ప్రూవ్ అయ్యినట్లైంది.
టెక్నికల్ గా
మార్క్ కె.రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తప్ప సంగీత పరంగా ఏ మాత్రం ఆకట్టుకోదు. జోసెఫ్ కెమెరా వర్క్ బాగుంది. మంచి విజువల్స్ తో సినిమా ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేసారు. ప్రొడక్షన వాల్యూస్ అంతంత మాత్రమే. డైరక్టర్ గా దామోదర్ మంచి కాన్సెప్టుని ఎంచుకున్నారు కానీ దాన్ని సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయారు. స్క్రిప్టే ఆయనకు మైనస్ గా నిలిచింది. ఫస్టాఫ్ లో కొన్ని చోట్ల అతను స్పార్క్ కనపడినా.. ఓవరాల్ గా తేలిపోయింది. పూర్తిగా ఫన్ యాంగిల్ లోనే సినిమా నడిపించి ఉన్నా బాగుండేది. డైలాగులు బాగున్నాయి.
ఆనంద్ దేవరకొండ మొదట ఇలాంటి కథను ఓకే చేసినందుకు మెచ్చుకోవాలి. అలాగే ఈ సినిమా అంతకు ముందు సినిమాల నటన కన్నా బాగుంది. సహజంగా ఎక్కడా తేలిపోకుండా కథలో కలిసిపోయారు. హీరోయిన్లలో శాన్వి మేఘన కు మంచి మార్కులు పడతాయి. మరో హీరోయిన్ గీతా సైని నటన పెద్దగా అవకాసం లేదు. సీనియర్ నరేష్ హెడ్ మాస్టార్ గా జస్ట్ ఓకే అనిపించారు. ఆయన స్థాయికి తగ్గ పాత్రకాదు. ఎస్ఐ పాత్రలో సునీల్ వలన సినిమా కు వచ్చిన ప్లస్ ఏమీ లేదు.
బాగున్నవి
సిట్యువేషన్ కామెడీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
బాగోలేనివి
కాంప్లిక్స్ లేని కథ
బోర్ కొట్టే సెకండాఫ్
చూడచ్చా
సెంకడాఫ్ ని భరించగలిగితే చూసేయచ్చు
తెర వెనక ముందు..
బ్యానర్స్: కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, గీత్ సైనీ, శాన్వీ మేఘన, సునీల్, భద్రం, సుదర్శన్, వీకే నరేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్
ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్,
ఎడిటర్ : రవితేజ గిరిజాల
మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని.
కాస్టూమ్స్ : భరత్ గాంధీ
రచన-దర్శకత్వం: దామోదర
సమర్పణ: విజయ్ దేవరకొండ
నిర్మాతలు: గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ దషీ, ప్రదీప్ ఎర్రబెల్లి
రన్ టైమ్: 2 గంటల 22 నిముషాలు
రిలీజ్ డేట్: 2021-11-2021